MohanPublications Print Books Online store clik Here Devullu.com

పిల్లల ఆరోగ్యం అరెరె.. ఆపండి..!, Health for Children

పిల్లల ఆరోగ్యం అరెరె.. ఆపండి..!, 
Health for Children

పిల్లల ఆరోగ్యం
అరెరె.. ఆపండి..!
పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన పసిబిడ్డలు..
హాయిగా ఆడుకుంటూ తిరగాల్సిన పిల్లలు..
ఉత్సాహంతో ఉరకలెయ్యాల్సిన పెద్దపిల్లలు..
- తల దెబ్బలు తిని ఆసుపత్రుల్లో ప్రాణాల కోసం అల్లాడుతుండటం.. ఎంత పెద్ద కష్టం?
ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు ఇదే విపత్తును ఎదుర్కొంటున్నారు. మేడల మీంచి పడిపోయి, మెదడు దెబ్బతిని తీవ్ర విపత్తులోకి జారిపోతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌లోని ‘రెయిన్‌ బో’ ఆసుపత్రి వైద్యులు నాలుగున్నరేళ్లుగా నిర్వహిస్తున్న అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టంగా పట్టిచూపిస్తోంది. దీనికి వాళ్లు చేసిన పాపమేం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకున్నా వీటన్నింటినీ పూర్తిగా నివారించుకోవచ్చు. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ఈ వారం మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
పాశ్చాత్య దేశాల్లో పిల్లల తలకు దెబ్బ తగలటం, మెదడు దెబ్బతినటమన్నది సాధారణంగా క్రీడల్లో చూస్తుంటారు. అదీ కాస్త పెద్ద వయసులో కనబడుతుంటాయి. కానీ మన దేశంలో మాత్రం పిల్లలు ఎత్తుల మీంచి, పైఅంతస్తుల మీంచి పడిపోయి తలకు తీవ్రమైన దెబ్బలు తగలటం చాలా ఎక్కువగా కనబడుతోంది. పైగా ఈ సమస్య పసి, చిన్న
వయసులోనే అధికంగా ఉంటోంది. దీనికి తోడు సురక్షిత పద్ధతులు పాటించకపోవటం మూలంగా రోడ్డు ప్రమాదాల్లో పిల్లలకు తల దెబ్బలు తగలటం కూడా ఎక్కువగానే ఉంది. ఇవే కాదు.. ఇళ్లలో పిల్లలు టీవీలను మీద పడేసుకుని, ప్రమాదాలను తల మీదికి తెచ్చుకోవటం కూడా ఎక్కువగానే ఉంది. తీవ్రమైన తల గాయాలు, దెబ్బలతో ఆసుపత్రిలో చేరిన పిల్లల వివరాలను విశ్లేషించగా బయటపడిన విస్మయకర వాస్తవాలివి.
నేడు చాలా భవనాల్లో పిల్లల రక్షణ గురించి అస్సలు పట్టించుకోకుండా.. ఆకర్షణీయంగా కనబడటం కోసమో, వినూత్నంగా ఉండాలనో మేడల మీద, మెట్ల రెయిలింగుల వద్ద రకరకాల డిజైన్లు పెడుతున్నారుగానీ అవెంత సురక్షితమైనవన్నది అస్సలు పట్టించుకోవటం లేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ విషయంలో నిబంధనలన్నీ కట్టుదిట్టంగా ఉంటాయి. కానీ మన దేశంలో అలాంటివేమీ లేకపోవటం వల్ల పరిస్థితి పిల్లల ప్రాణాల మీదికి వస్తోంది. ఇంట్లో పెద్దలు ఏదో పనిలో ఏమరపాటుగా ఉన్నప్పుడు పిల్లలు బాల్కనీల్లోకి, మెట్ల వద్దకు వెళుతున్నారు. కింద ఏముందో ఆసక్తిగా తొంగి చూడటానికి ప్రయత్నిస్తూ.. అక్కడి నుంచి చిటుక్కున పడిపోతున్నారు. క్షణాల్లో జీవితాలు తారుమారైపోతున్నాయి. వినటానికి చాలామంది ఇదేదో అరుదుగా జరిగేది అనుకోవచ్చుగానీ వాస్తవానికి ఒక్క ఆసుపత్రికే నెలలో ఇలాంటి కేసులు 10-12 వచ్చిన సందర్భాలుంటున్నాయి. ఇలా 10-12 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినప్పుడు తలకు, మెదడుకు విఘాతం కలగటమే కాదు.. చాలామందికి ఎముకలు విరిగిపోవటం, కాలేయానికి బలమైన దెబ్బ తగిలి పొట్టలో రక్తస్రావం అయిపోతుండటం, రక్తనాళాలు తెగిపోయి విపరీతమైన రక్తస్రావం కావటం.. ఇలా పరిస్థితి ప్రాణాల మీదికి వస్తోంది.
