ఆండ్రాయిడ్‌లో అవి తెలుసా?
Do You Know These Options in Android
ఆండ్రాయిడ్‌లో అవి తెలుసా?
వాడేది స్మార్ట్ ఫోన్... అదీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో... మరి, ఇవి మీకు తెలుసా?ఒకసారి చెక్ చేసుకోండి!
టెక్స్ట్ చిన్నగా అనిపిస్తే ఏం చేస్తారు? ‘లార్జ్ టెక్స్ట్’ ఆప్షన్‌తో పెద్దదిగా చేసుకుంటారు. మరి, బుల్లి తెరపై బ్రౌజింగ్ చేస్తున్నప్పుడో లేదా ఆప్‌లో మరేదైనా పనిలో ఉన్నప్పుడో తెరపై ఉన్న వాటిని పెద్దవిగా జూమ్‌ఇన్ చేయాల్సివస్తే! అప్పుడేం చేస్తారు? అందుకు సులువైన చిట్కా ఏదైనా ఉందా?
కారో... బైకో... నడుపుతున్నారు. ఇంతలో ఫోన్‌కి ఏవేవో సందేశాలు... ఇతర ఆప్స్, వెబ్ సర్వీసుల నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి...
ఇలాంటి సమయంలో ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లు, ఇతర నోటిఫికేషన్స్‌ని ఫోనే మీకు చదివి వినిపిస్తే! అదెలా సాధ్యమో తెలుసా?
- ఇలాంటి ఎన్నో రకాల అవసరాలకు చక్కని చిట్కాలు ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!
అనివార్యమై ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టారు. తర్వాత అనుకోకుండా ఫోన్‌ని మీరు ఉన్నచోటే ఎక్కడో వదిలేశారు. ఎంత వెతికినా కనిపించడం లేదు. సైలెంట్ మోడ్‌లో ఉండడంతో ఫోన్ రింగ్ అవ్వడం లేదు. మరప్పుడు ఫోన్ ఎక్కడుందో తెలుసుకునేందుకు మార్గం ఏంటి?
చదివి వినిపిస్తుంది
చేతిలో ఫోన్ ఉన్నప్పుడు అన్నీ చూస్తాం... వెంటనే స్పందిస్తాం. కానీ, ప్రయాణాల్లో ఉన్నప్పుడైతే! అంటే... కారు లేదా బైక్ నడుపుతున్నప్పుడు మాటేంటి? ఫోన్‌కి వచ్చిన ముఖ్యమైన మెసేజ్‌లు, నోటిఫికేషన్స్ చూడాలంటే ఎలా? ఏముందీ... ఫోనే చదివి వినిపిస్తుంది. ఎలా సాధ్యం అంటే... అందుకు తగిన ఆప్స్ గూగుల్ ప్లేలో సిద్ధంగా ఉన్నాయి. ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. మీరు ఎంపిక చేసిన వాటి నుంచి వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ని ఫోనే చదివి వినిపిస్తుంది. ఫోన్ రింగ్ అవుతున్నప్పుడే ఫోన్ చేస్తున్న వ్యక్తి పేరుని పలుకుతుంది. ఎవరైనా మిస్డ్‌కాల్ చేస్తే ఆ వ్యక్తి ఎవరో కూడా చెబుతుంది. ఫోన్ నెంబర్‌కి వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లను చదివి వినిపిస్తుంది. కావాలంటే Voice Notification: Shouter ఆప్‌ని ప్రయత్నించండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆప్ సేవల్ని ‘ఎనేబుల్’ చేయాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏయే ఆప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని చదివి వినిపించాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. అందుకు Select apps విభాగం ఉంది. అన్ని వేళల్లో కాకుండా మీరు నిర్ణయించిన సమయంలోనే చదివి వినిపించేలా షెడ్యూల్ చేయవచ్చు. ముఖ్యమైన సర్వీసుల నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని రెండు సార్లు చదివేలా ఆప్షన్‌ని సెట్ చేసుకునే వీలుంది. ఆప్‌ని వాడి చూద్దాం అనుకుంటే https://goo.gl/8RVYNN లింక్‌లోకి వెళ్లండి.
