MohanPublications Print Books Online store clik Here Devullu.com

పగిలినా..పరుగెత్తిద్దాం! హార్ట్‌ ఫెయిల్యూర్‌, Heart Failure

పగిలినా..పరుగెత్తిద్దాం! హార్ట్‌ ఫెయిల్యూర్‌, 
Heart Failure
+++++పగిలినా..పరుగెత్తిద్దాం! హార్ట్‌ ఫెయిల్యూర్‌.++++++.
పేరు భయపెట్టేటట్టున్నా ‘గుండె వైఫల్యం’ అంటే గుండె విఫలమైపోయి, ఆగిపోతోందనేం కాదు. శక్తి సామర్థ్యాలు కోల్పోయి, గుండె తన పని తాను సరిగా చెయ్యలేక పోతోందని! అంటే రక్తాన్ని సరిగా పంపింగ్‌ చెయ్యలేక అవస్థలు పడుతోందని!! ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలీ వైఫల్య స్థితి ఎందుకు తలెత్తుతుందో, దీన్ని నెగ్గుకొచ్చేదెలాగో.. వివరంగా చూద్దాం!ఒకప్పుడు ‘గుండె పోటు’ సమస్య మొదలైతే కథ ముగిసినట్టే. కానీ నేడున్న అత్యా ధునిక వైద్యంతో దాన్ని చాలావరకూ అధిగమిస్తున్నాం. అందుకే గుండెపోటు విపత్తు నుంచి బయటపడి.. ఇప్పుడెంతో మంది మళ్లీ మన మధ్య తిరుగుతున్నారు!
అయితే వైద్యం ఎంతగా పురోగమించినా.. ఒకసారి ఓడు బోయిన గుండె మళ్లీ పూర్తి జవసత్వాలు పుంజుకుని మునుపటంత దృఢంగా తయారవటం కష్టం. చాలాసార్లు ఇలాంటి ఓటి గుండెలు బలహీనపడి, క్రమేపీ ‘గుండె వైఫల్యం’ లోకి వెళతాయి. ఈ వైఫల్యమనేది ఒక్క రోజుతోనో, ఒక్క మందుతోనో తీరిపోయే సమస్య కాదు. పైగా శ్రద్ధ, చికిత్స కొరవడితే నడవలేక, లేవలేక.. లేస్తే కూర్చోలేక.. చివరికి పడుకోను కూడా లేక జీవితం నరకప్రాయంగా తయారవుతుంది. ఇప్పుడు మన సమాజంలో ఎంతోమంది ఈ ఓటి గుండెలతోనే రోజులు గడిపేందుకు తంటాలుపడుతున్నారు. సరైన చికిత్స, పర్యవేక్షణ ఉంటే ‘గుండె వైఫల్యాన్ని’ నెగ్గుకురావటం కష్టమేం కాదు. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
గుండెపోటును బాగానే అధిగమిస్తున్నాం!
ఇప్పుడిక ‘గుండె వైఫల్యం’ వంతు వచ్చింది!!
గుండెలోని రక్తనాళాలు పూడుకుపోయి.. గుండెకు రక్తసరఫరా నిలిచిపోయి.. ‘గుండెపోటు’ ముప్పు ముంచుకొస్తున్నప్పుడు.. రక్తసరఫరా పునరుద్ధరణ కోసం సత్వరమే ‘స్టెంట్‌’లు అమర్చో, ‘బైపాస్‌’ ఆపరేషన్‌ చేసో... ఏదో రకంగా ఆ పెను తుపాను నుంచి బయటపడుతున్నాం! దీనిపై ఇప్పుడు మన సమాజంలో అవగాహన బాగానే పెరిగింది. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత గుండె మీద పడే ప్రభావం, గుండెకు అది చేసే హాని గురించి చాలామందికి తెలియటం లేదు. ఆ పెను ‘తుపాను’ తాకిడికి కొన్నిసార్లు గుండె బాగా దెబ్బతిని, రక్తాన్ని సరిగా పంపింగ్‌ చెయ్యలేకపోతుంటుంది. సాధారణంగా మన గుండె 1. చెడు రక్తాన్ని శుద్ధి కోసం వూపిరితిత్తుల్లోకి పంపిస్తుండాలి 2. వూపిరితిత్తుల్లో శుద్ధి అయ్యి వచ్చే మంచి రక్తాన్ని శరీరమంతా సరఫరా చేస్తుండాలి. దెబ్బతిన్న గుండె ఈ రెంటిలో ఏదో ఒక పని సమర్థంగా చెయ్యలేకపోవచ్చు, కొన్నిసార్లు రెండు పనులూ అస్తవ్యస్తం కావచ్చు. ఇలా ఒకసారి సామర్థ్యం బలహీనపడితే.. పరిస్థితి క్రమేపీ గుండె వైఫల్యానికి (హార్ట్‌ ఫెయిల్యూర్‌) దారితీస్తుంది.
