MohanPublications Print Books Online store clik Here Devullu.com

జాబాలి జ్ఞానోదయం, jabali Puraniti, Jabali, Sparrow

జాబాలి జ్ఞానోదయం 
Jabali Puraniti, Jabali, Sparrow

++++++++++జాబాలి జ్ఞానోదయం++++++++
[పురానీతి]
పూర్వం జాబాలి అనే మహాముని ఉండేవాడు. నిష్ఠగా తపస్సు చేసుకునేవాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా తపస్సు సాగిస్తుండటంతో, జడలు కట్టిన ఆయన తలపై పిచుకల జంట గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకుని, పిల్లాపాపలతో నిశ్చింతగా ఉండసాగాయి. భూతదయా సంపన్నుడైన జాబాలి వాటిని తరిమివేయకుండా, అలాగే తలపై ఉండనిచ్చాడు. తలపై గూడు పెట్టుకున్న పక్షులను తాను అలా ఉండనిచ్చినందునే అవి హాయిగా ఉండగలుగుతున్నాయని, లోకంలో తన కంటే దయాళువు ఇంకెవరుంటారని భావించసాగాడు జాబాలి.
జపతపాదుల కంటే తన తలపై గూడు పెట్టుకున్న పక్షుల గురించే ఎక్కువగా ఆలోచించసాగాడు. తాను గనుక వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉన్నానంటూ గర్వించసాగాడు. రోజు రోజుకూ జపతపాలపై అతడి శ్రద్ధ క్షీణించి, గర్వం పెరగసాగింది.
జాబాలి గర్వానికి సమాధానంగా ఒక రోజు అశరీరవాణి ... ‘నాయనా! జాబాలి.. లోకంలో నువ్వొక్కడివే ధర్మపరాయణుడివని, దయాళువని నీకు నువ్వే అనుకోవడం సరికాదు.
తులాధారుడనే వర్తకుడు నీ కంటే ఎక్కువ ధర్మపరుడు. అయితే, అతడు నీలా ఎన్నడూ గర్వించలేదు’ అని పలికింది.
అశరీరవాణి పలుకులతో జాబాలికి అసూయ మొదలైంది. ‘ఎవరా తులాధారుడు..? నిత్యం జపతపాలు సాగించే నా కంటే ఘనత గలవాడా ఆ వర్తకుడు?’ అనే ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. తులాధారుడిని ఎలాగైనా చూసి తీరాలని, తనను మించిన ఘనత అతడిలో ఏముందో తెలుసుకోవాలని బయలుదేరాడు. తులాధారుడు ఉంటున్న గ్రామానికి వెళ్లాడు.
తులాధారుడి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముంగిట ఏర్పాటు చేసుకున్న అంగడిలోనే వర్తకం చేసుకుంటూ బేరసారాల్లో తలమునకలైన తులాధారుడు కనిపించాడు. అతడిని చూసిన జాబాలి ‘ఈ మామూలు వర్తకుడు నా కంటే గొప్పవాడెలా అవుతాడు’ అని ఆలోచించసాగాడు.
ఈలోగా బేరసారాలు ముగించుకున్న తులాధారుడు తన ముంగిట నిలుచున్న జాబాలిని గమనించాడు. ‘మహర్షీ! మీ రాకతో నా జన్మ ధన్యమైంది.
పిచుకలు తలపై గూడు పెట్టుకుని, పిల్లలతో కాపురం ఉంటున్నా, తపస్సు కొనసాగించిన దయాసాగరులు మీరు. మీ పాదధూళితో నా నివాసం పావనమైంది. దయచేయండి’ అంటూ ఆహ్వానించి, ఉచిత మర్యాదలు చేశాడు.
తులాధారుడి మాటలకు జాబాలి నివ్వెరపోయాడు. ‘నా సంగతంతా నీకెలా తెలిసింది?’ అని ప్రశ్నించాడు. ‘మహర్షీ! నాకు దేనిమీదా మమకారం లేదు. ఎవరిమీదా రాగద్వేషాలు లేవు. ధర్మబద్ధంగా జీవించడం మాత్రమే తెలుసు. నా మనస్సు తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది. అందుకే మీ ఘనతను తెలుసుకోగలిగాను’ అని బదులిచ్చాడు తులాధారుడు.
‘అయితే, నేను ధర్మమార్గంలో జీవించడం లేదంటావా? నేను సాగిస్తున్న జపతపాదులు ధర్మం కాదంటావా?’ కాస్త కోపంగా ప్రశ్నించాడు జాబాలి.
‘మునివరేణ్యా! మీకు తెలియనిదేముంది? అహంకారంతో చేసిన తపస్సును, ప్రతిఫలాపేక్షతో చేసిన యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్య తృప్తికి మించిన యజ్ఞం లేదు. దానివల్ల దేవతలతో పాటు మనమూ తృప్తి పొందుతాము’ అన్నాడు తులాధారుడు.
‘అయితే, నీ వర్తకం మానుకోవేం? నీది ధనాశ కాదా?’ అక్కసుగా అడిగాడు జాబాలి.
‘కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తగదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంతే’ అని బదులిచ్చాడు తులాధారుడు. కావాలంటే ఇన్నాళ్లూ మీ తలపై ఆశ్రయం పొందిన పిచుకలను అడగండి అని అన్నాడు. వాటిని పిలిచాడు జాబాలి.
వెంటనే అతడి తలపై ఉన్న పక్షులు రివ్వున పెకైగిరి ఆకాశమార్గాన నిలిచాయి. ‘మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞ మేరకు నిన్ను పరీక్షించడానికి వచ్చాం.
మత్సరం వల్ల నీ తపస్సు నశించింది. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది’ అని చెప్పి అంతర్ధానమైపోయాయి. వాటి పలుకులతో జాబాలికి జ్ఞానోదయమైంది. ‘అనవసరంగా నీపై మత్సరం పెంచుకున్నాను. క్షమించు’ అని చెప్పి తులాధారుడి వద్ద సెలవు తీసుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి బయలుదేరాడు.
టాగ్లు: పురానీతి, జాబాలి, పిచుకల, Puraniti, Jabali, Sparrow

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list