MohanPublications Print Books Online store clik Here Devullu.com

నీటికొద్దీ తామర

నీటికొద్దీ తామర


---------;నీటికొద్దీ తామర!;---------
‘నీ వలన కొరతె లేదు, మరి నీరు కొలది తామెరవు!’ అంటూ శ్రీనివాసుడిని స్తుతిస్తాడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య.
అనుభవం గల మహా విద్వాంసులు జనబాహుళ్యంతో వ్యవహరించేటప్పుడు ప్రతిభను, విద్వత్తును సంపూర్ణంగా ప్రదర్శించే ప్రయత్నమైనా చేయరు. తమ ప్రతిభను పూర్తిగా గ్రహించే శక్తి సామాన్యులకు ఉండదని వారికి తెలుసు. ‘నేను గ్రామీణుల సభలో మాట్లాడేటప్పుడు వ్యవసాయ సమస్యల్ని ప్రస్తావిస్తాను. అలీన దేశాల ఐక్యత లేదా అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడను’ అనేవారు జవహర్‌లాల్‌ నెహ్రూ. వినేవారికి గ్రహణశక్తి, ఆసక్తి లేనప్పుడు మనం ఎంత ప్రతిభ ప్రదర్శించినా అది అడవిగాచిన వెన్నెల అవుతుంది.
సభలో రసికుల స్థాయినిబట్టి సంగీత విద్వాంసుడి పాటకచ్చేరి ఉంటుంది. అతడు సంగీతశాస్త్ర రసజ్ఞుల సభల్లోను, వివాహ మహోత్సవ వినోదాల్లోను ఒకేలా పాడితే వైఫల్యమే ఎదురవుతుంది. ‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర’ అంటాడు పింగళి సూరన కవి. కొలను పరిమాణంబట్టి తామరపాదు పరచుకొన్నట్టు, ఆస్వాదించేవారి శక్తినిబట్టి ఉత్తములు తమ శక్తి చూపుతారని దాని భావం. భగవంతుడూ అంతే.
భక్తుడు ఎంతవరకు తెలుసుకోగలడో, భగవంతుడు అంతవరకే తెలుస్తాడు. ఆయన అప్రమేయ తత్వాన్ని యథాతథంగా పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం. అప్రమేయం అంటే, ప్రమేయం కానిది. ప్రమేయం అంటే- లభ్యమవుతున్న ప్రమాణాలు, కొలబద్దలు, సాధనాలతో కొలిచేందుకు లేదా తెలుసుకొనేందుకు వీలైనది. భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకొనేందుకు, మనిషి మామూలుగా వాడుకొనే కొలబద్దలు ఎందుకూ కొరగావు. కాలాతీతుడు, సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు- ఇలా హద్దులే లేనిది భగవత్తత్వం. అది కొలతకు ఎలా వస్తుంది? అలాంటి భగవత్తత్వం ఒకటి ఉంటుంది లేదా ఉండవచ్చు అనే విషయంకూడా కొందరి వూహకైనా అందదు!
భగవంతుడు భక్తుడి బుద్ధిశక్తికి అనుగుణంగా అర్థమవుతాడు. ఒక పిపీలికం కంటే మనిషికి విషయ గ్రహణశక్తి, లోకజ్ఞానం ఎక్కువ కాబట్టి- భగవత్తత్వాన్ని అతడు ఎంతో కొంత సమగ్రంగా తెలుసుకోగలడు. మనిషి చీమ కంటే ఘనుడే కాని, వూహాతీతంగా వ్యాపించి ఉన్న ఈ బ్రహ్మాండాల సముదాయ పరిమాణంతో, ఈ విశ్వ విస్తృతితో పోలిస్తే, అతడి అవగాహన శక్తి అతి పరిమితమే. ఒక గదిలో కూర్చొని కిటికీ లోంచి బాహ్యప్రపంచాన్ని చూసినట్లు- మనిషి తన గ్రహణశక్తి అనే కిటికీ ద్వారా భగవత్తత్వం విశేషాలను, విశిష్టతను, విస్తృతిని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు.
