మీరెప్పుడూ చూడలేనివి..
నో ఎంట్రీ.. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. వీటిని మనమెప్పుడూ చూడలేదు. ఇకపై చూడలేరు కూడా. ఈ ప్రపంచంలో ఏ మానవ మాత్రుడు కూడా అడుగుపెట్టలేని.. పెట్టకూడని ప్రాంతాలివి. నిషేధ ఆంక్షలు కొన్ని ప్రాంతాలకు పరిమితమైతే.. మరికొన్ని చోట్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి.. అందుకే ఆ ప్రదేశాలను సందర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదు.. ఇకపై ఉండబోదు అని కూడా బోర్డ్ తగిలించేశారు.. డోంట్ వర్రీ.. ఆ ప్రదేశాలను ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ వారం ముఖచిత్ర కథనంలో చూపిస్తున్నాం.
.
స్నేక్ ఐలాండ్, బ్రెజిల్
భూమ్మీద ఉన్న భయంకరమైన స్థలంగా దీన్ని భావించొచ్చు. ఓఫిడిఫోబియో ఉన్నవాళ్లను ఇక్కడకు పంపిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఇంతకీ ఈ ఫోబియా ఏంటంటే.. పాములను చూస్తే వీరికి చచ్చేంత భయం. ఈ పక్క ఫొటోలో ఉన్న ప్రదేశంలో ఆరు అడుగులకు ఒక పాము దర్శనమిస్తుంది. బ్రెజిల్‌లోని సావో పౌల్ ఇది. దీన్నే స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. దాదాపు 110 ఎకరాల్లో 4 వేల పాములు సంచరిస్తున్నాయని సైంటిస్టులు అంచనా వేసి మరీ చెప్పారు. పైగా ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే చాలా బలమైనవి. కొన్ని పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగల సామర్థ్యం కూడా ఉంటుందట. మరికొన్ని పాములు చాలా విషపూరితమైనవని పరిశోధనల్లో తేలింది. ఇక్కడ ఇతర జీవరాశులు బతుకడం కష్టమని కూడా తేల్చేశారు. చిన్నా చితకా పక్షులను అవి పొట్టన పెట్టుకోవడమే ఇందుకు కారణమట. అందుకే, ఈ ప్రాంతం నిషేధ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.
లాస్కాక్స్ గుహలు, ఫ్రాన్స్
మొంటిగానిక్ అనే గ్రామం దగ్గరలో 17 అడుగుల ఎత్తు గల ఈ గుహల పై భాగంలో సుమారు 600 పెయింటింగ్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా ఎద్దు బొమ్మలు గీయబడి ఉన్నాయి. 17 వేల సంవత్సరాల క్రితం ఈ పెయింటింగ్‌లు వేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1979లో లాస్కాక్స్ గుహలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. 12 సెప్టెంబర్ 1940న పద్దెనిమిదేండ్ల మార్సెల్ రావిడట్ అనే అబ్బాయి ఈ గుహని కనుగొన్నాడు. 1948 వరకు రోజూ ఈ గుహలను సందర్శించే అవకాశం ఉంది. 1960 నుంచి దీనిని నిషేధించారు. కారణం.. అందులో ఉండే ఫంగస్, ఇతర గ్యాస్‌ల కారణంగా మనుషులకు నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ నిషేధం.
ఏరియా 51, యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన స్థలానికి ఏరియా 51గా పేరు పెట్టారు. ఇక్కడ ఒకప్పుడు మిలిటరీ ఫోర్స్ ఉండేది. నెవడా దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్‌కి కూడా ఉపయోగించేవారు. అలాగే రహస్య మంతనాలు జరుపుకోవడానికి ఇది అనువైన ప్రదేశం అని అప్పటి సైనికులు భావించేవారు. వియత్నాం యుద్ధ సమయంలో ఈ ప్రాంతంలో సైనికులకు తప్ప, మరెవరికీ అనుమతి లేదని బోర్డ్ పెట్టారు. సైనిక స్థావరాలతో ఆ ప్రాంతం ఉండేది. అయితే ఆ యుద్ధం తర్వాత ఆ ప్రాంతంపై ఎన్నో కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మైనింగ్‌కి అనువైన స్థలం కావడం, సైనిక స్థావరానికి అవసరమైన స్థలం కావడంతో కొంతమంది కుట్రలకు పాల్పడ్డారు. దాంతో అక్కడి ప్రభుత్వం అటుగా వెళ్లకూడదని నిషేధం విధించింది. అందువల్లే దశాబ్దకాలంగా అటు వైపు వెళ్లినవారు లేరు. అలా ఇది నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. పైగా రక్షణ వలయం కూడా ఉండడంతో అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నారని, వాటిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని అందుకే నిషేధం విధించారని ఇలాంటి పుకార్లు ఉన్నాయి.
