MohanPublications Print Books Online store clik Here Devullu.com

అందుకే అతడు సూపర్‌స్టార్‌

అందుకే అతడు సూపర్‌స్టార్‌ 



++++++++ అందుకే అతడు సూపర్‌స్టార్‌ !+++++
‘కబాలి’ పోస్టర్‌లో రజనీకాంత్‌ సూట్లూ, బూట్లూ, కార్లూ చూసిన వాళ్లెవరికైనా ‘సూపర్‌స్టార్‌ అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తుంది. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగానూ రజనీకి పేరుంది. కానీ ఆ దర్జాలూ, విలాసాలూ సినిమాలకే పరిమితం. నిజజీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటాడని అభిమానులందరికీ తెలుసు. కానీ అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే.
బిచ్చగాడు అనుకొని
ఓసారి బెంగళూరులోని ఓ గుడిలో గట్టు మీద రజనీ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అతడి ఆహార్యాన్ని చూసి బిక్షగాడు అనుకొని ఓ మహిళ పది రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. కాసేపటి తరవాత రజనీకాంత్‌ బయటికి వచ్చి కారు ఎక్కుతున్నప్పుడు ఆమె గుర్తుపట్టి దగ్గరికొచ్చి క్షమించమని అడిగిందట. ‘స్టార్‌డమ్‌, మేకప్‌ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తుచేస్తూనే ఉంటుంది. అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను’ అంటాడు రజనీ.
నేలమీద పడక
‘దళపతి’ సినిమా షూటింగ్‌ సమయంలో అరవింద్‌ స్వామి తెలీక ఓ రోజు రజనీకాంత్‌ గదికి వెళ్లాడు. అప్పటికే అందులో ఏసీ ఆన్‌లో ఉండీ, మంచం పూలపాన్పులా హాయిగా అనిపించడంతో తెలీకుండానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించాడు. అప్పటికి అరవింద్‌స్వామి అనామకుడే. మరోపక్క రజనీ అప్పటికే సూపర్‌స్టార్‌. అందుకే అరవింద్‌ స్వామి కంగారుగా బయటికి వెళ్లి యూనిట్‌ సభ్యులను విషయం ఏంటని ఆరాతీస్తే... ముందురోజు రాత్రి షూటింగ్‌ అయ్యాక గదికి వచ్చిన రజనీ, తన మంచం మీద నిద్రపోతున్న అరవింద్‌ స్వామిని చూసి అతన్ని లేపొద్దని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు చెప్పి అక్కడే నేల మీద పడుకున్నాడట.
రంగు వేయడు
సినిమాల్లో ఎంత స్టయిల్‌గా ఉన్నా బయట మాత్రం ధోతీ, కుర్తా, ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పుల్లోనే కనిపిస్తాడు రజనీ. మేకప్‌, నెరిసిన వెంట్రుకలకు రంగు వేసుకోవడానికి అతను ఇష్టపడడు. ‘అమ్మ పిల్లలకి మంచి బట్టలు తొడిగి, అందంగా తయారు చేసి చూసుకుని మురిసిపోతుంది. అలానే అభిమానులు కూడా నన్ను అందంగా రకరకాల గెటప్‌లలో చూడాలనుకుంటారు. వాళ్లకోసమే సినిమాల్లో అలా కనిపిస్తా. బయట నేను నాలానే ఉంటా’ అంటూ తన ఆహార్యం వెనకున్న ఆంతర్యాన్ని చెబుతాడు రజనీ.
థాంక్యూ ఐశ్వర్యా!
‘రోబో’ ఆడియో విడుదల వేడుకలో రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘మొన్నీమధ్య బెంగళూరులోని మా అన్నయ్య ఇంటికెళ్లా. నన్ను చూడ్డానికి పక్కింట్లో ఉండే ఓ రాజస్థానీ పెద్దాయన వచ్చాడు. నేనింకా సినిమాల్లో నటిస్తున్నానా అని అడిగాడు. ఒక సినిమా చేస్తున్నా... ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌ అని చెప్పా. ‘ఓహ్‌... చాలా అందమైన అమ్మాయి, బాగా నటిస్తుంది, వేరీ గుడ్‌. మరి హీరో ఎవరు?’ అని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేనే హీరోనని చెప్పేసరికి అతనికి నోట మాటరాలేదు. బయటివాళ్లకు హీరోలా కనిపించని నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌ ఐశ్వర్యా’ అంటూ చాలా నిరాడంబరంగా, నిజాయతీగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
బీఎండబ్ల్యుకీ నో...
