MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆకర్షణీయంగా సుకన్య సమృద్ధి యోజన, Sukanya Samudra Yochana

ఆకర్షణీయంగా  సుకన్య సమృద్ధి యోజన, Sukanya Samudra Yochana

-----------:ఆకర్షణీయంగా
సుకన్య సమృద్ధి యోజన:-------
ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లకు కోత పెట్టింది. ఇందులో భాగంగా బాలికల కోసం ప్రవేశ పెట్టిన ప్రత్యేక పొదుపు పథకం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకంలోనూ అనేక మార్పులు చేసింది. చెల్లించే వడ్డీ రేటుపైనా కోత పెట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంపై ప్రభుత్వం 9.2 శాతం వరకు వడ్డీ చెల్లించింది. ప్రస్తుతం ఇది 8.6 శాతానికి తగ్గింది. ఇది కూడా ఈ నెలాఖరు వరకు మాత్రమే. ఇక నుంచి ఈ పథకంపైనా మిగతా చిన్న పొదుపు పథకాల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు మారనుంది. దీని వల్ల లాభంతో పాటు నష్టాలూ ఉన్నాయి. వడ్డీ రేటు పెరిగినపుడల్లా మరింత వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఈ మార్పులు ఎలా ఉన్నా, బాలికల భవిష్యత కోసం పన్ను పోటు లేని సురక్షిత పెట్టుబడుల కోసం చూసే తల్లిదండ్రులు, సంరక్షకులకు ఈ పథకం నేటికీ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ పథకంలో చోటు చేసుకున్న ప్రధాన మార్పులు చూద్దాం.
నిర్వచనంలో మార్పులు..
కుమార్తె అన్న మాటకు అర్థాన్ని మరింత విస్తృతం చేశారు. దత్తత తీసుకున్న బాలిక పేరు మీద కూడా ఇకపై ‘సుకన్య సమృద్ధి యోజన’ పొదుపు ఖాతా ప్రారంభించవచ్చు. కాకపోతే బాలిక వయసు 10 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే ఒక కుటుంబంలో ఇద్దరికి మించకుండా ఒక్కో బాలిక పేర ఒక ఖాతా మాత్రమే ప్రారంభించాలి. గతంలో ఈ ఖాతాల్లో బాలికకు 14 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే డిపాజిట్‌ చేసేందుకు అవకాశం ఉండేది. ఇపుడు దీన్ని 15 సంవత్సరాల వయసు వరకు పెంచారు.
డిపాజిట్‌ మొత్తంపై పరిమితులు..
సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాలో బాలిక తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఏటా కనీసం రూ.1,000 నుంచి రూ.1.5 లక్షల గరిష్ఠ స్థాయి వరకు డిపాజిట్‌ చేయవచ్చు. ప్రతి నెలా 10వ తేదీ వరకు ఖాతాలో జమైన మొత్తాన్ని వడ్డీ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పథకం గడువు ముగిశాక ఉపసంహరించుకుంటే, ఆ మొత్తానికీ పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఏటా డిపాజిట్‌ చేసే మొత్తం రూ.1.5 లక్ష దాటితే మాత్రం, ఆ అదనపు మొత్తంపై ఎలాంటి వడ్డీ లభించదు. కాకపోతే అ అదనపు మొత్తాన్ని ఎపుడు కావాలంటే అపుడు వెనక్కి తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ పథకంలో కేవలం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మాత్రమే డిపాజిట్‌ చేయాలనే నిబంధన ఉండేది. ఇపుడు 10 సంవత్సరాలు దాటిన బాలికలు కూడా తమ పేర ఉన్న ఈ పథకంలో డిపాజిట్‌ చేయవచ్చు.
ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో రికార్డులు...
ఈ పొదుపు ఖాతా ఉన్న బ్యాంక్‌ బ్రాంచ్‌ లేదా పోస్టాఫీసు కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ (సిబిఎస్‌) సదుపాయం అందుబాటులో ఉంటే నగదు, చెక్కు లేదా ఎలకా్ట్రనిక్‌ పద్దతిలోనూ డిపాజిట్‌ చేయవచ్చు. ఈ వివరాలను ఎలకా్ట్రనిక్‌ ఫార్మాట్‌లో రికార్డడ చేసుకోవచ్చు. ఖాతాదారు లేదా సంరక్షకుడు నివాసం మారితే సిబిఎస్‌ సదుపాయం ఉన్న మరో బ్యాంక్‌ బ్రాంచ్‌ లేదా పోస్టాఫీసుకు తమ ఖాతాను ఉచితంగా బదిలీ చేయించుకోవచ్చు. వేరే కారణాలతో బదిలీ చేయుంచుకోవాలంటే మాత్రం రూ.100 చెల్లించాలి.
పాక్షిక ఉపసంహరణ..