అసలేం జరుగుతుంది?
సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరం కొంత దెబ్బతిని, మానే క్రమంలో అది గట్టిగా తయారవుతుంది. ఆ మాటకొస్తే- చాలాకాలంగా హైబీపీ సరిగా నియంత్రణలో లేనివారిలో కూడా గుండె కండరం ఇలా మందంగా తయారవ్వచ్చు. ఇలా గట్టిగా తయారైన గుండెలోకి రక్తం చేరాలంటే చాలా ఎక్కువ పీడనం అవసరం. ఈ ప్రభావం వెనక్కి.. అంటే వూపిరితిత్తులు, వాటిలోని సూక్ష్మ రక్తనాళాల మీద పడుతుంది. పీడనం చాలా ఎక్కువైనప్పుడు రక్తంలోని నీరు (ద్రవం) ఆ రక్తనాళాల్లోంచి బయటకు, అంటే వూపిరితిత్తుల్లోకి లీక్‌ అవుతుంటుంది. దానివల్ల శ్వాస చాలా బలంగా, వేగంగా తీసుకోవాల్సి వస్తూ, ఆయాసం మొదలవుతుంది. గుండె వైఫల్యం బాధితుల్లో కనబడే తొలి లక్షణం ఇది. క్రమేపీ ఈ నీరు ఒళ్లంతా చేరుతుంది. పగటిపూట లేచి తిరుగుతుంటాం కాబట్టి నీరు ఎక్కువగా కాళ్ల వంటి భాగాలకే పరిమితమవుతుంది. కానీ రాత్రిళ్లు పడుకున్నప్పుడు నీరు ఛాతీలో చేరిపోయి, నిద్ర మధ్యలో విపరీతమైన దగ్గు, ఆయాసం మొదలవుతాయి. లేచి నిలబడి, కాసేపు అటూఇటూ నడిస్తే.. నీరు ఇతర భాగాలకు వెళ్లిపోయి, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. గుండె వైఫల్యంలో కనబడే మరో కీలక లక్షణం ఇది. గుండె వైఫల్యం పెరిగిన కొద్దీ ఈ ఆయాసం తీవ్రత కూడా పెరుగుతుంటుంది. మొదట్లో మెట్లెక్కటం, ఇల్లు వూడ్వటం వంటి శ్రమతో కూడుకున్న పనులు చేసినప్పుడే ఆయాసం రావచ్చు. కానీ ఆ తర్వాత స్నానం చెయ్యటం వంటి తేలికపాటి పనులు కూడా కష్టం కావచ్చు. మరీ తీవ్రమైతే కూర్చున్నా, పడుకున్నా కూడా ఆయాసం వస్తుంది. దీన్ని మామూలు ఆస్థమా కాదు. ఈ ‘కార్డియాక్‌ ఆస్థమా’కు చికిత్స భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. ఇదంతా కూడా ప్రధానంగా గుండెలో ఎడమ భాగం దెబ్బతిన్నప్పుడు తలెత్తే పరిస్థితులు.
