MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీకాళహస్తి SriKalahsthi

శ్రీకాళహస్తి
SriKalahsthi

-----------:శ్రీకాళహస్తి:----------
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది.
క్షేత్ర చరిత్ర/ స్థలపురాణం: ఇక్కడ కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ఏటికేడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ (సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం... ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ మూడు జీవులు ఇక్కడి శివయ్యను ఆరాధించి.. చివరకు ఆయనలోనే ఐక్యమయ్యాయి. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యే ప్రభావం కనబరుస్తాయన్నది భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది!
ఆలయ దర్శన వేళలు: ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! రూ. 50 ప్రత్యేక దర్శన టికెట్టుకూ ఇదే వర్తిస్తుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది!
నిత్యసేవలు/ ప్రధాన పూజలు: రోజూ ఉదయం 4.30 గంటలకు: మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ.
* ఉదయం. 5.45, ఉదయం 6.45, ఉదయం 10 గంటలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కాల అభిషేకాలు. ద్వితీయ కాల అభిషేకానంతరం నిత్యోత్సవం, నిత్యకల్యాణం, చండీ, రుద్రహోమాలు. శనేశ్వరునికి విశేష పూజలు. అభిషేకాలు.
* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాహు, కేతుసర్పదోష నివారణ పూజలు.
* సాయంత్రం 5 గంటలకు ప్రదోష కాల అభిషేకం
* సాయంత్రం 6.30 గంటలకు షోడశోపచార నివేదన
*రాత్రి 9.30 ఏకాంతసేవ
ఆర్జిత సేవల రుసుములు: సుప్రభాత సేవ రూ.50, గోమాత పూజ రూ. 50, అర్చన రూ. 25, సహస్ర నామార్చన రూ. 200, త్రిశతి అర్చన రూ. 125, సోమవారం ప్రదోష కాల సమయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రూ. 1,500, క్షీరాభిషేకం రూ. 100, పచ్చకర్పూర అభిషేకం (స్వామివారికి) రూ. 100, రుద్రాభిషేకం రూ. 600, పంచామృత అభిషేకం రూ. 300, నిత్యదిట్ట అభిషేకం రూ. 100, శనేశ్వర అభిషేకం రూ. 150, అఖండ దీపారాధన రూ. 50, ప్రత్యేక ప్రవేశం రూ. 50, నిత్యోత్సవం రూ. 58, నిత్య కల్యాణోత్సవం రూ. 501, రుద్రహోమం రూ. 1116, చండీహోమం రూ. 1116, అష్టోత్తర స్వర్ణ కమల పుష్పార్చన( ప్రతి శుక్రవారం) రూ. వెయ్యి, ప్రత్యేక ఆశీర్వచనం రూ. 500, సాధారణ సర్పదోష పూజలు రూ. 300 ప్రత్యేక సర్పదోష నివారణ రూ. 750, ఆశీర్వచన, సర్పదోష నివారణ రూ. 1,500, ప్రత్యే ఆశీర్వచనం, సర్పదోష నివారణ రూ. 2,500 (ప్రొటోకాల్‌ మేరకు మాత్రమే), ఏకాంత సేవ రూ. 100. వాహనపూజలు(పెద్దవి) రూ. 25( చిన్నవి) రూ. 20.
భక్తులకు ఇచ్చే బహుమానాలు..
ఆలయంలో జరిగే అభిషేక సేవలకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రుద్రాభిషేకానికి పులిహోర, లడ్డూ, కండువా, జాకెట్టు గుడ్డ, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పంచామృతం, పచ్చకర్పూర తీర్థజలం, విభూది ఆలయం తరఫున అందజేస్తారు.
పచ్చకర్పూర అభిషేకం చేయించిన భక్తులకు తీర్థంగా పచ్చకర్పూర జలాన్ని, పంచామృత అభిషేకం చేయించిన భక్తులకు అభిషేకం చేసిన పంచామృతాన్ని కానుకగా అందజేస్తారు.
నిత్య కల్యాణోత్సవం చేయించిన వారికి లడ్డూ, వడ... చండీ, రుద్రహోమాలు చేయించిన వారిని ఉప్పు పొంగలి ప్రసాదంగా అందజేస్తారు.
వసతి.. రవాణా సౌకర్యం: విజయవాడ-రేణిగుంట మార్గంలో శ్రీకాళహస్తి క్షేత్రం వుంది. రైలు.. రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. ప్రతి 15 గంటలకో సర్వీసు చొప్పున బస్సులు ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాళహస్తికి నేరుగా బస్సు సౌకర్యముంది. సమీపంలోని రేణిగుంటలో తిరుపతి విమానాశ్రయముంది.
ఇక ఇక్కడకు శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాల్లో అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. అలాగే పట్టణంలోనూ పలు ప్రభుత్వ/ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి.
ఆ వివరాలతోపాటు.. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు... ముందస్తు బుకింగ్‌ల కోసం... 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list