భగవత్తత్వం అప్రమేయమని, దాన్ని గ్రహించడం దుస్సాధ్యమని ‘భాగవతం’ అనేకసార్లు తేల్చిచెప్పింది. ఎందరు ఎన్ని విధాలుగా చూసినా, అందరికీ కనిపించేది ఒక్క భగవత్‌ తత్వమే!
‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు’ అన్నాడు వాగ్గేయకారుడు అన్నమయ్య. అంతరాంతరాలన్నీ పరీక్షిస్తే- పిండికొద్దీ రొట్టె ఎలాగో, భగవత్తత్వం పట్ల భక్తుడి అవగాహనా అలాగే పరిమితం. దాన్ని భక్తులు తమ శక్తి, అభిరుచి, సాధనలు, సంస్కారాలు, ఆత్మాశ్రయమైన అనుభూతులను బట్టి భిన్న రీతుల్లో గుర్తిస్తారు. కొందరు శివుడని, మరికొందరు విష్ణువని, ఇంకొందరు శక్తి అని, మరికొందరు నిర్గుణ నిరాకార పరబ్రహ్మమని భావిస్తారు.
కొంత ఘనబుద్ధి గలవారికి ఆయన ఘనత మరింతగా అర్థమవుతుందని అన్నమయ్య అంతరార్థం. ‘గంగానదికి పక్కన బావి తవ్వితే, గంగనీరే అక్కడా వూరినట్లు. ఆవల శ్రీవేంకటపతివి నువ్వు, ఈవల నేను. నాకు నువ్వే శరణు. నా బుద్ధికి అర్థమైన పరతత్వం ఇది. పరతత్వం అనేది నీటికొద్దీ తామర గదా’ అని దైవానికి అంజలి ఘటించాడాయన!
- మల్లాది హనుమంతరావు
-----------------------------------------
జీవిత పరమార్థం
జీవితంలో జీవనాధారం కోసమో, కీర్తిప్రతిష్ఠల పురోభివృద్ధి కోసమో ప్రతి వ్యక్తీ ఏదో ఒక వ్యవహార సరళిలో నడిచితీరాలి. అది వ్యాపారమో, వ్యవసాయమో కావచ్చు. రాజకీయమో, రంగుల ప్రపంచమో, ఉద్యోగమో, వైద్యమో, మరేదైనా కావచ్చు. ఆ రంగానికి, వ్యవహారానికి సంబంధించి మెలకువలు, శిక్షణ పొందాల్సి ఉంటుంది. జీవితంలో అది ఒక భాగం మాత్రమే. వ్యక్తిగత జీవితం వేరుగా ఉంటుంది. ఉండాలి కూడా. అప్పుడే అతడు తనదైన జీవితాన్ని ఆనందించగలడు. ఉపాధ్యాయుడైనా, ఉద్యోగి అయినా, క్రీడాకారుడైనా, నటుడైనా, సంగీతజ్ఞుడైనా, మరెవరైనా! కానీ, ఆధ్యాత్మిక మార్గం వేరు. ఆ మార్గాన్ని ఎంచుకొనే వ్యక్తికి అదే జీవితం కావాలి. అందులోనే అతడు జీవించాలి.