ఇక గుండెలోని కుడి భాగం దెబ్బతినప్పుడు ఆ ప్రభావం ఒంట్లోని ఇతర ప్రధాన రక్తనాళాలన్నింటి మీదా పడుతుంది. ఆ రక్తనాళాల్లోంచి నీరు బయటకు వచ్చి ఒళ్లంతా చేరుతుంది. పాదాలు, మడమలు, కాళ్లు నీరుచేరి ఉబ్బుతుంటాయి. నొక్కితే గుంట పడుతుంటాయి. కొందరికి ముఖం ఉబ్బరించొచ్చు. నీరు కడుపులో.. కాలేయంలో, పేగుల్లో, జీర్ణాశయ కణజాలంలో, చర్మం, కిడ్నీలు, మెదడు... ఇలా ఎక్కడైనా చేరొచ్చు. కాలేయంలో చేరితే అది పెద్దగా అయ్యి, కడుపు నొప్పి రావచ్చు. పేగులు, జీర్ణాశయంలో నీరు చేరితే అజీర్ణం, కొద్దిగా తినగానే కడుపు నిండినట్టుండటం, ఆకలి మందగించటం వంటి బాధలు బయల్దేరతాయి. కుడి, ఎడమ వైఫల్యాలు రెంటిలోనూ కూడా ఆయాసం, శ్వాస కష్టం కావటం, తీవ్రమైన అలసట వంటి బాధలుంటాయి. వీటిని తొలి దశ లక్షణాలనుకోవచ్చు. సమస్య దీర్ఘకాలికంగా మారినప్పుడు ఇతరత్రా బాధలూ కనిపించొచ్చు. అవి...
హఠాత్తుగా బరువు పెరగటం: కొంత కాలంగా గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గటం వల్ల కిడ్నీలకు తగినంత రక్త సరఫరా ఉండదు. దీన్ని చక్కదిద్దేందుకు కిడ్నీలు ఒంట్లో నీటిని ఎక్కువగా పట్టిఉంచుతాయి. ఇది ఉన్నట్టుండి బరువు పెరగటానికి దారి తీస్తుంది. కొందరు ఒకట్రెండు వారాల్లోనే 2-3 కిలోల వరకూ పెరిగిపోతారు. కొందరిలో కాళ్లవాపు వంటివాటి కంటే కూడా బరువు పెరుగుదలే ముందు కనబడుతుంది.
మూత్రం తగ్గటం: కొందరికి హఠాత్తుగా మూత్రం తగ్గిపోవచ్చు. మరికొందరిలో క్రమేపీ తగ్గుతూ రావచ్చు. వీరిలో తీవ్రమైన నిస్సత్తువ, రక్తపోటు పడిపోవటమూ కనబడతాయి. రక్తపరీక్ష చేసిచూస్తే క్రియాటినైన్‌ స్థాయులూ పెరిగి ఉంటాయి.
చర్మం చల్లబడటం: ఒంట్లో రక్త సరఫరా తగ్గితే.. దీన్ని అధిగమించేందుకు శరీరం ముందు చర్మానికి సరఫరా తగ్గించి, ఉన్నదాన్ని మిగతా కీలక అవయవాలకు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. దీంతో చర్మం పాలిపోయి, ఎప్పుడూ చల్లగా, చెమటతో తడితడిగా ఉంటుంది.
తికమక: మెదడుకు రక్త సరఫరా తగ్గితే తికమకపడటం, స్పృహ కోల్పోవటం వంటివి తలెత్తుతాయి.
కండరాలు పట్టేయటం: రక్త సరఫరా తగ్గటం వల్ల తరచూ పిక్కలు పట్టేయటం వంటి బాధలు మొదలవుతాయి. ఇది రాత్రిపూట ఎక్కువ.
కారణాలు
గుండె వైఫల్యం సంభవించటానికి అతి ముఖ్యమైన కారణం గుండె పోటు. ఒకసారి గుండెపోటు బారినపడిన వారిలో నూటికి 60 మందికి గుండె వైఫల్యం వచ్చే అవకాశముంటుంది. అయితే ఇదొక్కటే కాదు.. దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవటం వల్ల కూడా గుండె కండరం దెబ్బతిని వైఫల్యంలోకి వెళుతుంది. అలాగే మధుమేహం నియంత్రణలో లేకపోవటం వల్ల సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా గుండె వైఫల్యానికే దారితీస్తుంది. దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బు ఉన్న వారికి కూడా రక్తంలో విషతుల్యాల ప్రభావం పెరిగి, క్రమేపీ గుండె దెబ్బతినిపోతుంది. అరుదుగా.. పుట్టుకతో కండర ప్రోటీన్‌ లోపం ఉన్నవారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు, అలాగే జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూలేనంతటి తీవ్రమైన ఒత్తిడి బారినపడిన వారికి కూడా హఠాత్తుగా గుండె వైఫల్యం సంప్రాప్తించే ముప్పు ఉంటుంది.
