MohanPublications Print Books Online store clik Here Devullu.com

మల్లె విరిసే వేళలో, Malle Kurisina Vela

మల్లె విరిసే వేళలో
Malle Kurisina Vela

మల్లె విరిసే వేళలో...
స్వచ్ఛమైన మనసునీ స్నిగ్ధ సౌందర్యాన్నీ ప్రతిబింబించే మల్లెల తలపే మదిలో ప్రియరాగాల్ని పలికిస్తుంది... వలపువానల్ని కురిపిస్తుంది. అలాంటిది గాలి అలల మీద తేలివచ్చే ఆ మధుర పరిమళాన్ని గుండెలనిండుగా శ్వాసిస్తే మనసు మనసులో ఉంటుందా... పరవశించి పరవళ్ళుతొక్కదూ..!
పెరట్లోని మల్లెతీగ మొగ్గలేయడం ఆలస్యం... ‘తొలి పూలన్నీ నాకే... రేపు నీకు...’ అంటూ పిల్లాపెద్దా వంతులేసుకోవడం, అది విరబూశాక ఇంట్లోని ఆడవారందరి తలల్లోనూ ఆ పూలు గుబాళించడం తెలిసిందే. ఇంట్లో మల్లెతీగ లేనివాళ్లు బజారుకు వెళ్లి పూలు కొని మాలలు కట్టుకోవడం లేదంటే నేరుగా మాలలే కొని కురుల్లో అలంకరించుకోవడమూ మామూలే. మల్లెపూలంటే మగువలకు అంతిష్టం మరి. నిజానికి ఆడవాళ్లకే కాదు, మాఘమాసం నుంచి ఆషాడ జల్లుల వరకూ పలకరించే తెల్లని మల్లెలూ ఆ పరిమళమూ ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమే.
అందుకే ఎండలెంత మండుతున్నా మత్తెక్కించే ఆ మల్లెల సౌరభాల కోసమే కోరి మరీ వేసవిలోనే లగ్నాలు పెట్టుకుంటారు. అవును మరి, మల్లె పరిమళం అద్భుతమైన శృంగారప్రేరితం. స్త్రీ, పురుష హార్మోన్లను ప్రభావితం చేయడంతోబాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకూ తోడ్పడుతుంది. పెళ్లిమండపాలూ పూలదండలూ పూలజడలూ వధూవరుల మేలిముసుగులతోపాటు శోభనం రాత్రి గది అలంకరణకీ మల్లెల్ని వాడేది అందుకే. ధవళ వర్ణంలో అందంగా విరబూసే మల్లె మొగ్గలకు బంగారు, ఎరుపు రంగులద్ది పెళ్లిజడల్లోనూ సిగల్లోనూ అలంకరించడమన్నది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న కొత్త ట్రెండ్‌.
ఎన్నో రకాలు..!
ప్రపంచవ్యాప్తంగా జాస్మినమ్‌ జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్‌ సంబక్‌ మాత్రమే. దీన్నే అరేబియన్‌ జాస్మిన్‌, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూలరేకులూ పరిమాణాన్ని బట్టి ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరుసలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రేకలతో ఉండేదే మెయిడ్‌ ఆఫ్‌ ఓర్లియాన్స్‌. వీటినే రేక మల్లె, గుండు మల్లె అంటారు. గుండుమల్లెలానే ఉంటాయికానీ వాటికన్నా కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేవే అరేబియన్‌ నైట్‌ü్స. కాడ సన్నగా ఉండి గుండ్రని మొగ్గల్లా ఉండే బొడ్డు మల్లెల్నే బెల్లె ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. వీటినే మైసూర్‌ మల్లెలనీ అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. వీటిల్లోనే మరోరకం సన్నని పొడవాటి రేకలతో ఉంటుంది. దీన్ని బెల్లె ఆఫ్‌ ఇండియా ఎలాంగేటా అంటారు. చూడ్డానికి చిట్టి గులాబీల్లా ముద్దగా ఉండే రోజ్‌ జాస్మిన్‌ లేదా సెంటుమల్లె అనేది మరోరకం. ఇందులో రెండు రకాలు. గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ టస్కనీ, గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ సుప్రీమ్‌. పొడవాటి పొదగా పెరిగే ఈ రకాల్లో ఒకేచెట్టుకి ఒకే సమయంలో రకరకాల పరిమాణాల్లో పూలు పూస్తాయి. ఈ పూలు ఒక్కరోజుకే రాలిపోకుండా కొన్నిరోజులపాటు చెట్టుకే ఉండి సుగంధాలు వెదజల్లుతాయి. దొంతరమల్లె అనే మరో రకం ఉంది. ఇందులో పూరేకులు అరలుఅరలుగా అమరి ఉంటాయి. మాఘమాసంలో ఎక్కువగా పూసేదే జాస్మినమ్‌ మల్టీఫ్లోరమ్‌. మాఘ మల్లిక, స్టార్‌ జాస్మిన్‌ అని పిలిచే ఈ పూలు ఎక్కడా ఆకు అన్నది కనిపించకుండా పూసి మొక్క మొత్తం తెల్లగా కనిపిస్తుంది. ఇవే కాదు, నేల తీరు, వాతావరణం, అంట్లు కట్టే విధానాన్ని బట్టి ఒక్కో మల్లెమొగ్గదీ ఒక్కో అందం... ఒక్కో మధురమైన పరిమళం. ఆమధ్యే పేటెంట్‌ కూడా పొందిన మధురై మల్లెలు ఈ కోవకే చెందుతాయి. మీనాక్షీ అమ్మవారిని అలంకరించేదీ ఆ మల్లెలతోనే.