ఈ లోకంలో దేన్ని తెలుసుకుంటే మరేదీ తెలుసుకోనక్కరలేదో, దేన్ని పొందితే జీవితానికి మరోటి అవసరం లేదో అదే ఆత్మజ్ఞానం! దాన్ని అందజేసేదే ఆధ్యాత్మిక జీవితం. జీవితాన్నే వెచ్చిస్తే తప్ప, జీవితకాల సాధనతో తప్ప- లభ్యం కాని అమృత కలశమది. అదే పరమోత్కృష్ట జీవిత పరమార్థం. ఆషామాషీ ప్రయత్నాలతో, ఆటవిడుపు సాధనలతో, తీరుబడి పారాయణలతో అది మన ఒడిలోకి వచ్చి వాలదు. జీవితాన్ని, జీవితంలోని అనుక్షణాన్నీ ఆ సాధనలో వెచ్చించాలి. ఒక పూజ్య మాతాజీ అన్నట్లు, జీవితంలో సాధన ఒక భాగం మాత్రమే కాదు. కారాదు. జీవితమే సాధన కావాలి. ఆ సాధనలో సామాజిక వ్యవహారాలు అప్పుడప్పుడూ వచ్చిపోయే అలవోక పనులుగా మారాలి. తల్లిగర్భం నుంచి జన్మించిన మనిషి, క్రమేణా తనలో ఉన్న దేవతా శిల్పాన్ని గుర్తించాలి. చుట్టూ ఉన్న వ్యర్థ శిలా శకలాలను సాధనతో చెక్కివేయాలి. చైతన్య దేవతామూర్తిగా మనిషి మిగిలిపోవాలి. అతడే ఆధ్యాత్మికపరుడు. ఆధ్యాత్మిక సాధకుడు. అందుకు ఎంత సాధన కావాలి, ఎంత సమయం కేటాయించాలి?
సాధన కోసం ‘కాలగణన’ మనకు సరిపోదు. కాలమంతా సాధనే. సాధన అంతా జీవితమే. సాధనలో జీవితాన్ని మనిషి ఎంత ఉన్నతంగా, ఫలవంతంగా సద్వినియోగం చేస్తున్నాడన్నదే ముఖ్యం. జడభరతుడిలా మమకారాలతో మంచి చేసినా, అది ఫలవంతం కాకపోవచ్చు. ఇంద్రియాల్లో కొన్నింటిని అర్చనాదులకు వినియోగించినా, మిగిలినవాటిని ఇతరుల్ని హింసించే దుష్కార్యంలో ఉపయోగించవచ్చు. వ్యర్థకార్యాలు, వృథా సాధనల వల్ల సమయ వినియోగమే తప్ప, సద్వినియోగమయ్యే అవకాశాలు తక్కువ.
మన ప్రతి పనిలో, ప్రతి మాటలో ఆధ్యాత్మిక స్పర్శ ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఆలోచనలో ఆధ్యాత్మికతను జోడించాలి. జపమాలలోని ప్రతి పూసను మంత్రోచ్ఛాటనతో తిప్పినట్లు, ప్రతి క్షణాన్నీ ఆధ్యాత్మిక సాధన దృష్టితో గడవనివ్వాలి. గృహస్థులకు సంసారంలో ప్రాపంచిక, సామాజిక ప్రయోజనాల అవసరాలు ఉంటాయి. ప్రాపంచిక ప్రగతి సైతం పారమార్థిక పరిమళాల్ని గుబాళించేలా చేసుకోవాలి. ప్రతి పనిలో మనం చూపే ఆధ్యాత్మిక దృష్టి సమాజశ్రేయస్సుకూ దోహద పడుతుంది. మన ఆత్మను మనం ఉద్ధరించుకునే క్రమంలో, సర్వాత్మ అనుసంధాన రీత్యా మిగిలిన ఆత్మలనూ అవే పరిమళాలు అలముకుంటాయి. వెలుగును ప్రోది చేసుకున్న జ్యోతి మరెన్నో జ్యోతులను ప్రకాశింపజేసే అర్హత కలిగి ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే!
పరమాత్మ పట్ల మనం ప్రేమికుల్లా మరులుగొనాలి. సముద్రంలోని ఎడతెగని అలల్లా ఆయన కోసం ‘అల్లాడుతూనే’ ఉండాలి. క్షణక్షణం, అనుక్షణం, ప్రతిక్షణం మరో పనికి, వేరే ఆలోచనకు, ఇంకొక ఆశకు తావివ్వకుండా ఉండాలి. ఒకరింట్లో పనిచేసే మనిషి తన సొంత ఇంటికి వెళ్లేందుకు ఆత్రుతపడుతూ, త్వరత్వరగా యజమాని తాలూకు పనులు పూర్తి చేసుకోవడం సహజం. అలాగే ప్రతి వ్యక్తీ తొందరపడాలి. అందుకు సాధనే అతడి వృత్తి, ప్రవృత్తిగా మారాలి!