తలకు దెబ్బ తగిలినప్పుడు... తక్షణం ఇవి చూడాలి!
ఎత్తు మీది నుంచి పడటం, వేగంగా పడటం వల్ల పిల్లలకు తీవ్ర ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి.
* తల మీద ఎక్కడన్నా క్షణాల్లో వాచిపోయి బొప్పి కట్టిందా? తగిలిన చోట బాగా వాచి, బిడ్డ ఆపస్మారంలోకి వెళ్లారా? పడిన 10-15 నిమిషాల్లోపు ఫిట్‌ వచ్చిందా? వరసగా నాలుగు కంటే ఎక్కువ సార్లు వాంతులు అవుతున్నాయా? ముక్కు నుంచి గానీ, చెవుల నుంచి గానీ రక్తం వస్తోందా? శరీరంలో ఒకవైపు బలహీనంగా చచ్చుబడినట్లు అనిపిస్తోందా? కళ్ల కింద గానీ, చెవుల వెనకగానీ నల్లగా కమిలినట్లు మచ్చలు వస్తున్నాయా? అన్నది చూడాలి. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందే.
* తలకు చిన్నచిన్న దెబ్బలు తగిలినా పిల్లలకు 2, 3 వాంతులు కావచ్చు. కాబట్టి పిల్లలు మిగతా అన్ని రకాలుగా బాగానే ఉండి, రెండు మూడు వాంతులైనా ఫర్వాలేదుగానీ.. మూడుకు మించి వాంతులు అవుతుంటే వైద్యులకు చూపాల్సిందే. అలాగే ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తున్నా, కళ్ల కింద నల్లగా అవుతున్నా లోపల లోపల రక్తస్రావం అయిపోతోందని అర్థం.
* తలకు దెబ్బ తగిలిన తర్వాత ఏ దశలోనైనా పిల్లలు స్పృహ కోల్పోవటంగానీ, శరీరం బిగుసుకుని, ముడుచుకుపోయినట్లుగా ఉన్నారంటే మాత్రం (పోశ్చరింగ్‌) తల్లిదండ్రులు తక్షణమే వైద్యుల వద్దకు తీసుకువెళ్లటం తప్పనిసరి.
బృందంగా చికిత్స
సాధారణంగా ఎత్తు మీంచి పడిపోయినప్పుడు దెబ్బలు ఏదో ఒక భాగానికే పరిమితం కావు. తల దెబ్బలతో పాటు ఎముకలు విరగొచ్చు. పొట్టలో కాలేయానికి బలంగా దెబ్బ తగిలి రక్తం కారుతుండొచ్చు. కంటికి గాయాలవ్వచ్చు. ఇలాంటి సందర్భాల్లో పీడియాట్రీషియన్లు, సర్జన్లు, న్యూరాలజిస్టులు, ఎముకల వైద్యుల వంటి భిన్న విభాగాల వారంతా పరిస్థితిని అంచనా వేసి, అత్యవసర చికిత్స ఆరంభిస్తారు. ఫలితాలు బాగుండాలంటే ఇలా వైద్యులు ఇలా ఒక బృందంగా వైద్యం చెయ్యటం చాలా అవసరం.
