MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉచితంగా నేత్రవైద్యం శంకర ఐ ఫౌండేషన్‌_Free Eye Operation



ప్రపంచంలో అతి ఎక్కువమందికి  ఉచితంగా నేత్రవైద్యం  అందిస్తున్న సంస్థల్లో ఒకటి...  శంకర ఐ ఫౌండేషన్‌


Free Eye Operation

ప్రపంచంలో అతి ఎక్కువమందికి
ఉచితంగా నేత్రవైద్యం
అందిస్తున్న సంస్థల్లో ఒకటి...
శంకర ఐ ఫౌండేషన్‌.
కంచి కామకోటి పీఠం నేతృత్వంలో
స్ఫూర్తి ప్రదాత...
మఠాధిపతుల ప్రపంచం వేరు. నిత్యం...పూజలూ దీక్షలూ పర్యటనలూ అనుగ్రహభాషణలూ! ఆ ఆధ్యాత్మిక చింతనకు నిరుపేదల పట్ల కాస్త చింత కూడా తోడైతే...సమాజానికి మహోపకారం జరుగుతుంది. నడయాడే పరమశివుడని భక్తులు ప్రేమగా పిలుచుకునే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి శివుడంటే ఎంత భక్తో, నరుడంటే అంత ప్రేమ! ‘సమాజానికి మంచి చేయండి, దేశానికి ఉపకారం చేయండి’ అని భక్తులకు ప్రబోధించారాయన. పరమాచార్యుల చొరవతోనే కంచి పీఠం ఆధ్వర్యంలో అనేక వైద్యశాలలూ విద్యాలయాలూ ప్రారంభం అయ్యాయి. ఇక, శంకర ఐ ఫౌండేషన్‌కు ఆయన బోధనలే స్ఫూర్తి.చంద్రశేఖరేంద్రుల పూర్వాశ్రమ నామం స్వామినాథుడు. తమిళనాడులోని విల్లుపురంలో పుట్టారు. తండ్రి బ్రిటిష్‌ సర్కారులో పాఠశాలల తనిఖీ అధికారి. తల్లి గృహిణి. అమ్మ ఒడిలోనే రామాయణభారతాలు చదువుకున్నారు. మిషనరీ పాఠశాలకు వెళ్లడం వల్ల బైబిలు కూడా కంఠతా వచ్చేసింది. స్వామినాథుడికి పట్టుమని పదమూడేళ్లు కూడా లేనప్పుడే కంచిమఠం అప్పటి పీఠాధిపతి...ఆ పసివాడిలోని ఆధ్యాత్మిక సంపత్తిని గుర్తించారు, ఉత్తరాధికారిగా ప్రకటించారు. ఓసారి శ్రీమఠంలో పనిచేస్తున్న చిరుద్యోగి మినప్పప్పును దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. అతన్ని తీసుకెళ్లి స్వామివారి ముందు నిలబెట్టారు. ‘మహాపరాధం చేశాడు. ఉద్యోగంలోంచి తీసేయాల్సిందే’ అని అంతా పట్టుబట్టారు. చంద్రశేఖరేంద్రులు మాత్రం...‘ఆశ మహా చెడ్డది. ఎంత పనైనా చేయిస్తుంది. గారెల మీద మనసుపడ్డాడు కాబోలు. రేపు వేడివేడిగా గారెలు వండి, ఎన్ని తినగలిగితే అన్ని వడ్డించండి’ అని ఆదేశించారు...అంతటి మానవత! ఏనుగునెక్కడం మహాగొప్పగా భావించే రోజుల్లోనే...మరో జీవి మీద కూర్చోవడం కూడా జీవహింసే. అధిరోహించేదే లేదు’ అని స్పష్టం చేశారు...అంతటి జీవకారుణ్యం! ఆయన వేదాల మీద ఉపన్యసిస్తే...మరుసటిరోజు వాషింగ్టన్‌ పోస్ట్‌ సహా అంతర్జాతీయ పత్రికలన్నీ ప్రచురించేవి...అంతటి ప్రతిభ! నిండు నూరేళ్ల జీవితంలో...ఆయన ధర్మానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, సేవకూ అంతే విలువ ఇచ్చారు.
