MohanPublications Print Books Online store clik Here Devullu.com

అదే బ్రహ్మవిద్య (ముండకోపనిషత్) Brahma Vidhya

అదే బ్రహ్మవిద్య (ముండకోపనిషత్) 
Brahma Vidhya

అదే బ్రహ్మవిద్య (ముండకోపనిషత్):-----
‘ఓం భద్రం కర్ణేభిః శ్రుణుయామదేవాః... ఓం శాంతిశ్శాంతి శాంతిః’ (శాంతిమంత్రం). తలలు బోడులైనంత మాత్రాన సన్న్యాసులు కారు. తలపులు (ఆలోచనలు, ఊహలు, కోరికలు) బోడులైనవారే నిజమైన సన్న్యాసులు. ఈ ముండకోపనిషత్తు అటువంటివారికోసం ఆవిర్భవించింది. ముండకం అంటే నున్నగా క్షౌరం చేసేది అని అర్థం. పరిణతి చెందినవారు ఎవరైనా దీనిని వినవచ్చు.
దేవతలలో మొదటివాడు, సృష్టికర్త, జగద్రక్షకుడు అయిన బ్రహ్మదేవుడు తన పెద్దకొడుకు అధర్వునికి అన్ని విద్యలలో శ్రేష్ఠమైన బ్రహ్మవిద్యను ఉపదేశించాడు. అధర్వుడు ఆ విద్యను అంగిరునికి ఉపదేశించాడు. అంగిరుడు సత్యవంతునికి బోధించాడు. సంప్రదాయ బద్ధం గా ప్రసరిస్తున్న ఈ విద్యను అంగిరుని వంశస్థుడైన అంగిరసునికి చెప్పాడు. ఒకప్పుడు శౌనకుడు అనే మరో గృహస్థు వినయవిధేయతలతో అంగిరసుని పూజించి ‘భగవాన్ దేనిని తెలుసుకోవటం వల్ల అంతా తెలుస్తుందో చెప్పండి’ అని అడిగాడు. అంగిరసుడు శౌనకునకు అందజేసిన సమగ్రమైన బ్రహ్మవిద్యయే ఈ ముండకోనిషత్తు.
‘‘శౌనకా! పరా, అపరా అని విద్యలు రెండు విధాలు. అక్షరమైన అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చే విద్య పరావిద్య. కంటికి కనపడ నిదీ, పట్టుకోవడానికి దొరకనిదీ, పుట్టుక, రంగు, కాళ్లు, చేతులు, కన్ను, ముక్కు వంటి అవయవాలు లేనిదీ, నిత్యమైనదీ, అంతటా వ్యాపించినదీ, పరమసూక్ష్మమైనదీ, నాశనం లేనిదీ, సమస్త సృష్టికి పుట్టుకచోటు అయిన పరబ్రహ్మజ్ఞానాన్ని ధీరులు మాత్రమే పొందగలరు. వారే చూడగలరు.
సాలెపురుగు తనలోనుంచి దారాలను సృష్టించుకుని, వాటితో గూడు ఎలా అల్లుకుంటుందో, భూమిలో నుంచి ఓషధులన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో, మనిషి తలనుంచి శరీరం నుంచి వెంట్రుకలు సహజంగా ఎలా పుడుతున్నాయో అలాగే అక్షర పరబ్రహ్మం నుండి ఈ విశ్వం అంతా ఏర్పడుతోంది. తపస్సుతో ఆ బ్రహ్మపదార్థం చైతన్యవంతం అవుతుంది. దానినుండి అన్నం పుడుతుంది. ఆహారం నుంచి ప్రాణం ఏర్పడుతుంది. ప్రాణం నుంచి మనస్సు, సత్యమూ, లోకాలు, కర్మలు వాని నుండి అమృతమూ రూపొందుతున్నాయి. సర్వజ్ఞుడూ, సర్వవిద్యాస్వరూపుడు, జ్ఞానమయమైన తపస్సు రూపంలో ఉండేవాడు అయిన నిరాకార పరబ్రహ్మం నుండి పేర్లు, రూపాలు గల ప్రాణులు, ఆహార పదార్థాలు జన్మిస్తున్నాయి.