నిహు, యునైటెడ్ స్టేట్స్
ట్రావెలర్స్‌కి ఒకప్పుడు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విసిరిన బాంబులతో ఈ ప్రాంతం విచ్ఛిన్నం అయిపోయింది. జనావాసానికి కూడా ఈ ప్రాంతం అనువుగా లేకుండా పోయింది. ఈ ప్రాంతానికి ఇప్పుడు నిషిద్ధ ఐలాండ్‌గా పేరు పెట్టారు. 150 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఈ ఐలాండ్‌ని కబ్జా చేసి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 1860లో ఆ ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయింది. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించలేదు.
నార్త్ సెంటినెల్ ఐలాండ్, ఇండియా
విదేశాల్లోనే కాదు.. మన దేశంలోనూ అలాంటి నిషిద్ధ ప్రదేశం ఒకటి ఉంది. అండమాన్‌కి దగ్గరలో ఒక చిన్న ఐలాండ్ ఉంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపంలో మనుషులు కూడా నివసిస్తారు. వారిని సెంటినెల్స్ అని పిలుస్తారు. అయితే వీరు బయట వారినెవరినీ ఈ ద్వీపంలోకి రానివ్వరట. 60 వేల సంవత్సరాల నుంచి ఆ తెగ ఇక్కడ జీవనం సాగిస్తున్నది. కాకపోతే కొత్తవాళ్లు వచ్చిన ఎవరికైనా వారు మరణశిక్షే వేస్తారట. ప్రపంచ దేశాలు ఈ భూభాగాన్ని ఇండియా ప్రొటెక్షన్‌లో ఉంచాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 117 మంది ఉండగా 2011 వచ్చేసరికి 40 మంది నివసిస్తున్నారని అంచనా వేశారు. 2004లో వచ్చిన సునామీ అప్పుడు కూడా హెలికాప్టర్ల ద్వారానే ఈ ఐలాండ్‌ని పరీక్షించారట తప్ప దానిపైన అడుగుపెట్టలేదు.
బోహేమియన్ గ్రోవ్, యునైటెడ్ స్టేట్స్
2700 ఎకరాలు ఉండే స్థలమే బోహేమియన్ గ్రోవ్. అక్కడికి అందరికీ అనుమతి ఉండదు. ఒకవేళ కావాలనుకున్నా అనుమతి తీసుకోలేరు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అబ్బాయిల క్లబ్ అని పిలిచేవారు. బిజినెస్‌మాన్‌లు, ప్రభుత్వ సభ్యులు, అధ్యక్షులు, నాయకులు, కళాకారులు, సంగీతకళాకారుల్లో కొందరినీ ఎంపిక చేసుకొని గ్రూప్‌గా తయారయి ఇక్కడ సమావేశమయ్యేవారు. వాళ్లు మాత్రమే ఇక్కడికి రావచ్చునన్న ఆదేశాలు ఉండేవి. కేవలం ఎంజాయ్‌మెంట్ కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు మగవాళ్లు. కానీ 1942లో ఇక్కడ జరిగిన సమావేశం కారణంగానే అట్లాంటిక్ బాంబు పేలిందనే పుకార్లు వచ్చాయి. దాంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారు లేరు.
సుర్తేయ్ ద్వీపం, ఐస్‌లాండ్
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వెబ్‌సైట్‌లో మీరు వెతికిన ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకోలేరు. సముద్ర మట్టానికి 130 మీటర్ల దిగువన ఈ అగ్ని పర్వతం ఉంది. 14 నవంబర్ 1963లో ఈ అగ్నిపర్వతం రాజుకున్నట్లు వార్తలు ఉన్నాయి. 2007లో జరిపిన సర్వే ప్రకారం కూడా అప్పటికీ ఆ అగ్నిపర్వతం ఇంకా చల్లారినట్లు ఆనవాళ్లు కనపడలేదట. 20మైళ్ల మేర ఇది ప్రాంతంలో విస్తరించి ఉంది. అయితే ఈమధ్యే ఈ పర్వతం చల్లారినట్లు కనుగొన్నారు. అక్కడ పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయట. దీంతో శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు చేయడానికి రెడీ అయిపోయారు. వివిధ రకాల విత్తనాలు తీసుకొని ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. కాకపోతే అక్కడికి వెళ్లాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని బయలుదేరాలి.
