మెట్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, Take precations while making of steps
మెట్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
చాలా కాలం తర్వాత కలుసుకున్న ఇద్దరు ప్రాణస్నేహితులు కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తమ జీవితంలో ఇంత అభివృద్ధి సాధించటానికి తను ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎలా ఎక్కాడో చెప్పి తనకు జరిగిన కష్టసుఖాల గురించి చెప్పుకుంటుంటారు. అలాగే మెట్టు అనేది మనిషి జీవితంలో అభివృద్ధికి బంగారు బాటలేసే సోపానంగా మారింది. అలాంటి మెట్లు మనం నివసించే ఇంటికి కూడా అంతకంటే ఎక్కువ మేలు చేసేవిగా వుండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ ఇటీవల కాలంలో ఇంటీరియర్ డిజైనింగ్‌తో ఒక్కోసారి వాస్తు విరుద్ధంగా ఈ మెట్ల నిర్మాణాలు జరిగి సుఖశాంతులతో సరదాగా సాగే జీవితంలో వాస్తు దోషాలు సృష్టించే తుఫానులో కుటుంబాలే అంతరించిపోయే ప్రమాదాలు చాలా చాలా వింటుంటాం. అలాంటి సమస్యలు మనకు రాకుండా వుండాలంటే ఈ సూచనలతో ముందుకెళ్లండి అంతా మేలే జరుగుతుంది.
ఇంటికి అందాన్నిచ్చే ఈ మెట్లు వాస్తు ప్రకారం వుండాల్సిన దిశలో కాకుండా పొరపాటున వేరే దిక్కులో కట్టుకుంటే ఆ ప్రభావంతో మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోయే ఆస్కారం వుంది. ఈ మెట్ల నిర్మాణంలో వాటిని ప్రారంభించే ప్రదేశంలో త్రవ్వే పునాది నుంచి ఇంటి పిల్లర్ల క్రమం తప్పకుండా ఇంటికి పోటు తగలని విధంగా వాటి నిర్మాణం ప్లాన్ చేసుకోవాలి. ఒకటికి మించి అంతస్తులు కట్టే ఇంటి నిర్మాణాలకు ఈ మెట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఈ మెట్ల దిశ నిర్ణయంచటమే చాలా సంక్లిష్టమైనది. వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వారే మెట్ల దిశా నిర్దేశం కచ్చితంగా చేయగలరు. శాస్త్ర ప్రకారం మనకు సృష్టి ప్రసాదించిన పది దిక్కులు చాలా శక్తివంతమైనవి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి, భూమి, ఆకాశం. వీటిని దశ దిశలు అని శాస్త్ర ప్రకారం పిలుస్తుంటారు. రావణాబ్రహ్మ తలలు పది. అందుకే ఆయనను దశకంఠుడు అన్నారు. ఒక్కో దిక్కు ప్రాధాన్యత వాటి నైసర్గిక పరిస్థితులను బట్టి వుంటుంది. ఈ దిక్కుల్లో తొమ్మిదోది అయిన దిక్కు భూమి లోపలకి చొచ్చుకుని పోతుంది. దశవ దిక్కుగా పిలిచే పదవ దిక్కు ఆకాశంలోకి దూసుకుపోతుంది.
మరి మనం కట్టుకున్న ఇంటికి మొదటి అంతస్థు కనుక కట్టుకుంటే... మనం పై అంతస్థుకు వెళ్లాలంటే ... మనకు మెట్లు ఒక్కటే మార్గం. అందుకనే మెట్లకి వాస్తులో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మెట్లు పద్ధతి ప్రకారం కట్టాలి అంటే ఇంటి చుట్టూరా తగినంత ఖాళీస్థలం తప్పక వుండాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అలాంటి స్థలాలు దొరకాలంటే గగనమైపోయంది. ఉన్న స్థలంలోనే ఇంటిని కట్టుకొని మిగిలిన ప్రదేశంలో మెట్ల నిర్మాణం చేసుకొనేవారు చాలా మంది వున్నారు. వారందరూ ఈ విషయాలను జాగ్రత్తగా చదివి వాస్తుని అమలు చేసుకోండి. ఈ మెట్లు రకరకాలుగా వుంటాయ. కానీ వాస్తు ప్రకారం అన్నిటినీ జాగ్రత్తగా నిర్మించుకోవాలి.
