MohanPublications Print Books Online store clik Here Devullu.com

స్థితప్రజ్ఞ శిఖరం

స్థితప్రజ్ఞ శిఖరం

స్థితప్రజ్ఞ శిఖరం
‘శోకించకుండా దుఃఖానికి మూలాలు ఎవరు శోధన చేయగలరు, గాయపడకుండా నాలుకపై నర్తించే గేయాలు ఎవరు రాయగలరు?’ అన్నారు ఒక కవి. క్రౌంచ పక్షుల కన్నీటి గాథతో మనోవేదన చెందాడు బోయ వాల్మీకి. ఆ తరవాత ఆయనే రామాయణ మహాకావ్యాన్ని రచించి, ఆదికవిగా ప్రసిద్ధి చెందాడు. సిద్ధార్థుడు సత్యాన్వేషణ చేయటానికి బాటలు వేసిందీ దుఃఖమే. దాని మూలాలు వెతుకుతూ ఆయన అరణ్యాలకు వెళ్లిపోయాడు. ఆ అన్వేషణలో బుద్ధుడిగా రూపాంతరం చెందాడు!
సీతావియోగంతో పరితపించిపోయాడు శ్రీరాముడు. నరులకు ఓ పట్టాన సాధ్యం కాని లంకా వారధిని వానరుల సాయంతో నిర్మించాడు. తరతరాలూ ఆశ్చర్యపోయేంత అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచానికి కానుకగా ఇచ్చాడు. భక్తుడంటే ఇలా ఉండాలని లోకానికి చాటిచెప్పడం ద్వారా, తన నమ్మినబంటు హనుమను లోకారాధ్యుణ్ని చేశాడు శ్రీరామచంద్రమూర్తి! పది తలలతో విర్రవీగే అహంకారాన్ని, అధర్మాన్ని హతమార్చాడు. తన జీవిత పయనం ద్వారా ఒక ధర్మాన్ని నెలకొల్పాడు. ఆదర్శమూర్తిగా వెలుగొందాడు.
దుఃఖం రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. ఒక భాగం- మనిషిని ప్రక్షాళన చేసి పునీతుడిగా మారుస్తుంది. అతడు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా చేస్తుంది. మరో భాగం- వ్యక్తిగత జీవన వినాశనానికి దారితీస్తుంది. అందువల్ల దుఃఖం పట్ల అప్రమత్తంగా ఉండాలి. జీవితంలో దుఃఖం కలిగే సంఘటనలు, సందర్భాలు అనేకం ఉంటాయి. వాటి నుంచి పాఠాలు చేర్చుకోవాలి. దుష్ప్రభావానికి బలి కాకూడదు, కుంగిపోకూడదు.
చిత్రకారుడు ఏడుస్తూ బొమ్మలు గీస్తాడా, శిల్పి దుఃఖిస్తూ శిల్పాన్ని చెక్కుతాడా, నృత్యకారుడు రోదిస్తూ నాట్యం చేస్తాడా? గాయకుడు, సంగీతకారుడు కుమిలిపోతూ వారి కళలను ఆవిష్కరిస్తారా? లేదు. అటువంటి దృశ్యం ఎక్కడా కానరాదు. ఎందుకంటే, వారు వర్తమానంలో ఉంటారు. అది బ్రహ్మానంద క్షేత్రం. అందులో ఉండేది కేవలం ఆనందమే! ఆ ఆనందంలో మనిషి సృజనాత్మకంగా ఉంటాడు. అందులో నుంచే కొత్తవాటిని కనిపెట్టే నూతన శక్తి పుడుతుంది. మనిషి- దుఃఖాన్నే పట్టుకుని వేలాడితే అది బలహీనుణ్ని చేస్తుంది. అప్పుడతడు ఏ పనీ చెయ్యకుండా వృథాగా ఉండిపోతాడు. ఫలితంగా కుటుంబానికి, సమాజానికి భారంగా మిగిలిపోతాడు. ఇది అనారోగ్య స్థితిని తెలియజేస్తుంది.
శరీరానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళతాం. తిరిగి ఆరోగ్యం పొందుతాం. మనసు బాగాలేకపోతే దేవాలయానికి వెళతాం. ప్రశాంతత కోసం దేవుణ్ని ప్రార్థిస్తాం. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు మనసు తేలికపడటాన్ని గమనిస్తాం. ఏవైనా ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు, ఏ సమస్యకు ఎటువైపు వెళ్లాలో తెలిపేది జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేది విద్యాలయం.
గుడి, బడి- రెండూ కలిసి ‘చెట్టులా మనిషి ఆదర్శవంతంగా జీవించాలి’ అని పరోక్షంగా చెబుతాయి. చెట్టు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. దాదాపు అంతే పొడవుతో వేళ్ల రూపంలో అది భూమి లోపలా పెరుగుతుంది. అందుకనే అది దృఢంగా ఉంటుంది. ఎలాంటి విపత్తులనైనా తట్టుకొని నిలవగలుగుతుంది. విద్యాలయం- ప్రాపంచిక జ్ఞానాన్ని బోధిస్తుంది. ఆ జ్ఞానం, ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. దేవాలయం- మనిషికి ఆత్మజ్ఞానం ప్రబోధిస్తుంది. అది అంతరంగ ప్రపంచంలోకి తీసుకెళ్లి, సత్యం తెలుసుకోవడానికి దారి చూపిస్తుంది. సుఖదుఃఖాలను సమంగా చూసే నేర్పునిస్తుంది. ఎన్ని బాధలనైనా తట్టుకొనే శక్తిని సమకూరుస్తుంది.
అజ్ఞానమే దుఃఖానికి మూలమని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞాన సంపన్నుడికి ఈతిబాధలు ఉండవని కాదు. అతడికీ సుఖదుఃఖాలు ఉంటాయి. అవి భూమిని చుట్టుముట్టే రాత్రింబగళ్లు వంటివి. వస్తాయి, పోతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆత్మజ్ఞానులూ అంతే! సుఖదుఃఖాల ప్రభావానికి వారు ఏ మాత్రం వెరవక తమ పని తాము చేసుకుపోతారు. స్థితప్రజ్ఞత అనే శిఖరం చేరటానికి జ్ఞానమనే నిచ్చెన ఎక్కడమే మనిషి చేయాల్సిన అసలు పని!
- మునిమడుగుల రాజారావ


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list