MohanPublications Print Books Online store clik Here Devullu.com

బంగాళాదుంప | ఆలూ | Potato | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


బంగాళాదుంప | ఆలూ | Potato | బంగాళాదుంప | ఆలూ | Potato |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

ఆలూ... ఎంతో మేలు

బంగాళాదుంప వేపుడు ఎదురుగా కనిపిస్తే... పక్కన ఎన్ని కూరలున్నా సరే చెయ్యి చటుక్కున దానిమీదికే వెళ్తుంది. ఇక, ఆలూ సమోసా వాసన తగిలితే చాలు, డైట్‌లూ ఉపవాసాలూ హుష్‌కాకీ అయినట్లే. అంతేనా ఆలూకుర్మా, ఆలూ మసాలా దోసె, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌... చెప్పుకుంటూపోతే ఆలుగడ్డ రుచుల చిట్టా చాంతాడంత. రుచులే కాదండోయ్‌, ఈ దుంపలోని పోషకాలూ లెక్కకుమిక్కిలి. అందుకే, వరి, గోధుమలు, మొక్కజొన్నల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆకలి తీర్చుతున్నవి ఆలుగడ్డలే.కొన్ని వందల ఏళ్ల కిందట... పంట సాగులో ఇప్పుడున్న మెలకువలు లేవు. దాంతో ఎక్కడికక్కడే పేదరికం తాండవించేది. జనం ఆకలితో అలమటించేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో నివసించే ఇన్‌కా ఇండియన్‌ తెగవాసులకు ఆహారానికి కొరత ఉండేది కాదు. రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి, వారి దగ్గరున్న సంపదను కొల్లగొట్టుకోవాలనే ఉద్దేశంతో స్పెయిన్‌ రాజు పెరూ మీద దండెత్తి తన వశం చేసుకున్నాడు. అప్పుడు వారికి దొరికినవే ఆలుగడ్డలు. అవును, ఇన్‌కా ఇండియన్స్‌ సంపద అదే. ఒక్క ఎకరం పొలంలో ఆలుగడ్డలు సాగుచేస్తే ఏడాది పాటు పదిమంది ఉన్న కుటుంబం ఆకలి తీరుతుంది. అంతేకాదు, పేరుకది కూరగాయే అయినా బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలు, ఓట్స్‌లాంటి వాటిలో ఉండే దాదాపు అన్ని పోషకాలూ దాన్లో ఉంటాయి. వేరు వేరు కూరగాయలూ పండ్లలో ఉండే విటమిన్లూ ప్రొటీన్లు కూడా ఆలుగడ్డ సొంతం. పోషకాల లెక్కల గురించి తెలియకపోవచ్చుకానీ ఆ దుంపలు ఆకలి తీరుస్తాయనీ ఆరోగ్యంగా ఉంచుతాయనీ తెలుసుకున్న ఇన్‌కా ఇండియన్లు తరతరాలుగా వాటిమీద ఆధారపడుతూ వచ్చారు. ప్రత్యేక పద్ధతుల్లో వాటిలోని నీటిని తొలగించి దీర్ఘకాలం నిల్వ ఉండేలా చేసేవారు. దాంతో కరవు సమయాల్లోనూ వారికి ఆహార కొరత ఉండేది కాదు. అయితే, పెరూలోనూ దాని పక్కనే ఉన్న బొలీవియాలోనూ క్రీస్తుపూర్వం ఎనిమిదివేల సంవత్సరాల నుంచే బంగాళాదుంపల్ని పండిస్తున్నా మిగిలిన ప్రపంచానికి వాటి గురించి తెలీదు. స్పెయిన్‌ యుద్ధం తర్వాతే 16వ శతాబ్దంలో ఐరోపాకి అవి పరిచయం అయ్యాయి. ఆ తర్వాత మిగిలిన దేశాలకూ పాకింది ఆలుగడ్డ. ప్రస్తుతం ఆలుగడ్డల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఇది చాలదూ బంగాళాదుంప భారతీయుల జీవితాల్లో ఎంత భాగం అయిపోయిందో అర్థం చేసుకోవడానికి.రంగూ రుచీ రూపం 

ఆలూ అనగానే మట్టి రంగులో కొంచెం గుండ్రంగా, కోడిగుడ్డు ఆకారంలో ఉన్నవే గుర్తొస్తాయి మనకి. కానీ ఈ కూరగాయలో ఉన్నన్ని రంగులూ రూపాలూ దేన్లోనూ లేవు. పెరూ చుట్టుపక్కల ఇప్పటికీ నాలుగువేల రకాల ఆలుగడ్డలు దొరుకుతాయి. అయితే, ప్రపంచం మొత్తమ్మీదా ఓ వందరకాలే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. పైన ఎరుపూ లోపల గోధుమ వర్ణంలో ఉండే రోజ్‌ రెడ్‌, లోపలా బయట కూడా వంకాయ రంగులో కనిపించే పర్పుల్‌ పెరూవియన్‌, దుంప అంతా ఎరుపు రంగుండే ఆల్‌ రెడ్‌ పొటాటో, బంగరు వర్ణంలో కనిపించే కింగ్‌ ఎడ్వర్డ్‌, ముదురు ఎరుపు రంగులో ఉండే హైల్యాండ్‌ బర్గండీ, వేరు వేరు రంగుల్లో మచ్చలతో కనిపించే బ్లూ బెల్లే, జెస్టర్‌... లాంటి పేర్లతో ఎన్నో వర్ణాలూ రుచులూ ఉన్నాయి వీటిలో. ఇక, వేరు వేరు రూపాల్లో ఉండే దుంపల గురించి చెప్పాలంటే పెద్ద ముత్యాలంత ఉండే పెరల్‌ పొటాటో, వాటికన్నా కొంచె పెద్దగా ఉండే బేబీ పొటాటో, ఈత కాయలను తలపించేలా చిన్నగా ఉండే టైనీటైనీ పొటాటో, అరటి పండ్లలా పొడవుగా ఉండే రష్యన్‌ బనానా, ఫింగర్‌లింగ్‌ దుంపలూ... ఇలా చాలానే ఉన్నాయి. ఇవీ పలు రంగుల్లో ఉంటాయి.ఎన్నో ప్రత్యేకతలు 

ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా కనిపించే కూరగాయ బంగాళాదుంపే. 
* ఆలూలో ఇరవై శాతం పిండి పదార్థాలుంటే మిగిలిన ఎనభైశాతం నీరే ఉంటుంది. 
* ప్రపంచంలో ఆలుగడ్డల్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. 
* వరి, గోధుమ, మొక్కజొన్నల తర్వాత భూమ్మీద ఎక్కువగా పండించే పంట ఆలుగడ్డలే. 
* విటమిన్‌ సీ లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధి బాగా ప్రబలిన 1890 సమయంలో కొన్నిచోట్ల బంగారాన్ని మారకంగా ఇచ్చి బంగాళాదుంపను కొనేవారట మరి. ఆలూలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. 
* ఇంగ్లండ్‌లో పండిన దాదాపు ఎనిమిదిన్నర కిలోల దుంప ఇప్పటివరకూ పండినవాటిలో అతిపెద్ద ఆలుగడ్డగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 
* నూనెలో వేయించి చేసే ఆలూ చిప్స్‌ ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఇవి బాగా ప్రాచుర్యం పొందిన స్నాక్స్‌గా పేరుపొందాయి. ఏటా వంద కోట్లకు పైగా ఆలూ చిప్స్‌ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. 
* 1995లో నాసా సంస్థ, యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్‌సిన్‌తో కలిసి అంతరిక్షంలో ఆలుగడ్డల్ని పండించే టెక్నాలజీని సృష్టించింది. దీనివల్ల భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఆలూని పండించుకుని తినొచ్చన్నమాట. 
* చాలామంది ఆలుగడ్డలకు మొలకలు వచ్చినా కూడా వండేస్తుంటారు. కానీ ఆ మొలకలు విషపూరితమైన ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేస్తాయి. వాటిని తినడం ఆరోగ్యానికి మంచిదికాదు. 
* 1800 ప్రాంతంలో ఐర్లండ్‌ వాసులకు ఆలుగడ్డలే ప్రధాన ఆహార వనరుగా ఉండేవి. కానీ విధివశాత్తూ 1845 సమయంలో స్థానిక బంగాళాదుంప పంటలన్నీ ఒకరకం తెగులువ్యాధితో నాశనమయ్యాయి. దాంతో స్థానికంగా సుమారు పదిహేను లక్షలమంది ఆకలితో చనిపోయారు. ఐర్లండ్‌లో ఇప్పటికీ ప్రధాన ఆహారం ఆలూనే. అక్కడ ఒక్కో మనిషి సగటున ఏడాదికి 120 కిలోల ఆలుగడ్డల్ని తింటాడట. 
* ఆలుగడ్డల్ని వంటల్లోనే కాదు, వస్త్ర, కాగితం పరిశ్రమల్లో జిగురుకోసం కూడా వాడతారు. చాలాచోట్ల వీటిని పశువులకు మేతగానూ వేస్తారు.

ఆరోగ్యం 
అన్నంలో ఉండే శక్తీ, నిమ్మకాయలోని సీ విటమిన్‌, అరటి పండులో దాగున్న పొటాషియం, యాపిల్‌లోని పీచుపదార్థాలూ మరెన్నో పోషకాలు ఒక్క ఆలుగడ్డలోనే లభిస్తాయి. ఇది గ్లుటెన్‌ ఫ్రీ మాత్రమే కాదు, తక్కువ పెట్టుబడీ శ్రమతో పండించగలిగిన పంట కూడా. అందుకే, పేద దేశాలు బంగాళాదుంపల్ని బాగా వినియోగించేలా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోంది. దీన్లోభాగంగానే 2008 సంవత్సరాన్ని ఆలుగడ్డ నామ సంవత్సరంగా ప్రకటించింది. ఇక, ఆరోగ్యానికి ఈ దుంప చేసే మేలు గురించి చెప్పాలంటే బోలెడు. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీన్లో ఉండే కెరోటినాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రకరకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్‌ సీ, బీ కాంప్లెక్స్‌, ఖనిజలవణాలూ ఆలూలో పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు రాకుండానూ ఇది నివారిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచడంతోపాటు, నిద్రలేమి సమస్యల్నీ దూరం చేస్తుంది. అల్సర్లకూ అరుగుదలకూ కంటి ఆరోగ్యానికీ బంగాళాదుంప మంచి మందు. ఇది మెదడుని చురుకుగా కూడా ఉంచుతుంది. మంచిది మంచిది అన్నారు కదా అని ఆలూ చిప్స్‌ని తెగ తినేస్తాం అంటే కుదరదు. ఆలుగడ్డల్ని ఉడికించి చేసిన వంటకాలే ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు, అతి అనర్థం అన్నది దీనికీ వర్తిస్తుంది. ఏమైనా, ఆలూకి చాలా సీనుంది కదూ...
బంగాళాదుంప | ఆలూ | Potatoబంగాళాదుంప | ఆలూ | Potato |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

బంగాళాదుంప | ఆలూ | Potato |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list