ప్రధానంగా చెప్పాలంటే మెట్లు రెండే రకాలు. మొదటివి ఇంటి బయట కట్టే మెట్లు, రెండవవి ఇంటి లోపల కట్టే మెట్లు. ఇవి ఇంటికి దిశానిర్దేశం చేసే విధంగానే వుండాలి. బయటి మెట్లు అంటే ఇంటి బయట నుండి పై అంతస్థుకు వెళ్లేందుకు బయటనుండి కట్టే మెట్లు. లోపలి మెట్లంటే ఇంటి లోపలినుండి ఇంట్లోని పై అంతస్థుకు వెళ్లేందుకు లోపలి నుండి కట్టే మెట్లన్నమాట. ఇవి ఎక్కువగా డుప్లెక్స్ ఇళ్లలో తరచుగా చూస్తుంటాం. మెట్లు ఎక్కడున్నా ఏ పదార్థంతో కట్టినా, ఏ దిక్కులో కట్టినా వాటి ఫలితాలు వాస్తు శాస్త్ర ప్రకారంగానే వుంటాయి. అవి చెక్కవా? ఇనుప పదార్థానికి చెందినవా? రాతితో డిజైన్ చేసినవా అని తేడా వుండదు. ఈ మెట్లు మనం పైకి ఎక్కేపుడు ఉత్తరం నుండి దక్షిణానికి లేదా తూర్పు నుండి పడమరకు మాత్రమే ఎక్కేట్లుగా కట్టించాలి. అలానే ఎందుకు కట్టాలంటే తూర్పు, ఉత్తర దిశలు ఎప్పుడైనా పల్లంగానే వుంటాయి. కనుక మనం క్రింద నుంచి అంటే తూర్పు లేదా ఉత్తరం నుంచే మెట్లు ఎక్కటం ప్రారంభిస్తాము. మనం పైకి చేరే దిశలు దక్షిణం, పడమరలు. ఈ దిక్కులు ఎప్పుడైనా ఎత్తుగానే వుండాలి. కనుక మనం పైకి చేరే ప్రదేశం ఉచ్ఛస్థానంగానే వుండాలి. అందుకనే ఆ దిక్కులు అగ్రభాగాన నిలుస్తాయి. అలా కాకుండా ఈ వాస్తు పద్ధతులకు వ్యతిరేక దిశలలో మెట్ల నిర్మాణం కనుక చేస్తే ఇంటి యజమానికి అనారోగ్యం, తరచూ ప్రయాణాలలో ప్రమాదాలు సంభవిస్తుంటాయి. వ్యాపారస్థులకు అనుకోకుండా నష్టాలు వస్తుంటాయి సంతానం చదువులో వెనుకబడిపోతుంటారు. ధన వ్యయం ఎక్కువగా వుంటుంది. ఇంటి ఇల్లాలుకి శారీరక సమస్యలు వుంటుంటాయ. అన్ని రకాలుగా పతనావస్థకి చేరుకుంటుంటారు. అందుకని మెట్లని పద్ధతి ప్రకారమే కట్టించుకోండి.