ఇన్స్ గ్రాండ్ ష్రైన్, జపాన్
ఇన్స్ అనే పట్టణానికి దగ్గరలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ సూర్య భగవానుడిని అమెట్రసు రూపంగా భావించి పూజిస్తారు. చుట్టూ అడవి ఉండి మధ్యలో ఈ గుడి ఉంటుంది. మొత్తం చెక్కలతో పెద్ద పెద్ద గోడలు కట్టి ఈ గుడిని రక్షిస్తున్నారు. ఈ గుడికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఎందుకంటే.. ప్రతీ 20 సంవత్సరాలకొకసారి కొన్ని లక్షల డాలర్లు పెట్టి ఈ గుడిని పునర్నిర్మిస్తారు. 2013లో ఈ గుడి కొత్త రూపు సంతరించుకొని ఇదిగో ఈ ఫొటోలోలాగా తయారైంది. ఇది నిజం. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు అందులోకి ఎందుకు వెళ్లకూడదని ఎందుకంటున్నారు అనుకుంటున్నారా? జపనీస్ ఇంపిరీయల్ ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఇందులోకి అడుగు పెట్టాలట. ఇతరులెవరికైనా ఈ గుడి ప్రాంగణంలోకి కూడా ప్రవేశం లేదట. ఇది అక్కడి సంప్రదాయమంటున్నారు. ఈ గుడికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటుంది.
హార్డ్ ఐలాండ్, ఆస్ట్రేలియా
భూభాగం చివర ఏముంది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడొక హార్డ్ ఐలాండ్ ఉంది. ప్రపంచంలో అత్యంత రిమోట్ ద్వీపాల్లో ఇది కూడా ఒకటి. సాంకేతికంగా ఈ భూభాగం ఆస్ట్రేలియాకు చెందింది. మడగాస్కర్.. అంటార్కిటికా మధ్య దీన్ని చూడవచ్చు. దీన్ని 19వ శతాబ్దంలో కనుగొన్నట్లు వార్తలు ఉన్నాయి. దాదాపు 372 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ రెండు అగ్నిపర్వతాలు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతాయన్నట్లుగానే ఉంటుందట పరిస్థితి. కాకపోతే ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. సీల్స్, పెంగ్విన్స్ ఇక్కడ నివసిస్తుంటాయి. ఈ ద్వీపానికి దగ్గరలో మెక్‌డోనాల్డ్ ద్వీపాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదన్న నిబంధనలు జారీ చేశారు.
పోవ్లియా, ఇటలీ
వెనీస్ ఐడియా ఉంది కదా! నీటి మీద తేలియాడే నగరం. అంత అందమైన నగరానికి, లిడో అనే నగరానికి మధ్య ఒక చిన్న అందమైన ఐలాండ్ ఉండేది. ఇప్పుడు ఆ ఐలాండ్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ దందాకి ఇది అడ్డాగా ఉండేది. 14వ శతాబ్దంలో ప్లేగు బాధితుల నివాస స్థలంగా దీన్ని మార్చేశారు. ఆ తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి ఇక్కడి ఇండ్లను పిచ్చాసుపత్రికి నిలయాలుగా చేసేశారు. అయితే అక్కడ పనిచేసే డాక్టరు రోగుల మీద పిచ్చి ప్రయోగాలు చేసేవాడు. దీంతో అక్కడి రోగులంతా చనిపోయారు. వారు ఆత్మలుగా తిరిగి ఆ డాక్టరుని చంపేశాయనే వదంతులు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని సందర్శించిన వాళ్లు లేరు. ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్లడాన్ని నిషేధించింది.
క్విన్ షి హాంగ్ సమాధి, చైనా
కొన్ని సంవత్సరాల క్రితం చైనాలో జరిగిన తవ్వకాల్లో టెర్రాకోట సైనికుల బొమ్మలు బయటపడ్డాయి. రెండు వేలకు పైగా ఈ మట్టి బొమ్మలు భూగర్భంలో ఉంచారు. ఇవన్నీ కూడా చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హంగ్ సమాధి పైన ఉన్నాయి. ఈ సమాధి కట్టడానికి సుమారు 38 సంవత్సరాల కాలం పట్టిందని అంచనా. ఈ ప్రాంతంలో.. మరికొన్ని సైనికుల బొమ్మలు కూడా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ స్థలం సందర్శకులను తెగ ఆకర్షిస్తుందని కూడా అందరూ భావించారు. ఇన్ని వేల సైనికుల బొమ్మలు ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరుపుతున్నారు. కాకపోతే అక్కడ తవ్వుతున్నప్పుడు మెర్క్యురీ బయటపడింది. దీనివల్ల మనుషులకు ప్రాణహాని ఉంది. అందువల్ల ఆ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. శాస్త్రవేత్తలు వెళ్లాలన్నా వారు ముందు జాగ్రత్తలు తీసుకొని, అధికారులు అనుమతి తీసుకున్నాకే ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టేలా నియమం ఉంది. ఇంతటి గొప్ప సంపదను ఎవరూ చూడకుండా అయిపోయింది.
