కథ కాదు జీవితం
వారి జీవితాలు భావి తరాలకు స్ఫూర్తినిచ్చే గ్రంథాలు. విజయ తీరాలను చేరిన వారు కొందరైతే.. విజయాన్ని అర అంగుళం తేడాతో వదులుకున్న వాళ్లు మరికొందరు. అయినా వాళ్లు విజేతలే. ఎందుకంటే, ఎన్నో లక్షల హృదయాలను వారు గెలిచారు. ఆశయాల కోసమే అడుగులేశారు వాళ్లు. వారి గుర్తులు, వారి స్ఫూర్తి ఛాయలు మన మీద నిత్యం ప్రసరిస్తూనే ఉంటాయి. తరతరాలుగా మరిచిపోలేని వారిచ్చిన స్ఫూర్తి ముందు తరాలకు అందించడానికి వారి జీవిత చరిత్రలు సినిమాలుగా వస్తున్నాయి. ఆ వివరాలతో ఈ వారం కవర్‌స్టోరీ..
ప్రవీణ్‌కుమార్ సుంకరి
బయోపిక్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు. సినిమా బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉన్నప్పటి నుంచే బయోపిక్స్ హవా మొదలైంది. కాకపోతే ఆ మధ్యలో కొన్ని రోజులు చిన్న బ్రేక్ వచ్చింది. కొంతకాలం తర్వాత కాసిన్ని కమర్షియల్ హంగులు, కొన్ని ఊహాత్మక ఘటనలు కలిపి కొత్తగా జనాల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. పలు రంగాల్లో విజయవంతంగా రాణించిన వారి జీవితాల గురించి, తెలియని కోణాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత అందరికీ ఉంటుంది. పక్కవారి జీవితం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం మానవ సహజ గుణం. అలాంటిది సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవడమంటే మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ కోణంలోనే బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ లభిస్తున్నది. అందులో అభిమాన నటులు, ఆటగాళ్లు, నాయకుల కథలైతే తెరమీద విజయ విహారం చేస్తాయి. ప్రేక్షకుల నుంచి విజిల్స్, నీరాజనాలు అందుకుంటాయి.
కేసీఆర్ బయోపిక్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి స్వరాష్ట్రం సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు మధురా శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడుపడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వంటి ఘట్టాలతో ఈ బయోపిక్ ఉండనున్నది. అయితే.. కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.
అనగనగా ఓ రాకుమారుడు (కత్తి కాంతారావు బయోపిక్) : కత్తియుద్ధాల హీరో కత్తి కాంతారావు జీవితం కూడా మరికొన్ని రోజుల్లో బయోపిక్ రూపంలో తెరమీద ఆవిష్కృతం కానుంది. ఆయన సినిమాల్లో అరంగేట్రం నుంచి ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రనటుల సమకాలీనుడిగా నిలబడిన ప్రస్థానాన్ని ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. ఈ సినిమాకు పి.సి ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతగా, నటుడిగా ఆయన ప్రస్థానం ఈ సినిమాలో చూపించనున్నారు. ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆయన స్వస్థలమైన కోదాడలోని గుడిబండ వెళ్లి ఆయన పుట్టి, పెరిగిన ఇల్లు, ఆయన గురించి తెలిసిన వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నాడు దర్శకుడు పీసీ ఆదిత్య.
గోపీచంద్ బయోపిక్ : ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఆయన జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనున్నది. ఈ బయోపిక్‌కి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నాడట. గోపీచంద్‌గా సుధీర్ బాబు నటించనున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు వెండి పతకం గెలువడంతో గోపీచంద్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ తరుణంలో ఆయన జీవితం గురించి, బాడ్మింటన్ ఆటలో తన ప్రస్థానం గురించి బయోపిక్ ప్రకటన వచ్చింది.
సంజు (సంజయ్‌దత్ బయోపిక్) : బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవితాన్ని కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కించారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌లో సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించాడు. డ్రగ్స్‌కి బానిస కావడం, లవ్ ఎఫైర్స్, టాడా కేసులో జైలు జీవితం అనుభవించిన ఘటనలను సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది జూన్ 29న ఈ సినిమా విడుదల కానున్నది.
అభినవ్ బింద్రా బయోపిక్ : భారత షూటర్ అభినవ్ బింద్రా జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కిస్తున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ కణ్ణణ్ అయ్యర్.