నిర్ధరణ
గుండె వైఫల్యాన్ని చాలావరకూ.. లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టొచ్చు. వైద్యులు రోగిని పరీక్షించటంతో పాటు కచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. తేలికపాటి ‘ఈసీజీ’ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. గతంలో గుండెపోటు వచ్చిందా? గుండె, గదులు పెద్దగా అయ్యాయా? కండరం మందంగా తయారైందా? వంటి వివరాలన్నీ దీనిలో బయటపడతాయి. రెండోది- ‘ఎకో’ పరీక్ష చేస్తే గుండె పంపింగ్‌ సామర్థ్యం ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఇవి కాకుండా- గుండె వైఫల్యం లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు- ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయేమో, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ‘యాంజియోగ్రామ్‌’ అవసరమవుతుంది. 99% మందికి ఈ పరీక్షలతోనే గుండె వైఫల్యం కచ్చితంగా నిర్ధరణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎంఆర్‌ఐ, పెట్‌ స్కాన్‌ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండె వైఫల్యమా? లేక ఉబ్బసమా? అన్నది తెలుసుకునేందుకు ‘బీఎన్‌పీ’ రక్తపరీక్ష ఉపకరిస్తుంది.
చికిత్స దీర్ఘకాలం!
గుండె వైఫల్యం మొదలైనప్పుడు- దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు ప్రధానంగా గుండె సైజు పెరగటం, గుండె కండరం మందం కావటం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. వ్యాధి ముదరకుండా చూడటానికి వీటికీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటా బ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్‌బీ ఇన్‌హిబిటార్లు, స్పైరనోలాక్టోన్‌ వంటి మందులు ఇస్తారు. వీటికి తోడు గుండె సైజు పెరిగినప్పుడు దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు ‘నెప్రిలీసిన్‌ ఇన్‌హిబిటార్‌’ వంటి కొత్తమందులూ రాబోతున్నాయి. అలాగే ఒంట్లో అధికంగా చేరిపోయిన నీటిని- మూత్రం రూపంలో బయటకు పంపేందుకు ‘డైయూరిటిక్స్‌’ రకం మందులు, లక్షణాలు తగ్గేందుకు ‘డిజిటాయిల్స్‌’ వంటి మందులు తోడ్పడతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా కాపాడుతూ.. జీవనకాలం పెరగటానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్‌ సామర్థ్యం 30% కంటే తక్కువున్న వారికి ‘ఆల్డోస్టిరాన్‌ యాంటగోనిస్ట్స్‌’ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్థమా వంటి సమస్యలున్నవారు బీటా బ్లాకర్స్‌ తట్టుకోలేరు. వీరికి ‘ఇవాబ్రాడిన్‌’ అనే కొత్త మందు వచ్చింది. కిడ్నీ సరిగా పనిచేయనివారు, ఒంట్లో పొటాషియం స్థాయులు ఎక్కువగా ఉన్నవారు ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌, ఏఆర్‌బీ మందులను తట్టుకోలేరు. వీరికి ‘ఐసాలజైన్‌’ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రక్తనాళాలు విప్పారేలా చేస్తూ గుండె మీది భారాన్ని తగ్గిస్తాయి. వీటితో గుండె మెరుగ్గా, ఎక్కువ కాలం మన్నికగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గటమే కాదు, గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలూ తగ్గి, రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను క్రమం తప్పకుండా, తగు మోతాదులో తీసుకోవటం చాలా కీలకం.
