వర్షరుతువు హోమియో
వానా వానాహాయప్పా!
జలుబు, దగ్గు, ఆస్థమా వంటి సమస్యలు ఒకటే అయినా వాటి లక్షణాలు, తీవ్రత అందరిలో ఒకేలా ఉండవు. అందుకే హోమియో విధానం ఆయా వ్యక్తుల పరిస్థితి, రోగ లక్షణాలను బట్టి రకరకాల మందులను సూచిస్తుంది. రోగ లక్షణాలు తగ్గుముఖం పట్టేలా చేసే మందులతో పాటు అవి మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, దీర్ఘకాల (క్రానిక్) సమస్యలుగా మారకుండా చూడటానికి శరీర తత్వాన్ని బట్టి (కాన్‌స్టిట్యూషనల్) వాడుకోవాల్సిన ఔషధాలకూ ప్రాధాన్యం ఇస్తుంది.
ఎండ వేడి బెడద లేదు. ఉక్కపోత చిక్కులేదు. ఉదయం లేస్తూనే శరీరాన్ని చల్లగా తాకే గాలి. చిటపట చినుకుల సందడి. నింగికీ నేలకూ ఉయ్యాలలేసే వానధార. అవును.. వర్షకాలం వస్తూనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెంటబెట్టుకు వస్తుంది. ఎటుచూసినా పచ్చటి ప్రకృతి సోయగంతో పలకరిస్తుంది. అయితే ఇంతటి సంతోషాన్ని పంచే వర్షకాలం కొన్ని ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తుంది. జలుబు, తుమ్ములు, ముక్కు కారటం సరేసరి. ఆహారం, నీరు కలుషితం కావటం వల్ల పట్టుకునే విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్ జ్వరం.. దోమకాటుతో విరుచుకుపడే మలేరియా.. ఇలా ఎన్నెన్నో జబ్బులు చుట్టుముడుతుంటాయి. మరి వీటి నుంచి కాపాడుకోవటమెలా? ఇందుకు హోమియో చక్కటి పరిష్కారం చూపిస్తుంది. సహజ వైద్య విధానంతో సరళ పరిష్కారాలను అందిస్తుంది.
మన ఆరోగ్యాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రుతువుల గురించి. ఆయా కాలాల్లో తలెత్తే వాతావరణ మార్పులు.. ఎండ, చలి, వానల వంటివి మన శరీరంపై గణనీయమైన ప్రభావాన్నే చూపిస్తాయి. కొందరిలో ఇవి సమస్యాత్మకంగానూ పరిణమిస్తాయి. ఈ వర్షకాలంలో వానలో తడవటం, తేమ గాలి ప్రభావం వల్ల కొందరికి కొన్ని సమస్యలు ఆరంభం కావొచ్చు. కొందరికి అప్పటికే ఉన్న బాధలు ఎక్కువ కావొచ్చు కూడా. వానకాలంలో చాలామంది తరచుగా జలుబు బారినపడుతుండటం తెలిసిందే. దీంతో తుమ్ములు, దగ్గు, ముక్కు కారటం వంటివి తెగ వేధిస్తుంటాయి. అందుకేనేమో పడిశం పది రోగాల పెట్టు అంటుంటారు. ఇక కీళ్ల సమస్యలతో బాధపడేవారికైతే వానకాలంలో వాపులు, నొప్పులు మరింత ఎక్కువవుతుంటాయి కూడా. ఇలా కాలనుగుణంగా ఎదురయ్యే సమస్యలకు మూల హేతువు మన వ్యాధి నిరోధక వ్యవస్థ గాడి తప్పటం. ఇందుకు ఆయా కాలాల్లో వచ్చే మార్పులు దోహదం చేస్తుండటం.
ఒంట్లో కీలక ‘కేబినెట్’!
మన శరీరంలో, మనసులో తలెత్తే అస్తవ్యస్తాలే అన్ని వ్యాధులకు మూలం. దీనికి కారణం అంతర్గత, బాహ్య అంశాల ప్రేరేపణే. ఈ అంశాల కారణంగా వ్యక్తిలో తలెత్తే స్పందనలే రోగ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. అందుకే హోమియో వైద్య విధానం బహిర్, అంతర కారణాలు రెంటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. గాలి, నీరు, తేమ, సూక్ష్మక్రిముల వంటి పరిసరాల ప్రభావాలన్నీ బాహ్య కారణాలు. శరీర తత్వం, మనస్తత్వం, వయసు వంటివన్నీ ఆంతరంగిక కారణాలు. మనలో మానసిక (సైకో), నాడీ (న్యూరో), గ్రంథి (ఎండోక్రైన్), వ్యాధి నిరోధక (ఇమ్యూనిటీ) వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి. మన దేహాన్ని ఒక దేశమని అనుకున్నట్టయితే దాన్ని పరిపాలించే కీలకమైన ‘కేబినెట్’ సభ్యులు ఇవేనన్నమాట! ఈ అంతర్గత వ్యవస్థలు ప్రతి వ్యక్తిలో వేర్వేరుగా ఉంటాయి. మనిషి వ్యక్తిత్వానికి ఇవే ఆధారం. వీటిల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ ఇంకా ముఖ్యం. దీన్నే ప్రాణమనీ చెప్పుకోవచ్చు. ఆయా కాలాల్లో వచ్చే సమస్యల విషయంలో కచ్చితమైన సూత్రమంటూ ఏదీ లేదు. ఉదాహరణకు- వానలో అందరూ తడవొచ్చు గానీ కొందరికే జలుబు, తుమ్ముల వంటివి పట్టుకుంటుంటాయి. దీనికి కారణం వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరే మూలం. ఇది దెబ్బతింటే రకరకాల జబ్బులు తేలికగా దాడిచేస్తాయి. అదేపనిగా బాహ్య కారణాలు దాడిచేస్తుంటే అంతర్గత కీలక వ్యవస్థలు బలహీనపడి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఈ వ్యవస్థలను తిరిగి బలోపేతం చేస్తే వ్యాధులు, బాధలన్నీ కుదరుకుంటాయి.