- చక్కిలం విజయలక్ష్మి
--------------------------------------
వాగ్భూషణం
‘వాక్కు’ అంటే మాట. ‘వచ్‌’ అనే ధాతువు నుంచి ‘వాక్‌’ అనే శబ్దరూపం వచ్చింది. మానవుడి నాలుకపై మాటల రూపంలో సరస్వతీదేవి ఉంటుందని భావించడం వల్ల, ఆ పలుకుల తల్లిని ‘వాగ్దేవి’ అని వ్యవహరిస్తుంటాం.
మానవజాతికి మాత్రమే ప్రాప్తించిన అమూల్యమైన సంపద, వరం- వాక్కు. మానవజన్మ ఉత్కృష్టమైనది. మానవుడి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ‘ఐతరేయోపనిషత్తు’ పేర్కొంటోంది. వాక్కు- అగ్ని అంతటి పవిత్రమైనది, ప్రమాదకరమైనది కూడా. అందుకే, కాలుజారితే కూడదీసుకోగలం కాని, నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు పెద్దలు.
బాలవాక్కు, బ్రహ్మవాక్కు, రుషివాక్కు, వేదవాక్కు అని రూపాంతరాలున్నాయి. అమాయకమైన, నిష్కపటమైన, మనోహరమైన, ముద్దులొలికే సత్యాన్ని పలికేది- బాలవాక్కు. బ్రహ్మజ్ఞానుల ముఖం నుంచి వెలువడే హితకరం, శుభప్రదం, శ్రేయస్కరం, మంగళకరమైన వాక్కు- బ్రహ్మవాక్కు. సర్వసంగ పరిత్యాగులైనవారు పరుల హితం, అభ్యున్నతి కోసం వెలువరించే ప్రవచనాలను ‘రుషివాక్కు’ అంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ మానవాళికి దశ, దిశ నిర్దేశించేవి- వేదవాక్కులు.
బ్రహ్మ, రుషి, వేదవాక్కులు అందరికీ అనుసరణీయాలు. అవి సకల జనావళికీ ఆమోదకరమైనవి. సర్వమానవ సోదరత్వానికి, సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడేవి.
వాక్కు ఎలా ఉండాలో, వాగ్రూపం ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి వాక్కు ఆహ్లాదకరమైనదో స్మృతులు చెబుతున్నాయి. సముచిత నియమాలు పాటిస్తే సత్ఫలితాలను సాధించగలం. మృదువుగా, మంగళప్రదంగా, మనోహరంగా, మర్యాదపూర్వకంగా వాక్కు ఉండాలంటారు పెద్దలు.
‘నా కోరిక ఏదైనా- అది సత్యమే అయి ఉండి, ఆ సత్య వచనమే నన్ను అన్నివేళలా సంపూర్ణంగా సంరక్షించుగాక’ అని రుగ్వేద మంత్ర సారాంశం. ఏ జాతివారైతే సత్యభావనతో ఉంటారో, ఉత్సాహవంతులై ఉండి సత్సాంగత్యం పురుషార్థాల వల్ల సత్యవిజ్ఞానాలను సంపాదించుకుంటారో, వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారని ‘యజుర్వేదం’ చెబుతోంది. ‘సత్యమే పలుకుతాను... అసత్యం పలకను. సత్యం ఆధారంగానే ఈ భూమి ఉన్నది’ అని అధర్వణ వేదమంత్రాలు చాటుతున్నాయి.