మెట్లను ప్రారంభంలో తూర్పు నుండి పడమరకుగాని, ఉత్తరం నుండి దక్షిణానికి గాని మనం ఎక్కే విధంగా నిర్మాణం చేస్తూ, ఆ తరువాత కుడివైపునకుగాని లేకపోతే ఎడమ వైపునకుగాని తిరిగి ఎక్కేవిధంగా వీటి నిర్మాణం చేసుకోవాలి. మనం ఎక్కేపుడు తూర్పు లేదా ఉత్తరంనుంచి ఎక్కటం ప్రారంభించి, దక్షిణం లేదా పడమర దిశ ఎత్తులో మన నడక సాగేట్లుగా వుండాలి. మధ్యలో ఏవన్నా వంకరలుగాని, మలుపులుగాని వుండేట్లయతే వాటిని ఎడమ లేదా కుడివైపునకు తిరిగేట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకో రకమైన 1నిట్టనిలువు2 మెట్ల నిర్మాణ సమయంలో ఇంటి గోడలకు సమాంతరంగా కానీ, నేరుగా ఇంటి మీదకు మనం నడక సాగించే విధంగా కాని ఈ మెట్ల నిర్మాణం చేసుకోవాలి. అంటే ఈ మెట్లు చూడటానికి గోడకు వేసిన నిచ్చెన లాగా వుంటాయి. వీటిని ఉత్తరం నుండి దక్షిణానికి గాని, తూర్పు నుండి పడమరకు గాని మనం సులభంగా ఎక్కే విధంగా నిర్మించాలి. ఇక ఆఖరువి 1గుండ్రని (రౌండ్ షేప్)2 ఆకారంలో మెట్లు ఇవి చూడటానికి గుండ్రంగా తిరుగుతూ గమ్యానికి చేరే విధంగా వుంటాయి. ఇలాంటి వాటిని ఎక్కేపుడు మనం ఒక వృత్తంలో నడుస్తున్నట్టుగా వుంటుంది. వీటి నిర్మాణం ఉత్తరం నుండి లేదా తూర్పు నుండి ప్రారంభించాలి. గమ్యస్థానం చివరలో ఎటువంటి మెలికలు తూర్పు లేదా, ఉత్తర దిశలుగా లేకుండా వాస్తు పరంగా జాగ్రత్తలు తీసుకోండి.
ఇంటికి మెట్లు కట్టేపుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో మొట్టమొదటిది, ఎలాంటి పరిస్ధితులలో కూడా మెట్లని ఇంటి సింహ ద్వారానికి కాని, ఇంటి లోపల కాని, బయట కాని వున్న ద్వారాలకు ఎదురు లేకుండా, ఎదురు రాకుండా వాస్తు పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి యజమాని కాని, యజమానురాలు కాని ఇంటి ద్వారంలోనికి ప్రవేశించటానికి మెట్లు ఏ మాత్రం ఎదురు కారాదు. అంటే ఎవరైనా సరే ఇంటి సింహద్వారం గుండా పైభాగానికి వెళ్లాలంటే వుండే ఇంటి మెట్లు సింహద్వారం వెడల్పులో సగభాగానికి దాటి రాకూడదన్నమాట. అసలు ఈ మెట్లు చాలా వాస్తు సమస్యలకు ప్రధాన కారణంగా మారుతుంటాయి. చాలా మంది మెట్ల నిర్మాణం కరెక్ట్ గా చేసి వాటి క్రింది స్ధలం వేస్ట్ గా పోతున్నదని బాత్‌రూంల నిర్మాణం చేసి సమస్యల సుడి గుండాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు.
మెట్ల క్రింద టాయలెట్‌లు, బాత్‌రూంలు అస్సలు కట్టనే కట్టకూడదు. ఏ దిక్కులో అయనా సరే అలాంటి నిర్మాణాలు వాస్తు ప్రకారం పనికిరాదు. వాస్తు ప్రకారం మెట్లు మానవ జీవితాన్ని ఉచ్ఛస్థితికి తీసుకువెళ్లే సోపాన మార్గాలు. వాటిని ఆటంకపరుస్తూ, వాటి ఆసరాతో వేరొక నిర్మాణాన్ని వాటికి అనుసంధానం చేయటాన్ని వాస్తు శాస్త్రం తప్పుగా పరిగణిస్తుంది. అలా అనుసంధానం చేయటం వలన ఆ దిక్కుకు పెరుగుదల, ఇంకా దిక్కుకు మూల భాగ విస్తీర్ణం ఏర్పడుతుంది. అలా ఏర్పడటం ప్రమాదకరం. అది ఎలాగంటే ఉత్తర వాయవ్యంలో ఇంటికి మెట్లు వున్నాయనుకోండి. దాని క్రింద టాయలెట్ కాని, బాత్‌రూం కాని కట్టినట్టయతే ఇంటిమొత్తానికి ఉత్తర వాయవ్యం పెరిగి రకరకాలైన చెడు ఫలితాలు వస్తాయి. అలాగే మెట్ల క్రింద ఇలాంటి నిర్మాణాలు చేయటం వలన రాకూడని ప్రదేశాలలో గోతులు, అండర్ గ్రౌండ్ డ్రయన్ పైపులు వచ్చి ఇంటి యజమానికి రకరకాలైన సమస్యలు మెడకు చుట్టుకుంటాయి. ఇంకా అలాంటివి ఏవన్నా కట్టాలనుకుంటే మాత్రం దక్షిణంలో కాని, పడమరలో కాని మెట్ల క్రింద ఇంట్లోని పాత సామాన్లు, పనికి రాని వస్తువులని వుంచే స్టోర్ రూంని కట్టుకోవచ్చు. కాని అలాంటి గదిని కట్టిన తర్వాత దాన్ని ఖాళీగా మాత్రం వుంచితే అది ఆ ఇంటి వాళ్ల జీవితాలనే పూర్తిగా ఖాళీ చేసేస్తుంది జాగ్రత్త సుమా.
