ఇక్కడ చీరకొంగే ముడుపు!
సృష్టికి మూలం శక్తి. ఆ శక్తిని ఎవరు ఆరాధించినా స్త్రీ మూర్తిగానే కొలుస్తారు. జగదాంబగా పేరుపొందిన ఆదిపరాశక్తి వివిధ నామాలతో పూజలందుకుంటోంది. వాటిలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు ప్రసిద్ధి చెందినవి. పార్వతీదేవి చౌడేశ్వరిగా పూజలందుకుంటున్న క్షేత్రం నందవరం. ఈ క్షేత్రంలో కొలువుదీరిన చౌడేశ్వరి మాత దర్శనం ఐశ్వర్య కారకంగా భావిస్తారు భక్తులు.
మనసులోని పిరికితనాన్ని పోగొట్టి ధైర్యసాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవిగా ఇక్కడ విశాలాక్షిని ఆరాధిస్తారు. తనను కొలిచే భక్తుల కోసం కదిలి వచ్చిన అమ్మవారు ఇక్కడ సువర్ణ మూర్తిగా స్వయంభువుగా వెలిసిందని స్థలపురాణం తెలియజేస్తోంది. ఆ ఆలయమే కర్నూలు జిల్లాలోని నందవరంలో ఉన్న చౌడేశ్వరీ క్షేత్రం. సాక్షాత్తూ ఆ అమ్మలగన్న అమ్మే ఇక్కడ చౌడేశ్వరిగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.
ఇదీ కథ
పూర్వం చంద్రవంశానికి చెందిన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవాళ్లు. నంద భూపాలుడు దత్తాత్రేయుడి ఉపాసకుడు. ఆయన భక్తికి మెచ్చిన దత్తాత్రేయుడు రోజూ కాశీ వెళ్లి గంగా స్నానం చేయాలనే రాజు కోర్కెను మన్నించి పావుకోళ్లను ప్రసాదిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా వాటిని ధరించి మనోవేగంతో కాశీచేరి గంగా స్నానం చేసి విశ్వనాథుడినీ, విశాలాక్షినీ దర్శించుకుని తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచాక, నంద భూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ వేకువనే ఎక్కడికో వెళ్లి వస్తుండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయం చెబుతాడు రాజు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్లమని కోరుతుంది. రాణి మాటను కాదనలేని నందభూపాలుడు ఆమెతో కలిసి కాశీ చేరుకుంటాడు. తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్లు పనిచేయవు. తన రాజ్యానికి సత్వరం చేరుకోకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో సమీపంలోని ఆలయం దగ్గరున్న బ్రాహ్మణుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి సాయమడుగుతాడు. వాళ్లు తమ తపోశక్తితో రాజుకు తిరిగి వెళ్లే మార్గాన్ని చూపిస్తారు. ప్రత్యుపకారంగా వారికే సహాయం కావల్సి వచ్చినా తప్పక చేస్తాననీ, నిస్సంకోచంగా ఏదైనా అడగవచ్చనీ చెబుతాడు. అందుకు ఆ బ్రాహ్మణులు అవసరమైనప్పుడు అడుగుతామని అంటారు. కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరవు రాగా, నందభూపాలుడిని సహాయం అడిగేందుకు కొందరు బ్రాహ్మణులు నందవరం బయలుదేరుతారు. రాజ్యానికి చేరుకున్న వారు రాజుకి తామెందుకు వచ్చారో తెలియజేస్తారు. అప్పుడు రాజు తానిచ్చిన వాగ్దానానికి రుజువేంటని అడుగుతాడు. అందుకా బ్రాహ్మణులు విశాలాక్షి అమ్మవారే అందుకు సాక్ష్యమనీ, ఆమెచేతే ఆ విషయాన్ని రుజువు చేస్తామనీ చెబుతారు. బ్రాహ్మణులు కాశీ చేరుకుని విశాలాక్షిని నందవరం రమ్మని వేడగా ‘నేను మీతో వస్తాను కానీ ఒక్క షరతు. గమ్యం చేరేవరకూ ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు’ అని చెబుతుంది. అలా కొంత దూరం వెళ్లేసరికి వెనక నుంచి ఎలాంటి అలికిడీ వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఒక బ్రాహ్మణుడు వెనక్కి తిరుగుతాడు. దీంతో అమ్మవారు అక్కడే శిలా రూపంలోకి మారిపోతుంది. విషయం తెలుసుకున్న రాజు అక్కడికి చేరుకుని, అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడనే కథ ప్రచారంలో ఉంది.
వరాలిచ్చే కలిచెట్టు
అమ్మవారి ఆలయ పరిధిలోని కలిచెట్టుకు విశేష ప్రాముఖ్యం ఉంది. సంతానం ప్రసాదించే చెట్టుగా ఈ చెట్టును పూజిస్తారు భక్తులు. సంతానం లేనివారు చీర కొంగును చించి చెట్టుకొమ్మకు కడితే సంతానం కలుగుతుందని వీరి విశ్వాసం. చౌడేశ్వరి అమ్మవారు కాశీ నుంచి నందవరం వచ్చినప్పుడు ఈ చెట్టు విశాలాక్షి చీర కొంగుకు తగులుకుని వచ్చిందని చెబుతారు. చౌడేశ్వరిని అర్చించిన తర్వాత ఈ వృక్షాన్ని కూడా తప్పక అర్చించడం అనేది పూర్వం నుంచీ వస్తున్న ఆనవాయితీ. ఆలయంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ దత్తుడు ఇచ్చిన పాదుకలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. రోజూ చౌడేశ్వరీదేవికి కుంకుమార్చనలు జరుగుతాయి. ఆషాఢ బహుళ అమావాస్య రోజున అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలతోపాటు ఉగాది వేడుకలను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు.
ఇలా చేరుకోవచ్చు...
కర్నూలు పట్టణానికి సుమారు డెబ్భై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడేశ్వరి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బనగానపల్లి, నంద్యాల వెళ్లే బస్సులో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రైలు మార్గంలో అయితే బనగానపల్లి, నంద్యాల, పాణ్యం రైల్వే స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో క్షేత్రానికి వెళ్లొచ్చు.
- వెంకట నారాయణ, కర్నూలు డెస్క్
ఫొటోలు: నగేష్
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
best seo company in ghaziabad