MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాలమా... నీకు వందనం, Time

కాలమా... నీకు వందనం, 
Time 
కాలమా... నీకు వందనం!
సృష్టి అంతా కాలం అధీనంలోనే ఉంటుంది. దాని ప్రేరణతోనే దేవతలు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటారని అధర్వణ వేదంలోని కాలసూక్తం చెబుతోంది.
కాలానికి దైవం కంటే గొప్ప శక్తి ఉంది కాబట్టి, దైవాన్ని చూసినంత పవిత్రంగానూ దాన్ని చూడాలని రుషివచనం. కాలాన్ని వృథా చేసేవాడు జీవితం విలువను తెలుసుకోలేడు, సద్వినియోగపరచేవాడు కచ్చితంగా ప్రగతి సాధిస్తాడు.
కాల స్వరూపం కాని విషయం సృష్టిలో ఏదీ లేదు. సృష్టి జరిగేది, ఎదిగేది, నాశనం అయ్యేది దాని ప్రభావం వల్లే. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు అనేక సందర్భాల్లో ఇతర దేవతలూ కాల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కాల ప్రేరణ వల్లే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ప్రకృతి సైతం దానికి అనుగుణంగా మారుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. అందుకే- కాలాయ తస్మై నమో నమః (కాలానికి నమస్కారం) అంటోంది అధర్వణ వేదం.
జీవితాలు స్థిరపడటానికైనా, గతి తప్పడానికైనా కాలమే కారణమవుతుంది.దాని విలువ ఎంత అని ప్రశ్నిస్తే ఒక్కొక్కరూ ఒక్కోలాగా చెబుతారు. క్షణం విలువ తెలియాలంటే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నవాడిని అడుగు అంటాడో మానసిక శాస్త్రవేత్త. చావుకు, బతుక్కి మధ్య ఎడం ఎంతో ఆ వ్యక్తే కచ్చితంగా చెప్పగలడట.
నిమిషం విలువ తెలియాలంటే- చూస్తూండగానే రైలు తప్పిపోయినవాడిని అడగాలి. (ఆ రైలు అందుకుని చేసే ప్రయాణంమీదే అతడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. రైలును అందుకోవడం ఒక్క నిమిషం ఆలస్యమైతే, వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులవుతాయి)
గంట విలువ తెలియాలంటే ఎవరి కోసమో నిరీక్షించేవారిని, రోజు విలువ తెలియాలంటే ఆకలితో గడిపినవాడిని అడగాలంటారు.
వారం విలువ తెలియాలంటే బంధువుల ఇంట్లో గడిపినవాళ్ళను (ఒకటి రెండు రోజులైతే గౌరవంగా చూస్తారు. ఆపైన ఆత్మీయుడినైనా చులకన చేస్తారు) అడగాలట. నెల విలువ తెలియాలంటే జీతం అందుకున్న ఉద్యోగిని, సంవత్సరం విలువ తెలియాలంటే- కష్టపడి చదివినా ఏవో కారణాల వల్ల పరీక్ష తప్పిన విద్యార్థిని అడిగితే కచ్చితంగా చెబుతారంటారు అనుభవజ్ఞులు.
సంవత్సరానికి మూడు రుతువులు. ఒక్కొక్క రుతువూ నాలుగేసి నెలలు. వర్ష రుతువు నాలుగు నెలలూ కురవకపోతే, మిగిలిన ఎనిమిది నెలలూ శూన్యమవుతాయి. అందువల్ల వర్షానికి గౌరవ సూచకంగా, సంవత్సరాన్ని ‘వర్షం’ అని పిలుస్తారు.
మంచి కాలం, చెడ్డకాలం అని రెండు రకాలుండవు. వినియోగించుకునే నేర్పు, దక్షత మీదే అవి ఆధారపడి ఉంటా యన్న నెపోలియన్‌ మాట అక్షరసత్యం. గతం, భవిష్యత్తుల కంటే వర్తమానమే సత్యమైనది. దాని విలువ చాలా గొప్పది. కాబట్టి రేపు చెయ్యాలనుకున్న పని ఈరోజు చెయ్యి. ఈరోజు చెయ్యాలనుకున్న పని ఇప్పుడే చెయ్యి- అనేవారు గాంధీజీ.
కాలానికి ఎన్నో అద్భుత శక్తులున్నాయి. అది ఎన్నింటినో సృష్టిస్తుంది. కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. కడకు అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది. మనసుకు పడిన గాయాలను మాన్పుతుంది. భయంకరమైన సంఘటనల్ని, బాధల్ని మరిచిపోయేట్టు చేస్తుంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది.
కాలానికి దయాదాక్షిణ్యాలు, రాగద్వేషాలు, స్వ పర భేదాలు ఉండవు. అది ఎప్పుడూ ఎవరి కోసమూ ఆగదు. ఎవరేమన్నా, అనుకున్నా తన పని తాను చేసుకుపోతుంది.
కాలానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ సద్వినియోగపరచుకునేవాడు చరిత్ర సృష్టించగలుగుతాడు. లేకపోతే కాలగర్భంలో కలిసిపోయి చరిత్రహీనుడవుతాడు!
- అయ్యగారి శ్రీనివాసరావు

LIKE US TO FOLLOW:---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list