తలనీలాలు సమర్పించే దర్గా!
Jahangir Peer Dargah
సాధారణంగా ఏ గుడికో, ఉత్సవానికో వెళ్లినప్పుడు దేవుడికి తలనీలాలు సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ, ఒక దర్గాలో తలనీలాలు ఇస్తారని ఎప్పుడైనా విన్నారా..! ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న జహంగీర్‌పీర్ (జేపీ) దర్గా విశిష్టత ఇది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దర్గాను కేవలం ముస్లింలే కాకుండా అధిక సంఖ్యలో హిందువులూ దర్శించుకోవడం విశేషం.హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎలా గుర్తుకువస్తుందో దాని పక్కనే ఉన్న చారిత్రక మక్కా మసీదు కూడా అలానే జ్ఞప్తికి వస్తుంది. అయితే, మక్కా మసీదు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంతే చారిత్రక నేపథ్యం ఉన్న మరో ప్రదేశం జహంగీర్ పీర్ దర్గా. దీని ఏర్పాటు వెనక వేర్వేరు కథనాలు ప్రచారంలో ఉన్నా... సుమారు ఏడు వందల ఏళ్ల కిందట జరిగిన ఘటనను ప్రముఖంగా చెబుతుంటారు వక్ఫ్‌బోర్డు అధికారులూ, చరిత్రకారులూ. బాగ్దాద్‌కు చెందిన హజ్రత్ సయ్యద్ షా జహంగీర్ పీర్ బాబా, హజ్రత్ సయ్యద్ షా బుర్హనుద్దీన్ అవులియా బాబా సోదరులు మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి వివరించేందుకు ఆయన ప్రతినిధులుగా దిల్లీకి వచ్చారు. వీరిద్దరూ ప్రవక్త వంశస్థులని భక్తుల నమ్మకం. దిల్లీ నుంచి అజ్‌మేర్, ఔరంగాబాద్ మీదుగా గుల్బర్గా... అక్కడి నుంచి కొత్తూరు ప్రాంతానికి వస్తారు ఆ బాబా సోదరులు. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేదట. వీరు ఇక్కడే ఓ మర్రిచెట్టు కింద ఉంటూ జీవసమాధి అయ్యారు. తర్వాత కొన్నాళ్లకు గొర్రెల మందను మేపుతూ వచ్చిన ఒక కాపరి దారి తప్పిపోతాడు. ఎంత వెతికినా వాటి ఆచూకీ దొరకక పోవడంతో ఒక మర్రిచెట్టు కింద బాధపడుతూ కూర్చుంటాడు. అప్పుడు బాబాలు ప్రత్యక్షమై, అక్కడికి దగ్గర్లోనే గొర్రెలు ఉన్నాయని చెబుతారు. గొర్రెల మందను తోలుకుని తిరిగి చెట్టు కిందకు వచ్చేసరికి బాబాలకు బదులు రెండు సమాధులు దర్శనమిస్తాయి. వారే తనకు ప్రత్యక్షమై గొర్రెల జాడ తెలిపారని భావించిన ఆ కాపరి అప్పటి నుంచీ వాళ్లను పూజించడం మొదలుపెట్టాడట. ఆ తర్వాత కులమతాలకు అతీతంగా స్థానికులు కూడా ఈ బాబాసమాధులను కొలవడం ప్రారంభించారు.సంతానం కోసం...
దర్గాకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని ప్రతీతి. భక్తులు తమ కోర్కెలు నెరవేరిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి కుందూరు చేసి మొక్కులు తీర్చుకుంటారు. చిన్నపిల్లల తలనీలాలు తప్పక సమర్పిస్తారు. ఆనవాయితీ ప్రకారం ఇక్కడ క్షురకులుగా ఆడవాళ్లే ఉండటం విశేషం. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు ఫజర్ నమాజ్‌తో దర్గాలో ప్రార్థనలు ప్రారంభమవుతాయి. రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఇషా నమాజ్‌తో ముగుస్తాయి. బాబాలకు కుందూరుతోపాటు గోధుమ రొట్టెలను ప్రత్యేకంగా నైవేద్యంగా పెడుతుంటారు. హిందూ దేవాలయాల్లో మాదిరిగానే లడ్డూని కూడా ప్రసాదంగా ఇస్తారు. ఈ దర్గాకు ఉన్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఏడో తరగతిలోని సాంఘిక శాస్త్రంలో ఓ పాఠ్యాంశంగా దీన్ని చేర్చింది.ఉర్సు ఉత్సవాలు
ఏటా ఉర్సు ఉత్సవాలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి తర్వాత వచ్చే గురువారం నుంచీ ఉర్సు ఉత్సవాలు మొదలవుతాయి. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయి. మొదటి రోజున గంధం ఉత్సవం జరుగుతుంది. ఇందులో భక్తులు పెద్ద మొత్తంలో ఊరేగింపుగా తీసుకువచ్చిన గంధాన్ని బాబాల సమాధులకు అలంకరిస్తారు. మరుసటి రోజు దర్గాలోని అణువణువునూ కొవ్వొత్తుల వెలుగుతో నింపేస్తారు. మూడోదీ ఎంతో కీలకమైందీ కవ్వాలీ ఉత్సవం. ఈ కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుంచీ వచ్చిన భక్తులు ఇరవై నాలుగు గంటలపాటు భజనలు చేస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉర్సు ఉత్సవాల్లో ముస్లింలతోపాటు పెద్ద సంఖ్యలో హిందువులు కూడా పాల్గొంటారు.ఎలా వెళ్లాలి..!
హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో జహంగీర్‌పీర్ దర్గా ఉంది. ఇక్కడ ప్రతి గురువారం, ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో హైదరాబాద్‌లోని చార్మినార్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్ నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది.
- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
social media marketing company gurgaon