ఇంటి నిర్మాణంలో మెట్లు ఇంటి వాస్తు ఆకారాన్నే మార్చేసే ప్రధాన కారకాలు. అది ఎలాగంటే... ఇంటి బయట మనం కట్టే మెట్ల వలన ఇంటి ఆకారం అనగా ఆ స్థల ఆకారం చతురస్రంగా కాని, దీర్ఘ చతురస్రంగా కానీ వుండాలి. ఉత్తర వాయవ్యంలో మనం కట్టే మెట్ల వెడల్పు వలన ఉత్తర ఈశాన్యం కూడా పెరిగి ఇల్లు చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని మారితే మంచిది. తూర్పు ఆగ్నేయంలో మెట్లు కనక కట్టుకుంటే ఆ మెట్ల నిర్మాణం వలన తూర్పు ఈశాన్యం కూడా పెరిగి ఆ ఇల్లు చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని చూడ చక్కగా వుంటుంది. అలాగే పడమర వాయవ్యంగా కానీ, దక్షిణ ఆగ్నేయంగా కాని, పడమర దిశకు మధ్యలోకాని, దక్షిణ దిశకు మధ్యలో కాని మెట్ల నిర్మాణం వాస్తు శాస్త్ర ప్రకారం కొలతలతో కట్టుకోవచ్చు. అలా పై విధంగా చెప్పినట్లు మెట్లు మాత్రమే వుండి ఇల్లు ఆకారంలో చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా లేకపోతే ఈశాన్య భాగంలో సగం గోడలు కట్టి వాటి మీద గ్రిల్స్ తో చిన్నపాటి రూంని కట్టి ఇంటి ఆకారాన్ని చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా కూడా వీలుకానపుడు ఈశాన్యంలో నాలుగు పలకలతో చతురస్రపు ఆకారంలో పిల్లర్ వేయాలి. దానిని కలుపుకుంటూ ఈశాన్యం పెరిగే విధంగా పోర్టికోలాగా కట్టి ఇంటి ఆకారాన్ని చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని వచ్చేలా సరిచేయాలి. అంటే ఎలాంటి నిర్మాణం చేయదలచినా ఇంటికి ఈశాన్య భాగం తగ్గకుండా వాస్తు పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట.
