ధర్మపాలన
Dharma Palana
------------;ధర్మపాలన;--------
ధర్మం దైవస్వరూపం అన్నప్పుడు, అది నిర్వహించడమెలాగో ప్రతి మనిషీ తెలుసుకోవాలి. అందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసుకుంటూ, అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ధర్మం అంటే ఏమిటో భగవద్గీత స్పష్టంగా చెబుతుంది.
అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం వంటి నియమాలకు కట్టుబడి జీవించడమే ధర్మమంటుంది వేదాంతం. అహింస అంటే- భౌతికంగా, మానసికంగా ఎవరికీ హాని తలపెట్టకపోవడం, గాయపరచకపోవడం. హింసాత్మకమైన అన్ని ఆలోచనల్నీ అదుపులో ఉంచాలి. సత్యం అనేది- మనిషి ఉద్దేశాల్ని అతడి మాటలు, చేతల సమన్వయం ద్వారా వెలికితెచ్చే ఒక పవిత్రమైన భావన. అబద్ధాలు చెప్పకపోవడం ఒక్కటే కాదు, వాటికి వంతపాడే పనులేవీ చేయకపోవటమే సత్యం అనిపించుకుంటుంది. పురాణ యుగంలో ధర్మరాజు, హరిశ్చంద్రుడు, ఆ తరవాత కాలంలో గాంధీమహాత్ముడు తాము చెప్పి, ఆచరించి చూపినవాటిని గమనిస్తే- సత్యం స్వరూప స్వభావాలు అర్థమవుతాయి.
అస్థేయం అంటే దొంగతనాలకు, దోపిడులకు దూరంగా ఉండటమనే కాదు. అవినీతి చోటుచేసుకునే అన్ని కార్యకలాపాల్ని, అక్రమ లాభాలు ఆర్జించిపెట్టే అన్ని లావాదేవీల్ని అస్థేయంగానే చూడాలి. ఒకరికి ఇవ్వాల్సినది ఏదైనా ఉంటే, దాన్ని వారికి ఇవ్వకపోవడమూ అస్థేయమే! అపరిగ్రహం అంటే, కూడబెట్టాలనే విపరీతమైన కోరిక లేకుండా ఉన్నంతలో నిరాడంబరంగా జీవించటం. ఆధ్యాత్మికతతోనే లభించే అరుదైన లక్షణమది. విద్యార్థి దశలో జ్ఞానసముపార్జనకు చేసే ప్రయత్నాలతో బ్రహ్మచర్యం ముడివడి ఉంటుంది. వైవాహిక జీవితంలోకి ప్రవేశించాక, దాంపత్యానికే కాక సామాజిక, సాంస్కృతిక జీవనానికి సరిపడే విలువలేమిటో చెబుతూ వర్ణాశ్రమ ధర్మపాలనకు సహకరిస్తుంది. వానప్రస్థానికి సంసిద్ధుణ్ని చేసి, అంతిమ సత్యమైన బ్రహ్మాన్ని తెలుసుకొనే సాధనంగా మారుతుంది.
ధర్మాధర్మ విచక్షణతోనే మనిషికి సుఖదుఃఖాలంటే ఏమిటో తెలుస్తుంది. అందుకోసం అతడు మానసిక సంయమనంతో విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించాలి. వాటి గురించి ‘విదురనీతి’ వివరంగా చెబుతుంది. శాస్త్రాలు ఆచరణీయాలని చెప్పిన ధర్మాలేవీ కష్టతరమైనవి కావు. మనిషి తనకున్న సమయంలో కొంతైనా ధర్మం గురించి తెలుసుకోవడానికి ఉపయోగించడం లేదు. అదే అతడి సమస్యకు సమాధానం లభించకపోవడానికి కారణం. అది తెలుసుకొనేందుకు అతడికి కాలం, సమయం వంటి నియమాలు అక్కర్లేదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే చాలు.
నిజమైన ధర్మార్థికి- దాన్ని వివరించి చెప్పగలవారెవరైనా, ఎక్కడున్నా వారినుంచి తెలుసుకోవడానికి సంకోచం ఉండదు. అది చెప్పగల ధర్మజ్ఞులూ- వారు ఏ పరిస్థితిలో ఉన్నా, దాన్ని తెలియజెప్పేందుకు విముఖత చూపరు. శ్రీరాముడంతటివాడు తన శత్రువైన రావణుడిని మించిన రాజనీతిజ్ఞుడు మరొకడు లేడన్నాడు. అదంతా అతడి నుంచి తెలుసుకురమ్మని సోదరుడు లక్ష్మణుణ్ని పంపించాడు. రణరంగంలో తుదిశ్వాస విడిచేందుకు సిద్ధంగా ఉన్నా, రావణుడు ఆ ధర్మాల్ని లక్ష్మణుడికి సాదరంగా చెబుతాడు. మహాభారత యుద్ధరంగంలో భీష్ముడు అంపశయ్యపైకి చేరినా, స్వచ్ఛంద మరణం కోరి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్నా ధర్మప్రబోధం మానలేదు. రాజ్యాధికారం చేపట్టనున్న మనుమడు ధర్మరాజుకు రాజధర్మంతో పాటు ధార్మిక విలువలెన్నో బోధించాడాయన.
పరమ భాగవతోత్తములందరూ ‘గీత’లో భగవంతుడు చెప్పిన స్వధర్మాన్ని ఆచరించినవారే. అందర్నీ ధర్మమార్గంలో నడిపించినవారే. మంచి ఉద్దేశంతో చేసిన ఏ ఒక్క పనైనా స్వధర్మ ఆచరణే అవుతుంది. దైవం గురించి ప్రస్తావించని గౌతమబుద్ధుడు ‘ధర్మం శరణం గచ్ఛామి’ అనేవారు. పురుష ప్రయత్నాల్లోనే ధర్మం ఉందన్నది ఆ బోధనల సారాంశం. పురుష ప్రయత్నం అంటే, స్వశక్తిని నమ్ముతూ వివేచనతో మంచి పనులు చేయడం. అందుకే ‘మీరు చేసే పనులకు మరెవ్వరినో బాధ్యుల్ని చేయవద్దు’ అనేవారు స్వామి వివేకానంద.
ధర్మాన్ని దేవుడే వచ్చి రక్షిస్తాడని కూర్చుంటే, ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాల్ని క్రమంలో ఆచరించలేం. ధర్మపరిరక్షణ అనేది తనకు వచ్చిన అవకాశంగా మనిషి భావించాలి. అధర్మ రూపాలైన అవినీతి, బంధుప్రీతి, అక్రమ సంపాదన, లైంగిక నేరాలు, జాతి, మత, కుల విచక్షణ ఉన్నంతకాలం ధర్మమార్గం అగోచరమై ఉంటుంది. ధర్మాచరణ వల్ల దైవ, మానవ సంబంధాల పవిత్రతకు ఎప్పుడూ భంగం వాటిల్లదు. ధర్మపథంలో నడిచినంతకాలం, మనిషి దారి తప్పే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మికత ఇచ్చే శక్తితో, అతడు తన ధర్మపథాన్ని తానే నిర్మించుకుంటూ సాగిపోవాలి!
- జొన్నలగడ్డ నారాయణమూర్తి
- జొన్నలగడ్డ నారాయణమూర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565