MohanPublications Print Books Online store clik Here Devullu.com

క్షమించండి, Sorry MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

క్షమించండి(Sorry)


క్షమించండి
ఓ వ్యక్తి తనను అనవసరంగా విమర్శిస్తున్నారని, తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వచ్చాడు.
ఆ గురువు అతని ముందు ఓ జనుప గోతాంను, ఓ గంప నిండా ఆలుగడ్డలను పెట్టాడు.
‘నిన్ను కష్టపెట్టిన వాళ్లు, విమర్శించిన వాళ్లు ఈ ఆలుగడ్డలు అనుకో. వాళ్లు క్షమించడానికి వీల్లేని వాళ్లే కావొచ్చు. అలా ఎంతమంది ఉన్నారో అన్ని ఆలుగడ్డలని ఈ గోతాంలో వేయి’ చెప్పాడు గురువు.
ఆ వ్యక్తి ఆ విధంగా చేశాడు. గోతాం నిండింది.
‘ఈ నిండిన గోతాంని ఓ వారం రోజులు మోసుకొని వెళ్లు. నువ్వు ఎక్కడికి వెళ్లినా దాన్ని తీసుకొని వెళ్లు. ఆ తరువాత మనం మాట్లాడుదాం’ గురువు ఆ వ్యక్తితో చెప్పాడు.
గురువుగారు చెప్పినదాంట్లో ఆ వ్యక్తికి ఏమీ కన్పించలేదు. వాటిని మోయడం పెద్ద కష్టము కాదు. అయినా గురువుగారు చెప్పినట్టుగా చేశాడు. కొంత సమయం తరువాత అతనికి అవి బరువుగా అన్పించాయి. అతని పనికి ఆటంకంగా కూడా అన్పించింది. కాలం గడిచిన కొద్దీ అవి ఎక్కువ బరువుగా అన్పించాయి. నిజానికి వాటి బరువేమీ మారలేదు.
కొద్ది రోజులు గడిచిన తరువాత ఆ గోతాం నుంచి వాసన రావడం మొదలు పెట్టింది. అది పుల్లటి వాసనగా మారింది. అసౌకర్యంగా అన్పించింది. మెల్లమెల్లగా అది దుర్గంధంగా పరిణమించింది.
వారం రోజులు గడిచిపోయాయి.
ఆ గోతాంతోబాటు గురువు దగ్గరికి వెళ్లాడు.
‘ఏమైనా ఆలోచనలు వచ్చాయా?’ అడిగాడు గోతాం వైపు చూస్తూ గురువు.
‘చాలా ఆలోచనలు వచ్చాయి గురువుగారు. మనం ఇతరులని క్షమించకపోతే చెడు ఆలోచనలు, చెడు భావనలు ఎప్పుడూ మన వెంటే ఉంటాయి. ఈ ఆలుగడ్డల మాదిరిగా, ఆ వ్యతిరేక భావనలు కొంతకాలం తరువాత బరువెక్కుతాయి. కుళ్లిపోతాయి’ చెప్పాడు ఆ వ్యక్తి.
‘అవును. ఎవరిపైనైనా అసూయ, ఈర్ష్యలాంటి చెడు భావనలను మోస్తే ఇలాగే ఉంటుంది. వాటిని తగ్గించుకోవడం ఎలా?’
‘వాళ్లని క్షమించడానికి ప్రయత్నించాలి’ ఆ వ్యక్తి గురువుతో చెప్పాడు.
‘క్షమించడం అంటే నీ గోతాం నుంచి ఒక్కో ఆలుగడ్డని తీసివెయ్యడం. నిన్ను ఆక్రమించిన ఎంతమందిని నువ్వు క్షమించగలవు’ ప్రశ్నించాడు గురువు.
‘చాలామంది వున్నారు. ఇది కష్టమే. వాళ్లని క్షమించాలంటే నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయినా సరే! అందరినీ క్షమిస్తాను’
‘అన్ని ఆలుగడ్డలు తీసివేసిన తరువాత కూడా ఈ వారంలో మనసును ఆక్రమించిన వాళ్లు ఎవరైనా ఉన్నారా?’
ఆ వ్యక్తి కొంతసేపు ఆలోచించి కొంతమంది ఉన్నారని చెప్పాడు. ఆ వ్యక్తి ఆందోళనకి లోనయ్యాడు. ఖాళీ చేసిన గోతాములోకి మళ్లీ ఆలుగడ్డలని వేయడం మొదలుపెట్టాడు.
‘గురువుగారూ, ఇట్లా నేను చేస్తూ పోతే ప్రతి వారం ఆలుగడ్డలతో ఓ గోతాం తయారవుతుంది కదా!’ అడిగాడు.
‘అవును. నీ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా చర్యలు చేపట్టినా మళ్లీ ఆలుగడ్డలు తయారవుతాయి’
‘మరి గురువుగారు! వీటిని నియంత్రించాలంటే ఏం చేయాలి?’
‘ఇతరులని క్షమించడానికి మనం నిరంతరం ప్రయాస పడాల్సిందే. ఆలుగడ్డలు చెడు భావనలు అయితే మరి గోతాం ఏమిటి? మన చెడు భావనలని స్వీకరించేది, మనతోపాటు వుంచేది. అది మన మనస్సులో ఉండి ఎప్పుడూ మనల్ని గాయపరుస్తుంది. అది మనం స్వయంగా మనం నిర్మించుకున్న బెలూన్ లాంటిది’ చెప్పాడు గురువు.
‘దాన్ని తీసివేస్తే ఏమవుతుంది?’
‘ఒకవేళ అలా చేసే ఒక్కో ఆలుగడ్డకి ఒక్కో పేరు పెడుతూ వాటిని మళ్లీమళ్లీ గోతాములో వేయాల్సిన అవసరం వుండదు. దుర్గంధమేదీ నీ వెంట రాదు’ చెప్పాడు గురువు.
క్షమించడం అనేది ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయం. క్షమించడమంటే ఆలుగడ్డలని తీసివేయడం కాదు. మొత్తం గోతామునే తీసివేయడం.


--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list