--------------------
(మరిన్ని వివరాలకు: giftofvision.org, శంకర ఐ ఫౌండేషన్‌, పెదకాకాని దగ్గర, గుంటూరు. ఫోన్‌: 0863- 2293903/905)
______________
కనుపాప కరవైన... కనుల కోసం!
ప్రపంచంలో అతి ఎక్కువమందికి ఉచితంగా నేత్రవైద్యం అందిస్తున్న సంస్థల్లో ఒకటి... శంకర ఐ ఫౌండేషన్‌. కంచి కామకోటి పీఠం నేతృత్వంలో మొదలైన నేత్రయజ్ఞం తెలుగునేలకూ విస్తరించింది. గుంటూరు ప్రజలు ఆ వైద్యశాలను గుండెలకు హత్తుకున్నారు. హైదరాబాద్‌లోనూ ఓ సువిశాల ఆవరణ సిద్ధం కాబోతోంది.
చూపొక్కటి కరవైతే బతుకంతా చీకటే. అనుబంధాలకు బీటలు పడతాయి. ఉపాధి కరవైపోతుంది. సమాజానికీ చులకనే. ఏదో ఓ ఆసరా కోసం, ఎవరో ఒకరి సాయం కోసం జీవితాంతం ఎదురుచూడాల్సిందే. ఆ పరాధీనత వేయి వైకల్యాలకు సమానం.
- ఈ దుస్థితిని 2020 నాటికైనా అధిగమించాలన్నది శంకర ఐ ఫౌండేషన్‌ లక్ష్యం. ఆ సంకల్ప దీపం, దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం...కోయంబత్తూరులోని మీనాక్షి ఆలయంలో వెలిగింది. మీనాక్షి అంటే... మీనాల్లాంటి పెద్దపెద్ద కళ్లున్న తల్లి!
మీనాక్షమ్మ ఆలయాన్ని కంచి కామకోటి పీఠం నిర్వహిస్తోంది. అప్పట్లో, ఆలయ ప్రాంగణంలో చిన్న ఆరోగ్య కేంద్రం ఉండేది. రోజూ ఎంతోమంది నిరుపేదలు ఇక్కడికొచ్చి చికిత్స చేయించుకునేవారు. సహృదయులైన వైద్యులు నిస్వార్థంగా సేవలు అందించేవారు. ఆ వైద్య బృందంలో డాక్టర్‌ ఆర్‌.వి.రమణి, డాక్టర్‌ రాధారమణి దంపతులూ ఉన్నారు. ఇద్దరూ కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి శిష్యులే. ఓ సందర్భంలో పరమాచార్యులు ఆ దంపతుల్ని ‘శివానుగ్రహ ప్రాప్తిరస్తు. స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్లండి’ అని ఆశీర్వదించారు. ఆ దంపతులకు స్వామివారి ఆకాంక్ష అర్థమైంది. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సూక్తి గుర్తుకొచ్చింది. అదే గురువుల సంకల్పమని విశ్వసించారు. నేత్రవైద్యం మీద దృష్టిపెట్టారు. 1982లో కంచి కామకోటి మెడికల్‌ ట్రస్టు ఏర్పాటైంది.
