తక్షణ వైద్యంతో ప్రాణాలు సేఫ్!
మానవ తప్పిదాలతో ప్రమాదాలు జరగడం సహజమే! అయితే ప్రాణాపాయాల్ని నివారించడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. బాధితులకు సత్వర చికిత్స అందించగలిగితే విలువైన ప్రాణాల్ని కాపాడుకోగలుగుతాం! అందుకోసం అవసరమైన అవగాహన అందరం ఏర్పరుచుకోవాలి!
రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలపాలై (ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీ) మరణిస్తున్న వారి సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ. దేశవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికి రకరకాల రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలై మరణిస్తున్నారు. వీటిలో 35ు (ఏటా రెండు లక్షలు) మరణాలు ప్రమాదం జరిగిన కొద్ది సమయంలోగా సంభవిస్తున్నవే! ఇది నాణానికి ఓ పార్శ్వం మాత్రమే! అవే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకపోయినా, అంగ వైకల్యం పొంది బ్రతుకు వెళ్లదీస్తున్నవారూ ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని గాయపడేవారిలో అత్యధికులు 20 నుంచి 40 ఏళ్లలోపు వారే! ప్రమాదాల ఫలితంగా అంగవైకల్యం పొందడం వల్ల వృత్తి, ఉద్యోగ నైపుణ్యం దెబ్బతిని, భృతి కోల్పోయి వారి కుటుంబాలు వీధులపాలవుతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణ వైద్యం అందించగలగాలి.
తలకు గాయమైతే?
రోడ్డు ప్రమాదాల్లో ప్రధానంగా గాయపడేది తలే! అయితే కొన్ని సందర్భాల్లో తల పగలకుండా అంతర్గత రక్తస్రావం జరగొచ్చు, లేదా చిన్న గాయం ఏర్పడి, తక్కువ రక్తస్రావం కనిపించవచ్చు. ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు వాటి ప్రభావం మెదడు మీద తీవ్రంగా ఉంటుంది. పైకి మామూలుగానే అనిపించినా, తలకు తగిలే దెబ్బలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ‘దెబ్బ చిన్నదే కదా! తగ్గిపోతుందిలే!’ అని వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యపరంగా శాశ్వతమైన పరిణామాలను ఎదుర్కోవలసివస్తుంది. కాబట్టి రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగలిన వెంటనే వీలైనంత త్వరగా వైద్య సహాయం అందేలా చూడాలి. ఆలస్యం జరిగేకొద్దీ తిరిగి సరిదిద్దలేని నష్టం జరిగిపోతుంది. కాబట్టి ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలిన వ్యక్తుల్లో కొన్ని లక్షణాలు గమనించాలి.
అవేంటంటే..
తల నొప్పి
మాటలు తడబడడం
శరీరం మొద్దుబారడం
వాంతులు
మత్తులోకి జారిపోవడం
కనుపాప మరోదాని కంటే పెద్దదిగా మారిపోవడం
అదుపు చేయలేనంతగా ఎగిరి పడుతూ ఉండడం
శరీరం వేగంగా వణికిపోతూ ఉండడం
పరిసరాలను గుర్తు పట్టలేకపోవడం
స్పృహ తప్పడం
పసికందులు, పిల్లలు గాయపడితే ఎంత ఓదార్చినా ఏడుపు ఆపకపోవడం
తలకు గాయం ప్రమాదకరం! ఎందుకంటే?
మెదడు మిగతా శరీర భాగాల్లా తనను తాను అభివృద్ధి చేసుకోలేదు. కాబట్టి మెదడుకు గాయమైతే అది శాశ్వత నష్టంగానే భావించాలి. కపాలం మెదడుకు తగినంత రక్షణ కల్పించేదే అయినా ప్రమాదం జరిగిన సందర్భాల్లో కపాలమే మెదడుకు తిరిగి సరిదిద్దలేని నష్టం కలిగిస్తుంది. ప్రమాదం ప్రభావం మూలంగా మెదడు వాచినప్పుడు, అంతర్గత రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పరిమాణం పెరుగుతుంది. ఆ సమయంలో కపాలంలో చోటు సరిపోకపోవడం మూలంగా మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఎన్నో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తలకు దెబ్బ తగిలినప్పుడు బాధితుడి లక్షణాల ఆధారంగా తక్షణ చికిత్స అందించి మరింత ఆరోగ్య నష్టం జరగకుండా నియంత్రించవచ్చు. అవసరమైతే సర్జరీ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.
ప్రమాదం జరిగిన ఎంతసేపటిలోగా?
ఎక్కువ శాతం ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీలలో రెండు గంటల్లోపే ప్రాణాలు పోతూ ఉంటాయి. కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స మొదలుపెడితే, ప్రాణాలు నిలవడంతోపాటు మున్ముందు పరిణామాలనూ నియంత్రించవచ్చు. కాబట్టి ‘గోల్డెన్ అవర్’ను వృథా చేయకూడదు. దెబ్బ తగిలిన వెంటనే మెదడు నాడీ కణజాలానికి జరిగే నష్టం తక్కువే ఉన్నా, నిమిషాలు, గంటలు, రోజులు గడిచేకొద్దీ ఆ గాయం తాలూకు (సెకండరీ ఇంజురీ) తీవ్రత అంతకంతకీ పెరిగిపోయి, తిరిగి సరిచేయలేని పరిస్తితి నెలకొంటుంది. ఇలాంటి సెకండరీ ఇంజురీలే మరణాలకు, వైకల్యాలకు ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి లక్షణాలు, గాయాలు, రక్తస్రావం ఉన్నా, లేకపోయినా రోడ్డు ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలిన వ్యక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి.
డాక్టర్ జి. వేణుగోపాల్,
సీనియర్ న్యూరో సర్జన్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565