పరికరాలు: గుండె వైఫల్యం కారణంగా గుండె లయ తప్పి, మరణించే ముప్పు ఎక్కువున్న వారికి, లయ చెడకుండా ‘ఇంప్లాంటబుల్‌ కార్డియోవెర్టర్‌ డీఫిబ్రిలేటర్‌ (ఐసీడీ)’ పరికరాన్ని, అలాగే గుండె కొట్టుకోవటంలో గదుల మధ్య సమన్వయం తప్పితే సరిచేసేందుకు ‘కార్డియాక్‌ రీసింక్రనైజేషన్‌ థెరపీ (సీఆర్‌టీ)’ పరికరాన్ని అమర్చాల్సి ఉంటుంది. కొందరికి ఈ రెండూ అమర్చాల్సి ఉంటుంది.
గుండె మార్పిడి: మందులు, పరికరాలతో చికిత్స తీసుకున్నా కూడా క్రమేపీ తీవ్రవైఫల్యంలోకి వెళ్లిపోయి, చివరికి పడుకున్నా ఆయాసం వంటివి వేధించే స్థితి లోకి చేరుకున్న వారికి ‘గుండె మార్పిడి’ ఒక్కటే పరిష్కారం. లేదూ కృత్రిమ గుండె అమర్చాల్సి ఉంటుంది.
జీవనశైలి మార్పు ముఖ్యం!
గుండె వైఫల్యం బాధితులు దైనందిన ఆహారంలో, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవటం చాలా అవసరం.
ఉప్పు: గుండె వైఫల్యం నిర్ధరణ అయ్యి.. ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాముల (అరచెంచా) కన్నా తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండానే కూరలు వండి.. గుండె వైఫల్యం బాధితుల కోసం విడిగా కొంత తీయాలి. ఒక ప్యాకెట్లో అరచెంచా ఉప్పును ఇచ్చి రోజంతా దాంతోనే సరిపుచ్చుకోవాలని చెప్పాలి. దేన్లోనూ విడిగా ఉప్పు వేసుకోవద్దు. పచ్చళ్లు, బయటదొరికే చిరుతిళ్లను మానెయ్యాలి. ఉప్పు ఉండని- బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి నట్స్‌, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్‌, లేదా కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకుల వంటివి ఉపయోగించుకోవచ్చు.
ద్రవాలు: కాళ్ల వాపు ఉంటే నీరు, మజ్జిగలాంటి ద్రవాలన్నీ మితంగా తీసుకోవాలి. రోజు మొత్తమ్మీద లీటరు కంటే తక్కువ తీసుకోవాలి. ఒంట్లో నీరు చేరుతున్న లక్షణాలు లేకపోతే ఒకటిన్నర లీటర్ల వరకూ తీసుకోవచ్చు.
విశ్రాంతి: గుండె వైఫల్యం వస్తే పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్పించి మిగతా వారంతా శరీరం సహకరించినంత వరకూ, ఆయాసం రానంత వరకూ శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కటం వంటివి చెయ్యొచ్చు. ట్రెడ్‌మిల్‌ వంటి గుండె మీద భారంపడే వ్యాయామాలు చెయ్యాలనుకుంటే మాత్రం వైద్యుల సిఫార్సు మేరకే చెయ్యటం మంచిది.
మానసిక సాంత్వన: గుండె వైఫల్యం, అశక్తతల మూలంగా మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. వీరికి యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు.
ఈ మందులు వద్దు: గుండె వైఫల్యం ఉన్నవాళ్లు కొన్ని మందులు.. ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఐబూప్రోఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టిరాయిడ్లకూ దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లో నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. జింటామైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ కిడ్నీలను దెబ్బతీస్తాయి కాబట్టి వీటినీ వాడకూడదు. సంప్రదాయ ఔషధాలు, నాటు మందుల్లో ఏముంటాయో, అవి గుండె మీద ఎలా పనిచేస్తాయో తెలియదు కాబట్టి వాటికీ దూరంగా ఉండటం మంచిది. మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు ప్యారాసిటమాల్‌ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు.
