ఎవరు గురువు?ఏది చదువు?
విద్యార్థికి ఈ సమాజం అంతా గురువే. తెలియని విషయాలు చెప్పేవారందరూ గురువులే. చేపలు పట్టే వ్యక్తి కూడా ఏకాగ్రత విషయంలో గురువే అని వివరిస్తుంది మహాభాగవతంలోని అవధూత ఉపాఖ్యానం. సమాజం నుంచి సమగ్రమైన విజ్ఞానం లభిస్తుంది. మనసు వికసిస్తుంది. తుదిగా ఆ సమాజంపై గౌరవం ఏర్పడుతుంది.
గమ్యం తెలియని జీవన గమనానికి దారి చూపే దీపం చదువు. విద్యార్థి జీవితం సజావుగా సాగేందుకు ఆ దీపాన్ని భద్రంగా పట్టుకొని ఉండే జ్ఞానాధారం గురువు. విద్యార్జన మహాయాగం వంటిది. దానిని నిర్వహించే బ్రహ్మ గురువు. ఆయన అనుగ్రహం విద్యార్థిని జ్ఞానవంతుడిని చేస్తుంది. విద్యార్థి చదువు గురువుతో ఉండే అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. గురుశిష్యుల సంబంధం గురించి, సమాజహితాన్ని కోరే చదువు గురించి మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే..
తమ చిన్నారికి మూడో యేడు వచ్చిందో లేదో తల్లిదండ్రులకు ఆరాటం. ఎప్పుడెప్పుడు అక్షరస్వీకారం చేయిస్తామో.. ఎప్పుడెప్పుడు బడికి పంపిస్తామో అని. మన సంప్రదాయంలో పిల్లలను బడిలో వేయడం కూడా ఒక సంబరమే. పప్పు బెల్లాలు, పలకాబలపాలు తోటి పిల్లలకు పంచిపెట్టి.. తమ పిల్లలతో ఓనమాలు దిద్దిస్తారు. ఆనందంగా మొదలయ్యే విద్యార్థి జీవితం ఓ మధురానుభూతి. చదువంటే ఓ సంతోషం, ఓ ఆనందం. బడికి పోవాలనే ఒకటే ఆరాటం. ఎలాంటి ఒత్తిడి లేకుండా, హాయిగా చదువుకోవడం తొలినాళ్ల నుంచి మన విద్యావ్యవస్థలో కనిపిస్తుంది. అప్పుడే పునాది గట్టిగా ఉంటుంది. దానిపై భవిష్యత్ బంగారుమేడ గట్టిగా నిలవగలుగుతుంది.
మనిద్దరం కలిసి..
విద్యార్థి జీవితం గురువుపైనే ఆధారపడి ఉంటుంది. గురుశిష్యుల బంధం ఎంత బలంగా ఉంటే.. ఆ విద్యార్థి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. సనాతన విద్యావిధానం గురుశిష్యుల సంబంధాన్ని చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సారాంశం కేనోపనిషత్తు శాంతి మంత్రంలో కనిపిస్తుంది.
‘‘ఓం సహనావవతు, సహనౌభునక్తు..
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః’’
ఈ శాంతి మంత్రం విద్యావిధానానికి ఓ దిక్సూచి లాంటిది. దీనిలో ఉన్న గురుశిష్య సంబంధ అంశాలను పరిశీలిస్తే మన సంప్రదాయం వారి బంధానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో తెలుస్తుంది. శిష్యుడిని గురువు ఎంత ప్రేమగా చూసుకోవాలో అర్థమవుతుంది. ‘‘ఓ శిష్యుడా! మనమిద్దరినీ భగవంతుడు రక్షిస్తూ, పోషిస్తూ ఉండాలి. మనమిద్దరం శక్తిమంతులమై శ్రమిస్తూ ఉండాలి. మన అధ్యయనం తేజోవంతంగా ఉండాలి. మనిద్దరం నిరంతరం ద్వేషం లేకుండా ఉందాం’’ ఇది కేనోపనిషత్తులోని శాంతిమంత్ర ప్రసాదం. గురు-శిష్య సంబంధం గురించి విద్యార్థికి ప్రతి గురువూ తెలియజేయాలి. అప్పుడు ఆ విద్యార్థికి గురువు ప్రాణసమానుడు అవుతాడు.