ఆనంద్‌కుమార్ బయోపిక్ : ఐఐటీ- జెడ్‌ఈఈ ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి ఈయన సుపరిచితుడు. గొప్ప మ్యాథమెటీషియన్. సూపర్ 30 పేరుతో దిగువ మధ్యతరగతిలో ఉన్న 30మందిని సెలెక్ట్ చేసుకొని వారికి ఈ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటాడు. ఈయన బయోపిక్ ఆధారంగా వస్తున్న సినిమాలో హృతిక్‌రోషన్ నటిస్తున్నాడు. కాగా, ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో షకీలా బయోపిక్ త్వరలో రానున్నది. ఈ బయోపిక్‌లో షకీలా పాత్రలో రిచా చడ్డా నటించనున్నది. సిల్క్‌స్మిత హవాను తట్టుకొని షకీలా ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అయిందో ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. బాలల హక్కుల కోసం పోరాడుతూ నోబెల్ బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి జీవితం కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కున్నది. కైలాష్ సత్యార్థి పాత్రలో బొమన్ ఇరానీ కనిపించనున్నాడు. అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ జీవితం కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో రాకేష్ శర్మ పాత్రలో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నాడు. 83 పేరుతో కపిల్‌దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్నది. 1983లో ఇండియాకు క్రికెట్‌లో కప్ సాధించిపెట్టిన ఘట్టం నుంచి ఈ కథ మొదలవుతుంది. ఈ బయోపిక్‌లో కపిల్‌దేవ్ పాత్ర రణ్‌వీర్ సింగ్ పోషించనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానున్నది.
సన్నీలియోన్జీ టీవీ గ్రూప్ నిర్మాణ సారథ్యంలో ఈ బయోపిక్ రానున్నది. పోర్న్ రంగంలోకి వెళ్లిన తర్వాత, వెళ్లక ముందు తన జీవితం ఎలా ఉండేది అనే కోణంలో సన్నీ లియోన్ జీవితాన్ని చూపించనున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో సన్నీలియోన్‌గా పేరు మార్చుకొని పోర్న్ రంగంలోకి ప్రవేశించిందో, అందులోంచి బయటకు వచ్చి రెగ్యులర్ సినిమాల్లో అవకాశాలు అందుకొని రాణిస్తున్న క్రమాన్ని ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. తన శృంగార సినిమాలతో ఎంతోమంది యువకుల గుండెలు దోచుకున్న ఈమె పాత్రను ఎవరు పోషిస్తున్నారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
యాత్ర : కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడువాలనుంది. మీ గుండె చప్పుడు వినాలని ఉంది అనే నినాదంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర విశేషాలను, ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఇది. ఇందులో వైఎస్సార్‌గా మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాలను మహీ వీ రాఘవ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. వైఎస్‌ఆర్‌గా కనిపించనున్న మమ్ముట్టి వేషధారణ, నడక, మాటలు అన్నీ వైఎస్‌ఆర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంటాయంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో జగన్ పాత్రలో సూర్య, షర్మిల పాత్రలో భూమిక కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ : బాలకృష్ణ నిర్మిస్తున్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ సంక్రాంతికి విడుదల కానున్నది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడైన బాలకృష్ణే పోషించనున్నాడు. ఎన్టీఆర్ సినిమా ప్రస్థానం నుంచి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన ఘట్టాలను ప్రధానంగా తీసుకొని ఈ బయోపిక్ నిర్మిస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న మరికొన్ని బయోపిక్స్ :జార్జిరెడ్డి, శ్రీదేవి (బోనీ కపూర్ నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు), దాసరి, సౌందర్య, జయలలిత, సైరట్ దర్శకుడు అమితాబ్‌తో ఒక బయోపిక్.
ఏ పాత్రకు.. ఎవరు?బయోపిక్‌ల హవా నడుస్తున్న ఈ సీజన్‌లో మరిన్ని బయోపిక్‌లు వచ్చే అవకాశం ఉంది. సావిత్రిగా మెప్పించి కీర్తి సురేష్ ప్రశంసలందుకుంటున్నది. ఎవరి బయోపిక్‌కి ఎవరైతే బాగుంటుందో సరాదాగా ఓ లుక్కేద్దామా!