అగ్నికార్యం చేసేటప్పుడు హోమకుండంలో సమిధలతో చక్కగా మండే అగ్నిలో మధ్యలో పడేటట్టు ఆహుతులను శ్రద్ధగా వెయ్యాలి. యజ్ఞంతో మాత్రమే పుణ్యలోకాలు వస్తాయని మిగిలిన బాధ్యతలు వదులుకోకూడదు. యజ్ఞకర్మలే శ్రేయోదాయకం అనుకునేవాడు మూఢుడు. అటువంటివారు మళ్లీ పుట్టి జరామరణాలకు లోనవుతారు.
ఇది ముండకోపనిషత్తులో అంగిరసుడు శౌనకునికి చెప్పిన మొదటి ముండకంలోని మొదటి ఖండం. ఇలా ఈ ఉపనిషత్తు మొత్తం మూడు ముండకాలు, ఆరు ఖండాలుగా ఉంది.
ప్రథమ ముండకం- ద్వితీయ ఖండం
శౌనకా! ఋషులు మంత్రాలలో ఏ యజ్ఞకర్మలను చూశారో అవి అన్నీ సత్యమే. అవన్నీ ఋక్, యజుస్, సామవేదాలలో పలువిధాలుగా వర్ణించబడ్డాయి. సత్యకాములారా! ఆ యజ్ఞకర్తలన్నిటినీ నియమ నిష్ఠలతో మీరు ఆచరించండి. పుణ్యలోకాలకు చేరుకోవడానికి మీకు ఇది ఒక్కటే మార్గం. అమావాస్య, పౌర్ణమి, చాతుర్మాస్యం, పంటకుప్ప నూర్పిడి పనులు మొదలైన కర్తవ్యాలు మానుకొని యజ్ఞం చేసినా, అతిథులు లేకుండా భోజనం చేసినా, విశ్వేదేవతలకు ఆహుతులు ఇవ్వకపోయినా, యథావిధిగా ఆచరించకపోయినా అలా యజ్ఞం చేసినవాడికి ఏడు తరాలు పుణ్యలోకాలు నశించిపోతాయి.
కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే ఏడు పేర్లతో ఏడు జ్వాలలు అగ్నిహోత్రునికి ఏడు నాలుకలు. ఈ ఏడు జ్వాలలు బాగా ప్రజ్వలించేటప్పుడు సమయానుగుణంగా ఆహుతులు ఇస్తూ ఉంటాడో అతణ్ణి అవి సూర్యరశ్మిగా దేవతల ప్రభువైన ఇంద్రుని వద్దకు తీసుకుపోతాయి. వర్ఛస్సుతో ప్రకాశించే ఆహుతులు, యజ్ఞకర్తలకు దారి చూపిస్తూ సూర్యకిరణాల ద్వారా పైలోకాలకు తీసుకుపోతాయి. ప్రేమగా పలకరిస్తాయి. పూజిస్తాయి. ఇదే మా సుకృతం వల్ల లభించిన బ్రహ్మలోకం’అంటాయి.
శౌనకా! అజ్ఞానంలో పడి కొట్టుకునేవారు తామే ధీరులమనీ, పండితులమనీ చెప్పుకుంటారు. గుడ్డివాని వెంట నడిచే గుడ్డివారిలాగా దారి తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అవిద్యలో కొట్టుమిట్టాడేవారు పసిపిల్లల్లాగా తమకు తాము కృతార్థులుగా భావిస్తారు. వీరికి కర్మఫలాసక్తి ఉన్నంతవరకు నిత్యజ్ఞానం కలగదు. వారు చేసిన పుణ్యకర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించినా పుణ్యం పూర్తికాగానే మళ్లీ కిందిలోకాలకు వచ్చేస్తారు. మూఢులు యజ్ఞకర్మలే శ్రేష్ఠమనుకుంటారు. ఆ పుణ్యంతో స్వర్గానికి పోయి తిరిగి వస్తూ ఉంటారు. హీనమైన లోకాలకు పోతూ ఉంటారు.
నాయనా! జ్ఞానవంతులు శాంతులు, విద్వాంసులు, భిక్షాజీవనులై అరణ్యంలో ఉంటూ శ్రద్ధగా తపస్సు చేస్తారు. వారు తమ పాపాలన్నిటినీ పోగొట్టుకుని సూర్యమండలంలో నుండి అమృతమయమైన, అవ్యయమైన పరబ్రహ్మలో లీనమౌతారు. మోక్షాన్ని పొందదలచినవాడు ఏ కర్మకు ఏ లోకం లభిస్తుందో తెలుసుకుని వాటిపై విరక్తిని పొందాలి. కామ్యకర్మల వల్ల మోక్షాన్ని పొందలేరు. అది తెలుసుకోవడానికి శ్రోత్రియుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువు దగ్గరకు వెళ్లాలి
ప్రశాంత చిత్తుడు, శమాన్వితుడు, సాధకుడు అయి తన దగ్గరకు వచ్చిన వానికి సద్గురువు అక్షరమైన బ్రహ్మవిద్యను, సత్యమైన పరబ్రహ్మను గురించి స్పష్టంగా ఉపదేశించాలి’’ అంటూ అంగిరసుడు శౌనకునికి ప్రథమ ముండక ద్వితీయ ఖండాన్ని వివరించాడు.
------ డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
++++++++++++++++++++++++++
ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!
Sakshi | Updated: June 18, 2016 22:39 (IST)
ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!
భారతీయ వేదాంతానికి మణిదీపాల వంటి మంత్రాలు తృతీయ ముండకంలో ఉన్నాయి. ఒక చెట్టు మీద స్నేహంతో కలసి వుండే రెండు పక్షులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ పిప్పలి చెట్టు పళ్లు తింటోంది. మరొక పక్షి ఏమీ తిన కుండా చూస్తూ కూర్చుంది. మొత్తం వేదాంతం రెండు పక్షుల రూపంలో సూక్ష్మంగా చెప్పబడింది. ఒక పక్షి జీవాత్మ. అది ఐహిక దృష్టితో దైవచింతన లేని మోహంతో దుఃఖిస్తోంది. దాని పక్కనే అదే చెట్టు మీద ఉన్న రెండోపక్షి పరమాత్మ. మహిమాన్వితమైన పరమాత్మను చూస్తూ జీవాత్మ దుః ఖాన్ని పోగొట్టుకుంటోంది. పరమాత్మను దర్శించిన విద్వాంసుడు పాపపుణ్యాలకు అతీతుడై అతణ్ణి చేరుకుంటున్నాడు. అన్ని ప్రాణులలోని ప్రాణస్వరూపం పరమాత్మే. దీనిని తెలుసుకున్నవాడు పండితుడై మౌనంగా ఉంటున్నాడు. నిరంతరం ఆత్మతత్త్వంలో క్రీడిస్తూ, ఆనందిస్తూ క్రియాశీలియై బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు అవుతున్నాడు.
శౌనకా! సత్యం, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకోవచ్చు. దోషరహితులైన యోగులు శుభ్రమూ, జ్యోతిర్మయమూ అయిన పరమాత్మను శరీరంలోనే చూడగలుగుతారు. సత్యమే జయిస్తుంది. అసత్యం గెలవదు. సత్యంతోనే దేవయానమార్గం ఏర్పడుతోంది. ఋషులు, కోరికలను జయించిన సత్పురుషులు ఈ మార్గం ద్వారానే పరమపథానికి చేరుకుంటున్నారు. ఆ పరబ్రహ్మం దివ్యకాంతితో ఊహకు అందని రూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా, దూరాతిదూరంగా ఉంటుంది. హృదయగుహలో దాగిన ఆ పరబ్రహ్మాన్ని యోగులు తమలోనే చూడగలరు. దానిని కళ్లతో చూడలేరు. వాక్కుతో వర్ణించలేరు. ఇంద్రియాలతో, తపస్సుతో, యజ్ఞయాగాది కర్మలతో గ్రహించలేరు. జ్ఞానంతో పరిశుద్ధుడై ధ్యానించేవాడు నిరాకారమైన పరబ్రహ్మను చూడగలుగుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. పంచప్రాణాలతో ఉన్న శరీరంలో అణురూపంలో ఉన్న ఆత్మను మనసుతో తెలుసుకోవచ్చు. మానవుల మనస్సును ఇంద్రియాలు గట్టిగా చుట్టుకొని ఉన్నాయి. నిగ్రహంలో ఇంద్రియాలనుండి మనస్సును వేరు చేస్తే స్వచ్ఛమైన మనస్సులోని ఆత్మ సాక్షాత్కరిస్తుంది. పరిశుద్ధ మనస్కుడైన ఆత్మజ్ఞాని ఏ లోకాలను కోరుకుంటే ఆ లోకాలను పొందుతాడు. కోరికలన్నీ నెరవేరతాయి. కనుక ఆధ్యాత్మిక సంపద కోరుకునేవారు ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములను ఆశ్రయించి, అర్చించాలి.
