స్వరాష్ట్రం తెచ్చిన సంబురాల పాటలు!
తెలంగాణతో పాటకు వందలయేండ్ల సోపతి! చెమట చుక్కలే చరణాలై.. పడిలేచిన బతుకులే పల్లవి గీతాలై.. రాలిన కన్నీళ్లే రాగం తానమై మేల్కొలిపింది మన పాట! నాడు మన గోసను తెలిపి.. తిరుగుబాటు బావుటాను ఎగిరేసి కల సాకారం కోసం కదం తొక్కితే..
నేడు అదే పాట రూటు మార్చి స్వరాష్ట్ర సంబురాలు జరుపుకుంటున్నది! కోట్లమంది తెలంగాణ జనులచే జజ్జనకరి జనారే అంటూ రేలపూతల మోతలను మోగిస్తున్నది! తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాల జాతరను చిన్నాపెద్దా అంతా వైభవంగా జరుపుకొన్నారు. తీన్మార్ చప్పుళ్లతో తీరొక్క రంగులతో అందంగా ముస్తాబై అంబరాన్ని అంటేలా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నాం. సంబురమంటే ఇలా ఉండాలి అనిపించేలా సందడి చేశాం. ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి.. వైభవ రీతులను సంతరించుకోవడానికి తెలంగాణ పాట కూడా ఓ కారణం. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తే.. జన సమూహంలో జయహో తెలంగాణ అని వినిపిస్తుంది!
నెల రోజులాయె. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సంబురాల్లో జనాలంతా మునిగిపోయి. ఒక్కొక్కరివి ఒక్కో ఏర్పాట్లు. ప్రణాళికలు, వ్యూహాలు. కల సాకారం చేసుకోవడంలో పోటీ పడుతాం, అభివృద్ధిలో పోటీ పడుతాం, సంబురాలు జరుపుకోవడంలో కూడా మేం పోటీ పడుతాం అనే రీతిలో తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ రూపొందించడంలో మాధ్యమాలూ పోటీ పడ్డాయి. ఈ నెల రోజులు కష్టపడి మంచి మంచి అచ్చమైన తెలంగాణ పాటలను అమ్మకు ప్రేమతో అందించారు. ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సామాజిక మాధ్యమ సంస్థలు ఫార్మేషన్ డే సాంగ్స్ కోసం పోటీ పడ్డాయి. వీటితో పాటు వినోదాత్మక మాధ్యమాలూ వీడియోలను రూపొందించి రాష్ట్ర అవతరణ సంబురాలకు ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చాయి.
జయహో తెలంగాణ..ఎవరి వాట్సప్, ఫేస్‌బుక్ చూసినా తెలంగాణ అవతరణ దినోత్సవ పాటలే పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ మట్టి పరిమళాలే వెదజల్లినట్లుగా ఉంటున్నది ఒక్కో పాట. ఒకరు.. ఓరుగల్లు కోటనడుగు. కోటలోని కత్తినడుగు చెపుతాయిలే.. ఈ నేల ఘనతనే.. తెలంగాణ చరితనే అని తెలంగాణ గొప్పదనాన్ని వినిపిస్తే.. మరొకరు మాగాణి మట్టి మెరుపు తెలంగాణ.. బతుకమ్మా తంగెడు తళుకు తెలంగాణ. చనుబాల స్వచ్ఛపు తెలుపు తెలంగాణ.. బోనాల బొట్టు ఎరుపు తెలంగాణ అంటూ గత వైభవాన్ని చాటారు. ఇంకొకరు.. సుట్టు సుట్టు సుట్టు సుక్కల చూడు.. సుక్కల మధ్యన వీరుల చూడు.. వీరులు చల్లిన కాంతులు చూడో అంటూ వీర తెలంగాణ చరితను తెలిపే ప్రయత్నం చేశారు. తెలంగాణ పాటల ఊట అని వీటిద్వారా మరోసారి నిరూపించారు. తెలంగాణకు పాట పట్టం కడితే.. ఆ పాటకు ప్రజలు బ్రహ్మరథం పట్టి ఊపుతో ఉత్సవాలు జరుపుకొన్నారు.