సత్యవాక్పరిపాలనకు కట్టుబడిన బలిచక్రవర్తి, హరిశ్చంద్రుడు చరితార్థులయ్యారు. మానవజాతికి స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారు. మహాభక్తుడైనప్రహ్లాదుడు ఎన్నడూ అసత్యమాడలేదని, అతడి వ్యక్తిత్వాన్ని ‘మహాభాగవతం’లో కీర్తించాడు పోతన.
తమ వాక్కులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో, కొందరు సాధకులు నిత్యం భగవన్నామ స్మరణ చేస్తుంటారు. ‘ముకుందమాల’లో శ్రీ కులశేఖరు ఆళ్వారు, భాగవతంలో పోతన, ‘శివానంద లహరి’లో శంకరాచార్యులు ‘వాక్‌’ ప్రశస్తిని వివరించారు. పవిత్రమైన వాక్‌ నిర్మాణం కోసం తాపత్రయపడ్డారు. ‘ఓ స్వామీ! నా వాక్కులతో నిన్నే ప్రార్థిస్తున్నాను. నా మనసు నీ పాదపద్మాల పైనే లగ్నమగు గాక! నా వాక్కులు నిన్నే స్తుతించుగాక’ అని వారు తన్మయమైన వాక్కులను ఎలా ఉచ్చరించాలో తెలిపిన సన్నివేశాలు కొల్లలు!
భగవద్గీతా వాక్యం ప్రకారం, జ్ఞానం అన్నింటి కంటే పవిత్రమైనది. జ్ఞానంతో సుసంపన్నమైన వాక్కు అంతకంటే పవిత్రమైనది. ఈ వాక్కు వల్ల మిత్రత్వం ఏర్పడుతుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం సిద్ధిస్తుంది.
సంస్కారవంతమైన పలుకులు అలవడాలంటే మంచి సాంగత్యం, దానితో పాటు మంచి అభ్యాసం కావాలి. మునుల ఆశ్రమాల్లో మొదట చేరినప్పుడు జడులుగా ఉన్నవారు సైతం, చివరికి లోక కల్యాణ భావనలు అలవరచుకుని జ్ఞానవంతులై ప్రకాశిస్తారు. వారి నోట ఎన్నడూ అమంగళ వచనాలు, పరుష వాక్యాలు రావు. వాగ్భూషణమే వారికి అలంకారమవుతుంది. ‘వాక్కు’ అనేది ఓ ఆభరణం. దాన్ని మించినది ఇలలో మరేదీ లేదు!
- తటవర్తి రామచంద్రరావు (అంతర్యామి)
+++++++++++++++++++++++++
+++++++++:తాపం-తపం:+++++++
రెండు పదాల మధ్య ఒక చిన్న పాద భేదమే ఉన్నా, ఆ శబ్దాల వెనక అర్థాలు వేరు. నింగికి నేలకు, నక్కకు నాక లోకానికి నడుమ ఉన్నంత తేడా ఉంది. తాపం అంటే సంతాపం, బాధ, విచారం, వ్యధ, వేదన. తపం అంటే- తపస్సు, పుణ్యకార్యం, సంవేదన, పరుల కోసం పడే తపన.
మనకు శారీరకంగా, మానసికంగా ఏదైనా రవ్వంత బాధ కలిగితే ఎంతో ఆవేదనతో గిలగిల్లాడిపోతాం. కాలికి ముల్లు గుచ్చుకుంటే కళ్లంట నీళ్లు జలజల రాలతాయి. ఎప్పుడో పోయిన, లేదా మరిచిపోయిన ‘అబ్బా, అమ్మా’ గుర్తుకు వస్తారు. ఇది మానవ సహజమైన లోకరీతికి సంకేతం.
కంటిలో నలుసు పడితే మనసు ఎందుకు విలవిలమంటోంది? ఈ రెంటి నడుమ ఉన్నది బంధమా, అనుబంధమా, ఆత్మీయతా? రాగమైనా, అనురాగమైనా అనుభవించేది మనసు. ఆ అనుభవాన్ని యుద్ధభూమిలో సైనికుడిలా నిలబడి, పోరాడి, ఒక అనుభూతిగా మార్చేది శరీరం. రెండూ ముఖ్యమే.