ఇంతకు ముందు అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో డిపాజిట్‌ అయిన మొత్తాన్ని పాక్షికంగా అయినా ఉపంసహరించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఇపుడు బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చినపుడు లేదా పదో తరగతి పాస్‌ అయినపుడు..... వీటిలో ఏది ముందైనా, పథకంలో అంతకు ముందు సంవత్సరం వరకు ఉన్న డిపాజిట్‌ మొత్తంలో సగం వరకు ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఈ మొత్తాన్ని ఆ బాలిక ఉన్నత విద్య కోసం మాత్రమే ఖర్చు చేయాలి. గతంలో ఖాతా ఉన్న యువతి పెళ్లి ఖర్చుల కోసం ఖాతాలో డిపాజిట్‌ అయిన మొత్తంలో సగం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉండేది. ఇపుడా అవకాశం లేదు.
పునరుద్ధరించుకోకపోతే నష్టం..
ఈ పొదుపు ఖాతాలో ఏటా కనీసం వెయ్యి రూపాయిలైనా డిపాజిట్‌ చేయాలి. లేకపోతే మీ ఖాతాను డీఫాల్ట్‌ ఖాతాగా పరిగణిస్తారు. మళ్లీ దీన్ని పురుద్ధరించుకోవాలంటే కనీస డిపాజిట్‌తో పాటు, డీఫాల్ట్‌ అయిన ప్రతి సంవత్సరానికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. ఖాతా ప్రారంభించిన 15 సంవత్సరాల్లోపు డీఫాల్ట్‌ ఖాతాను పునరుద్ధరించు కోకపోతే మరింత నష్ట పోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఈ ఖాతా నుంచి డిపాజిట్‌ మొత్తం తీసుకునేటపుడు సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాపై చెల్లించే వడ్డీ చెల్లించరు. కేవలం పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాపై చెల్లించే వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. అంటే పథకం చివరి సంవత్సరం 15వ సంవత్సరంలో డిపాజిట్‌ చేయడంలో విఫలమైనా, అప్పటి వరకు డిపాజిట్‌ చేసిన మొత్తంపైనా తక్కువ వడ్డీ రేటే చెల్లిస్తారు.
మినహాయింపులు..
కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఖాతాదారు తండ్రి లేదా సంరక్షకుడు చనిపోవడం వల్ల డిపాజిట్‌ చేయలేకపోతే, అప్పటి వరకు ఆ ఖాతాలో జమ అయిన డిపాజిట్‌ మొత్తంపై సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చెల్లించే అధిక వడ్డీ రేటే చెల్లిస్తారు.
ముందుగానే ఖాతా క్లోజింగ్‌...
ఎవరి పేరు మీద ఖాతా ఉందో ఆ బాలిక ప్రవాస భారతీయురాలైనా, భారత పౌరసత్వం కోల్పోయినా వారి ఖాతాను మెచ్యూరిటీకి ముందే క్లోజ్‌ చేస్తారు. అప్పటి వరకు ఆ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లిస్తారు. చిల్లి గవ్వ వడ్డీ కూడా చెల్లించరు. ఇంకా బాలిక సంరక్షకుడు చనిపోయినా, లేదా ఖాతా ఉన్న బాలిక ప్రాణాలకు ప్రమాదం తెచ్చే వ్యాధితో బాధపడడం వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ఖాతాను ముందుగానే క్లోజ్‌ చేసుకోవచ్చు. కాకపోతే అప్పటికి ఖాతా ప్రారంభించి కనీసం ఐదు సంవత్సరాలైనా పూర్తిగావాలి. అంతకంటే ముందే ఖాతా క్లోజ్‌ చేస్తే మాత్రం, ఖాతా బ్యాలెన్స్‌పై పో స్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంక్‌ వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు.
మెచ్యూరిటీ..
ఖాతా ప్రారంభించిన 21 సంవత్సరాల తర్వాత ఖాతాలోని డిపాజిట్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు నిండిన యువతి, పెళ్లి తర్వాత తన పేర ఉన్న సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాను క్లోజ్‌ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత ఖాతా కొనసాగించినా, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చెల్లించినట్టు అధిక వడ్డీ రేటు చెల్లించేవారు. ఇపుడు మాత్రం నిర్ణీత 21 సంవత్సరాల వరకు మాత్రమే ఖాతాలోని మొత్తంపై వడ్డీ చెల్లిస్తారు. ఆ తర్వాత ఖాతా కొనసాగించినా, ఖాతాలోని మొత్తంపై చిల్లి గవ్వ కూడా వడ్డీ లభించదు.
కొన్ని ప్రతికూల అంశాలున్నా సుకన్య సమృద్ధి యోజన ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది. బాలికల కోసం సురక్షిత రాబడుల కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు అత్యత అనువైన పథకం. దీని వలన యుక్త వయసులో ఆడ పిల్లల భవిష్యతకు కొంతలో కొంత ఆసరా లభిచడంతో పాటు సెక్షన్‌ 80సి కింద తల్లిదండ్రులకు పన్ను పోటు తప్పుతుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list