* ఇలాంటిదే మరోటి ప్రయత్నిద్దాం అనుకుంటే ReadItToMe ఉంది. చదివితే వినడం ఒక్కటే కాదు. మాట్లాడుతూనే (వాయిస్ రిప్లె) మీ స్పందన తెలపొచ్చు. డౌన్‌లోడ్ లింక్:https://goo.gl/HHxWix
ఎక్కువ సార్లు వాడితే...
స్మార్ట్ ఫోన్‌లో హోం స్క్రీన్‌ని అనేక రకాలుగా వాడేస్తాం. ఆప్స్‌ని విభాగాలుగా సెట్ చేస్తాం. హోం స్క్రీన్‌పై మరేవైనా అదనంగా సెట్ చేసుకుని వాడదాం అనుకుంటే? ప్రత్యేక షాట్‌కట్స్ ప్యానల్‌ని సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఎక్కువ సార్లు వాడే ఆప్స్‌ని మరింత సులువుగా ఓపెన్ చేసుకునేలా ఏదైనా ప్రత్యేక బార్‌ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ‘నోటిఫికేషన్స్ ప్యానల్’నే అందుకు వేదిక చేయవచ్చు. అదెలాగంటే... అందుకు కొన్ని లాంచర్ ఆప్స్ ఉన్నాయి. కావాలంటే Bar Launcher ఆప్‌ని ప్రయత్నించండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఎక్కువగా వాడే వాటిని నోటిఫికేషన్ ప్యానల్‌లో కాన్ఫిగర్ చేయవచ్చు.
డౌన్‌లోడ్ లింక్: https://goo.gl/vHkyHk
* ఇలాంటిదే మరోటి ప్రయత్నిద్దాం అనుకుంటే Notification Toggle ఆప్‌ని నిక్షిప్తం చేయండి. దీంట్లో ఫోన్ సెట్టింగ్స్‌ని మరింత అనువుగా సెట్ చేసుకోవడమే కాకుండా ఆప్స్‌కి షాక్ట్‌కట్స్‌ని పెట్టుకోవచ్చు. ఉదాహరణకు సెట్టింగ్స్‌లోని మెనూల్లోకి వెళ్తే తప్ప కనిపించని WiFi, Bluetooth, Brightness, NFC... లాంటి ఆప్షన్స్‌ని చిటికెలో యాక్సెస్ చేసేలా నోటిఫికేషన్ ఫ్యానల్‌లోనే పెట్టుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్: https://goo.gl/Wnzr0n
* మరో రెండు ఆప్స్ Power Toggles, 1Tap Quick Bar.
దేంట్లోనైనా ‘జూమ్‌ఇన్’
రెండు వేళ్లతో లాగుతూ... రెండు సార్లు తెరపై ట్యాప్ చేస్తూ జూమ్‌ఇన్ చేస్తుంటారు. అలాగే, బిల్ట్‌ఇన్‌గా ఉన్న జూమ్ ఆప్షన్స్‌తో టెక్స్ట్‌ని పరిమాణాన్ని పెంచుకోవచ్చు. కానీ, బ్రౌజింగ్ చేస్తున్నప్పుడో లేదా ఏదైనా ఆప్‌ని వాడుతున్నప్పుడో తెరపై ఉన్న వాటిని జూమ్‌ఇన్ చేసుకుని చూడాలంటే Magnification Gestures మార్చుకోవచ్చు. అందుకు ఎలాంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్‌షార్ట్ తీసుకోవాల్సిన పని లేదు. సింపుల్‌గా ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి చాలు. అక్కడ కనిపించే Accessibilityమెనూలోకి వెళ్తే Magnification Gestures ఆప్షన్ కనిపిస్తుంది. ఆఫ్‌లో ఉన్న ఆప్షన్‌ని ‘ఆన్’ చేస్తే చాలు. మూడు సార్లు వరుసగా తెరపై ట్యాప్ చేస్తే కంటెంట్ ఏదైనా జూమ్‌ఇన్ అవుతుంది. ఇలా జూమ్‌ఇన్ అయ్యాక మరింత జూమ్‌ఇన్ చేయాలనుకుంటే ఎప్పటిలానే రెండు వేళ్లతో నొక్కి సాగదీయొచ్చు. జూమ్‌ఇన్ చేసిన మొత్తాన్ని జరుపుతూ కావాల్సిన భాగాన్ని చూద్దాం అనుకుంటే రెండు వేళ్లతో తెరపై నొక్కి ఉంచి జరిపితే సరి. అవసరం తీరాక ఈ సౌకర్యాన్ని డిసేబుల్ చేయాలంటే ‘ఆఫ్’ చేస్తే చాలు.
