శనీశ్వరుడు వివిధ భావాలలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు
Satrun
శనీశ్వరుడు వివిధ భావాలలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు
సాధారణముగాఏదైనా పని జరగనపుడు గానీ , కష్టములు ఎదురైనపుడు గానీ మానవులు శనీశ్వరుని నిందిస్తారు .'' మాకు శని పట్టింది , శని వెంటాడుతుంది '' అని అనేక రకములుగా నిందిస్తూ ఉంటారు .
అయితే శనీశ్వరుడే లేక పొతే మానావుడే లేడు . అసలు ఈ భూమిమీద జీవమే లేదు . శని వాయు తత్వ కారకుడు . ఈ సృష్టిలో ఉన్న వాతావరణములో గాలి లేకపోతే చలనము ఉండదు . అంతెందుకు మన చుట్టూ విశ్వములో కన్పిస్తోన్న ఈ గ్రహములు నక్షత్రములు ఏవీ ఉండవు . ఈ వాయువు వలన భూమి స్థిరముగా గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నది. వాయువే లేకపోతె శబ్దము ఉండదు .
మానవులే కాకుండా ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు , పశు పక్ష్యాదులు , వృక్షములు అన్ని గాలి వలన జీవిస్తూన్నాయి. ఈ సృష్టి లో ఏ జీవి అయిన తిండి లేక పొతే బ్రతుక గలదేమో గానీ ఊపిరి తీసుకోకుండా బ్రతుక గలడా?
ఇంక మరొక విషయానికొస్తే శనీశ్వరుని వలన కష్టములు కల్గుతాయనీ , చాలా భాధలు ఏర్పడుననీ అందరూ అనుకొంటూ ఉంటారు . నిజానికి గత జీవితమును గుర్తొచ్చే విధంగా చేస్తాడు . మనిషి లో ఉన్న కామ , క్రోధ , లోభ , మద ,మోహ , మాత్సర్యము అను ఆరు గుణములచే అదుపు తప్పి ప్రవర్తించే వారిని గాడిలో పెట్టగల సమర్ధుడు.
లగ్నము నందు శనియున్న జాతకులు వికార రూపము కలవారు . నల్లగా ఉండడం , బలహీన కండరములు , ఊబకాయులు ( గుల్ల శరీరము ) లేక శరీరముపై నరములు తేలి ఉనట్లు సన్నగా ఉండడం లాంటి లక్షణములు కలుగజేస్తాడు . లగ్నము నందు శనిగ్రహము స్థితి పొంది ఉండగా పుట్టిన వారు నీరసముగా ఉంటారు . యాక్టివిటీ తక్కువగా ఉంటుంది . చాలా నెమ్మది స్వభావము కలిగి ఉందురు . కొందరికైతే అవయవ లోపము ఉంటుంది .( అవిటివారు ) వీరు సాధారణముగా శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉబ్బసము , పడిశము , ఆస్తమా , పిట్స్ మొదలగు రోగములచే భాద పడు అవకాశమున్నది . శరీరములో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది .
ద్వితీయ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు కుటుంబము , ధనము, వాక్కు , నేత్రములు మొదలగు వాటిని సూచించును. ఇక్కడ శనిగ్రహము ఉన్నస్థితి కలిగిన జాతకులు ధన సంపాదన విషయములో అనుకొన్న లక్ష్యములను చేరలేరు . సమయానికి డబ్బు చేతికి అందదు . నలుగురిలో మాటలాడలేరు . వీరు కుటుంబములో ప్రశాంతత ను కోల్పోతారు . సభాపిరికి , కొందరికి మెల్లకన్ను ఉండు అవకాశము ఉన్నది . కొందరికి ప్రేమ వివాహము గానీ ఇంటర్నల్ ఎపైర్స్ , ఇంటర్ కేస్ట్ మేరేజ్ జరుగుతుంది . కొన్ని విషయములలో ఇతరులకు లోబడి ఉండాల్సిన అవసరము ఉంటుంది .
తృతీయ స్ధానములో శనిగ్రహము ఉన్నవారు యోగ కరమైన జీవనము గడుపుతారు. కొందరికి చెవుడు కలుగును . వినికిడి శక్తి తక్కువగా ఉంటుంది . తమ్ముళ్ళు నశింతురు . అలా కాని పక్షమున వివాహము జరిగిన వెంటనే వీరు కుటుంబ భాధ్యతలను విస్మరించి వేరు కాపురం పెడతారు .
చతుర్ధ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు విద్యకు అవరోధము ఏర్పడును . వీరు విద్యా పరంగా ఉన్నత స్థానములో ఉండటానికి చాలా కష్ట పడవలసి వస్తుంది . గృహ సౌఖ్యము ఉండదు . పాత ఇల్లు గానీ లేక ఎవరో నిర్మించిన ఇల్లు కొనుక్కోవడం గానీ జరుగుతుంది . తమ స్వహస్తాలతో గృహమును నిర్మించు కాలేరు . బంధువులు సరియైన ఆదరణ ఉండదు . వీరికి మాతృ సౌఖ్యము తక్కువ . . ఉన్నత స్థానములను చేరుటకు చాలా కాలము పడుతుంది . ఇతరులతో ముభావముగా ఉంటారు . ఏకాకి జీవితమును గడుపుటకు ఇష్ట పడతారు .