ఆ సమయానికి నేత్ర వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం. ప్రజల్లోనూ నేత్ర సమస్యల పట్ల అవగాహన తక్కువ. ఆ నిర్లక్ష్యమూ నిర్లిప్తతా అజ్ఞానమూ...ఎన్నో జీవితాల్ని బలితీసుకునేవి. ఓ తీవ్ర సమస్య పరిష్కారానికి పూనుకోవాలంటే...ప్రయత్నమూ గొప్పగానే ఉండాలి. అప్పుడే ఫలితాలు కనిపిస్తాయి, జీవితాలు వికసిస్తాయి. అందుకే, సువిశాలమైన ప్రాంగణంలో, అత్యాధునికమైన పరికరాలతో వైద్యశాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎలాంటి రాజీ లేకుండా ఆసుపత్రిని నిర్మించాలంటే, ఐదారు ఎకరాల భూమి అయినా కావాలి. అంత జాగా ఎక్కడి నుంచి వస్తుంది? ఏ అశరీరవాణో చెవిలో చిరునామా చెప్పినట్టు....నటరాజ్‌ అనే వ్యక్తి ట్రస్టు కార్యాలయాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కోయంబత్తూరు సమీపంలోని శివానందపురంలో తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిని ఆసుపత్రి నిర్మాణానికి కానుకగా ఇచ్చాడు. ఇక భవన నిర్మాణమే ఆలస్యం. నిధులు సమకూరితే ఆ పనీ మొదలైపోతుంది. అలా అని, ఆరోజు కోసం ఎదురుచూస్తూ కూర్చోవడమూ సమంజసంగా అనిపించలేదు. కానీ, అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి. అంతలోనే, సుబ్రమణియం అనే భక్తుడు ‘నా వంతు సేవ చేస్తాను, అనుమతి ఇవ్వండి’ అంటూ, అడక్కుండానే ఓ వాహనాన్ని సమకూర్చిపెట్టాడు. గతుకుల రోడ్లను దాటుకుంటూ మారుమూల పల్లెలకూ వెళ్లేవారు. అలా ఓ సంచార వైద్యశాలగా శంకర ఐ ఫౌండేషన్‌ ప్రారంభమైంది. 1986లో భవన నిర్మాణం మొదలైంది. చకచకా పనులు పూర్తయిపోయాయి. చాలాకాలం వరకూ ఇక్కడ కంటి శుక్లాల శస్త్రచికిత్సలు మాత్రమే జరిగేవి. ఆతర్వాత అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ సేవల్నీ అందుబాటులోకి తెచ్చారు. మూడు దశాబ్దాల్లో...శంకర వైద్య సేవలు ఆరు రాష్ట్రాలకు విస్తరించాయి. బెంగళూరు, షిమోగా, ఆనంద్‌, లూథియానా తదితర నగరాల్లో ఎనిమిది వైద్యశాలలున్నాయి. దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ ఓ నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేయాలన్నది శంకర సంకల్పం.
-------------------------
తెలుగుగడ్డ మీద...
ఒకటిన్నర దశాబ్దం క్రితం...శంకర సేవల్ని తెలుగుగడ్డకు విస్తరించాలని ట్రస్టు నిర్ణయించింది. జనచైతన్య సంస్థ గుంటూరు-విజయవాడ మార్గంలో నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దేశవిదేశాల్లోని దాతల సౌజన్యంతో భవన నిర్మాణానికి నిధులు సమకూరాయి. 2004 మార్చిలో గుంటూరు ఆసుపత్రి ప్రారంభమైంది. ప్రపంచశ్రేణి నేత్రవైద్య సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ అందుబాటులో ఉంది. అపార అనుభవం ఉన్న వైద్యబృందం అండగా నిలిచింది. సేవలు క్రమంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలకూ విస్తరించాయి. ‘గిఫ్ట్‌ ఆఫ్‌ విజన్‌’ కార్యక్రమం కింద వైద్యులు ఈ మూడు జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుంటూరు ఆసుపత్రికి తీసుకువస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ...రోజుకు 60 నుంచి 100 దాకా శస్త్రచికిత్సలు చేస్తారు. ఇక్కడ మొత్తం 225 పడకలు ఉన్నాయి. వీటిలో ఇరవై దాకా ఫీజులు చెల్లించేవారికి కేటాయిస్తారు. పడకల సామర్థ్యాన్ని మరో వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఆవరణలో ఏటా పాతిక వేల ఉచిత శస్త్రచికిత్సలు జరుగుతాయి. కోయంబత్తూరు తర్వాత అతిపెద్ద ఆసుపత్రి ఇదే. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఎన్టీఆర్‌ వైద్య సేవ కిందా, వివిధ ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకాల కిందా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. ఉచిత నేత్ర చికిత్స కోసం వచ్చేవారు ముందుగా ఆయా ప్రాంతాల్లో జరిగే వైద్య శిబిరాలకు హాజరు కావాల్సి ఉంటుంది. నేరుగా ప్రవేశం ఉండదు. శంకర కంటి ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఓ ఐ బ్యాంక్‌ ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ‘ఆదర్శ నేత్రనిధి’గా గుర్తించింది.