ఇక్కడ ఇంకో వాస్తు సమస్య ఏంటంటే.. ఇంటికి బయట మెట్ల నిర్మాణం చేయాలనుకుంటే... ఇంటికి తగలకుండా మెట్లు కట్టుకోవటమే. ఇలా చేయటం వలన ఇంటి ఆకారంలో వచ్చే చతురస్రం, లేదా దీర్ఘ చతురస్రం సమస్యకు ఇలా చేయటమే చక్కటి పరిష్కార మార్గం. అది ఎలా చేయాలంటే... కట్టబోయే మెట్లకు ప్రత్యేకంగా ఒక పిల్లర్‌ని వేయాలి. ఇలా చేసేపుడు మెట్ల బరువు ఇంటి మీద ఏ మాత్రం పడకుండా చూడాలి. కాకపోతే ఇలాంటి మెట్ల నిర్మాణ సమయంలో ఇంటికి, కట్టబోయే మెట్లకి మధ్య కనీసం రెండు అంగుళాల దూరం మాత్రమే కచ్చితంగా వుండితీరాలి. ప్రత్యేకమైన పిల్లర్ వేయకుండా మెట్ల నిర్మాణం చేయరాదు. ఈ పిల్లర్‌తో ఇంటి పిల్లర్లకు సంబంధం లేదు. ఇంటి బయట మనం కట్టుకునే మెట్లు ఇంటికి సంబంధించిన నాలుగు దిక్కుల్లో ఏ దిశలో కూడా కాంపౌండ్ వాల్‌కి తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఒకవేళ పొరపాటున కాని, వాస్తు తెలియకో కాని కాంపౌండ్ వాల్‌కి తగిలితే మాత్రం అది చాలా పెద్ద పెద్ద వాస్తు దోషాలకు కేంద్ర బిందువవుతుంది. ఇలాంటి దోషాలకు తీవ్రమైన అనారోగ్యాలు, అనుకోకుండా ధనవ్యయం, ధననష్టం, ఇంట్లో మరణాలు, విలువైన వస్తువుల అపహరణలు, ఇంట్లో ఆడపిల్లల ప్రేమలు విఫలం కావడం, గర్భ స్రావాలు ఇలా రకరకాలైన చెడుఫలితాలు విచ్చలవిడిగా ఒకటి తర్వాత ఇంకోటి వస్తుంటాయి.
ఉత్తర దిశలోని ప్రహరీ గోడకు తాకుతూ మెట్లు కనుక వుంటే చాలా ప్రమాదకరం. ఇంట్లోని మగ సంతానం కాని, యజమాని కాని అనుకోకుండా హఠాత్తుగా మరణించే ఆస్కారం వుంది. ధనవంతులు బికారులుగా మారే ప్రమాదమూ పొంచి వుంటుంది. ఇంట్లో అగ్నిప్రమాదాలు జరగటానికి అవకాశాలు చాలా వుంటాయ. గ్యాస్ స్టౌ ప్రమాదాలు అనుకోకుండా జరుగుతా య. అందుకనే ఇంటిలోపల కాని, బయట కాని మెట్లు కచ్చితంగా ఎక్కడ కడితే వాస్తు సమస్యలు రాకుండా వుంటాయో ఇపుడు తెలుసుకోండి. తూర్పు ఆగ్నేయంలో, ఉత్తర వాయవ్యంలో, పడమర వాయవ్యంలో, దక్షిణాగ్నేయంలో, పడమర మధ్య భాగంలో, దక్షిణ మధ్య భాగంలో కచ్చితమైన కొలతలతో, సరియైన దిశలో నిర్భయంగా మెట్ల నిర్మాణం చేసుకోవచ్చు.
వాస్తు బలం ఇంటికి కావాలనుకుంటే పడమర దిశలో మధ్యభాగాన మెట్లు కట్టుకుంటే ఇల్లు దేదీప్యమానంగా కళగా వెలిగిపోతుంటుంది. ఈ మెట్లు ఇంటికి లోపలైనా, ఇంటి బయటవైపైనా ఇదే విధంగా కట్టాలి. ఈ దిశలో మెట్లు కట్టాలనుకుంటే పడమర దిశ మధ్య భాగంలోని కేంద్ర బిందువును కచ్చితంగా పట్టుకుని అక్కడే నిర్మాణం జరిపితే ఇంటికి వెయ్య ఏనుగులంత బలమైన వాస్తు లభిస్తుంది. ఇంటి ఆయుష్షుకు, ఇంట్లోని వారి సుఖ శాంతులకు, ధన, ధాన్యలకు, వస్తు వాహనాలకు, రాజకీయ జీవితం ఉచ్ఛస్థితికి చేరటానికి, పెద్ద పెద్ద పదవులు అనుకోకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వాటంతట అవే రావాలన్నా, పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి ఆదాయం పెరగాలన్నా పడమర దిశ మధ్యభాగాన మెట్లు కట్టుకోండి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565