మల్లెల సుగంధం!
ప్రపంచవ్యాప్తంగా మల్లెలు విరిసినప్పటికీ వీటిని ఎక్కువగా పూయించేది మనమే. కానీ ఫ్రాన్స్‌, ఇటలీ, మొరాకో, ఈజిప్టు, ,చైనా, టర్కీ దేశాలే మల్లెల తైలాన్ని ఎక్కువగా తీస్తున్నాయి. ఒక గ్రా. గాఢ మల్లె తైలాన్ని తీయాలంటే ఎనిమిది వేల మొగ్గలు కావాలి. అచ్చంగా మల్లెలతో చేసిన పెర్‌ఫ్యూమ్‌ ధర చుక్కల్ని తాకుతుంటుంది. అందుకే దీన్ని ఇతర తైలాల్లో కలిపి ఉపయోగిస్తుంటారు.
మల్లెల మందు!
మల్లెపూల పరిమళం మెదడును తాకి, మనసుకు ఎంతో హాయినీ ప్రశాంతతనీ కలిగిస్తుంది. అందుకే గాఢంగా పీల్చితే ఆ వాసన అన్ని నాడుల్నీ తాకి ప్రభావితం చేస్తుందంటారు అరోమాథెరపిస్టులు. శరీరానికి అవసరమయ్యే ఇ-విటమిన్‌ మల్లెల్లో ఉంటుందనీ, మల్లెలతో మరిగించిన నూనె చుండ్రు నివారణకూ శిరోజాల సంరక్షణకూ ఉపయోగపడుతుందనీ కూడా చెబుతారు. ఓ ఇరవై పువ్వుల్ని తీసుకుని వాటి నుంచి రసం తీసి దాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలకు పట్టిస్తే క్రమంగా అవి తగ్గుముఖం పడతాయి. మల్లెపూల గాఢ తైలం ఎనస్తటిక్‌గానూ పనిచేస్తుంది. ఇది చర్మానికి మంచి టానిక్‌ కూడా. ఈ నూనెను వేరే దాంతో కలిపి మర్దన చేస్తే మొటిమల మచ్చలూ తగ్గుముఖం పడతాయి.
* మల్లెల్ని త్రిదోష సంహారిణిగా పేర్కొంటోంది ఆయుర్వేదం. జ్వరమూ దగ్గూ కళ్లవాపులూ వాంతులూ అల్సర్లూ వంటి వాటి నివారణకు వాడతారు సంప్రదాయ వైద్యులు. పుండ్ల నివారణకు ఈ పూల నుంచి తీసిన రసాన్ని పూస్తుంటారు. ఇంకా చర్మవ్యాధులకీ కంటి సమస్యల నివారణకీ కామెర్ల మందులోనూ వాడుతుంటారు.
* మల్లెల వాసన నిద్రలేమినీ నివారిస్తుందట. సహజ యాంటీ డిప్రసెంట్‌ కూడా. ఈ వాసన ముక్కు రంధ్రాల ద్వారా మెదడుని చేరి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అలసటనీ ఆందోళననీ తగ్గిస్తుంది.
* మల్లెపూల పరిమళం ట్యూమర్లనూ నిరోధిస్తుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో మల్లె ఆకుల్నీ పూలనీ రొమ్ముక్యాన్సర్‌ నివారణకు వాడేవారు. వీటినుంచి తీసిన నూనె వాసన బ్యాక్టీరియాను నిరోధిస్తుందట.