మంచం మీంచి
ఒక్కసారైనా పడకుండా పెరిగే పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. బిడ్డ పడగానే ఏం జరిగిందోనని తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతుంటారు. అయితే అదృష్టవశాత్తూ మంచం మీంచి పడినప్పుడు తలకు తీవ్రమైన దెబ్బలు తగలటమన్నది అరుదనే చెప్పుకోవాలి. మంచం మరీ ఎత్తుగా ఉండదు. తక్కువ ఎత్తు నుంచి పడుతున్నప్పుడు.. వేగం పుంజుకునేలోపే వాళ్లు నేలను తాకుతారు. దీనివల్ల తలకు, మెదడుకు తగిలే దెబ్బ తీవ్రత తక్కువగా ఉంటుంది.
తల విఘాతం.. పెద్ద కష్టం!
తలకు, మెదడుకు తగిలే దెబ్బలను ‘ట్రమాటిక్‌ బ్రెయిన్‌ ఇంజురీ(టీబీఐ)’ అంటారు. తీవ్రతను బట్టి ఈ దెబ్బలను, ఓ మోస్తరు, కాస్త తీవ్రం, మరీ తీవ్రమని చెప్పుకోవచ్చు. దెబ్బ తీవ్రంగా ఉంటే పిల్లలు కోమాలోకి వెళ్లిపోతారు. తలకు బలమైన గాయాలైనప్పుడు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు మూడు రకాలుగా ఉంటాయి.
సాధారణంగా చాలా ఇళ్లలో టీవీలను కాస్త ఎత్తుగా ఉండే బల్లల మీద పెడుతుంటారు. ఇదే పిల్లల పాలిట పెద్ద ప్రమాదానికి కారణమవుతోంది. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లలు కుతూహలం కొద్దీ దాని దగ్గరకు వెళ్లి, రెండు చేతులతోనూ దాన్ని లాగి మీద వేసుకోవటమన్నది చాలా ఎక్కువగా చూస్తున్న ప్రమాదం. తెలిసీ తెలియక టీవీని ముందుకు లాగగానే ఆ బరువు ఆపలేక పిల్లలు వెనక్కి పడిపోతారు, టీవీ వచ్చి వాళ్ల మీద పడటంతో తలకు చాలా తీవ్రమైన గాయాలవుతున్నాయి. గోడలకు తగిలించే టీవీల వాడకం పెరగటంతో ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో ఈ రకం ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ పేద కుటుంబాల్లో తరచూ ఈ తరహా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలను కూడా గోడకు తగిలించకుండా బల్లల మీద పెట్టినప్పుడు ఇదే తరహా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటోంది. ఇలా టీవీ ప్రమాదాలకు గురైన పిల్లల్లో మెదడు ముందువైపు గాయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తల లోపల పలుచోట్ల రక్తస్రావమవుతూ పరిస్థితి పిల్లల ప్రాణాల మీదికి వస్తోంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ టీవీలు పడిపోకుండా స్థిరంగా ఉండేలా గట్టిగా కట్టటం, ముందుకు జరిగిపోకుండా వెనక వైపున కట్టుదిట్టం చెయ్యటం చాలా అవసరం.
రెండోది- కార్‌ సీట్లలో పిల్లలకు బెల్టు పెట్టకపోవటం వల్ల తీవ్రమైన గాయాలవుతున్న సందర్భాలు కోకొల్లలు. ఒళ్లొ కూర్చోబెట్టుకోవటం, స్వేచ్ఛగా వదిలెయ్యటం వల్ల వాళ్లు ఉన్నట్టుండి బ్రేక్‌ వంటివి వేసినప్పుడు వేగంగా వెళ్లి తమ ముందున్న సీటునుగానీ, డ్యాష్‌ బోర్డ్‌ను గానీ బలంగా ఢీకొంటున్నారు. దీంతో తలకు బలమైన గాయాలవుతున్నాయి. ఇలా తలకు తగిలే దెబ్బలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే చాలా సందర్భాల్లో వాళ్లు తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశమే ఉండటం లేదు.
