MohanPublications Print Books Online store clik Here Devullu.com

విదుర నీతి, Vidhura Neethi

విదుర నీతి
 Vidhura Neethi


++++++++++విదుర నీతి++++++++
మహాభారతంలో విదురుడు మహానీతిమంతుడు. యమధర్మరాజు అంశలో ఆయన- వేదవ్యాసుడికి, కురురాజు అంతఃపురంలోని పరిశ్రమి అనే దాసికి జన్మించాడు. భారతంలో కురువంశీయుల జన్మ వివరాలు వింతగా అగుపిస్తాయి. విదురుడు ధృతరాష్ట్రుడికి సవతి తమ్ముడు. ఇతడికి కురు వంశ పితామహుడైన దేవవ్రతుడు (భీష్ముడు) విద్యాబుద్ధులు నేర్పించాడు.
పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్షసాక్షి. అన్యాయం సహించని నైజం ఆయనది. ఎవరితోనూ శత్రుత్వం ఉండరాదన్నది ఆయన నీతి. వైరం లేకుండా జీవించడం ఒక సాధన. విదురుడికి, అక్రూరుడికి, ధర్మరాజుకు శత్రువులే లేరు.
విదురుడు సుయోధనుడి దుష్టత్వాన్ని సహిస్తూనే మిత్రుడిగా జీవించాడు. శిష్టుడైన శ్రీకృష్ణుడితోనూ అంతే స్నేహం ప్రదర్శించాడు. పాండవ పక్షపాతి అని భావించిన కౌరవులు సైతం విదురుణ్ని భక్తిపూర్వకంగా ‘విదుర దేవా!’ అని సంబోధించేవారు.
ఆయన మహావీరుడు. యుద్ధవిద్యలన్నీ తెలుసు. మహారథి అయినా భారతయుద్ధంలో ఎవరి పక్షమూ వహించలేదు. ధృతరాష్ట్రుడు ఆయన పట్ల అసహనం ప్రదర్శించేవాడు. కొన్నిసార్లు అది క్రోధంగా మారేది. విదురుడు మాత్రం ధృతరాష్ట్రుడితో, ఆయన నూరుగురు కొడుకులతో స్నేహంగానే మెలిగేవాడు. ఎప్పుడూ ధర్మాన్నే అనుసరించాడు. తామరాకుపై నీటిబొట్టులా ఉండేవాడు. ఎవరి మనసునూ నొప్పించేవాడు కాదు.
జీవిస్తే విదురుడిలా, తనువు చాలిస్తే సరయూ నది నుంచి నేరుగా వైకుంఠం చేరిన శ్రీరాముడిలా ఉండాలన్నది అక్రూరుడి మాట. బలవంతులతో విరోధం మంచిది కాదని విదురుడు చాలాసార్లు దుర్యోధనుడికి హితవు పలికాడు. ఆయన మంచిని తాను సాధన చేసి ఇతరులకు చెప్పిన మాన్యుడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు మనిషిలోని తాపత్రయాలకు గుర్తులని పలు మార్లు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. శకుని వల్ల మాయాజూదంలో ఓడిన ధర్మరాజుకు- సాత్విక స్వభావం, నిశ్చల ధర్మస్థితి గల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడంటూ నిష్ఠుర సత్యాలు బోధించాడు. కష్టాల్లో ధైర్యంగా ఉన్న వ్యక్తినే విజయం వరిస్తుందని విదురుడు చెప్పిన మాటలు- ధర్మరాజుకు సాంత్వన కలిగించాయి.
ఆదరిస్తే ఆనందం, అనాదరణకు గురైతే కోపం పొందేవారు ఏమీ సాధించలేరు. అవమానాలను వ్యక్తం చేయకుండా, ఆ స్థితినే విజయానికి మెట్టుగా భావించడం ద్వారా శత్రువును జయించాలన్నది విదుర బోధ. శకునికి ఈ విషయాన్ని ఆయనే రహస్యంగా బోధించాడని రాజాజీ ‘మహాభారతం’ వెల్లడిస్తోంది.
తీవ్రమైన మనోరథం కలిగినవారు మూర్ఖులేనని ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సందర్భంలో విదురుడు దుశ్శాసనుడికి చెబుతాడు. దుశ్శాసనుడు మూర్ఖత్వం చూపించి, దుర్యోధనుడి ఆజ్ఞలను అనాలోచితంగా పాటించి పతనమయ్యాడు.
శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినప్పుడు, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలు అమూల్యమైనవి. ‘మహావీరుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పుడైనా గురి తప్పడం వల్ల శత్రువును బాధించకపోవచ్చు... కానీ, మహానుభావుడి పలుకులు గురి తప్పవు. జీవరాశులన్నింటితో పాటు భూమినీ అవి నాశనం చేయగలవు’ అన్నది ఆయన హితోక్తి.
నూరుగురు కౌరవుల దురాగతాలను ధర్మరాజు క్షమించాడు. ఆ వ్యక్తిత్వాన్నే విదురుడు ఉదాహరిస్తూ- ‘సుయోధనా! క్షమను అసమర్థతగా భావించకూడదు. క్షమించడం కంటే బలమైన అస్త్రం లేదు. సమర్థుడి క్షమ- సమయం ఆసన్నమైనప్పుడు భూమిని సైతం నశింపజేయగల శక్తిగా పరిణమిస్తుంది. ధర్మరాజుతో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరం’ అని హెచ్చరించాడు.
కుటుంబంలో ఎవరూ లేని వ్యక్తిని, విపత్తుల్లో పడిన స్నేహితుణ్ని, దారిద్య్రం వల్ల ఆకలితో అలమటిస్తున్న శత్రువును, సంతానం లేని సోదరిని అక్కున చేర్చుకొని ఆశ్రయమివ్వాలని విదురుడు చెప్పేవాడు. ఆయన నీతిసూత్రాలు ఎవరికైనా ఆచరణీయాలే!
- అప్పరుసు రమాకాంతరావు
LIKE US TO FOLLOW:---


1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list