హార్డ్‌వేర్ మాటేంటి?
వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఎలా పని చేస్తోంది? ప్రాసెసింగ్ వేగం నెమ్మదించినట్టుగా అనిపిస్తోందా? హార్డ్‌వేర్ పని తీరుపై ఓ కన్నేద్దాం అనుకుంటే చిట్కా ఏంటి? ప్రత్యేక ఆప్ ఒకటి ఉంది. పేరు Phone Tester. ఇన్‌స్టాల్ చేసి రన్ చేస్తే చాలు. చిట్టా మొత్తం తెరపై ప్రత్యక్షమవుతుంది. ఫోన్ సెన్సర్లు, నెట్‌వర్క్, జీపీఎస్, బ్యాటరీ, కెమెరా, సిస్టం సమాచారం మొత్తాన్ని చూపిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం ఏ మేరకు ఉందో చెక్ చేసి చూడొచ్చు. డ్యూయల్ కెమెరాల మొత్తం స్పెసిఫికేషన్స్‌ని చూడొచ్చు. https://goo.gl/exK0dx
లాక్ తీసినప్పటికీ...
చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. స్మార్ట్‌గా ఫోన్ కనిపిస్తే చాలు... ఓ సారి ఇలా ఇమ్మంటారు. తాళం వేసి ఉంటే అన్‌లాక్ చేయమంటారు. మీరు పక్కన ఉండగానే అన్నీ చూస్తుంటారు. ముందే ఫోన్‌లోని గ్యాలరీలు, ముఖ్యమైన ఫోల్డర్లను లాక్ చేసుండడంతో మీరేం కంగారు పడరు. కానీ, వాట్స్‌ఆప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్... లాంటి మెసెంజర్ ఆప్స్ నుంచి ఏదైనా ముఖ్యమైన నోటిఫికేషన్ అప్పుడే వస్తే! అది వారి కంటపడకుండా ఉండాలంటే? అందుకో చిట్కా ఉంది. సెట్టింగ్స్‌లోని Sound and Notifications మెనూలోకి వెళ్లాలి. అక్కడి మెనూ జాబితాలోని When device is unlocked ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి Hide Sensitive notification content లేదా Don't show notifications at allఆప్షన్స్‌లో ఏదొకటి సెలెక్ట్ చేసి కంటపడకుండా చేయవచ్చు.
సైలెంట్ మోడ్‌లో ఉన్నా...
ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఫోన్‌ని పని చేసే చోటే ఎక్కడో వదిలేశారు. స్నేహితుడి ఫోన్ నుంచి కాల్ చేస్తే సైలెంట్ మోడ్‌లో ఉండడం వల్ల రింగ్ వినిపించడం లేదు. అలాంటప్పుడు ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలాగంటే... ‘ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్’ సేవల్ని వాడుకుంటే సరి. ఫోన్ ఎక్కడుందో తెలుసుకోడమే కాదు. ఇతరులు వాడకుండా తాళం వేయవచ్చు. ముఖ్యమైన డేటా ఏదైనా ఉంటే ఇతరుల కంటపడకుండా చెరిపేయొచ్చు. కేవలం ఫోన్‌ని రింగ్ చేసి చూద్దాం అనుకుంటే వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. అడ్రస్‌బార్‌లో Find my phoneకమాండ్‌ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. తర్వాత మీరు వాడుతున్న జీమెయిల్ ఎకౌంట్ వివరాలతో లాగిన్ అయితే... ఫోన్ మోడల్, ఉన్న లొకేషన్ వివరాలు వచ్చేస్తాయి. ఫోన్‌ని రింగ్ అయ్యేలా చేసి ఎక్కడుందో తెలుసుకునేందుకు Ring ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు. సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్ కూడా రింగ్ అవుతుంది. ఒకవేళ ఫోన్‌ని లింక్‌లోకి వెళ్లి మ్యాప్‌పై లొకేషన్‌ని చూడొచ్చు. ఫోన్‌ని Lock, Erase చేయవచ్చు కూడా.