కొత్త జీవితం...
చిరుకపల్లివారి పాలేనికి చెందిన నరసింహకు రెండో జన్మ ఎత్తినట్టుగానే ఉంది. చాలా కాలం క్రితమే అతడి చూపులో తేడా మొదలైంది. ఆ మసక రానురానూ రెండు కళ్లకూ ముసురుకుంది. ఆ స్థితిలో ఎంతకాలమని కుట్టుపని నడిపిస్తాడు? సూదిలో దారం ఎక్కించడమూ అసాధ్యమైపోయింది. కుట్టు మిషను చక్రం ఆగిపోయింది. బతుకుబండి కుంటుబడిపోయింది. సరిగ్గా అప్పుడే, శంకర సంచార వాహనం పల్లెకు వెళ్లింది. ఆశగా వరుసలో నిలుచున్నాడు. వారం రోజుల్లో శస్త్రచికిత్స జరిగిపోయింది. తనిప్పుడు, పనిలో పాతికేళ్ల కుర్రాడే.
దృష్టిదోషం ఓ తీవ్ర సమస్య. పేదరికం మరో తీవ్ర సమస్య. రెండూ ఉన్నాయంటే...బతుకు భరించలేనంత బరువైపోతుంది. చికిత్స కోసం పట్నానికి వెళ్లడమంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎవరో ఒకరు మేమున్నామని ముందుకొస్తే, అన్నీ తామై ఖర్చులు భరిస్తే, కంటిచూపును కానుకగా అందిస్తే...ఆ చీకటి కళ్లలో మెరుపు వస్తుంది. శంకర ఫౌండేషన్‌ ‘గిఫ్ట్‌ ఆఫ్‌ విజన్‌’ - లక్ష్యం ఇదే. ఆసుపత్రి ప్రతినిధులు చుట్టుపక్కల మూడొందల కిలోమీటర్ల పరిధిలోని పల్లెలకు వెళ్తారు. వారానికి రెండు మూడు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఎంతమంది వచ్చినా, కాదనకుండా కంటి పరీక్షలు జరుపుతారు. సమస్యలుంటే, గుంటూరుకు తీసుకొచ్చి వైద్యం చేస్తారు. సహాయకులకు ఉచిత వసతి కల్పిస్తారు. కడుపునిండా భోజనం పెడతారు. చికిత్స పూర్తయ్యాక, సురక్షితంగా ఇంటిదగ్గర దిగబెడతారు.
కంటికి కనుపాపలా... నేత్ర రోగులకు శంకర! ఇప్పటి వరకూ...దేశవ్యాప్తంగా ఉన్న శంకర ఆసుపత్రుల్లో 35 లక్షల మందికి కంటి పరీక్షలు జరిగాయి. దాదాపు పదిహేను లక్షల ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించారు. రోజూ, సగటున ఐదొందల సర్జరీలు జరిగిపోతాయి. 2020 నాటికంతా, ఏటా ఐదు లక్షల మందికి ఉచిత వైద్యం అందించాలన్నది ఫౌండేషన్‌ లక్ష్యం.
మహాభాగ్యమిది...