* ఈ పూలతో చేసిన తేనీరు పొట్టలోని నులిపురుగుల్ని నాశనం చేస్తుందట. జాస్మిన్‌ టీని రోజూ తీసుకోవడంవల్ల క్యాన్సర్‌ తగ్గుతుందంటారు చైనీయులు. బహిష్టుకి ముందు వచ్చే నొప్పి ఉపశమిస్తుందట. ఈ టీకోసం తేయాకుల్నీ విరిసిన మల్లెల్నీ అరలు అరలుగా పోసి పూలవాసన ఆకులకు పట్టేలా చేస్తారు. ఈ ఆకులతో చేసిన టీ ఆకుపచ్చరంగులో సువాసనలు వెదజల్లుతుంది. మరో పద్ధతిలో అయితే బాగా మరిగించిన కొన్ని నీళ్లలో ఎండిన మల్లెల్ని వేసి మూడు నాలుగు నిమిషాలు ఉంచాలి. అదండీ సంగతి... మరి ఈ మల్లెల గుబాళింపుల్ని అస్సలు మిస్సవకండేం.
+++++++++మల్లెపూల జడ++++++++++++
ఎండాకాలం వచ్చిందంటే ఎంత సందడి. పిల్లల బడులకి సెలవు. చిన్నారుల ఆటపాటలకి అంతే ఉండదు. మామిడి పళ్లు, సపోటాలు, తాటి ముంజలు, ముఖ్యంగా మల్లెపూలు. ఇక మల్లెపూల విషయానికి వద్దాం. మల్లెలంటే ఇష్టం లేని వారుండరు. పూలు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అందరికీ వాటి రూపం, స్వచ్ఛమైన ఆ ధవళ వర్ణం, ఆ పూల సువాసన ఎంతో ప్రీతి! మల్లెలు చూస్తే రకరకాల భావాలు మనసుని ముప్పిరిగొంటాయి. వేసవిలో మల్లెపూలకి కొరతే ఉండదు.
తెలుగు లోగిళ్లల్లో మల్లె తీగెలు లేని ఇళ్లే ఉండవంటే అతిశయోక్తి కాదేమో! మల్లెల్లో ఎన్నో రకాలు. జాజిమల్లె, తీగ మల్లె, దొంతర మల్లె, బొడ్డు మల్లె ఇలా ఎన్నో. తెలియనివి ఇంకెన్ని రకాలో! అసలు మల్లెలు చూడాలే కానీ, మనసు పారేసుకోని వారు లేరు. పండు వెనె్నల్లో, మల్లెమాలల్లో సేద తీరాలని ఎందరి కోరికో! మల్లెలు మనసైన వారికి మనసెరిగి ఇచ్చే మధురమైన కానుక. ఆ అనుభవం లేనిదెవరికి? ముఖ్యంగా
మహిళలకి మల్లెలంటే ఎంతో మక్కువ.
పూలెన్ని ఉన్నా, మల్లెపూలే మనసుకిష్టం. అవి ప్రత్యేకం. తెల్లటి తెలుపుతో ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. మత్తెక్కించే సువాసనలు జల్లుతూ! రారమ్మని పిలుస్తూ మల్లెలు! ఇట్టే పూలు కోసి పెట్టుకోవాలనిపించేట్టు, ఇంతలోనే వాటిని కోసి, గుచ్చి, గొంతుకలు బిగించి కడుదురు కదా దయలేని ఆడవారు అని ‘పుష్పవిలాపం’ గుర్తుకొస్తుంది.
ఆడపిల్లలున్న ఇంట్లో వేసవి కాలం వచ్చిందంటే చాలు. ఒకటే సందడి.