ఫలాలు చూపే పాటలు: యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ పాటలు ముందు వరుసలో ఉన్నాయంటే వీటిని ఎంతమంది చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాటలో అన్ని అంశాలూ వచ్చేలా రూపొందించారు. గత వైభవంతో పాటు ప్రస్తుత అభివృద్ధి ఫలాల గురించి ఈ పాటల్లో పొందుపర్చారు. ఇన్నాళ్లు నీళ్ల కేడ్చాం. నిధులకేడ్చాం. ఉద్యోగం కోసం పాటలు పాడాం. ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లేందుకు పాటలను ఆప్షన్‌గా ఎంచుకున్నాం. వాటి ఫలితమే తెలంగాణ సిద్ధించినప్పుడు ఇప్పుడు ఫలాలు పొందే సమయం ఆసన్నమైనప్పుడు వాటి గురించి ఎందుకు చెప్పుకోకూడదు? తల్లి తెలంగాణ సంకెళ్ల గురించి పాటగా పాడినవాళ్లం.. ఆమె సంతోషం గురించి ఎందుకు పాడుకోవద్దు? అనే ఉద్దేశం ప్రతీ పాటలో కనిపిస్తున్నది. అందుకే వీటిని తెలంగాణ ఫలాలను ప్రతిబింబించిన పాటలుగా చెప్పవచ్చు.
శుభ తరుణం: ఒకప్పుడు.. బండెనక బండి కట్టి.. పదహార్లు బండ్లు కట్టి అని మన నిరసనను పాట రూపంలో పాడాం. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా అని మన గోస గురించి పాడుకున్నాం. జిల్ జిల్లేడమ్మా జిట్టా జిల్లేడమ్మా జిట్టా అంటూ పొమ్మంటే పోని పెత్తందార్లను పంపించేందుకు పాడాం. వాగు ఎండిపాయోరో అంటూ వనరుల లేమి గురించి పాడుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ సిద్ధించింది. జయ జయహే తెలంగాణ అంటూ మన తెలంగాణ ఖ్యాతి గురించి.. ఫలాలు సిద్ధిస్తున్న ప్రస్తుత తెలంగాణ గురించి పాటలు పాడుకుంటున్నాం. వింటున్నాం. బతుకమ్మ పాటలు, బోనాల పాటలతో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు టీవీ చానెళ్లు. వీ6 చానెల్ ఈ ట్రెండ్‌ను సెట్ చేస్తే మిగతా చానెళ్లు పాటిస్తున్నాయి. ఇప్పుడు అన్ని చానెళ్లు ప్రతీ సందర్భంలో తెలంగాణ వైభవం గురించి పాటలు తీస్తున్నాయి. పూసిన పున్నమి వెన్నెల్ల్లోనా అనే పాటతో ఈ రకమైన పాటలకు సినిమాల్లోనూ బీజం పడింది. ఇది శుభ తరుణం.
పాటల హోరు.. పదాల జోరు: తెలంగాణ వైభవాన్ని, ప్రస్తుత అభివృద్ధి తీరును కళ్లకు కట్టినట్లు చెప్తూ ప్రతీ సందర్భంలో ముందు వరుసలో నిలుస్తున్నది మైక్‌టీవీ. సంగీతం, అందమైన లొకేషన్స్‌తో పాటు అచ్చమైన తెలంగాణ పదాలను పాటల్లో చేరుస్తూ మట్టి పరిమళాలను వెదజల్లుతున్నారు. ఈసారి మైక్‌టీవీ రూపొందించిన ఫార్మేషన్ డే సాంగ్‌కు కందికొండ లిరిక్స్ అందించాడు. జంగిరెడ్డి, మంగ్లీ పాడారు. గోలుకొండ గోడనడుగు.. గోడలోని రాయినడుగు చెపుతాయిలే.. పాపన్న పోరునే.. పౌరుషపు దాడినే. ఆదిలబాదు అడవినడుగు.. కొమురంభీం సాహసమే.. మేడారం గద్దెనడుగు.. కోయజాతి తెగువనే అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్ అయింది. టీ న్యూస్ సమర్పణలో వచ్చిన జయజయహో జనని తెలంగాణమా.. జయహో రేలా దూలా తెలంగాణమా.. జయజయహో జనని తెలంగాణమా.. జగమున జానపదుల ఇలవు తెలంగాణమా కూడా దుమ్మురేపుతున్నది. మధుప్రియ పాడిన టీవీ1 వారి పాట మాగాణి మట్టి మెరుపు తెలంగాణ.. బతుకమ్మా తంగెడు తళుకు తెలంగాణ.. చనుబాల స్వచ్ఛపు తెలుపు తెలంగాణ.. బోనాల బొట్టు ఎరుపు తెలంగాణ తనదైన ముద్ర వేసుకొని ఆకట్టుకుంది. ఈ పాటను కూడా కందికొండ రాయగా, నందన్‌రాజ్ బొబ్బిలి సంగీతం అందించారు.
