MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుమార షష్ఠి, Kumara Sasthi

కుమార షష్ఠి


+++++++++++కుమార షష్ఠి+++++++++
స్కందుడు దేవసేనాధిపత్యం పొందిన షష్ఠిని ‘కుమార షష్ఠి’గా వ్యవహరిస్తున్నారు. శివ కుమారుడైన కుమారస్వామికే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యుడని నామాంతరాలున్నాయి. ఆ స్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు చెబుతున్నాయి.
‘బ్రహ్మ వైవర్తం’ ప్రకారం- విష్ణువు దేవసభలో ఉండగా పార్వతీదేవి వెళ్లింది. నర్మదా నదీతీరంలో పరమశివుడితో తాను విహరించే సమయంలో కొందరు దేవతలు ఎదురై తమ ఏకాంతానికి అంతరాయం కలిగించారని తెలియజేసింది. ఆ తరవాత శివతేజం భూమ్మీద జారిపడగా ఎవరో అపహరించారని, దేవతలందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఇక అన్వేషించాలని ప్రార్థించింది.
శివుడి తేజాన్ని భరించలేని భూదేవి దాన్ని అగ్నిలో విడిచిపెట్టిందని, అగ్ని సైతం భరించలేని స్థితిలో రెల్లు పొదల్లో జారవిడిచాడని దేవతల వల్ల తెలిసింది. శర వనం అంటే రెల్లు పొదలు. అక్కడ జన్మించడం వల్ల స్వామి శరవణుడయ్యాడు.
‘కృత్తికలు’గా పేరున్న ఆరుగురు మునిపత్నులు ఆ బాలుణ్ని పెంచారని, అందువల్ల కార్తికేయుడయ్యాడని ‘బ్రహ్మాండ పురాణం’ పేర్కొంటోంది.
మరో గాథ ప్రకారం- భర్తలను కొలుస్తున్న మునిపత్నులను చూసి అగ్ని ఓ దశలో చలించాడు. అది తెలిసిన అతడి భార్య స్వాహాదేవి ఒక్కొక్క రుషి పత్ని రూపంలో ఒక్కోమారు వెళ్లి అగ్నిని కలిసింది. ఆ కారణంగా పుట్టిన కుమారస్వామికి ఆరు ముఖాలు ఏర్పడి ‘షణ్ముఖి’ అయ్యాడు.
కుండలినీ శక్తి జాగృతమై, షట్చక్రాల నుంచి పైకి పాకి, అగ్నితత్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నం కావడం వల్ల ఓ విశిష్ట శక్తి ఆవిర్భవించింది. దాని ఫలితమే ‘షణ్ముఖుడు’ అని వేరొక పురాణగాథ ప్రచారంలో ఉంది.
కాలస్వరూపుడైన ఈ స్వామిని ‘ఆరు రుతువులు ఆరు ముఖాలుగా కలిగిన అభయ స్వరూపుడు’గానూ అర్చిస్తారు.
తారకాసుర సంహార సందర్భంలో, కుమారస్వామి దేవసేనాధిపతి అయ్యాడు. ఆ తరవాత శూర పద్మాసురుడనే రాక్షసుణ్ని వధించాడు.
ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి కుమారస్వామికి పరిణయం చేశాడంటారు. శివముని కుమార్తె వల్లీదేవి ఆ స్వామి భార్య అని కూడా పురాణాలు వేరువేరుగా చెబుతున్నాయి.
సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. అది ఓంకార రూపానికి ప్రతీక.
స్వామి ప్రణవ స్వరూపుడు. కోడిపుంజు ఆయన ధ్వజంమీద కనిపిస్తుంది. ‘కో’ అనే ధ్వనిని ప్రణవ సూచకంగా భావిస్తారు. జ్ఞాన భానూదయానికి ఆధ్యాత్మిక సంకేతమది.
కుమారస్వామి చేతిలోని శక్తి- ఇచ్ఛాజ్ఞాన, క్రియాశక్తుల రూపం.
ఆషాఢ శుద్ధ షష్ఠినాడు స్కంద వ్రతాచరణాన్ని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తమిళనాట కుమారస్వామికి ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట వద్ద గల కుమారారామంలోని శివలింగాన్ని కుమారస్వామే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.
కుజ దోష నివారణకు, భక్తులు సుబ్రహ్మణ్య స్వామి పేరుతో కుమారస్వామిని అర్చిస్తారు. సంతాన భాగ్యం కలిగిస్తాడన్న విశ్వాసంతోనూ భక్తజనులు ఆయనను పూజిస్తుంటారు. - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list