MohanPublications Print Books Online store clik Here Devullu.com

చెట్టు తొర్రలో శ్రీవేంకటేశ్వరుడు, Venkateswara Swamy

చెట్టు తొర్రలో శ్రీవేంకటేశ్వరుడు, Venkateswara Swamy



++++++++చెట్టు తొర్రలో శ్రీవేంకటేశ్వరుడు!++++++
నృసింహావతారంలో...ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన శ్రీహరి, వరదల పాలైన ఆ ప్రాంత ప్రజలకు వరదహస్తం అందించడానికి... .శ్రీనివాసుడిగా చెట్టు తొర్రలో దర్శనమిచ్చాడు. ఈ మహిమాన్విత క్షేత్రం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఉంది.
కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్‌... వెదుకంగానేల ఈయాయెడన్‌ - అన్న పోతనామాత్యుని భాగవత పద్యాన్ని తలపించేలా అక్కడ, చెట్టంత దేవుడు చెట్టుతొర్రలో వెలిశాడు. సాధారణంగా శ్రీనివాసుడంటే ఏడుకొండలే గుర్తుకొస్తాయి, ఆనందనిలయమే హృదయనేత్రాల ముందు సాక్షాత్కరిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో...ప్రాణహిత తీరంలో ప్రాచీన వృక్షాన్నే ఆనందనిలయంగా మార్చుకుని... వేంకటేశ్వరుడు ఇరుదేవేరులతో కొలువుదీరాడు. ఆ ఐతిహ్యమూ ఆశ్చర్యకరమే. రెండొందల యాభై సంవత్సరాల క్రితం, ప్రాణహిత నదికి భారీగా వరదలొచ్చాయి. అదో జల ప్రళయం! పంటలు మునిగాయి. పల్లెలు కొట్టుకుపోయాయి. అపార జన నష్టం జరిగింది. రావె ఈశ్వర, కావవె వరద, సంరక్షింపు భద్రాత్మకా... అని గజేంద్రుడు వేడుకున్నట్టుగానే ఆ పరిసర ప్రాంతాల ప్రజలూ శ్రీహరిని మొక్కుకున్నారు. స్వామి కరుణించాడు. వరదలు తగ్గుముఖం పట్టాయి. ఎక్కడి నుంచో వేంకటేశ్వరస్వామి, అలమేలు మంగ, పద్మావతి అమ్మవార్ల అపురూప ప్రతిమలు ఆ ప్రవాహంలో కొట్టుకువచ్చాయి. మహారాష్ట్రలోని సిరొంచా తాలూకాలో ఉన్న వెంకటాపూర్‌ సమీపంలోని వాగుఒడ్డు కాల్వ పక్కన...మద్దిపాలచెట్టు తొర్రలో అవి ఆగిపోయాయి. కొంతకాలానికి అటుగా వెళ్తున్న ఓ భక్తుడికి ఆ ప్రతిమలు కనిపించాయి. అడుగడుగు దండాలవాడు... అడుగు దూరంలోనే కనిపిస్తే ఆశ్చర్యంగా అనిపించదూ! భక్తిపరవశంతో పల్లె వైపు పరుగులు తీశాడు. ఆ రాత్రికి, గ్రామ ప్రజలకు స్వామి కలలో కనిపించి, తాను ఫలానాచోట వెలసినట్టు చెప్పాడు. తనకు నిత్య పూజలు చేయమని ఆదేశించాడు. క్రమంగా ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతమైంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచీ భక్తులు తరలివస్తారు. ఆ పల్లెకు వేంకటేశ్వరుడు కొలువైన కారణంగానే వెంకటాపూర్‌ అన్న పేరు వచ్చింది. పక్కనే ప్రవాహం ఉండటంతో, ఆ ప్రాంత మాండలికంలో కాలువల్ని ‘తోగు’ అని వ్యవహరిస్తుండటంతో తోగు వేంకటేశ్వరాలయం అన్న పేరు స్థిరపడింది.
ఎన్నో పోలికలు..
