MohanPublications Print Books Online store clik Here Devullu.com

నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏది? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, విద్య - విలువలు, విద్యార్థి దశ, భవిష్యత్‌, Brahmasri chaganti Koteshwara Rao, Education - the values, Student stage, Of the future


నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏది? 



+++++++నేను తప్పకుండా
చదవాల్సిన పుస్తకం ఏది? +++++++++
---బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
విద్య - విలువలు:----
మీరిప్పుడు విద్యార్థి దశలో ఉన్నారు. భవిష్యత్‌లో మీకు చిక్కుసమస్యలు ఎదుైరనప్పుడు, సందిగ్ధావస్థల్లో చిక్కుకున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుని వాటినుంచి బయటపడే ప్రజ్ఞ అంకురించాలంటే-మంచి విషయాలను మీరు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. మీకు ఆ సపోర్ట్ లేకపోతే...కేవలం మీరు అకాడమిక్‌గా పాఠ్యాంశాలకే పరిమితమైతే, మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడలేరు. స్వామి వివేకానంద, భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస, అబ్దుల్‌కలాంవంటి వారి ప్రసంగాలు, రామాయణ భారతభాగవతాదులవంటి గ్రంథాలను నిరంతరం చదవడం, పరిశీలించడం అలవాటైందనుకోండి. క్లిష్టసయమాల్లో మీరు మహోన్నతమైన నిర్ణయాలు చేయగలుగుతారు.
అలాగే మీరు మహాత్ముల ఇళ్ళు చూడండి. వారి ఇళ్ళలో ఉన్నవి అనవసర వస్తువులు కావు. ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూకు చెందిన తీన్‌మూర్తి భవన్ వెళ్ళిచూడండి. ఇప్పటికీ చాలా షెల్ఫులు, వాటినిండా పుస్తకాలు. చివరకు కారాగారంలో ఉండికూడా వారుమాట్లాడిన మాటలు అంత సారవంతంగా ఉంటాయి. వాళ్ళు నడిచివెడుతున్న గ్రంథాలయాల్లా కనిపిస్తారు. ఈ దేశంలో మహాత్ములు కారాగారంలో మగ్గుతుంటే మనం బయట ఉండడమేమిటని సిగ్గుపడి సొంతంగా సిద్ధపడి కారాగారాలకు వెళ్ళినవారు ఎందరో !
ఘంటసాల వేంకటేశ్వర రావుగారు గొప్ప నేపథ్యగాయకుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులందరూ కారాగారంలో ఉంటే నేను బయట పాటలు పాడుకోవడమేమిటని తనకుతానుగా సంగ్రామంలో పాల్గొని, జైలుకెళ్ళి పొట్టి శ్రీరాములుగారితో కలిసి గడిపిన రోజుల్లో వారి దగ్గర్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పేవారు. శ్రీరాములుగారు మరణిస్తే, అంత్యేష్ఠి సంస్కారం జరుగుతున్నప్పుడు శ్మశానంలో కూర్చుని దేశభక్తిగీతాలతో కచ్చేరీ చేసారు. అటువంటి వ్యక్తులు పుట్టినగడ్డ ఇది.
మంచిమంచి పుస్తకాలు చదవండి. చదివిన విషయాలపై ఆ పుస్తకం మొదటిపేజీలో చక్కటి సమీక్ష రాయండి. నేను చదివిన ప్రతి పుస్తకం ముందు పేజీలో అలా రాసుకుంటాను. నేనెంత కాలం ఉంటాను! నాతదనంతరం నా మనవడు ఎప్పుడైనా ’మా తాత ఇన్ని పుస్తకాలు చదివాడా?’ అని ఆశ్చర్యపోతూ ఒక పుస్తకం బయటికి తీసి ముందుపేజీ చూస్తాడు. దానిలో ’’పక్షపాతం గురించి వ్యాఖ్యానం అద్భుతం-92వపేజీలో’’ అని ఉంటుంది. ఆ పేజీలోకి వెడతాడు. పక్షపాతం అన్నది జీవితాలను ఎంతగా పాడుచేస్తుందో అక్కడ చదివినతర్వాత వాడేమనుకుంటాడంటే...’’మా తాత చదివిన ఇన్ని పుస్తకాలు నేను చదవక్కరలేదు. ఆ సమీక్షలవరకు చూసుకుంటే చాలు’’ అనుకుంటాడు. అంటే నేను శరీరంతో లేకపోయినా నా మనవళ్ళకు మార్గదర్శనం చేసినవాడినవుతాను. గొప్పకోసం కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను చదివిన పుస్తకాలు వందలకొద్దీ అయిపోతే నేను మొదటిపేజీలో సమీక్ష రాసుకున్నవి ఈ మధ్యకాలంలో కాకినాడలో ఒక గ్రంథాలయం వారికిస్తే నా పేరున ఒక షెల్ఫ్ నింపేశారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానం సంపాదించడమేకాదు, పంచిపెట్టడం అనేది... అంటే విషయాలు తెలుసుకోవడమే కాదు, తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడి దాహం తీర్చడం మరింత తృప్తినిస్తుందని చెప్పడానికే.