సాహసమే..ప్రముఖుల జీవితాలను తెరకెక్కించాలంటే అదో సవాల్. వారి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను ఎక్కడా తేడా రాకుండా తెరకెక్కించాల్సి ఉంటుంది. వాస్తవ జీవితాన్ని అచ్చం అలాగే చూపించాల్సి ఉంటుంది. తెర మీద చూస్తున్న సీన్లు సదరు కథకు చెందిన వ్యక్తి కాలంలోకి తీసుకెళ్లగలగాలి. ఇదంతా సాధ్యం కావాలంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించగలగాలి. అందుకు చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది. వాస్తవాన్ని సినిమాటిక్‌గా, ఆసక్తికరంగా చూపించగలగాలి. ఎవరి జీవితాన్నైతే సినిమాగా తీస్తున్నామో ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ఆసక్తికరంగా మలచాలి. ఎవరినీ నొప్పించకుండా అందరినీ మెప్పించాలి. వాస్తవాన్ని ఎక్కడా వక్రీకరించకూడదు. ఊహాజనిత ఘటనలు తెరకెక్కించకూడదు. కొన్నిసార్లు ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని మైనస్ పాయింట్స్ చూపించకుండా ఉండాల్సి ఉంటుంది. ప్రపంచానికి తెలియని పాజిటివ్ కోణాన్ని, తెలియని ఆసక్తికర విషయాలను చెప్తే ఆదరణ పెరుగుతుంది.
ఎందుకింత డిమాండ్..దర్శకుడి ఊహల్లో పుట్టిన కథలు, తెరకెక్కిస్తే అప్పట్లో జనాలు విరగబడి చూశారు. సినిమా చూసే ప్రేక్షకులు, సినిమా చూపే దర్శకుల ఆలోచనా విధానం కూడా మారుతున్నది. పాత కథలకు కాలం చెల్లింది. గత 15ఏళ్లుగా బయోపిక్స్ ప్రస్థానం మొదలైంది. నిజ జీవితాలను, వాస్తవ ఘటనలను ఆధారంగా తీసుకొని సినిమాగా రూపొందిస్తున్నారు. తెరపై విరగబూసే కథలన్నీ ఇప్పుడు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో నిజ జీవితాలే సినిమా కథలుగా తెరకెక్కుతున్నాయి. బయోపిక్‌లో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన వాస్తవాలుంటాయి. రియాలిటీ ఉంటది. అందరికీ తెలిసిన, విన్న ఘటనలు ఉంటాయి. అవన్నీ ప్రత్యక్షంగా చూసిన అనుభవం బయోపిక్‌లో దొరుకుతుంది. అప్పటికే ఒకసారి సదరు వ్యక్తి జీవితం గురించి తెలిసిన వారికి మరోసారి, తెలియని వారు ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిచ్చే బయోపిక్‌లకు అందుకే ఇంత ఆదరణ లభిస్తున్నది. సోషల్ మీడియా, టీవీ షోలు మనిషిని రియాలిటీకి దగ్గర చేస్తున్నాయి. అందుకే తెరమీద కూడా రియాలిటీని కోరుకుంటున్నారు.
అలరించిన బయోపిక్స్ మహానటిలీడ్‌రోల్ : కీర్తి సురేష్, నిర్మాత : స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకత్వం : నాగ్ అశ్విన్,
వంగవీటిలీడ్‌రోల్ : శాండీ,
నిర్మాత : దాసరి కిరణ్‌కుమార్,
దర్శకత్వం : రాం గోపాల్ వర్మ
సచిన్... ఎ బిలియన్ డ్రీమ్స్లీడ్‌రోల్ : సచిన్ టెండుల్కర్,
నిర్మాత : రవి భాగ్‌చంద్కా,
దర్శకత్వం : జేమ్స్ ఎర్స్‌కిన్
ధోని... ది అన్‌టోల్డ్ స్టోరీలీడ్‌రోల్ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, నిర్మాత : అరుణ్ పాండే,
దర్శకత్వం : నీరజ్ పాండే,
అజహర్లీడ్‌రోల్ : ఇమ్రాన్ హష్మీ,
నిర్మాణం : సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్,
దర్శకత్వం : టోనీ డిసౌజా
మేరీకోమ్లీడ్‌రోల్ : ప్రియాంక చోప్రా, నిర్మాత : సంజయ్ లీలా భన్సాలీ, అజిత్ అంధరే, దర్శకత్వం : ఓముంగ్ కుమార్
భాగ్ మిల్కా భాగ్లీడ్‌రోల్ : ఫర్హాన్ అక్తర్, దర్శకత్వం : రాకేష్ ఓంప్రకాష్
పూర్ణ లీడ్‌రోల్ : అదితి ఇనందర్
దర్శకుడు : రాహుల్ బోస్
నిర్మాతలు : అమిత్ పట్నీ, రాహుల్ బోస్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565