MohanPublications Print Books Online store clik Here Devullu.com

సతతం.. హరితం Trees

సతతం.. హరితం
Trees

----------;సతతం.. హరితం;---------
మొక్క నాటడమే.. భూమాతకు మొక్కు తీర్చుకోవడం
పచ్చని చెట్లు తోడుంటే.. అంతా ఆనందమే.. లేకుంటే అంధకారమే
మొక్కలు నాటేందుకు అనువైౖన సమయం ఆసన్నం
అటవీ, ఉద్యాన శాఖల పరిధిలో 20 కోట్ల మొక్కలు సిద్ధం

ఆకలి తీర్చే అమ్మలు.. దప్పిక తీర్చే దారులు.. వాయువు ఇచ్చి ఆయువు పోసే ప్రాణదాతలు.. ఆహారచక్రంలో మొదటి మెట్లు.. పచ్చటి చెట్లు! ఆకు నవ్వితే వాన..జల ఉప్పొంగుతుంది.. ఆకు నవ్వితే పంట.. గాదెలు నిండుతాయి.. ఆకు నవ్వితే ఆక్సిజన్‌.. ప్రాణాలు నిలుస్తాయి!! ఎవరన్నారు మనిషి గొప్ప అని?.. మనం పరాన్నజీవులం.. చెట్లు లేకపోతే చెట్టంత మనిషికీ కునుకే లేదు.. ఉనికే లేదు!!!
హైదరాబాద్‌, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మానవాళితోపాటు భూమిపై జీవకోటి బతకాలంటే ప్రతిక్షణం ప్రాణవాయువు (ఆక్సిజన) కావాలి. అడగకుండానే దాన్ని మనకు అపారంగా అందించే ప్రాణదాతలు చెట్లు. అటువంటి వృక్ష సంపదను అడ్డంగా నరికేసి.. పచ్చదనాన్ని ఎండగడుతున్న మనం మేల్కోకపోతే భవిష్యత్తు అంధకారమే. చెట్లను నరికేసినా, మొక్కలను నాటకపోయినా కరువుకాటకాలకు స్వాగతం పలికినట్లే. ‘‘అటువంటి పరిస్థితికి మంగళం పాడి వానలకు స్వాగతం పలకాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అవి చెట్లు, వృక్షాలై మనకు ప్రాణవాయువైన ఆక్సిజన అందించడంతో పాటు ప్రాణధార అయిన వానచుక్కల్ని నింగినుంచి భువికి తీసుకొస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటి వాటికి నీరుపోసి సంరక్షించాలి’’ అని ప్రభుత్వం చెబుతోంది. పొలంలో పండ్ల మొక్కలు నాటామా? పెరట్లో కొబ్బరి చెట్లు నాటామా? అన్న ఆలోచన అక్కర్లేదు. ఎవరు ఎక్కడ ఏ మొక్కయినా నాటొచ్చు! అవి గుండెల నిండా ఆక్సిజన అందిస్తాయి.. ఎండలో సేదతీరేందుకు నీడనిస్తాయి.. ఫలాలనిచ్చి ఆకలి తీరుస్తాయి.. మేఘానికి స్వాగతం పలికి దాహార్తి తీరుస్తాయి. అప్పుడు అంతా ఆనందమే. మనిషికి ఇంతటి ఉపయోగమున్న మొక్కలను నాటేందుకు ఇదే అనువైన సమయమని ఆంధ్రప్రదేశ అటవీశాఖ, ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. భావి తరాల కోసం మానవజాతి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ వనమాలిగా మారితే రాష్ట్రం వనాంధ్రప్రదేశగా పచ్చదనంతో పరిఢవిల్లుతుందని సూచిస్తున్నారు.
ఇదే అదను..
తెలుగు రాష్ట్రాల్లో జూన రెండోవారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది మే చివరి వారం నుంచే వానలు కురుస్తున్నాయి. జూన మొదటి వారంలోనే రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో సైతం జడివానలు కురుస్తున్నాయి. ఇలాంటి వాతావరణ అనుకూల పరిస్థితుల్లో మొక్కలు విరివిగా నాటితే అవి బతికి చెట్లుగా పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు 150 చొప్పున మొత్తం పదమూడు జిల్లాల్లో అటవీశాఖ నర్సరీలు సుమారు రెండువేల వరకూ ఉన్నాయి. వాటిలో గత కొన్ని నెలలుగా 15.60 కోట్ల మొక్కలు పెంచారు. అలాగే.. ప్రతి జిల్లాలోనూ ప్రైవేటు నర్సరీలు, కడియం, పుత్తూరు లాంటి చోట్ల పండ్ల మొక్కల నర్సరీలు.. అన్నిటినీ కలిపితే 20 కోట్ల మొక్కలకు తగ్గకుండా ఈ ఏడాది అందుబాటులో ఉన్నాయి. అంటే ఐదు కోట్ల ఆంధ్రులు ఒక్కొక్కరు నాలుగు మొక్కలకు తగ్గకుండా నాటేందుకు మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వర్షాలు ముందుగా రావడం, ఈ ఏడాది పుష్కలంగా వర్షాలొస్తాయని వాతావరణశాఖ చెబుతున్న నేపథ్యంలో మొక్కలు నాటేందుకు ఇంతకన్నా మంచి సమయం లేదని అటవీ, ఉద్యాన శాఖల అధికారులు చెబుతున్నారు.
జామాయిల్‌, సరుగుడు, సుబాబుల్‌..
అటవీశాఖ నర్సరీల్లో జామాయిల్‌, సరుగుడు, సుబాబుల్‌ మొక్కలు ఎక్కువగా పెంచుతున్నారు. యూకలిప్టస్‌, సరుగుడు, సుబాబుల్‌ తోటలు పెంచి రైతులు పేపర్‌ మిల్లులకు విక్రయిస్తారు. ఫలితంగా రైతుకు ఆదాయం సమకూరుతుంది. అందుకని రైతాంగానికి అండగా ఉండేందుకు అటవీశాఖ వీటిని ఎక్కువగా పెంచుతోంది. ఐదారేళ్లకొకసారి రైతులు వాటిని నరికినా మళ్లీ పెంచుతారు. ఒక్క రాజమండ్రి పేపర్‌ మిల్లు యాజమాన్యమే ఇటువంటివి ఏటా 25కోట్ల నుంచి 30కోట్ల మొక్కలను నాటిస్తోందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
పండ్ల తోటలకు ఊతం..
కరువు ప్రాంతాలైన అనంతపురం, చిత్తూరు లాంటి జిల్లాల్లో పండ్లతోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక్కడ వ్యవసాయానికి సరిపడా నీరు లభించకపోవడంతో డ్రిప్‌ ఇరిగేషన పద్ధతిలో పండ్ల మొక్కలు పెంచేందుకు.. చిన్న, సన్నకారు రైతులకు మామిడి, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, జామ తదితర పండ్ల మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతేగాక చెట్లు నాటి వాటిని సంరక్షించేందుకు నీటి వసతితోపాటు కూలీలను ఏర్పాటు చేస్తోంది. అనంతపురం లాంటి జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తానని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చేసే ప్రకటనలకు అనుగుణంగా అధికార గణం కరవు జిల్లాలో పండ్లతోటల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తోంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list