బుద్ధి రథికుడని, శరీరం రథమని, ఇంద్రియాలు కళ్ళాలని, మనసు సారథి అని, కోరికలు గుర్రాలని ‘గీతోపనిషత్తు’ చెబుతున్నది.బతికి ఉండగా, మనసును, శరీరాన్ని వేరుచేయలేం. ఇహానికి పరానికి, బంధానికి మోక్షానికి- శరీరం సహకరించాలి. తెలివైన నావికుడు పడవను నీటిలో నడిపిస్తూ, తడవకుండా ఆవలి ఒడ్డుకు సుఖంగా చేరుకుంటాడు. అలాగే శరీరాన్ని ఐహిక, ఆముష్మిక సుఖాల కోసం ఉపకరణంగా చేసి చక్కగా వాడుకోవాలి. ఈ శరీరం నాది కాదు, నాకు శరీరమే లేదు అనుకోగానే సరిపోదు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఉల్లాసంగా ఉండగలదు.
లోకకల్యాణం కోసం, ఇతరుల కష్టాలను తనవిగా తలచి, వారి బాధలను పోకార్చే ప్రయత్నం చేసే ప్రతి మనిషీ- భగవంతుడే. విషం స్వీకరించి, దేవతలకు అమృతపాన భాగ్యం కలిగించిన శివుడే!
తపం అంటే అన్నీ వదిలేసి, ప్రపంచాన్ని జీవితాన్ని సమాజాన్ని ఏవగించుకుని దూరంగా అడవిలో ఏకాకి జీవితం గడపటం కాదు. నిరాకరణ తపస్సు కాదు. అది తన కోసమే తాను జీవించాలనుకునే ఒక స్వార్థపూరితమైన ఆలోచన. అది ఒక రకమైన తమస్సు అవుతుంది తప్ప తపస్సు అనటానికి వీలులేదు.
ఆదికూర్మం బరువునంతా తన వీపుపైన మోస్తున్నది. సూర్యుడు, చంద్రుడు వెలుగు దీపాలుగా, జ్యోతిచక్రాన్ని అలా తిప్పుతూనే ఉంటారు. నక్షత్రాలు క్షణంక్షణం కన్ను మూత పడకుండా రెప్పలను అల్లారుస్తూ, కాపు కాస్తున్నాయి. అలాగే, సజ్జనులు తమ పనులు పక్కన పెట్టి ప్రజాసంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమ పడుతూనే ఉంటారు.
పరోపకారులైన జీవులను మించిన భాగ్యశాలురు మూడు లోకాల్లో మరెవరూ లేరు. అలాంటి సజ్జన సాంగత్యమే సత్‌సంగం, జీవన్ముక్తి వివేకం!
శివుడి పాదపద్మాలపై సద్భక్తి కలిగి, పరిశుభ్రమైన మనసుతో, నిర్భయంగా నిర్లిప్తంగా నిరాసక్తంగా ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరించేవాడే సజ్జనుడు. అలాంటివాడు ఎవడైనా, ఎక్కడ ఉన్నా, వెతికి పట్టుకోగలిగితే మానవజాతి పావనమవుతుంది. తనతో పాటు పదిమందికీ మేలు చేయటానికి పాటుపడటం కంటే, జీవితానికి వేరే పరమార్థం లేదు.
తాపాన్ని లోకతాపంగా మార్చడమే తపం. అది సాధుసజ్జనుల భూషణం!
ప్రపంచపు బాధను తన బాధగా, ఆ బాధను పోగొట్టడానికి తానో సమిధగా మారగలిగినవాడే తాపసి.
తాపాన్ని తపంగా మలచేవాడే మహర్షి, మహామనీషి!
- ఉప్పు రాఘవేంద్రరావు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list