MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఒక ప్రశంస... బోల్డంత ఉత్సాహం Uttsaham

ఒక ప్రశంస... బోల్డంత ఉత్సాహం
Uttsaham

+++++++++++++++++++++++++++++++++++++++
++++++++ఒక ప్రశంస... బోల్డంత ఉత్సాహం! +++++++++
+++++++++++++++++++++++++++++++++++++++
భర్తలు భార్యను గారాబంచేస్తూ పొగడ్తల్లో ముంచెత్తడం మనకు తెలిసిందే! వాళ్ళ అందాలను, గుణగణాల్ని ప్రశంసిస్తూ ఆనందడోలికల్లో తిప్పుతారు. ఆ అభినందనలు, ఆరాధనలకు మురిసిపోతారు మగువలు. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. మరింత ప్రేమ కురిపిస్తారు.
ప్రశంస ప్రభావం అంతటిది. దురదృష్టవశాత్తూ ఈ మెచ్చుకోళ్లు తమకే తప్ప భర్తలకి అక్కర్లేదనుకుంటారు చాలా మంది భార్యలు. కనుకనే ప్రేమగా వండి వడ్డిస్తారే తప్ప ప్రశంసల జోలికెళ్ళరు.
నిజానికి ప్రశంసకు లింగభేదం లేదు. దాని ప్రభావం ఆడపైనా మగపైనా ఒకేతీరుగా పనిచేస్తుంది. ముఖ్యంగా భార్య ప్రశంసిస్తే ఏ భర్తకైనా ప్రపంచాన్ని జయించినంత ఆనందమట. అంచేత భార్యలు తమ తీరు మార్చుకోవాలి. ఇప్పటిదాకా చేసినట్టు భర్త సుగుణాలను గమనించనట్లు ఉంటూ లోలోపలే సంతోషిస్తే లాభంలేదు. మనసారా అభినందించాలి. కాపురంలో మూడు సంతోషాలు.. ఆరు ఆనందాలు వెల్లివిరియాలంటే ఈ సూత్రం పాటించక తప్పదు.
పొగడాలి కదాని ఇంద్రుడివి, చంద్రుడివి అంటూ ఆకాశానికెత్తేస్తే హాస్యాస్పదమౌతుంది. వూదరగొట్టి, ఉబ్బేయడాలు నమ్మశక్యంగా వుండవు. పైగా పని గడుపుకోవడంకోసం చెప్పే కల్లబొల్లి కబుర్లన్పించి చిరాకేసే ప్రమాదముంది. కనుక ప్రశంసల్లో నిజం వుండాలి. నిజాయితీ ధ్వనించాలి. భార్య అన్నాక వేళకన్నీ అమర్చినంతలో చాలదు. అవతలి వారి మనసెరిగి మసలుకోవడంలోనే ఉంటుంది అసలు ప్రతిభ! అడుగడుగునా హృదయస్పర్శ, ఆత్మీయస్పర్శ అవసరం. అభినందన అందుకు తోడ్పడ్తుంది. భర్త సుగుణాల్ని మెచ్చుకోడంవల్ల ఆనందం అంబరమంటుతుంది. చిరునవ్వులు చిందులేస్తాయి. కృతజ్ఞత వర్షిస్తుంది. ‘కరణేషు మంత్రీ, క్షమయా ధరిత్రీ’అంటూ అతనూ ఆమెనీ పొగుడుతాడు. ఇదిలా కొనసాగితే ఇద్దరికిద్దరూ ఎదుటివారిలో లోటుపాట్లను చూట్టం మానేస్తారు. ప్రతి పురుషుడూ తన భార్యకు తనే హీరోననుకుంటాడు. ఆమె కూడా అలా భావిస్తే కొండంత తృప్తి. ‘నీ సామర్థ్యం మీద నాకు నమ్మకముంది’, ‘నీకస్సలు కపటం తెలీదు’, ‘నువ్వెంత నవ్విస్తావో’, ‘నీలాంటి నిజాయితీపరుడు భర్తవడం గర్వంగా వుంది’, ‘నీ నవ్వు చాలా బాగుంటుంది’, ‘నువ్వెంత స్మూత్‌గా బండి నడుపుతావో’ - లాంటి ప్రశంసలకు అతనెంతో ఆనందించి అనుభూతి చెందుతాడు.
పెళ్ళికి ముందు ఆకతాయిగా తిరిగిన కుర్రాళ్ళు కూడా పెళ్ళయ్యాక ఎంతో బాధ్యతగా వుంటారు. భార్యాపిల్లలకి ఏ లోటూ రాకుండా చూసుకోవాలనుకుంటారు. ఆ శ్రమని గుర్తించి ‘మాకోసం నువ్వెంతో కష్టపడ్తున్నావు, ‘నువ్వు దొరకడం నా అదృష్టం’, ‘అరే, నాకోసం వంట చేశావా, చాలా థ్యాంక్స్‌’, ‘నువ్వందరికంటే భిన్నమైన వాడివి’, ‘నీకు తప్పకుండా ప్రమోషన్‌ వస్తుంది’, ‘ఈ వయసుకే నువ్వెంతో సాధించావు’, ‘నీ ఆలోచన్లు ఉన్నతంగా వుంటాయి’ అంటూ మెచ్చుకుంటే మహోల్లాసంతో అలసటంతా మర్చిపోతారు.
స్త్రీలేకాదు పురుషులూ గౌరవాన్ని కోరుకుంటారు. ఇతర్ల సంగతెలా వున్నా తన భార్య తనను మన్నించి, గౌరవించినపుడు మరింత తృప్తిచెందుతాడు. ప్రేమ గాఢమౌతుంది. అందుకు విరుద్ధంగా ‘నీకేం తెలీద’ని, ‘ఏ పనిచేసినా ఇలాగే తగలెడతావనీ’ తూలనాడితే నిరుత్సాహం చెందడమే గాక, క్రమంగా ఆత్మవిశ్వాసం తగ్గుతుందని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు.
సామాన్యంగా అబ్బాయిలకి అందమ్మీద పెద్దగా శ్రద్ధాసక్తులుండవు. అద్దానికి అంటుకుపోరు. గంటల తరబడి తయారవరు. కానీ ‘ఈ చొక్కా నీకు భలేవుంది’, ‘ఇవాళెంత అందంగా వున్నావో’, ‘జిమ్‌కి వెళ్ళడం మొదలెట్టాక దృఢంగా వున్నావు’ తరహా పొగడ్తలందిస్తే ఉత్సాహం ఉరకలేస్తుంది.
మొత్తానికి భర్తతో అనుబంధం బలపడాలంటే ఏ చిన్న అవకాశం దొరికినా అతన్ని అభినందించాలి. అయినా, మనసారా మెచ్చుకోవడంవల్ల పోయేదేముంది? అదనపు ప్రేమాదరణ దక్కడం తప్ప! ఒక ప్రశంస... బోల్డంత ఉత్సాహాన్నిస్తుంది! పూలజల్లులో తడిసిన అనుభూతి కల్గుతుంది. అభినందనల చందనాలు దంపతుల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచి, అనుబంధాన్ని పటిష్టం చేస్తాయి. ‘నాకు నువ్వు, నీకు నేను.. నువ్వు లేక నేను లేను’ అంటూ బాస చేసుకుని ఎంచక్కా పూలబాటలో సాగిపోతారు.
- నాగరత్న


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list