డాక్టర్‌ ఆర్‌.వి.రమణి
శంకర ఐ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు
భారతదేశంలో ఏ ఒక్కరూ అవగాహనా రాహిత్యంతోనో, ఆర్థిక సమస్యల కారణంగానో కంటిచూపుకు దూరం కాకూడదు. శంకర ప్రారంభమైన తొలిరోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఓ మారుమూల ప్రాంతంలో ... గ్రామస్థులంతా కలసి ఓ పసిపిల్ల కళ్లు పొడిచేశారు. ఓ విదేశీ స్వచ్ఛంద సేవకురాలు ఆ హృదయ విదారక సంఘటన గురించి నా దృష్టికి తెచ్చింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లు. పసిపాప పుట్టగానే తల్లి చనిపోయిందట. దీంతో నష్టజాతకురాలని ముద్ర వేసి...రెండు కళ్లూ పొడిచేశారు. ఎంత ఘోరం! శంకరలో శస్త్రచికిత్స తర్వాత, ఆ చిన్నారి తొలిసారిగా ప్రపంచాన్ని చూసిన దృశ్యం...నా కళ్లముందు ఇంకా కదలాడుతోంది. ఆ సంతృప్తిని కోట్ల రూపాయల సంపాదనా ఇవ్వలేదు. చూపును ఇవ్వడానికి మించిన సేవ ప్రపంచంలో మరొకటి లేదని నేను విశ్వసిస్తాను. ఆ ఆలోచనే నన్నూ మా బృందాన్నీ ముందుకు నడిపిస్తోంది.
నాగరత్నమ్మకు అయితే ఇదంతా కలలా అనిపిస్తోంది. భర్త పోయాక, బాధ్యతలన్నీ ఆమె మీదే పడ్డాయి. ఆ బరువంతా ఎలా మోస్తుందా ఒంటరి మహిళ? ఉద్యోగం వెతుక్కోడానికి చదువులేదు. ఏ వ్యాపారమో చేద్దామంటే డబ్బులేదు. తెలిసిన పనల్లా...నలుగురికీ కమ్మగా వండిపెట్టడమే. ఆ కళనే ఉపాధిగా మార్చుకుంది. ఇంటి బయటే చిన్న పాక వేసుకుంది. అందులో హోటలు మొదలుపెట్టింది. ఆమె చేతి ఇడ్లీలు మల్లెల్లా ఉంటాయన్న పేరొచ్చింది. తింటుంటే వెన్నముద్దల్లా కరిగిపోతాయన్న ప్రశంస పాకిపోయింది. వ్యాపారం వూపందుకుంటున్న సమయంలో, కంటి సమస్య మొదలైంది. చూపులో అస్పష్టత వల్ల కావచ్చు, రుచి కుదిరేది కాదు. దీంతో, వ్యాపారం పడిపోయింది. మళ్లీ పాత జీవితమే! ‘రేపల్లెలో ఉచితంగా వైద్యం చేస్తున్నారు. వెళ్లొచ్చుగా...’ అని తెలిసినవారు సలహా ఇచ్చారు. హోటలు కట్టేసి వూతకర్రపట్టుకుని బయల్దేరింది. డాక్టర్లు అన్ని పరీక్షలూ చేశారు. రెండు కళ్లకూ ఆపరేషన్‌ తప్పదని తేల్చారు. నాగరత్నమ్మకు భయంగా అనిపించింది. ఎప్పుడూ పెద్దాసుపత్రి మొహం కూడా చూడలేదామె. ‘ఏం ఫర్వాలేదు. మేమంతా లేమూ?’ అని శంకర ప్రతినిధులు ధైర్యం చెప్పారు. మాటిచ్చినట్టే, ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. చక్కని కంటిచూపునూ అందించారు. రత్నమ్మ వ్యాపారం మళ్లీ వూపందుకుంది. ఆమె చేతి ఇడ్లీల కోసం జనం వరుసలు కడుతున్నారు.
పిల్లల కనుపాప...