ఆ సందడి ఎంత చెప్పినా తక్కువే. ఎంత రాసినా తనివి తీరదు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, మామయ్యలు, బావలు, చిన్నమ్మలు, చిన్నాన్నలు మిగతా బంధుజనం. ఇక అందరి పిల్లలు ఒకచోట చేరి చేసే అల్లరి, అలకలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇక అమ్మాయిలు ఏ చుట్టాలింటికి వెళ్లినా మల్లెలు జడలో తురమకుండా పంపరు. లేకపోతే పూలు ఇంటికి టపా చేస్తారు. ఇక పెద్దవాళ్లంతా చేరి, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ మల్లెపూల జడ వేయాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు నిర్ణయించుకున్నాక, గోరింటాకు కోసి రుబ్బి, అమ్మాయిల చేతుల నిండా పండిస్తారు. పూలమ్మాయికి ఎన్ని పూలు కావాలో? ఏయే పూలు కావాలో, ఏ రోజు, ఏ టైంకి కావాలో చెప్పి తెప్పించుకుంటారు. ఈలోగా అమ్మాయిలకి నలుగు పెట్టి, కుంకుడు కాయలతో తలంటి, సాంబ్రాణి పొగ పెట్టి, జడ కుచ్చులతో ఆడపిల్లలకి వాలుజడ వేస్తారు. అమ్మాయి జుట్టు పెద్దగా ఉంటే సవరం ఉండదు. చిన్న జుట్టు ఉంటే వారికి నప్పే సవరం చేర్చి జడ అల్లుతారు. ఏ ఆకారంలో జడలో పూలు అలంకరించాలో ముందే నిశ్చయమవుతుంది. ఇంతలోనే ఒకరు కొబ్బరి పుల్లలు పోగుచేసి వాటిని నున్నగా చెక్కుతారు. మిగిలిన వాళ్లు తలొక పుల్ల తీసుకుని ఆ పుల్ల నిండా మల్లెపూలు గుచ్చుతారు. కొందరు కనకాంబరాలు గుచ్చితే, మరి కొందరు మల్లెలు, కనకాంబరాలు మాలలు కడతారు. అల్లిన జడలోకి కొబ్బరి పుల్లకి గుచ్చిన మల్లెలు, కనకాంబరాలు అయిదారు వరుసల్లో పేర్చి జడపైన దారంతో కుడతారు. ఆ తర్వాత తలనిండా కట్టిన పూలు కూరుస్తారు. తీరైన పద్ధతిలో అలంకరిస్తారు. ఎంత కళాత్మకంగా ఆ పని చేస్తారు. ఆ దృశ్యం ఎంత అబ్బురంగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా కలిసి జట్టుగా సృజనాత్మకంగా జడని తీర్చిదిద్దుతారు! ఏ మేనేజ్‌మెంట్ గురులు నేర్పారు మహిళలకు ‘టీమ్ బిల్డింగ్’ గురించి? మేనేజ్‌మెంట్ గురూలు కూడా ఆ దృశ్యాలను చూసి, ఆ కలసికట్టుగా సాగించే ఆ కృషిని చూసి ముక్కున వేలేసుకోక మానరు. మన గ్రామీణ జీవన సౌందర్యంలోనే ఆ అపురూప దృశ్యాలు. మనస్సుని హత్తుకునే దృశ్యాలు మనకు కనిపించేది. ఆ ఆనందం వర్ణనాతీతం!
గోరింటాకుతో పండిన చేతులు, పట్టు పరికిణీ, జాకెట్, బొట్టు, కాటుక, మెడలో బంగారు గొలుసు, చేతికి గాజులు, వేలికి ఉంగరం పెట్టి అమ్మాయిలని ముస్తాబు చేసి ఫొటో స్టూడియోకి తీసుకెళ్లి ఫొటో తీయిస్తారు. అదో ముచ్చట. అనుభూతి. దాన్ని పెద్దవాళ్లు ఓ అందమైన అనుభవంగా దాచుకుంటారు. మా తరంలో ఎందరో ఇళ్లల్లో పూల జడలతో ఫొటో తప్పక ఉండేది. అచ్చం బుట్టబొమ్మలా అమ్మాయిలు ఉండేవారు. ఇక ఇంటికి వచ్చాక దృష్టి తీయడం వంటివి మామూలే! ఇక ఆ ఇంట్లో వరసైన అబ్బాయిలు ఉంటే ఇంట్లో వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అదో మురిపెం. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఇక బావో, మావయ్యో ఉంటే వాళ్లు ఆ చట్టి మరదళ్లని, చిన్నారి మేనకోడళ్లని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ముద్దు చేస్తారు. ఆ బంధాలు, అనుబంధాల గురించి మాటల్లో రాయలేం. ఆ చిన్ని అనుభూతులు అర్థం చేసుకోవాలంటే ఎవరికి వారి అనుభవంలోకి రావాల్సిందే. ఇక పెద్దయ్యాక అమ్మాయిలు ఆ ఫొటోలు చూసుకుంటే ఎనె్నన్ని జ్ఞాపకాల అనుభూతులో. మనస్సు మెల్లిగా తట్టి లేపి, సున్నితంగా హెచ్చరిస్తుంది. ఇప్పటి చిన్నారులు ఏం కోల్పోతున్నారో అని.www.MOHANPUBLICATIONS.Com

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list