రా.వన్‌లో అతిథి పాత్రలో కనిపించినందుకు షారుక్‌ఖాన్‌, రజనీకి బీఎండబ్ల్యు 7 సిరీస్‌ కారును కానుకగా ఇవ్వజూపాడు. కానీ తాను లగ్జరీ కార్లను ఉపయోగించననీ, అనవసరంగా దాన్ని షెడ్‌లో ఉంచడం ఇష్టంలేదనీ చెప్పి ఆ కానుకను రజనీ తిరస్కరించాడు. ఇప్పటికీ షూటింగులకు రావడానికి మిగతా నటులకు ఏ కారు పంపిస్తారో అదే పంపించమని నిర్మాతలను అడుగుతాడాయన.
నమ్మినవాళ్ల కోసం...
ఒకప్పుడు రజనీకి సహాయకుడిగా పనిచేసిన జయరామన్‌ నిర్మాతగా మారి ఓ చిన్న సినిమా తీశాడు. అతడిని ప్రోత్సహించేందుకు స్వహస్తాలతో దాదాపు వంద పోస్టర్లపైన సంతకం పెట్టాడు రజనీ. ‘బాబా’ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆ పరాజయాన్ని తన భుజాలమీద వేసుకొని, దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఇంటికి పిలిచి మరీ సొంత డబ్బుని తిరిగిచ్చి ఓ కొత్త సంస్కృతికి ప్రాణం పోసిందీ సూపర్‌స్టార్‌ రజనీనే.
వేడుకలకు దూరం
ఒకప్పుడు రజనీ చెన్నైలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవాడు. దాదాపు పాతికేళ్ల క్రితం ఆ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు చనిపోయారు. అప్పట్నుంచీ అపరాథ భావంతో చెన్నైలో పుట్టినరోజును జరుపుకోవడం మానేశాడు.
శత్రువులు ఉండరు
1996 ఎన్నికల సమయంలో రజనీ ఓపార్టీకి మద్దతు తెలిపినప్పుడు, మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ అతణ్ణి కించపరుస్తూ మాట్లాడింది. దాంతో ఎన్నికల తరవాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రజనీ, స్వయంగా కలగజేసుకుని తన ‘అరుణాచలం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి, తనకు శత్రువులు ఎవరూ ఉండరని చెప్పాడు.
ప్రచారానికి దూరం
రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ‘త్రీ’ సినిమా తీసినప్పుడూ, చిన్నమ్మాయి సౌందర్య ‘కోచ్చడయాన్‌’ తీసినప్పుడూ రజనీ ప్రత్యేకంగా వాటికోసం ప్రచారం చేయలేదు. ‘వాళ్లకు సినిమా తీయడం తెలిసినప్పుడు దాన్ని మార్కెట్‌ చేసుకోవడం కూడా తెలిసే ఉంటుంది, మధ్యలో నా ప్రమేయం ఎందుకు’ అన్నది అతడి మాట.
ఆస్తి అంతా పేదలకే
తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన ‘రాఘవేంద్ర పబ్లిక్‌ చారిటీ ట్రస్టు’కే చెందుతుందని రజనీ గతంలో బహిరంగ సభలో ప్రకటించారు. ‘రజనీకాంత్‌ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే సంగతే అందరికీ తెలుసు. కానీ ఆయన సంపాదనలో యాభై శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారన్న విషయం చాలామందికి తెలీదు’ అని రజనీకాంత్‌ జీవిత చరిత్రలో దాని రచయిత నమన్‌ రామచంద్రన్‌ ప్రస్తావించారు.
పాఠాల్లో చోటు
సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్‌. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌’ పేరుతో సీబీఎస్‌ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఓ పాఠం.
అందుకే చంద్రముఖి!