పంచమ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు మంద బుద్ది కలవారు . వీరికి సంతానము ఆలస్యముగా కలుగుతుంది . వివాహము కూడా ఆలస్యముగా జరుగుతుంది . ఒకవేళ తొందరగా వివాహము జరిగి వెంటనే సంతానము కలిగితే మాత్రం అబార్షన్ జరగడం గానీ , పుట్టిన శిశువు మరణించడం గానీ జరుగుతుంది . పుట్టిన పిల్లలలో బుద్ది మాంద్యము కలుగు అవకాశములు ఉన్నవి . వీరిలో చురుకు తనము తక్కువగా ఉంటుంది .
ఆరవ స్ధానములో శనిగ్రహము ఉన్నప్పుడు పుట్టిన వారు .జాయింట్స్ ,కండరములు, మరియు వాత సంబంధ రోగములతో భాధ పడతారు . మిగతా విషయములు అన్నింటిలో చాలా బాగుంటుంది . వీరు కోర్టు సంభంధ వ్యవహారములలో ఇరుక్కోకుండా ఉండడం మంచిది . లేని యెడల దీర్ఘ కాలము శిక్షలు అనుభవించు అవకాశాలు ఎక్కువ.
ఏడవ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులకు ఆలస్య వివాహము జరుగుతుంది. తొందరగా పెండ్లి సంబంధములు కుదరవు . కొంతమందికి కులాంతర వివాహము , ప్రేమించి పెళ్లి చేసుకొనే అవకాశములు ఎక్కువగా ఉంటాయి . కానీ భార్యా భర్త ఇద్దరి మధ్యా అన్యోన్యత లోపించును . ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండరు . వీరిలో కొందరికి రెండు వివాహములు జరగడం గానీ ( పెళ్ళైన వారికి మళ్ళీ పెళ్లి జరగడం ) లేక అక్రమ సంబంధములు ఉండడం గానీ జరుగుతుంది . దాంపత్య జీవితములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి . ఒకవేళ సంప్రదాయము ప్రకారము వివాహము జరిగితే జీవిత భాగస్వామికి అనుకోని ప్రమాదములు సంభవించు అవకాశములు ఉంటాయి .
ఎనిమిది స్థానములో శని ఉన్నప్పుడు పుట్టిన వారికి మంచి ఆయుర్దాయము కలుగుతుంది . వృద్దాప్యము లో పనికొచ్చే విధంగా ముందు చూపుతో ధనమును పొదుపు చేస్తారు . ప్రణాలికా బద్దంగా ముందుకు వెళతారు . దీర్ఘ కాలము బ్రతుకుతారు . కానీ మరణ సమయములో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు . పక్షవాతం లాంటి జబ్బులతో ఎక్కువ కాలం భాదపడి చనిపోతారు .
తొమ్మిదవ ఇంట శని గ్రహ స్థితి ఉన్నప్పుడు జన్మించిన జాతకులు తండ్రి , తాతల తాలూకా ఆస్తులను కోల్పోతారు . వాటిని అనుభవించలేరు . వీరికి కుటుంబ పరంగా గుర్తింపు ఉండదు . తాత , తండ్రుల యొక్క వంశ పారంపర్య చరిత్ర ఉండదు .అనగా వీరి వంశములో పూర్వీకులు గొప్ప వారెవ్వరూ ఉండరు . సాధారణ జీవితమును గడుపుతారు . జాతకులు మాత్రం స్వశక్తితో అభివృద్ది లోకి వస్తారు . వీరే స్వయంగా స్వార్జితముగా ధన సంపాదన చేయుదురు . పేరు ప్రఖ్యాతలు గడించు కొంటారు . ఆర్ధికముగా స్థిర పడతారు .
పదవ స్థానమున శనియున్న జాతకులు మొదట సాధారణ జీవితమును గడిపెదరు. జీవితములో ఒక మెట్టు , ఒకమెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఉన్నత స్థానములకు చేరుతారు . వీరికి ఏదీ సునాయాసముగా లభించదు . ఎంతో కష్ట పడితే గానీ జీవితమున అభివృద్ధి సాధించలేరు . ‘’ కష్టే ఫలీ’’ అను సూత్రము వీరికి వర్తించును . వీరు ఎంతో కష్ట పడి సాధించిన విజయములు వీరికి కీర్తిని గడించి పెట్టును . దీర్గ కాలము పాటు వీరిని అందరూ గుర్తించు కొంటారు .
పదకొండవ స్థానమున శనియున్న జాతకులు ఆశించిన లాభములను పొందలేరు . వీరు అనుకొన్న లక్ష్యములను సాధించుటకు చాలాకాలము పట్టును . వీరు ఒంటరిగా కాకుండా సమిష్టి గా పని చేయుట , పోరాడుట వలన ఎక్కువ లాభములను పొందగలరు . ( గ్రూప్ మేనేజ్ మెంట్స్ ) వీరికి కలసి వస్తాయి . పని వారి వలన సేవకా వృత్తి వలన , టీం మేనేజ్ మెంట్స్ మొదలగు వాటివలన వీరు విరివిగా లాభపడే అవకాశములు ఎక్కువ .
పన్నెండవ స్థానమున శని గ్రహము ఉంటుండగా పుట్టిన జాతకులకు ఎక్కువగా బరువు భాద్యతలు ఉంటాయి . వీరికి సుఖము తక్కువనే చెప్పాలి . వీరికి ప్రతి విషయములోనూ ఆటంకములు ఎదురగు చుండును . ఎంతో శ్రమకు ఓర్చవలసి ఉంటుంది . భార్య భర్తల మధ్య సయోధ్య ఉండదు . జీవిత భాగస్వామికి లోబడి ఉండాలి. స్వతంత్రత ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో భాధ పడుతూ ఉంటారు . అతి నిద్ర, బద్దకము , నీరసము ఆవహించడం , నరముల నిస్సత్తువతో భాధ పడతారు .
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565