చందూ కుటుంబం బీహార్‌ నుంచి లూథియానాకు వలస వెళ్లింది. అమ్మానాన్నా పనికెళ్లిపోయేవారు. చందూ పుస్తకాల సంచీ భుజానికేసుకుని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవాడు.
ఓరోజు లెక్కల క్లాసులో... ఎవరో కుర్రాడు పెన్సిలు విసిరాడు. అది బాణంలా దూసుకొచ్చి చందూ కంటికి గుచ్చుకుంది. భరించలేనంత నొప్పి! బొటబొటా రక్తం కారింది. అంతా కలసి దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు సిరంజి పొడిచి, నాలుగు మాత్రలిచ్చి ఇంటికి పంపేశారు. నొప్పి తగ్గింది కానీ పసివాడి చూపు పోయింది. ఎలాగైనా బిడ్డకు కంటిచూపును ప్రసాదించమంటూ తల్లిదండ్రులు శంకర నేత్రవైద్యశాలను ఆశ్రయించారు. కీహోల్‌ సర్జరీ ద్వారా.. ఆరంటే ఆరు వారాల్లోనే చందూకు చూపొచ్చింది.
శంకర్‌కు పన్నెండేళ్లు కూడా ఉండవు. ఆ పసివాడిలో క్యాన్సర్‌ లక్షణాలు బయటపడ్డాయి. కన్నవారిది దిగువ మధ్యతరగతి నేపథ్యం. ఉన్న నాలుగు రాళ్లూ ఖర్చుపెట్టి వైద్యం చేయించారు. మొత్తానికి రోగ లక్షణాలు మాయమైపోయాయి. అమ్మానాన్నలు ఆ అప్పుల భారం నుంచి తేరుకుంటున్న సమయానికి...శంకర్‌ కంటిచూపు మందగించింది. రెండు కళ్లకూ పొరలు కమ్మాయి. ఇదంతా రేడియేషన్‌ చికిత్స ప్రభావమేనని తేలింది. మరోసారి వైద్యమంటే, ఆ కుటుంబానికి తలకు మించిన భారమే. ఆ కన్నీటి కథ ట్రస్టుకు తెలిసింది. తనే వెళ్లి ఆసరా ఇచ్చింది. శంకర్‌ మళ్లీ బడికెళ్తున్నాడిప్పుడు.
శంకర్‌, చందూ లాంటి బాలల కోసమే శంకర ఫౌండేషన్‌ ‘రెయిన్‌బో’, ‘మైత్రి’ పేరుతో నేత్రవైద్య సేవలు అందిస్తోంది. నవజాత శిశువులు మొదలు పద్దెనిమిదేళ్లలోపు పిల్లల్లో అంధత్వాన్ని నివారించడం, దృష్టిదోషాలేమైనా ఉంటే సరిచేయడం...ఈ కార్యక్రమాల లక్ష్యం. గుంటూరు ఆసుపత్రిలో ఏటా 30వేల మంది పిల్లలకు ‘రెయిన్‌బో’ కింద పరీక్షలు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు నేత్ర సమస్యల మీద అవగాహన కల్పించడం ద్వారా... పాఠశాల స్థాయిలోనే పసివాళ్ల దృష్టిదోషాల్ని పసిగడతారు. ‘మైత్రి’ మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు...అంటే బడిబాట పట్టని పసివాళ్లలో లోపాల్ని సరిచేసే లక్ష్యంతో ప్రారంభించింది. ‘స్వాగతం’ మరో వినూత్న కార్యక్రమం. అమ్మ కడుపులోంచి భూమి మీదికి పడిన పిల్లలకు మనమిచ్చే బహుమతి ఏమిటి, అంధత్వమా? అందులోనూ నెలలు నిండకుండా పుట్టే పసిపిల్లల్లో నేత్ర సంబంధ సమస్యలకు ఆస్కారం ఎక్కువ. ఎంత త్వరగా లోపాన్ని పసిగడితే అంత మంచిది. శంకర వైద్యబృందం వారానికి ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి...అప్పుడే పుట్టిన శిశువుల్ని క్షుణ్నంగా పరీక్షిస్తుంది. అవసరమైతే, చికిత్సా, శస్త్రచికిత్సా అందిస్తుంది. ఇప్పటిదాకా, దాదాపు యాభై లక్షల మంది పిల్లలకు పరీక్షలు చేసింది. హైదరాబాద్‌లోనూ శంకర నేత్ర వైద్యశాల ఏర్పాటు కానుంది. ఆ ప్రయత్నంలో సాయం అందించమని ఫౌండేషన్‌ దాతలకు పిలుపునిస్తోంది.