దాయి శ్రీశైలం
ఓరుగల్లు కోటనడుగు..
కోటలోని కత్తినడుగు చెపుతాయిలే
సాహిత్యం: కందికొండ
సంగీతం: నందన్‌రాజ్ బొబ్బిలి
గానం: జంగిరెడ్డి, మంగ్లీ
మాగాణి మట్టి మెరుపు తెలంగాణ..
బతుకమ్మా తంగెడు తళుకు తెలంగాణ..
చనుబాల స్వచ్ఛపు తెలుపు తెలంగాణ
సాహిత్యం: కందికొండ
సంగీతం: నందన్‌రాజ్ బొబ్బిలి
గానం: మధుప్రియ
టీ న్యూస్ clik image see video
జయజయహో జనని తెలంగాణమా..
జయజయహో జనని తెలంగాణమా..
జయహో రేలా దూలా తెలంగాణమా
సాహిత్యం: యాది పాత్కుల
సంగీతం: సత్యా సోమేష్
గానం: వరం, బోలె షావలి
ఉద్యమాలతో అగ్గిరవ్వలా నిత్యం రగిలిన నేల..
స్వతంత్ర కాంక్ష స్వరాష్ట్ర స్వప్నం
నిజమైన రోజు ఇయ్యాల.
లిరిక్స్: ఆనంద్ కోర్వా
మ్యూజిక్: చిన్ని కృష్ణ
సింగర్: వరం
సుట్టు సుట్టు సుట్టు సుక్కల చూడు..
సుక్కల మధ్యన వీరుల చూడు..
వీరులు చల్లిన కాంతులు చూడో
సాహిత్యం: మానుకోట ప్రసాద్
సంగీతం: బోలే
గానం: మధుప్రియ, భోలే శావాలీ
బతుకమ్మా పోరాటం బతుకుల్ల్లూ మార్చే
బోనాల దీపాంతం.. వెలుగుల్లు సల్లే
మా భూమి మాకొచ్చీ మనసెంతో మురిసే..
గానం: స్వర్ణ
రచన: కందికొండ
సంగీతం: నందన్‌రాజ్ బొబ్బిలి
ఊగింది పైరు ఉయ్యాలల్లో.. నా తెలంగాణ కౌగిళ్లలో
మ్యూజిక్, లిరిక్స్: సత్యా సాగర్ పోలం
గానం: శ్రావణ భార్గవి
అస్తిత్వం తెలంగాణ..
ఆలోచన తెలంగాణ.. ఆత్మంతా తెలంగాణ.. అనునిత్యం తెలంగాణ..
సంగీతం, గానం: వందేమాతరం శ్రీనివాసరావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ..
ఈ పుణ్యభూమిలో పుట్టిన అమరుల త్యాగాల వీణ.
లిరిక్స్: అరేపల్లి ఓదేలు
మ్యూజిక్: ప్రవీణ్ కాయితోజు
జై జయహో తెలంగాణ..
జననీ తెలంగాణ.. సిరులున్న మాగాణ..
జయహో..
గానం: తేలు విజయ,
లిరిక్స్: కర్నకంటి శ్రవణ్‌కుమార్, మ్యూజిక్: నవీన్
కాకలు తీరిన
యోధులెందరికో కన్న తల్లిరా తెలంగాణ..
వీరులెందరికో జన్మనిచ్చినా
వీరమాతరా తెలంగాణ
రచన, గానం: సాయిచంద్
ఐదు ఏండ్లు నిండి..
అభివృద్ధివైపు అడుగులేసే..
అవని ఆశ్చర్యంగా నీ వైపే తొంగి చూసేలే..
లిరిక్స్: అంజపల్లి నాగమల్లు
సింగర్: లహరి అంబటి
మ్యూజిక్: హర్ష ప్రవీణ్
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
Social Media Marketing Services Delhi