అందరికీ చదువు
విద్య అందరికీ అవసరమే. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పురాణాల కాలంలోనూ ఇదే కనిపిస్తుంది. మనుషులు, దేవతలే కాదు.. చదువు ఎంత గొప్పదో అసురుల్లోనూ నాటుకుపోయింది. ఈ విషయాన్ని పోతన మహాభాగవతం ఏడో స్కందంలోని 130, 132 పద్యాల సారాంశం మనకు విశదీకరిస్తుంది. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. ఆయన కుమారుడు ప్రహ్లాదుడు. ఓ రోజు చిన్నారి ప్రహ్లాదుడిని చెంతకు పిలిచిన హిరణ్యకశిపుడు లాలనగా..
చదువని వాడజ్ఞుండగు,
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువగ వలయును జనులకు, జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!’
అని అన్నాడు. ‘‘జీవితానికి చదువు చాలా ముఖ్యం, చదువుకోని వాడు అజ్ఞానిగా ఉంటాడు.. వాడు పశువుతో సమానం. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. చదువనేది మంచి ఏమిటి? చెడు ఏమిటి? అనే వివేకాన్ని కలిగిస్తుంది. అందుకే పుట్టిన ప్రతివాడూ చదువుకోవాలి. నిన్ను మంచి గురువుల దగ్గర చదివిస్తాను’’ అని ఆ పద్య భావం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య ప్రాధాన్యం తెలియజేయాలి. తగిన విధంగా ప్రోత్సహించాలి. విద్యపై ఆసక్తి కలిగించే విషయాలు చెప్పాలి. అప్పుడు పిల్లలకూ బడిపై మమకారం పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కలుగుతుంది.
సంస్కరించే విద్య..
ఇప్పుడు చదువంటే.. మార్కులు. ఉత్తీర్ణత శాతం. పోటాపోటీ పరుగు. తల్లిదండ్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. బాగా చదవాలంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లి తమ పిల్లాడికి మార్కుల గురించి అడుగుతున్నారే కానీ, ఎలాంటి విద్య బోధిస్తున్నారో, ఏం నేర్పించాలో సూచించడం లేదు. కానీ, తల్లిదండ్రులు పిల్లవాడిని బడికి పంపినప్పుడు ఎలా వ్యవహరించారో హిరణ్యకశిపుడి ద్వారా మనకు తెలియజేశారు పోతన. ప్రహ్లాదుడిని గురువులకు అప్పగిస్తూ హిరణ్యకశిపుడు.. ‘‘ఓ గురువులారా! మా పిల్లవాడు ఇప్పటిదాకా జీవితానికి సంబంధించిన జ్ఞానం లేకుండా ఉన్నాడు. నేను మా అబ్బాయి పైకి రావాలని అనుకుంటున్నాను. దయచేసి మా పిల్లవాడికి చదువు చెప్పి గ్రంథాలు చదివించండి. నీతిశాస్త్రం నేర్పించి సంస్కరించి మమ్మల్ని రక్షించండి’’ అని విన్నవించుకున్నాడు. ఇందులో తన కుమారుడికి నైతిక విలువలున్న విద్య నేర్పించండని కోరడం కనిపిస్తుంది. విద్యకు ముందు కావాల్సింది నైతికత. మన సంప్రదాయం నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ తరం తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉన్నత విద్యతో పాటు, ఉన్నత విలువలు రావాలని ఆకాంక్షించాలి. మన విద్యావిధానంలో ప్రతి అంశానికీ నైతిక విలువలు జోడించి చెప్పడం సాధ్యమేనని విద్యావేత్తలు చెబుతున్నారు. ఫలితంగా పిల్లలకు విజ్ఞానంతో పాటు నైతికత అబ్బుతుంది. నీతిగా మెలగాలన్న స్ఫురణ కలుగుతుంది.