ప్రవాసుల అండ...
విదేశాల్లోని దాతలకూ, దేశంలోని శంకర ఆసుపత్రులకూ వారధిగా నిలుస్తోంది ...శంకర ఐ ఫౌండేషన్‌ - అమెరికా. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తోందీ స్వచ్ఛంద సంస్థ. మురళీకృష్ణమూర్తి, కె.శ్రీధరన్‌ సోదరులు మిత్రబృందంతో కలసి నెలకొల్పారు. మురళీకృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన శంకర ఫౌండేషన్‌ సేవల కోసం తన వృత్తి జీవితాన్ని కూడా వదులుకున్నారు. అమెరికాలో ఈ సంస్థకు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. వెంకట్‌ మద్దిపాటి, సుధీర్‌ చెముడుగుంట, హేమ, పద్మా జవహర్‌...ఆ జాబితాలో కొన్నిపేర్లు. అంతా వృత్తి నిపుణులూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. వీళ్లంతా తమ ఆదాయంలో కొంతమొత్తాన్ని ట్రస్టుకు కేటాయిస్తారు. నిధుల సమీకరణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతారు. కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో అధిక భాగం ఎస్‌ఈఎఫ్‌-అమెరికా ద్వారానే సమకూరుతున్నాయి. నిధుల సేకరణకు ఈ సంస్థ వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతోంది. ‘వాల్‌ ఆఫ్‌ డోనార్‌’ పథకం కింద వేయి డాలర్లు విరాళంగా ఇచ్చినవారి పేరు ఆసుపత్రి గోడ మీద శాశ్వతంగా దర్శనమిస్తుంది. కనీసం ముప్ఫై డాలర్లు సాయం చేసినా... ఓ రోగి కాటరాక్ట్‌ చికిత్సకు సహకరించినవాళ్లు అవుతారంటూ చిన్నమొత్తాల్లోనూ విరాళాల్ని ప్రోత్సహిస్తోంది. ఏటా అక్టోబరులో పదివేలమందితో దాండియా నిర్వహిస్తుంది. శంకర ఫౌండేషన్‌కి తెలుగు ఆసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా), బే ఏరియా తెలుగు సంఘం (బాటా) తదితర సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ప్రవాసులు కోమటి జయరాం కూడా తనవంతు సహకారం అందిస్తున్నారు. శంకర ఐ ఫౌండేషన్‌కు డాక్టర్‌ ఎస్‌.వి.బాలసుబ్రణియం ఛైర్మన్‌, డాక్టర్‌ ఆర్‌.వి.రమణి వ్యవస్థాపక మేనేజింగ్‌ ట్రస్టీ.
(మరిన్ని వివరాలకు: giftofvision.org, శంకర ఐ ఫౌండేషన్‌, పెదకాకాని దగ్గర, గుంటూరు. ఫోన్‌: 0863- 2293903/905)
80:20 సూత్రం...