వైద్య సంరక్షణ: వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తొచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వీటి మోతాదుల్లో మార్పు చెయ్యటం, లేదా మందులను మార్చటం వంటివి అవసరమవ్వచ్చు. కాబట్టి తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించటం ముఖ్యం.
బీపీ,షుగర్‌
లాగే...గుండె వైఫల్యం మొదలైందని తేలిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి వీల్లేదు. ఎందుకంటే వదిలేస్తే ఇది ఆయుర్దాయాన్ని గణనీయంగా తగ్గించేసే సమస్య! దీన్ని పూర్తిగా నయం చెయ్యలేకపోయినా.. చక్కటి చికిత్స తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తే చాలా ఏళ్ల పాటు అందరిలా సాధారణ జీవితం గడిపే వీలుంటుంది. గుండె వైఫల్యం కూడా... మధుమేహం, హైబీపీల్లాంటి దీర్ఘకాలిక సమస్యేననీ, దీన్ని కూడా చికిత్సతో కచ్చితంగా అదుపులో ఉంచుకో వచ్చని గుర్తించాలి.
ఎంతపోటుకు అంత వైఫల్యం
గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరం ఎంత దెబ్బతిన్నదన్న దాన్నిబట్టి ‘గుండె వైఫల్యం’ సంభవిస్తుంది. గుండెపోటు వల్ల గుండె కండరం 20% కంటే ఎక్కువ దెబ్బతింటే వెంటనే వైఫల్యం మొదలవుతుంది. ఒకవేళ కండరం 10-15% కంటే తక్కువ దెబ్బతింటే వైఫల్య లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చుగానీ... క్రమేపీ ముదురుతాయి. వీరికి 2, 3 ఏళ్లలో గుండె వైఫల్య లక్షణాలు బయల్దేరుతుంటాయి. అందుకే గుండెపోటు బారినపడి కోలుకుంటున్న బాధితులందరికీ- వారి గుండె పంపింగ్‌ సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌) ఎలా ఉంది? అది ఎంత దెబ్బతింది? మున్ముందు వైఫల్యంలోకి వెళ్లే అవకాశం ఉందా? అన్నది తప్పనిసరిగా చూడాలి. ఆ ముప్పు ఉంటే వెంటనే మందులతో చికిత్స ఆరంభించటం ద్వారా ‘వైఫల్యం’లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు.
+++++++++++++++++++++++++++++
++++++గుండె మార్పిడి సురక్షితమే!+++++++
కాలేయం, మూత్రపిండాల్లాగే గుండెను కూడా మార్చొచ్చు. కానీ ‘గుండె మార్పిడి’ అనగానే గుండె ఆగినంత భయపడతాం. నిజానికి గుండె మార్పిడి అందరూ అనుకునేంత క్లిష్టమైనది, ఖరీదైనది కాదు. తగిన సమయంలో గుండెను మార్చగలిగితే ఆరోగ్యంతోపాటు ఆయుష్షును కూడా పెంచుకోవచ్చంటున్నారు కార్డియో థొరాసిక్‌, హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్స్‌ డాక్టర్‌.పి.వి.నరేష్‌ కుమార్‌, డాక్టర్‌.సి.ఆర్ముగం.
కాలేయం, మూత్రపిండాల అవసరం ఎంతోమందికి ఉన్నా వాటిని అందించే దాతలు లేరు. కానీ గుండె విషయంలో పరిస్థితి పూర్తి విరుద్ధం. తగినన్ని గుండెలున్నాయి. కానీ గ్రహీతలే కరువవుతున్నారు. దాంతో ఎంతో అమూల్యమైన గుండెలు వృథా అవుతున్నాయి. విదేశాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. గుండె మార్పిడి గురించి తగినంత అవగాహన ఉండటంతో అక్కడి రోగులు మార్పిడికి ముందుకొస్తున్నా తగినన్ని గుండెలు దొరకని పరిస్థితి.
గుండె ఎప్పుడు మార్చాలంటే?
