MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధైర్య వచనం, Dhiva Vachanam

ధైర్య వచనం
Dhiva Vachanam

+++++ధైర్య వచనం+++++
‘ఈ మాత్రలు సక్రమంగా వాడండి. నాలుగు రోజుల్లో మీరు మామూలు పనులన్నీ చేసుకోవచ్చు...’ అని వైద్యుడు చెప్పగానే- రోగి పెదవులపై చిరునవ్వు వెలిగింది. ఉపాధ్యాయుడు ‘మీరంతా కష్టపడి చదివారు. పరీక్షలు బాగా రాస్తారు...’ అనగానే- తరగతి గదిలో, దిగులు పోగొట్టే చప్పట్లు మార్మోగాయి. ‘అత్తమామలు నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటారు తల్లీ! ఈ మాట ఓ వారం తరవాత నువ్వే అంటావు’- తల్లి వూరడింపు కొత్తగా కాపురానికి వెళ్లే కుమార్తె బెంగను చాలావరకు తగ్గించింది. ‘నాన్నా! నలుగురు బిడ్డలున్నాం. పదవీ విరమణ చేసినా నీకు, అమ్మకు ఏ లోటూ రానివ్వం’- పెద్దకొడుకు హామీతో తండ్రి గుండె ఆనంద తరంగితమైంది. ఇవి ధైర్య వచనాలు. దైనందిన జీవితంలో ఇలాంటి సన్నివేశాలు వివిధ స్థాయి వ్యక్తుల్లో అసంఖ్యాకం. ఆప్తవాక్యం వూరటనిస్తుంది. ఆశ నింపుతుంది. కార్యానికి ప్రేరణ కలిగిస్తుంది.
‘ధైర్యం సర్వత్ర సాధకమ్‌’ ఆర్యోక్తి సర్వులకూ వర్తించినా, ధైర్యగుణాన్ని వశం చేసుకోవడం సులభసాధ్యం కాదు. దానికి సడలిపోయే లక్షణముంది. ధైర్యంతో మనసులో ఒక సంకల్పానికి బీజావాపనం కాగానే, దాని చుట్టూ ఎన్నో సంబంధిత అంశాలు పరిభ్రమిస్తాయి. సాధనోపాయాలు అన్వేషించేందుకు యత్నిస్తాయి. బుద్ధి వాటిని జల్లెడ పడుతుంది. చివరకు వివేకం ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలో, ధైర్య పరిమాణంలో స్వల్పంగానైనా మార్పు రావడం సహజం. మన పురాణేతిహాసాలు ఇందుకు ఎన్నో తార్కాణాలు చూపాయి.
ధైర్య వచనాలు, ఆప్తవాక్యాలు, సహానుభూతులు, అనునయం, ప్రోత్సాహాలు, ఆప్యాయత, ఆత్మీయత, హితోపదేశాలు- ఇటువంటివి కష్ట నివారణను సందర్భోచితంగా సూచించాయి. రామాయణం యుద్ధకాండలో ఒక విలక్షణ ఉదాహరణ ఉంది. రావణుడితో భీకర సమరంలో అలసిన రాముడు చింతామగ్నుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి సమీపిస్తాడు. ‘రామ మహాబాహూ!’ అని సంబోధించి ధైర్యోన్నతి వర్ధిల్లజేసి- జయకరం, చింతాశోకనాశం, పరమ మంగళప్రదమైన ‘ఆదిత్య హృదయం’ జపిస్తాడు. రావణుణ్ని సంహరించమని ఉపదేశిస్తాడు. రాముడు అది పాటించి రావణుణ్ని వధిస్తాడు. అదీ, ధైర్యవచన ప్రభావం.
ఒక కోణంలో దర్శిస్తే ‘భగవద్గీత’ సుదీర్ఘ ధైర్యవచన సమాహారంగా తోస్తుంది. కౌరవ, పాండవ సేనల మధ్య నిలిచిన అర్జునుడు ఎదురుగా ఉన్న దాయాదులు, ఆచార్యులు, బంధుగణాన్ని చూసి శోకతప్తుడవుతాడు. ‘గాండీవం జారిపోతున్నది. నిలబడలేకున్నాను. స్వజనాన్ని ఎలా చంపగలను’ అని కృష్ణుడితో తీవ్ర వేదన వ్యక్తంచేస్తాడు. కృష్ణుడు గీతాబోధనతో ధైర్య వచనాల ద్వారా సవ్యసాచిని సమరోన్ముఖుణ్ని చేయగలిగాడు.
ఇటువంటి హితోక్తులు, వూరడింపులు, నిర్భయ భాషణం వంటివి పూర్వం కంటే నేడు మరింత ఆవశ్యకం. కాలం ఎంతో మారింది. స్వార్థచింతన, ధనార్జనాపేక్ష, హింసాప్రవృత్తి పెరిగాయి. విదేశీ ఉద్యోగావకాశాలు అధికమై, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తరిగిపోయి, సంతానమున్నా వయోధికులు ఏకాకులవుతున్నారు. జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలకరింపు, ఆపన్న హస్తం, సానుభూతి వంటివి సహాయకారులవుతాయి. వేదన తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుతాయి. బాధల్ని కొంతైనా నివారిస్తాయి. ఆత్మహత్యల వంటి ఆవేశపూరిత చర్యలు తగ్గుతాయి. కుంగుబాటు నుంచి రక్షిస్తాయి. భయం అంతరిస్తుంది. ఆనందం మొలకెత్తుతుంది.
ఆర్తుల్ని ఆదుకునేందుకు కరుణ నిండిన హృదయం కావాలి. మన చుట్టూ ఎందరో ఆర్తులుంటారు. వారి బాధల్ని మాట సహాయం, మంచి పలకరింపుతో ఉపశమింపజేయవచ్చు. అది మనలో మానవీయత పెంచుతుంది. ఆర్తులకు సహాయం సకాలంలో అందుతుంది. అదే ధైర్యవచన ఫలితం.
- గోవిందరాజు రామకృష్ణారావు

LIKE US TO FOLLOW:---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list