వేంకటాచలానికీ వెంకటాపురానికీ చాలా పోలికలున్నాయి. అక్కడ శ్రీనివాసుడు పుట్టలో కనిపించాడు, ఇక్కడేమో చెట్టు తొర్రలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడా ఇద్దరమ్మలు, ఇక్కడా ఇద్దరమ్మలు! ఇక్కడ ఉన్నట్టే, పూర్వం తిరుమలలోనూ ఓ పెద్ద చెట్టు ఉండేదట. ఆ ప్రస్తావన అన్నమాచార్యుల కీర్తనల్లోనూ కనిపిస్తుంది. తిరుమలగిరి తీర్థాలకూ ఔషధ మొక్కలకూ నెలవైనట్టే... ఈ ప్రాంతమూ అటవీ సంపదకు నిలయం! ఆలయం చుట్టూ వందల ఏళ్లనాటి భారీ వృక్షాలు విస్తరించి ఉన్నాయి. వృక్షం మధ్యలో నుంచే ఆలయాన్ని నిర్మించారు. ఏడుకొండల మీదున్న నారద, తుంబుర తీర్థాల్ని తలపించేలా... గుట్టపై నుంచి అన్ని కాలాల్లోనూ నీరు పారుతూనే ఉంటుంది. భక్తులు దైవదర్శనానికి వెళ్తున్నప్పుడు ప్రవాహం తక్కువగా ఉంటుందనీ, తిరుగు ప్రయాణంలో ఆ ఉద్ధృతి పెరుగుతుందనీ భక్తుల విశ్వాసం. అక్కడికి చేరుకునే యాత్రికులు ఆ నీటిలోనే పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడికి పూజలు చేస్తారు. ఆపదమొక్కులవాడికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఇక్కడా ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో... వేంకటేశ్వరుడిని దర్శించుకోడానికి ముక్కోటి దేవతలూ తరలివస్తారని ఓ నమ్మకం. తిరుమలగిరిలో ‘కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే...’ అంటూ వేదపండితులు సుప్రభాతాన్ని ఆలపించే సమయానికే, ఇక్కడా పూజలు మొదలవుతాయి.
అలమేలు మంగ, పద్మావతి, వేంకటేశ్వరస్వామి విగ్రహాలతో పాటూ... చూడముచ్చటైన వినాయక ప్రతిమ, నాగేంద్రుడి పడగ కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. ఆ మూర్తులూ పూజలు అందుకుంటున్నాయి. ఆలయానికి దగ్గర్లోని అటవీప్రాంతంలో ఏడుగుండాల పేరుతో పవిత్ర తీర్థాలున్నాయి. ఒక గుండం వరకూ వెళ్లవచ్చు. ఇక్కడే భక్తులు స్నానాలు చేస్తారు. ఈ గుండానికో ప్రత్యేకత ఉంది. ఎదురుగా నిలబడి చప్పట్లు కొడితే నీటి ప్రవాహం పెరుగుతుందంటారు. మిగతా గుండాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వెంకటాపూర్‌లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దహెగాం మండల ప్రజలు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తారు. మహారాష్ట్ర అధికారులు స్వామివారికి సకల లాంఛనాలూ సమర్పిస్తారు.ఇలా వెళ్లాలి...
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో... ప్రాణహిత నదిని దాటి కాలినడకన వెళ్లాలి. కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మంచిర్యాల దాకా రావడానికి రైలు, బస్సు మార్గాలున్నాయి. అక్కడినుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో... వేమనపల్లి మండల కేంద్రం ఉంది. అక్కడి నుంచి కళ్లంపల్లి, రావులపల్లి మీదుగా ఇంకో పదిహేను కిలోమీటర్లు వెళ్తే వెంకటాపూర్‌ గ్రామం కనిపిస్తుంది. భక్తుల రద్దీ పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడో అతిథి గృహాన్ని నిర్మించింది.
- కాయల పూర్ణచందర్‌,
ఈనాడు, ఆదిలాబాద్‌ డెస్క్‌


--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list