దైవవాణి ధ్యాసలో ముహమ్మద్ (స) ప్రవక్త జీవితం
దైవవాణి ధ్యాసలో ముహమ్మద్ (స)
ప్రవక్త జీవితం
ప్రవక్త జీవితం
దైవదూత గొంతు పిసికేస్తాడేమో అన్నంత బాధ కలిగింది. ఆ బాధలోనే ఆయన ‘ఏం చదవాలి?’ అన్నారు? అప్పుడా దైవదూత, ‘‘చదువు! సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయనే మానవుణ్ణి కరుడుకట్టిన రక్తంతో సృష్టించాడు. చదువు! నీ ప్రభువు ఎంతో పునీతుడు, శ్రేష్టుడు. ఆయన కలం ద్వారా జ్ఞానం ప్రసాదించాడు. మానవుడికి తెలియనిదంతా నేర్పాడు (96.1-5). ఈవాక్యాలను దైవదూత ఎలా పలికాడో అలానే యథాతధంగా పఠించాడు ముహమ్మద్ (స).
చదివీ చదవగానే ఆయనకది కంఠస్థమై పోయింది, హృదయ ఫలకంపై ముద్రించుకు పోయింది. దైవదూత వెళ్ళిపోయాడు. ముహమ్మద్ (స) అలానే నిశ్చలనంగా నిచుండిపొయ్యాడు. ఒళ్ళంతా భయంతో చెమట పట్టాయి. కొన్ని క్షణాల తరువాత కాస్తంత తేరుకొని గుహ అంతా కలియజూశాడు భయంభయంగా. ఎటువంటి అలికిడిగాని, ఎలాంటి ఆకారం కాని కనిపించలేదు. ఏమిటి? తనకేమైంది? ఏదైనా పిశాచంగాని ఆవహించిందా? ఇప్పటి వరకు తనను చదువు, చదువు అని బలవంత పెట్టిందెవరు??. రకరకాల ఆలోచనలు, అవమానాలు మనసును ముసురుకున్నాయి. గబగబా గుహలోంచి బయటికొచ్చి నేరుగా ఇంటిదారి పట్టారు. పరుగులాంటి నడకతో వడివడిగా ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే మంచానికి అడ్డంపడి, ‘ఖదీజా! దుప్పటి కప్పు, దుప్పటి కప్పు’ అని పలవరించారు.
‘అయ్యో! ఏమిటండీ, ఏమైందండీ?’అంటూ కంగారుపడుతూ పరుగు పరుగున వచ్చారు ఖదీజా (ర). దుప్పటి కప్పి, విసురుతూ కూర్చున్నారు. భార్య సపర్యలతో కొద్దిసేపటి తరువాత ఆయన కొద్దిగా తేరుకున్నారు. అప్పుడామె ‘అసలు ఏమైందండీ, ఇప్పుడెలా ఉంది?’ అని ప్రశ్నించారు ఆర్తిగా. సమాధానంగా ఆయన శ్రీమతి వైపు దీనంగా చూస్తూ, ‘ఖదీజా! నాకేదో అయింది. భయంగా ఉంది.’ అన్నారు.
‘ఏమీ భయంలేదు. మీకేమీ కాదు. మీరిలా భయపడితే ఎలా? అసలేమైందో చెప్పండి’ అన్నారు ఖదీజా ధైర్యాన్ని కూడగట్టుకుంటూ... ముహమ్మద్ (స) హిరాగుహలో జరిగిన వృత్తాంతమంతా పూస గుచ్చినట్టు వివరించారు. అంతా విన్న ఖదీజా, ఏమాత్రం అధైర్య పడకుండా, ‘ఇది నిస్సందేహంగా శుభవార్తే. భయపడాల్సింది ఏమీలేదు. శుభఘడియ సమీపించింది. సంతోషించండి. మీ దినచర్య యధావిధిగా కొనసాగించండి. ఏ శక్తి చేతిలో ఖదీజా ప్రాణముందో, ఆ శక్తి సాక్షిగా చెబుతున్నాను. మీరు దేవుని ప్రవక్త కాబోతున్నారు. మీరు సత్యసంధులు, వాగ్దాన పాలనకు, నిజాయితీపరులు, అమానత్తుదారులు, బంధువుల హక్కులు నెరవేర్చేవారు, పేదసాదలను, అనాధలను ఆదుకునేవారు, అతిధిమర్యాద చేసేవారు, సత్కార్యాల్లో పరులకు సహాయపడేవారు.. అలాంటి మీకు దేవుడు అన్యాయం చేస్తాడా? అలాఎన్నటికీ జరగదు. మీరు విచారించకండి’ అంటూ ధైర్యం నూరి పోశారు ఖదీజా.
శ్రీమతి ఓదార్పు మాటలతో ఆయన మనసుకు కాస్తంత స్థిమితం కలిగింది. వాడిన ముఖారవిందం మళ్ళీ వికసించింది. ధైర్యం చెప్పి ఓదార్చినందుకు శ్రీమతికి కృతజ్ఞత చెప్పారు. అలానే మంచంపై పడుకొని నిద్రలోకి జారుకున్నారు.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565