ఆప్స్ చిట్టా...
ఆండ్రాయిడ్‌లో ఏం చేసినా జీమెయిల్‌తోనే. మరి, మీ స్మార్ట్ ఫోన్‌ని కొన్నప్పటి నుంచి ఏమేం ఆప్స్‌ని ఇన్‌స్టాల్ చేశారో మొత్తం చిట్టాని చూడాలంటే? బ్రౌజర్‌లో అయితే గూగుల్ ప్లేలోకి లాగిన్ అయ్యాక మెయిన్ మెనూలోని My apps ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మొత్తం థంబ్‌నెయిల్ ఐకాన్స్‌తో జాబితాగా కనిపిస్తాయి. ఒకవేళ ఫోన్‌లోనే చూద్దాం అనుకుంటే గూగుల్ ప్లే హోం మెనూలోని My apps & games ఆప్షన్‌ని తాకి All విభాగంలోకి వెళ్లి చూడండి. ఉచితంగా ఇన్‌స్టాల్ చేసిన ఆప్స్ సంగతి సరే! కొనుగోలు చేసి పొందిన వాటిని చూడాలంటే ఎలా? అనే సందేహం అక్కర్లేదు. My Paid Apps ఆప్‌ని ప్రయత్నించొచ్చు. గూగుల్ ప్లే నుంచి కొనుగోలు చేసి వాడుతున్న అన్ని విభాగాలకు సంబంధించిన వాటిని బ్రౌజ్ చేసి చూడొచ్చు. డౌన్‌లోడ్ లింక్: https://goo.glPrD3F
ఆటోమాటిక్‌గా అన్‌లాక్
ఫోన్‌ని ఇతరులు వాడకుండా సెక్యూరిటీ నిమిత్తం PIN, Pattern లాక్‌లు పెట్టుకుంటాం. ఎప్పుడైనా... ఫోన్‌కి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా... పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేస్తేగానీ ఫోన్‌ని వాడలేని పరిస్థితి. మీకేమో అన్నిసార్లూ ఫోన్‌ని అన్‌లాక్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తోంది. అందుకే మీ ఫోన్ సురక్షితం అనుకున్న చోట ఫోన్ ఆటోమాటిక్‌గా అన్‌లాక్ అయిపోతే! అదెలా సాధ్యం అంటే... మీరు ఆండ్రాయిడ్ 5.0 ఆపై వెర్షన్ ఓఎస్‌తో ఫోన్‌ని వాడుతున్నట్లయితే ‘స్మార్ట్ లాక్’ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఈ సర్వీసుని ఎనేబుల్ చేసి ఫోన్ సురక్షితం అనుకున్న చోట (ఇల్లు, ఆఫీస్) ఫోన్‌ని ఆటోమాటిక్‌గా ఆన్‌లాక్ అయ్యేలా చేయవచ్చు. సెట్టింగ్స్‌లోని ‘సెక్యూరిటీ’ మెనూలోకి సర్వీసుని ఎనేబుల్ చేయాలి. ఫోన్ జీపీఎస్ సెన్సర్ ద్వారా మీరు ఎంపిక చేసిన లొకేషన్స్‌ని ఫోన్ గుర్తించి పని చేస్తుంది.
బ్లాక్ చేయవచ్చు
ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నారు. వచ్చే కాల్స్, మెసేజ్‌లు మిమ్మల్ని అసహనానికి గురి చేస్తున్నాయి. వాటిని బ్లాక్ చేయడం ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్ వెర్షన్‌లో అయితే సాధ్యమే. ఆప్షన్ ఎక్కడ ఉందబ్బా అనేగా? సెట్టింగ్స్‌లోకి వెళ్లి Sound and Notification మెనూలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే Interruptions మెనూని సెలెక్ట్ చేసి బ్లాక్ చేయవచ్చు.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565