తమిళనాట ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ ఆఖరి సినిమా ‘నరసింహ’. ఆయనంటే రజనీకి చాలా గౌరవం. శివాజీ మరణం తరవాత ఆయన కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు శివాజీ కొడుకు రామ్‌ కుమార్‌కి రజనీ ఫోన్‌ చేసి ‘శివాజీ ప్రొడక్షన్స్‌’ మీద మళ్లీ సినిమా తీయమనీ, తాను హీరోగా నటిస్తాననీ చెప్పాడు. అలా చేసిన ‘చంద్రముఖి’ భారీ విజయాన్నే సొంతం చేసుకొని, శివాజీ ప్రొడక్షన్స్‌ని మళ్లీ గాడిలో పెట్టింది.
మూలాల్ని మరవకుండా...
తాను ఉపయోగించని వస్తువులకు ప్రచారం చేయడం ఇష్టంలేక రజనీ ఇప్పటివరకూ ఒక్క ప్రకటనలోనూ నటించలేదు. షూటింగులకు ఆలస్యంగా వెళ్లిన సందర్భాలూ, కింది వాళ్లను తక్కువగా చూసిన దాఖలాలూ లేవు. ‘అద్భుతాల్ని నేను నమ్ముతా. ఓ బస్‌ కండక్టర్‌ సూపర్‌స్టార్‌లా మారడం అద్భుతమే కదా’ అంటాడు రజనీ. మూలాల్ని మరచిపోకుండా సాగిన ఆ ప్రయాణమే రజనీని అన్నివిధాలా సూపర్‌స్టార్‌ని చేసిందంటారు అభిమానులు.
హిమాలయాల్లో ధ్యానం
తన ప్రతి సినిమా విడుదలయ్యాక ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి హిమాలయాలకు వెళ్లి కొన్నాళ్లు ధ్యానం చేసుకొని రావడం రజనీకి అలవాటు. ఆ సమయంలో లుంగీలూ, పంచలూ, కుర్తాలూ తప్ప మరే ఇతర సామగ్రినీ వెంట తీసుకెళ్లడు.
ఆ కుర్రాడి కోసం...
కార్తీక్‌ అనే క్యాన్సర్‌ బాధిత కుర్రాడికి ఒక్కసారైనా సూపర్‌స్టార్‌ని చూడాలన్న కోరికుండేది. విషయం తెలుసుకున్న రజనీ ఆస్పత్రికి బయల్దేరాడట. కానీ ఆ కుర్రాడి తండ్రి ‘భక్తులే గుడికి రావాలి కానీ...’ అంటూ రజనీని రావొద్దని వారించి కొడుకునే అతడి ఇంటికి తీసుకెళ్లాడు. గేటు వరకూ వెళ్లి కార్తీక్‌ని ఆహ్వానించిన రజనీ, అతడితో గంటపాటు గడిపి, తాను సంతకం పెట్టిన ఫొటోను బహుమతిగా ఇచ్చి పంపించాడు. ‘ఆయనతో ఫొటో దిగితే చాలనుకున్నా, కానీ నాకోసం ఆస్పత్రికి వస్తాననడం, ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అంతా కలలా ఉంది’ అని మురిసిపోయాడు కార్తీక్‌.
చెక్కుచెదరని స్నేహం
బస్‌కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో అతని స్నేహితుడూ, డ్రైవర్‌ రాజ్‌ బహదూర్‌, రజనీని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌üలో చేరమని ప్రోత్సహించాడు. తరవాత అతను సూపర్‌స్టార్‌ అయినా ఆ స్నేహం చెక్కుచెదరలేదు. ఏడాదికోసారి రజనీకి బెంగళూరులోని స్నేహితుడి ఇంటికెళ్లి ఐదారు రోజులు గడిపి రావడం అలవాటు. ‘రజనీ చెప్పాపెట్టకుండా వస్తాడు. అందరితో కలిసి భోజనం చేస్తాడు. తాను తనలా ఉండగలిగే ఒకేఒక్క చోటు మా ఇల్లే అంటుంటాడు’ అని స్నేహితుడి స్వభావాన్ని గుర్తు చేసుకుంటారు బహదూర్‌.



--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list