1. పుర్రె ఎముక విరగటం: రక్తస్రావం లేకుండా కేవలం తల మీది పుర్రె ఎముకకు దెబ్బ తగలటం, ఎముక చిట్లటం వరకే జరిగితే.. దానికి పెద్దగా ఏమీ చెయ్యక్కర్లేదు. క్రమేపీ అదే అతుక్కుపోతుంది. దెబ్బ తగిలి గుంటలా (డిప్రెస్డ్‌ ఫ్రాక్చర్‌) పడితే మాత్రం అప్పుడు సర్జరీ చేసి, చక్కదిద్దాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఎముక నిరంతరం మెదడుకు తలుగుతూ, చికాకుపరుస్తుండటం వల్ల మున్ముందు ఫిట్స్‌ వచ్చే ముప్పు ఉంటుంది.
2. లోపల రక్తస్రావం: మెదడులో రక్తస్రావం ఎక్కువగా అయిపోతున్నా, మెదడు బాగా వాచిపోతున్నా పిల్లలు స్పృహ తప్పి ఉంటారు, స్పందనలుండవు, ఒకవైపు బలహీనంగా ఉంటారు. సీటీస్కాన్‌ చేయిస్తే లోపలి పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. రక్తస్రావం మెదడు పైపైపొరల్లోనే అయితే మందులతో 4 వారాల్లో దానంతటదే కరిగిపోతుంది. కింది పొరల్లో రక్తస్రావం (ఎపిడ్యూరల్‌ హెమటోమా) అవుతుంటే- అది వేగంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. రక్తస్రావం మెదడుకు మరీ దగ్గరగా ఉంటే (సబ్‌డ్యూరల్‌ హెమటోమా) మెదడు కూడా కొంత దెబ్బతిని ఉండొచ్చు. కాబట్టి ఈ పిల్లల్లో ఫలితాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఎత్తుమీంచి వేగంగా పడిపోవటం వల్ల మెదడు అటూఇటూ వూగిపోయి, రుద్దుకుంటూ మెదడు మీద చాలా ప్రాంతాల్లో రక్తస్రావం వస్తుంటుంది. దీన్ని ‘డిఫ్యూజ్‌ ఆక్సోనల్‌ ఇంజురీ’ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విఘాతం. దీని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రభావం చూపే తీవ్ర సమస్యలుంటాయి. వీళ్లు నడవటంలో, కండరాలు కదపటంలో తీవ్రంగా ఇబ్బంది పడొచ్చు. గుటక మింగటంలో ఇబ్బందులు రావచ్చు. చాలాకాలం వెంటిలేషన్‌ మీద పెట్టాల్సి కూడా ఉంటుంది.