మీరు కూడా మంచి పుస్తకాలు చదివి సమీక్షలు రాసి మీ స్నేహితులకు బహూకరించండి. మీరు ఏ పుస్తకం చదివినా ముందున్న ఖాళీపేజీలో ఆ పుస్తకంలో మీకు నచ్చిన విషయాలు రాసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా ఆ విషయాల తాలూకు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ పుస్తకం తెరిచి మీ వ్యాఖ్యచూసుకుని మీరెలా మురిసిపోతారంటే.. పటికబెల్లం చప్పరిస్తున్న అనుభూతి చెందుతారు. ఈ అలవాటు మీరు జీవితంలో మంచి మంచినిర్ణయాలు చేయడానికి కారణమవుతుంది. ఈ డేటాబేస్, ఈ విషయాలు మీ స్టోర్‌లో ఉండాలి. ఉంటే మిమ్మల్ని చెడుైవపు వెళ్ళనివ్వదు. ఆపుతుంది. మంచిైవపుకు నడిపిస్తుంది. పదిమందిలో కష్టపడి నిలబడడానికి యోగ్యుడిని చేస్తుంది. దీనికి మీరు టైంలేదనకండి....
ఒంగోలులో డాక్టర్ గోపీచంద్‌గారని ఒక వైద్యుడున్నారు. ఆయనతో నేనొక సభకూడా చేసాను. మధ్య వయస్కుడు. గుండెకు సంబంధించి ఇప్పటికి ఇంచుమించు 50వేల శస్త్ర చికిత్సలు చేసారు. ఎవరికి ! చంటిపిల్లలకు. ఆయన ఒక్క క్షణం ఖాళీగా ఉండరు. ఆపరేషన్ థియేటర్‌లోకి వెడితే నూరో ఎన్నో శస్త్ర చికిత్సలుచేసిగాని బయటకు రారు. అటువంటి వ్యక్తి నెలలో రెండు రోజులు దక్షిణాఫ్రికా వెళ్ళి వస్తారు. ఎందుకో తెలుసా! వ్యాధులు సంక్రమించి పిల్లలు చనిపోతున్నారని అక్కడికి వెళ్ళి ఆపరేషన్లు చేసి, అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వస్తారు. టైం లేదన్నంత దారుణమైన మాట మరొకటి లేదు. మనం కాదు సమయాన్ని చంపాల్సింది. నిర్లిప్తంగా చూస్తూ ఉంటే సమయమే మనల్ని చంపేస్తుంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
మీ బంధువులు మీకేదయినా బహుమతి ఇవ్వదలుచుకున్నప్పుడు ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకుని హైదరాబాద్‌లో ఫలానా పుస్తకశాలలో దొరుకుతుందని, దానిలో నాకు ఒక సంపుటి బహూకరించండని అడగండి. అది మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. మీకెవరైనా పుస్తకం బహూకరిస్తే దాని మొదటిపేజీలో ఫలానాతేదీనాడు, ఫలానావారిచే బహూకరింపబడినదని రాసుకోండి. అడిగే పిల్లలు దొరకాలి కానీ ఎంతో సంతోషపడి ఆ పుస్తకాలు నాదగ్గర ఉంచుకోవడం కన్నా, చదవాలన్న జిజ్ఞాస ఉన్న పిల్లవాడు దొరికితే నా దగ్గరున్న అన్ని పుస్తకాలను ఇచ్చేస్తానన్నంతగా మురిసిపోతారు. ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు వద్దు. మంచి పుస్తకాలు చదవండి. ఏది మంచి పుస్తకం? అన్నదానికి నిర్వచనం ఎప్పుడు తెలుస్తుందంటే.. మంచి పుస్తకాలను సూచించమని మీరు పెద్దలను అడిగినప్పుడు వారి సమాధానం ద్వారానే. అందువల్ల సునిశిత ప్రజ్ఞ అభివృద్ధి చెందేది కేవలం సమాచార సేకరణ, విషయసేకరణ ద్వారా మాత్రమే. అది మంచి పుస్తకాలద్వారా, మంచి ప్రసంగాల ద్వారా అందుతుంటుంది.
మంచి పుస్తకాలు చదవండి. మంచి వ్యక్తులుగా ఎదగండి. జీవితంలో అవి దార్శనికతకు కారణమౌతాయి. ఎవరైనా పెద్దల్ని కలిస్తే, మీరు వేయవలసిన ప్రశ్న ఒకటే-’’అయ్యా ! నేను తప్పకుండా చదవవలసిన పుస్తకం ఒకటి సూచిస్తారా?’’ అని.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
టాగ్లు: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, విద్య - విలువలు, విద్యార్థి దశ, భవిష్యత్‌, Brahmasri chaganti Koteshwara Rao, Education - the values, Student stage, Of the future


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list