MohanPublications Print Books Online store clik Here Devullu.com

పరీక్ష ఫలితం Exam and Result

పరీక్ష ఫలితం 
Exam and Result
 -------- పరీక్ష-ఫలితం ----------
విద్యాభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ. అది ఒక తపస్సు. మహామునుల తపస్సుకు భగవంతుడు పరీక్ష పెట్టి, వరం ఇస్తూ ఉంటాడు. విద్యార్థులకూ వారి స్థాయిని బట్టి పరీక్షలుంటాయి. ఉత్తీర్ణతే తపోఫలం. కఠోర విద్యాదీక్షితులను ఈ పరీక్షలు భయపెట్టలేవు. మొక్కుబడిగా చదివేవాళ్లకు పరీక్ష పెద్దగండం. వాళ్ల తల్లిదండ్రులకు సైతం ఆందోళన కారకమది. విఫలురైన విద్యార్థుల్లో కొందరికి జీవితంపైనే విరక్తి కలుగుతుంది! ఈ ఉత్తీర్ణతలు, వైఫల్యాలు అంతగా పట్టించుకోదగినవి కావేమో. జీవిత పరీక్షలతో పోల్చినప్పుడు, విద్యాసంబంధమైన పరీక్షలు చాలా చిన్నవి. వైఫల్యాలు పట్టుదలను పెంచాలే కాని, మనిషిని కుంగదీయకూడదు. ఎదురుదెబ్బల్ని వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలుగా మలచుకోవాలి.
కౌరవులు, పాండవులు ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించారు. అస్త్ర విద్యాప్రదర్శన ఏర్పాటుచేసి, వారి నైపుణ్యాలను పెద్దలు పరీక్షించారు. మైదానంలో ఒకరిని మించి ఒకరు తమ విద్యలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అర్జునుడు చూపిన విలువిద్యా నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రేక్షకుల్లో ఉన్న ఒక సామాన్యుడు ‘నేనూ అంతకంటే అధికంగా విలువిద్యను ప్రదర్శించగలను’ అంటూ ముందుకు వచ్చాడు. విద్య ఎవరి సొత్తు? కూలీనాలీ చేసుకొని బతికే అతి సామాన్యుల బిడ్డలు సైతం అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం నేడు చూస్తూనే ఉన్నాం. అస్త్రవిద్యా పరీక్ష సమయంలో ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చిన విద్యార్థి పేరు కర్ణుడు. అనుకోని విధంగా అతడికి ఒక కఠిన ప్రశ్న ఎదురైంది. ‘నువ్వు ఈ రాజకుమారులతో పాటు అస్త్రవిద్యా ప్రదర్శనలో పాల్గొనాలంటే... ముందుగా నువ్వు ఎవరివో, నీ తల్లిదండ్రులెవరో, వంశమేదో తెలియజేయాలి’ అని అడ్డుకున్నాడు కృపాచార్యుడు. కర్ణుడు పుట్టినప్పటి నుంచీ ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడిది ఒక కొత్త రకం పరీక్ష. అందువల్ల ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక దిగాలుపడ్డాడు. జీవిత పరీక్షలు ఇంత కఠినంగా ఉంటాయి. వాటితో పోలిస్తే విద్యార్థులు ఎదుర్కొనే ప్రశ్నలు, పరీక్షలు ఏపాటివి?
తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాసంబంధ పరీక్షల్లో ప్రథములుగా ఉత్తీర్ణులు కావాలని ఆశిస్తారు. అది అత్యాశగా మారి ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారితీస్తుంది. పిల్లలు విఫలమైనా, తక్కువ స్థాయిలో ఉత్తీర్ణత సాధించినా, ఆ తల్లిదండ్రుల ముఖాలు వాడిపోతాయి. ‘ఈ జన్మలో నీకు చదువు రాదు... బాగా చదువుతావు అని ఆశించడం మా బుద్ధితక్కువ... నువ్వు శుద్ధ మొద్దు రాచిప్పవి!’- ఇలాంటి ములుకుల్లాంటి పలుకులు వాళ్ల నోటివెంట వెలువడుతూ ఉంటాయి. పెద్దలు ఇలాంటివి మాట్లాడటం తగదు.
వివేకానందులు ఇలా అంటారు- ‘విద్యావిధానంలోని కొన్ని అంశాలు కలిగించే నష్టాలు తీవ్రమైనవి. అందువల్ల ఆ విధానంలోని ‘మంచి’ అదృశ్యమవుతోంది. ఇప్పటి విద్య వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించడం లేదు. విద్యార్థి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి నిరాశావాదిగా, పిరికిపందగా మారుతున్నాడు’.
విద్యాసంబంధ పరీక్షల్లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణత, విద్యార్థుల ఉత్తమ వ్యక్తిత్వానికి ధ్రువపత్రం కాదు; పరీక్షలో వైఫల్యం వారి జ్ఞానానికి ప్రమాణపత్రమూ కాదు. గీటు రాయి తగిలితేనే బంగారం నాణ్యత బయటపడుతుంది. అగ్నిపరీక్ష వల్లనే సీతాదేవి పరమ పతివ్రతగా వన్నెకెక్కింది. పరీక్షలను ఎదుర్కొన్న హరిశ్చంద్రుడు తుదకు ఈశ్వర సాక్షాత్కారం పొందాడు.
ఒక తిరగలి పక్కన రత్నం పడింది. రత్నం తిరగలిని చూసి ‘నేను అమూల్య సువర్ణ ఆభరణాల మధ్య ప్రకాశిస్తుంటాను’ అన్నది గర్వంగా. తిరగలి నిర్వికారంగా పలికింది- ‘అది సరే గాని... నువ్వు ఎందరికి జీవనోపాధి కలిగిస్తున్నావు, ఎందరి కడుపులు నింపుతున్నావు?’
ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులై, రత్నాల్లా వెలుగొందే విద్యార్థులను అభినందించవలసిందే! రత్నంలా ప్రకాశించకపోయినా, నిరంతరం శ్రమిస్తూ ఉండే తిరగలి గల్లు వంటివారిని చులకనగా చూడనే కూడదు!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

LIKE US TO FOLLOW: ---




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list