ఏదైనా.. విజ్ఞాన గని
ప్రతి మనిషి చదువుకోవాలి. చదువుకుంటేనే మంచి మనుగడ. పరిణామ క్రమంలో విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. పురాణకాలంలో గురుకులాల్లో చదువుకునేవారు. బౌద్ధమత రోజుల్లో అది ఆరామాలకు చేరుకుంది. తర్వాత అనేక సంస్కరణలకు నోచుకుంది, అనేక విధానాలు అలవర్చుకుంది. ఒకనాడు గురుకులం.. ఇంకోనాడు ఆరామం.. ఇప్పుడు పాఠశాల.. ఏదైనా విజ్ఞానాన్ని ప్రసాదించే ఆలయమే. అక్కడ గురువే దైవం. అక్కడికి వచ్చే శిష్యుడు పరమభక్తుడు. ఆ భక్తుడిని పరిపూర్ణంగా అనుగ్రహించాల్సింది గురుదేవుడే. ఒత్తిడి లేని చదువును అనుగ్రహించి.. విజ్ఞానాన్ని కటాక్షించి.. వారి జీవిత మార్గానికి వెలుగు ప్రసాదించాలి.
వినయమే విద్యార్జనకు తొలిమెట్టు. గురువు కూర్చునే ఆసనం, ఆయన వినియోగించే వస్తువులను కూడా సాక్షాత్తు గురువే అనే భావనతో ఉండేవారు అప్పటి విద్యార్థులు. పాఠం ముగించుకొని గురువు వెళ్లాక.. ఆయన వినియోగించిన ఆసనాన్ని తాకడానికి సాహసించేవారు కాదు. గురువుపై అంతటి భక్తిప్రపత్తులుండేవి.
విలువలకు కట్టుబడి
గురువు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. విరాటరాజు కొలువులో బృహన్నలగా ఉన్న అర్జునుడు రాకుమారి ఉత్తరకు నాట్యం నేర్పించేవాడు. ఉత్తర అపురూప సౌందర్యరాశి. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఉత్తరను వివాహం చేసుకోవాల్సిందిగా అర్జునుడిని కోరుతాడు విరాటరాజు. అప్పుడు అర్జునుడు ‘గురువుగా ధర్మం తప్పడం మంచిది కాదని, ఉత్తరను తన కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేస్తాన’ని విరాటరాజుకు వివరించి చెబుతాడు.
విద్యార్థుల ప్రవర్తన
- డా.యల్లాప్రగడ మల్లికార్జునరావు
పాఠశాల
ఒక సామాజిక దేవాలయం. అక్కడ అందరూ సమానం. పేద, ధనిక భేదాలు ఉండకూడదు.
పురాణాల కాలం నుంచి మన విద్యావ్యవస్థలో ఇది కనిపిస్తుంది. దశరథ మహారాజు
కుమారులైన రామలక్ష్మణభరతశత్రుఘ్నులు వసిష్ఠుడి దగ్గర, బలరామకృష్ణులు
సాందీపని ముని దగ్గర ధనవంతుల పిల్లల్లా విద్యనభ్యసించలేదు. నిరాడంబరంగా,
సామాన్యుల్లాగే చదువుకున్నారు. సామాజిక, రాజనీతి విషయాలలో శ్రీరామచంద్రుడు
ఈనాటికీ ఆదర్శమూర్తిగా భావించడానికి కారణం గురువు దగ్గర వినయంగా
విద్యనభ్యసించడమే. శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడితో స్నేహం చేశాడు.
వారి మైత్రి గురుకులం వరకే పరిమితం కాలేదు. కృష్ణుడు ఎంతో ఉన్నతస్థాయికి
ఎదిగాక కూడా కుచేలుడిని ఆదరించాడు. తన సరసన కూర్చోబెట్టుకొని, గౌరవించేంతటి
సంస్కారం ఆనాటి విద్యావిధానం నేర్పినదే.
|
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565