ఏ స్వచ్ఛంద సంస్థ అయినా పూర్తిగా విరాళాల మీదే ఆధారపడలేదు. చక్కగా పంటలు పండుతున్నప్పుడూ...జోరుగా వ్యాపారాలు సాగుతున్నప్పుడూ జనం చేతుల్లో డబ్బు ఆడుతుంది. మంచి పనులకు సాయం చేయాలన్న ఆలోచనా వస్తుంది. దీంతో, నిధుల ప్రవాహం బావుంటుంది. సంస్థ నిర్వహణకు ఇబ్బందే ఉండదు. కానీ కరవు వాతావరణం నెలకొంటే, నిధులు మందగిస్తే - పరిస్థితి ఏమిటి? నెలనెలా వేలకువేల ఆపరేషన్లు ఎలా జరిపించాలి? వైద్యుల జీతాలు ఎలా చెల్లించాలి? - ఇవన్నీ ఆందోళన కలిగించే ప్రశ్నలే. ఆ అనిశ్చితిని అధిగమించడానికి శంకర 80:20 ఫార్ములాను అనుసరిస్తోంది.
శంకరలో సౌకర్యాలకు కొదవలేదు. సేవల్లో నాణ్యత కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఉంటుంది. అంతకన్నా ఉన్నత ప్రమాణాలే ఉంటాయి. చెల్లించగలిగే స్తోమత ఉన్నవారి దగ్గర ఫీజు తీసుకుంటూనే...నిరుపేదలకు పూర్తి ఉచితంగా సేవలు అందిస్తోంది. అలా ఇరవైమంది దగ్గర తీసుకున్న డబ్బు...ఎనభైమందికి ఉచిత వైద్యం చేయడానికి సరిపోతుంది. ఆ ఇరవైమంది కూడా సంతోషంగానే ఇస్తారు. ఎందుకంటే, ఆ డబ్బుతో తమ నేత్ర సమస్య పరిష్కారం అవుతుంది, మరికొంతమంది సమస్యనూ పరిష్కరించినవాళ్లు అవుతారు. వైద్యానికి వైద్యం, సంతృప్తికి సంతృప్తి! అదే ఏ కార్పొరేట్‌ ఆసుపత్రో అయితే...ఆ మొత్తం యజమానుల ఖాతాలోకి వెళ్లిపోతుంది. దీనివల్ల సమాజానికి ఒరిగేదేం ఉండదు. ‘మా మీద నమ్మకంతో ఎంతో మంది పేద రోగులు వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత ఉన్నా.. ఇక్కడికొచ్చే కుబేరులూ ఉన్నారు. అన్నివర్గాల్లోని ఆ నమ్మకమే శంకర విజయ రహస్యం’ అంటారు గుంటూరు ఆసుపత్రి ఆర్‌ఎంవో డా.పి.సుధాకర్‌. ఈ స్వయంసమృద్ధి సూత్రం ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని శంకర నేత్ర వైద్యశాలలూ స్థాపించిన ఐదేళ్లలోపే తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నాయి. లక్షలమంది కళ్లలో కొత్త కాంతిని నింపుతున్నాయి.
***
కరుణ వేరు. ప్రేమ వేరు. కరుణలో దయ ఉంటుంది. కరుణ చూపేవాడు ఎప్పుడూ ఓ మెట్టు పైన ఉంటాడు. కరుణను స్వీకరించేవాడు ఎంతోకొంత కిందనే ఉంటాడు.
అదే ప్రేమలో అయితే...ఎక్కువ తక్కువలు ఉండవు. ఇచ్చేవారూ పుచ్చుకునేవారూ సమానమే. సేవ చేసేవారూ చేయించుకునేవారూ సమానమే. - పరమాచార్యుల ప్రబోధమిది.
కాబట్టే, శంకర ఆసుపత్రుల ఆవరణలో కరుణ కనిపించదు. జాలి అన్న మాటే వినిపించదు. అంతా ప్రేమమయమే. వైద్యుడు ప్రేమగా వైద్యం చేస్తాడు. రోగి కూడా అంతే ప్రేమగా చికిత్స చేయించుకుంటాడు. ఆ ప్రేమ శక్తితోనే ..ఇన్ని వైద్యశిబిరాలూ, ఇంతమందికి పరీక్షలూ, ఇన్ని శస్త్రచికిత్సలూ, ఇంత విస్తరణా!
- జె.కళ్యాణ్‌బాబు,


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list