వాటికన్ సీక్రెట్ ఆర్చివ్స్, వాటికన్ సిటీ
మత రహస్యాలను ప్రపంచంలో ఎక్కడ రక్షిస్తారంటే మాత్రం అందరి చూపుడు వేలు వాటికన్ సిటీ వైపే ఉంటుంది. వీటిని సీక్రెట్స్ ఆఫ్ ది మిస్టరీగా పేర్కొంటారు. 20వ శతాబ్దంలో ఫాసిజంకు సంబంధించిన రాక్షసులు, గ్రహాంతర వాసులు, చర్చి పై ఆరోపించిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నట్లు వార్తలున్నాయి. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అతి రహస్య పేపర్లు కూడా ఇక్కడ దాచిపెట్టారు. 17వ శతాబ్దంలో పోప్ పాల్ V ఆదేశాల ప్రకారం సీక్రెట్ ఆర్కైవ్స్ వాటికన్ లైబ్రెరీ నుంచి వేరు చేయబడ్డాయి. ఇందులోకి అడుగు పెట్టాలంటే వాళ్లు బాగా తెలిసిన పండితులు, విద్యావేత్తలు అయి ఉండాలి. అలాగే వారిని పరీక్షించిన తర్వాతే అది కూడా కాస్త సమయం ఇందులో గడుపడానికి అనుమతినిస్తారు. 1881 వరకు ఈ ప్రాంతాన్ని వెయ్యి మంది కంటే తక్కువ మందే సందర్శించారు.
మేస్ఘోర్యే, రష్యా
ఇతరులెవ్వరికీ ఇక్కడికి ప్రవేశం లేదు అనే బోర్ద్ మేస్ఘోర్యే పట్టణం వద్ద వేలాడుతూ ఉంటుంది. ఉరల్ పర్వతాలకు 120 మైళ్ల దూరంలో ఈ ప్రాంతం కొలువై ఉంది. ఇది బకరోస్తాన్ ప్రాంతానికి రిపబ్లిక్ రాజధానిగా 1979లో నిర్ణయించారు. చాలా చిన్న పట్టణం మేస్ఘోర్యే. ఇక్కడ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక్కడ ఆటోమేటిక్‌గా మిసేల్స్ యాక్టివేట్ అయిపోతుంటాయి. ప్రయోగించబడుతుంటాయి. కాబట్టి ఇక్కడికి మామూలు జనాలకు ప్రవేశం లేదు. కేవలం రెండు బెటాలియన్ల సైనికులు మాత్రమే ఈ ప్రాంతాన్ని సంరక్షిస్తుంటారు. ఈ ప్రాంతం గురించి ఏదైనా సమాచారం కావాలంటే కేవలం ఉపగ్రహం పంపించే డేటాపైనే ఆధారపడాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ మైనింగ్ కూడా చేపడుతుంటారు.
నార్త్ బ్రదర్ ఐల్యాండ్, యునైటెడ్ స్టేట్స్
1614లో డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ నార్త్ బ్రదర్ ఐలాండ్, సౌత్ బ్రదర్ ఐలాండ్‌గా నామకరణం చేశారు. అంతకుముందు ఆ ప్రాంతాలను డీ గెసిలిన్‌గా పిలిచేవారు. న్యూయార్క్ సిటీలో ఎన్నో రహస్య ప్రాంతాలో ప్రముఖమైంది ఇదే. ఈస్ట్ నది పరీవాహక ప్రాంతంలో ఈ ఐలాండ్ ఉంటుంది. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆసుపత్రి ఉండేది. ఇక్కడ పచ్చకామెర్లు, అమ్మవారు పోసిన వారికి ఎక్కువ ట్రీట్‌మెంట్లు చేసేవారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రాంతాన్ని మత్తు పదార్థాలు తీసుకునే వారికి ట్రీట్‌మెంట్ చేసేందుకు వాడారు. 1960లో అది కూడా ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి మళ్లీ తెరుచుకోలేదు. 2007లో ఈ ప్రాంతాన్ని వేరే వాళ్లు కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మనుషులకెవ్వరికీ ఇక్కడ అనుమతి లేదని బోర్డ్ పెట్టేశారు.
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
YouTube promotion Companies
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
YouTube promotion Companies