ద్వితీయ ఖండం
శౌనకా! ఆత్మజ్ఞాని మాత్రమే దివ్యమూ, కాంతిమంతమూ, విశ్వద్యాప్తమూ అయిన పరంధామాన్ని తెలుసుకుంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞుడైన గురువును ఏ కోరికా లేకుండా ఉపాసించినవారు జనన మరణ చక్రం నుండి బయటపడతారు. ఇంద్రాయసుఖాలకోసం ఆరాటపడేవారు ఆ కోరికలు తీరేవారికి మళ్లీమళ్లీ పుడతారు. ఆత్మజ్ఞానంతో కోరికలను ఆత్మలో లీనం చేసినవారి కోరికలు నశించిపోతాయి.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహుదా శ్రుతేన ఊకదంపుడు ఉపన్యాసాలతో, మేధాశక్తితో, శాస్త్రాధ్యయనంతో ఆత్మజ్ఞానం కలగదు. ఎవరు ఆత్మసాక్షాత్కారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారో వారికి ఆత్మదర్శనం అవుతుంది. తన స్వరూపాన్ని ఆత్మ స్వయంగా వివరిస్తుంది. దృఢసంకల్పం లేకుండా అజాగ్రత్తగా, మిడిమిడి జ్ఞానంతో తపస్సు చేసే వారికి ఆత్మజ్ఞానం కలగదు. మనోబలం, శ్రద్ధ, ఆత్మజిజ్ఞాస సంపూర్ణంగా సాధన చేసే వాని ఆత్మ మాత్రమే పరబ్రహ్మలో లీన మౌతుంది. ఆత్మదర్శనాన్ని పొందిన ఋషులు జ్ఞానతప్తులై రాగద్వేషాలు లేనివారు, ప్రశాంత చిత్తులు, పరమాత్మ స్వరూపులు అవుతారు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను అన్ని చోట్లా దర్శించగల ధీరులు, ప్రాజ్ఞులై అన్నిటిలో ప్రవేశించగలుగుతారు.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్న్యాసయోగార్యతయః శుద్ధ సత్త్వాః తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాఃపరిముచ్చంతి ధీరాః
సన్న్యాసులు ఎక్కడ కనపడినా నమస్కరించాలి. వెంటనే ఈ మంత్రాన్ని చదవటం సంప్రదాయం. భారతీయ వేదాంతానికి, ముండకోపనిషత్తుకు ఇది ప్రాణం లాంటిది. వేదాంత విజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు యతులై, శుద్ధసత్త్వులై సన్న్యాసయోగాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి చేరి మోక్షాన్ని పొందుతారు. అప్పుడు వారి పదిహేను కళలు వాటి స్థానాలకు చేరుకుంటాయి. ఇంద్రియాలు పంచభూతాలలో కలిసిపోతాయి. కర్మలు, జీవాత్మ పరబ్రహ్మలో లీనమైపోతాయి. బ్రహ్మజ్ఞానం వల్ల శోకం, పాపాలు నశిస్తాయి. హృదయంలోని ముడులు విడిపోతాయి. విముక్తుడైనవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు.
శౌనకా! శ్రద్ధగా కర్మలు చేసేవారు, వేదాధ్యయనం చేసేవారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ‘ఏకర్షి’ అయిన అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు, యధావిధిగా ‘శిరోవ్రతాన్ని’ ఆచరించేవారు మాత్రమే ఈ బ్రహ్మవిద్య వినడానికి అర్హులు. అటువంటివారికే ఉపదేశించాలి. ఇది సత్యం. దీనిని పూర్వం అంగిరసుడు తన శిష్యులకు నియమబద్ధంగా చెప్పాడు. వ్రతాచరణ లేనివాడు ఈ ముండకోపనిషత్తును వినకూడదు. నమః పరమ ఋషిభ్యోన్నమః పరమ ఋషిభ్యః - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
వేరువేరు పేర్లు గల నగరాలు సముద్రంలో కలిసి పేర్లను, ఆకారాలను కోల్పోతున్నట్లు విద్వాంసుడు తాను నామరూపాలనుండి విముక్తుడై పరాత్పరుడైన పరబ్రహ్మాన్ని చేరుకుంటున్నాడు. పరబ్రహ్మ తత్వం తెలిసినవాడు పరబ్రహ్మ అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారే పుడతారు.
టాగ్లు: వేదాంతం, మంత్రాలు, బ్రహ్మ, Philosophy, Mantras, Brahma


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list