కిడ్నీలు, లివర్‌లాగే గుండె కూడా ఫెయిల్‌ అవుతుంది. గర్భిణుల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల క్రమేపి గుండె బలహీనమై ‘డైలేటెడ్‌ కార్డియో మయోపతీ’ సమస్య తలెత్తినప్పుడు హార్ట్‌ ఫెయిల్‌ అవుతుంది. అప్పుడిక గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారం. 30 నుంచి 40 ఏళ్ల వయస్కులైన కొందరిలో అకారణంగా కూడా ఇదే సమస్య మొదలై గుండె పనిచేయటం మానేయొచ్చు. అలాగే రక్తనాళాల్లో అడ్డంకుల మూలంగా వరుసగా గుండె పోటుకు గురైనా హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. కొందరిలో ఒక్కసారికే తీవ్రమైన గుండెపోటు రావడంతో గుండె పూర్తిగా పనికిరాకుండా పోవచ్చు. ఈ సందర్భాల్లో గుండెను మార్చాల్సిందే!
అవగాహన అవసరం
గుండె మార్పిడి చేయించుకుంటే చావును ఆహ్వానించినట్టే అనే ఓ అపోహ బలంగా నాటుకు పోయింది. మార్పిడి తర్వాత ఇన్‌ఫెక్షన్లు, బలహీనతల వల్ల ప్రాణాలు నిలవటం కష్టమని, గుండె మార్పిడి చేసేంత సాంకేతిక పరిఙ్ఞానం మన దేశంలో లేదని.. ఇలా ఎన్నో అపోహలు ఉంటున్నాయి. దాంతో లక్షలు ఖర్చుపెట్టి ప్రాణాలు నిలబెట్టలేని సర్జరీ చేయించుకోవటం వృథా ప్రయాస అనే నిర్ధారణకు వస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. సరైన సమయంలో గుండె మార్పిడి చేయించుకుంటే ప్రాణాలు నిలవటంతోపాటు ఆయుష్షును కూడా పెంచుకోవచ్చు. పైగా సర్జరీకయ్యే ఖర్చులో కొంత ప్రభుత్వం కూడా భరిస్తోంది. కాబట్టి సాధారణ వైద్యుల్ని కలిసి సమయం వృథా చేసుకోకుండా లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన వైద్యుల్ని కలిస్తే అసలు సర్జరీ దాకా వెళ్లే అవసరమే తప్పవచ్చు. ఒకవేళ మార్పిడి అవసరమే అయితే తగిన దాత దొరికేవరకూ సరైన ముందులతో గుండె మరింత పాడవకుండా కాపాడుకోవచ్చు. అలా
కాకుండా వ్యాధితోనే ఆరేడు నెలలు కాలం గడిపేసి ఆ తర్వాత వైద్యుల్ని సంప్రదిస్తే గుండెతోపాటు ఊపిరితిత్తులు కూడా దెబ్బతిని పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. గుండె విషయంలో దాంతో సంబంధం ఉండే ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్‌ అవుతాయి. ఇలా రెండిట్లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగితే చికిత్స క్లిష్టమవుతుంది. ఈ దశలో గుండె మార్పిడి చేయటం ఎంతో రిస్క్‌. కాబట్టి ఈ దశలో వచ్చిన రోగులకు గుండె వైద్యులు మందులతో, లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌ అనే పరికరాన్ని అమర్చి పరిస్థితి మరింత దిగజారకుండా నియంత్రిస్తారు. గుండె దొరికేవరకూ ఈ చికిత్సతో ప్రాణాలు కాపాడుతూ దాత దొరికాక మార్పిడి చేస్తారు.