3. మెదడు దెబ్బ తినటం: దెబ్బ తగిలిన వెంటనే ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కొద్ది గంటల తర్వాత మెదడు విపరీతంగా వాచిపోవచ్చు. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మెదడు కోలుకోలేనంతగా దెబ్బతింటుది. వీళ్లకు వెంటనే సర్జరీ చేసి, పుర్రె భాగాన్ని కొంత తొలగించి మెదడుకు దెబ్బతినకుండా చూడటం చాలా అవసరం. అందుకని తక్షణం సర్జరీ అవసరం లేకున్నా కొందరికి తల లోపల ఒత్తిడి పెరుగుతోందేమో నిరంతరం పరిశీలిస్తుండాల్సి ఉంటుంది. అలాంటి వారికి పుర్రె ఎముక లోపలికి చిన్న రంధ్రం చేసి, చిన్న కడ్డీ వంటి పరికరాన్నిలోపల పెట్టి.. ఒత్తిడిని గమనిస్తుంటారు. ఇలా 3-4 రోజులు జాగ్రత్తగా చూసి అప్పుడు అవసరమైతే వెంటలేటర్‌ అవసరాన్ని తగ్గించుకుంటూ క్రమేపీ వార్డుకు మారుస్తారు. కొన్నిసార్లు దెబ్బ తగిలిన వేగానికి మెదడు ఎవరో కత్తిపెట్టి కోసినట్టుగా రెండు ముక్కలుగా అయిపోతుంటుంది. ఇలాంటి పిల్లల విషయంలో తక్షణ ఉపశమనం తప్పించి చెయ్యగలిగింది కూడా చాలా తక్కువ. అలాగే.. అదృష్టవశాత్తూ వెన్ను తెగిపోవటం, తీవ్రంగా దెబ్బతినటమన్నది అరుదు. కానీ జరిగిన వారికి మాత్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా కనబడుతుంటుంది ఇది. దీర్ఘకాలంలో.. దెబ్బ తీవ్రత, దెబ్బతిన్న భాగాన్ని బట్టి వీరిలో చాలామంది శరీరంలో ఒకవైపు బలహీనంగా ఉండొచ్చు. చాలాకాలంపాటు చూపు సరిగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రులను గుర్తుపట్టటానికి కూడా వారాల నుంచి నెలల సమయం పట్టొచ్చు.
ఈ విపత్కర పరిస్థితులన్నింటినీ చిన్న జాగ్రత్తతో నివారించుకునే వీలుంటుందనే విషయం మనం మర్చిపోకూడదు.
వెలకట్టలేనివి పసితలలు!
తలకు, మెదడుకు బలంగా దెబ్బ తగిలినప్పుడు వెంటిలేటర్లు, ఒత్తిడిని అంచనా వేస్తుండే మోనిటర్లు, ఆసుపత్రుల్లో చాలా రోజులు ఉండాల్సి రావటం, అత్యవసరంగా ఆపరేషన్లు చెయ్యాల్సి రావటం.. ఇలా లక్షలతో కూడిన ఖరీదైన వైద్యాలు అవసరమవుతాయి. ఇంత చేసినా బతికి బట్టకట్టిన పిల్లల్లో తీవ్రమైన ఎదుగుదల లోపాలు ఉండిపోవచ్చు. వైద్య సహాయం, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ వంటివి చాలాకాలం అవసరమవుతాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన అనుభవంగా మిగిలిపోతుంది. తలకు ఓ మోస్తరు గాయాలైన పిల్లల్లో కూడా కుదురుగా ఉండకపోవటం, చదువుల్లో వెనకబడటం వంటి ఎన్నో సమస్యలు తలెత్తచ్చు. వీటి ప్రభావం కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బిడ్డ కోల్పోయేదేమిటో మనం అంచనా కూడా వెయ్యలేం. మనం గుర్తుంచుకోవాల్సిందేమంటే- ఇవన్నీ కూడా కొద్దిపాటి ముందు జాగ్రత్త, చిన్నపాటి జాగ్రత్తలతో పూర్తిగా నివారించుకోదగ్గ బాధలు! ఎవరూ కూడా ‘ఇది మనకెందుకు జరుగుతుందిలే!’ అనుకుని ధీమాగా ఉండిపోవటానికి లేదు! మన ప్రాంతంలో ఇప్పుడు ఐదారు అంతస్తులే కాదు, 20-25 అంతస్తుల ఇళ్లు, టవర్లు కూడా సర్వసాధారణమవుతున్నాయి. వీటి నిర్మాణం, డిజైన్లలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. బాల్కనీ తలుపులు, గోడల వంటివన్నీ కూడా పూర్తిగా పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూడాలి. చాలామంది పిల్లలను ‘మనం చూసుకుంటూ ఉంటాం కదా!’ అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరూ కూడా నిరంతరం పిల్లలకు కాపలా కాయలేరన్న వాస్తవాన్ని గుర్తించాలి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list