గుండెను మార్చిన తర్వాత
గుండె మార్పిడి సర్జరీ తర్వాత వైద్యులిచ్చే చికిత్స ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. సర్జరీ తర్వాత ఇమ్మిడియెట్‌ రిజెక్షన్‌ ఉంటుందో లేదో వైద్యులు కనిపెడతారు. అలాంటిది లేనప్పుడు ఇనిషియల్‌ రిజెక్షన్‌ మీద దృష్టి పెడతారు. ఈ చికిత్సలో భాగంగా మూడు నెలలు వైద్యులు ఎక్కువ మోతాదులో ఇమ్యూనో సప్రెసెంట్స్‌ ఇస్తారు. అమర్చిన గుండెను శరీరం రిజెక్ట్‌ చేయకుండా ఉండటానికే ఈ మందులు. అలాగే ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి బయటి వ్యక్తులకు దూరంగా ఉండాలని రోగులకు సూచిస్తారు. క్రమంగా మందుల మోతాదు తగ్గిస్తూ వస్తారు. ఇలా సంవత్సరంపాటు జాగ్రత్తగా ఉండగలిగితే గుండె మార్పిడి చేయించుకున్నవాళ్లు కూడా ఆ తర్వాత అందరిలాగే సాధారణ జీవితం గడపవచ్చు. సంవత్సరం తర్వాత రిజెక్షన్‌, ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి. అలాగే అప్పటికి రోగులు కూడా శారీరకంగా బలవర్ధకంగా తయారవుతారు కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం ఉండదు.
హార్ట్‌ ఫెయిల్యూర్‌ దశలు
హార్ట్‌ ఫెయిల్యూర్‌ నాలుగు దశల్లో జరుగుతుంది. మూడో దశ గుండె మార్పిడికి సరైనది. న్యూయార్క్‌ హార్ట్‌ అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం ఈ దశలోనే గుండె మార్పిడికి వెళ్లాలి. ఈ దశ దాటి నాల్గో దశకు చేరుకుంటే హార్ట్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఈ దశలో గుండె మార్పిడి చేసినా రిస్క్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. మొదటి, రెండవ స్టేజ్‌లో వచ్చిన రోగులకు గుండె మార్పిడి చేయరు. ఈ రోగులకు మందులతోనే పరిస్థితి చక్కదిద్దవచ్చు. కాబట్టి వైద్యులు మందులు వాడుతూ వ్యాధి తగ్గుదలను గమనిస్తూ ఉంటారు. ఒకవేళ వ్యాధి అదుపులోకి రాకుండా దశలు దాటుతూ మూడవ దశకు చేరుకుని నాల్గో దశకు సమీపంగా ఉన్నప్పుడే సర్జరీ సూచిస్తారు. ఇక నాల్గో దశలో సర్జరీ చేయటం ఎంతో క్లిష్టం. ఆ దశ సర్జరీకి అనుకూలమైనది కాదు.
లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌
మూడుసార్లు గుండె పోటుకు గురైన 60 నుంచి 70 ఏళ్ల వ్యక్తికి గుండె మార్పిడి చేయటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటివాళ్లకు చక్కటి ప్రత్యామ్నాయం ‘లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌’. ఈ పరికరం గుండె కోల్పోయిన సామర్ధ్యాన్ని భర్తీ చేస్తుంది. ఈ పరికరాన్ని శరీరంలో దాదాపు పదేళ్ల వరకూ ఉంచవచ్చు. కాబట్టి ట్రాన్స్‌ప్లాంట్‌ సరిపడని రోగులకు ఈ పరికరం చక్కటి ప్రత్యామ్నాయం. అలాగే ఈ పరికరంతో రిజెక్షన్‌ రిస్క్‌ కూడా ఉండదు. కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్‌ వాడాల్సిన అవసరం తప్పుతుంది.
గుండె జబ్బు లక్షణాలు
గుండె జబ్బు లక్షణాలను కనిపెట్టటం తేలికే! తొలి దశలోనే ఈ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే గుండె పూర్తిగా వ్యాధికి గురవకుండా కాపాడుకోవచ్చు. అవేంటంటే..
.
తొలి దశలో...
రోజువారీ పనులు చేస్తున్నప్పుడు కూడా ఊపిరి అందకపోవటం.
చిన్న పనికే ఆయాసపడటం.
వెల్లకిలా పడుకున్నప్పుడు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం.
రాత్రి పడుకున్నప్పుడు పదే పదే దగ్గు రావటం.
మలి దశలో...
కాళ్ల వాపు.
డాక్టర్‌.పి.వి.నరేష్‌ కుమార్‌
డాక్టర్‌.సి.ఆర్ముగం
సీనియర్‌ కార్డియో థొరాసిక్‌,
హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్స్‌, యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list