వ్యాధిని నిరోధించటానికి గానీ నివారించటానికి గానీ జీవశక్తిని ఉత్తేజపరచటం చాలా అవసరం. హోమియో వైద్య విధానం చేసే పని ఇదే. లక్షణాల కంటే కూడా శరీర తత్వం, వ్యక్తిత్వానికి ప్రాధాన్యమిస్తూ.. వ్యాధి సమూలంగా నయమయ్యేలా చేస్తుంది.
నిజానికి బయటకు కనిపించే రోగ లక్షణాలన్నీ కూడా పరిసరాల ప్రభావం ఒత్తిడిని తట్టుకునేందుకు మన ఆంతరంగిక వ్యవస్థ చేసుకునే ఏర్పాట్లే అనుకోవచ్చు. శరీరం వ్యక్తం చేసే ఈ లక్షణాలను బట్టి మనం రకరకాల వ్యాధుల పేర్లతో పిలుచుకుంటున్నాం. ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. ఒకే రకం బాహ్య పరిస్థితుల్లో ఉండేవారిలో కూడా.. ఆంతరంగిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి స్పందనలు కూడా వేరుగా ఉంటాయి. వర్షం, తేమ, తేమతో కూడిన గాలి అన్నవి బాహ్య పరిస్థితులు. దీనికి వ్యక్తి స్పందనల తీరును బట్టి మందులను ఎంపిక చేసి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంటుంది. హోమియో చికిత్సలో ఇది చాలా కీలకమైన అంశం. మందుల ఎంపికలో వ్యాధి లక్షణాలు మాత్రమే కాకుండా వ్యక్తి స్వభావం, తత్వం తెలిసి ఉండటం కూడా చాలా అవసరం. అప్పుడే దానికి తగ్గ సమర్థవంతమైన మందును ఎంపిక చేసుకోవటానికి వీలవుతుంది. కాల ప్రభావం ఒక్కొక్కరిలో ఒకోలా ఉంటుంది. ఉదాహరణకు ఉబ్బసం ఒకటే అయినా కొందరికి అర్ధరాత్రి సమయంలో ఉద్ధృతంగా ఉంటుంటే.. మరికొందరికి తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క బాధను బట్టే మందు ఇవ్వటం హోమియో పద్ధతి కాదు. రోగ లక్షణాలు, రోగి శరీర తత్వాన్ని బట్టి మందును ఎంచుకోవాల్సి ఉంటుంది.
మనిషి వ్యక్తిత్వానికి అంతర్గత వ్యవస్థలే ఆధారం. వీటిల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ ఇంకా ముఖ్యం. దీన్నే ప్రాణమనీ చెప్పుకోవచ్చు.
రస్టాక్స్: వర్షకాలంలో ప్రధానంగా చెప్పుకోదగిన ఔషధమిది. వానలు కురిసే ముందు ముఖ్యంగా.. తుపాన్లు వచ్చే ముందు తలెత్తే బాధలకిది మంచి మందు. జలుబు, కీళ్లవాతం, కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, జ్వరం.. ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుఖంగా, హాయిగా ఉండాలి. కానీ కొందరికి విశ్రాంతిగా ఉన్నప్పుడు నొప్పులు, బాధలు పెరుగుతుంటాయి. వీరికి అటూ ఇటూ కదులుతూ మెదులుతూ ఉంటేనే ఉపశమనంగా అనిపిస్తుంటుంది. నిద్రలేవటంతోనే కండరాలు, కీళ్లు బిగపట్టుకొని పోయి ఉంటాయి. ఇలాంటివారికి రస్టాక్స్ మేలు చేస్తుంది. పగటి పూట కన్నా రాత్రి పూట బాధలు ఎక్కువుతుంటే దీన్ని వాడుకోవచ్చు. అర్ధరాత్రి దాటాక పొట్టలో నొప్పి, నీళ్ల విరేచనాలతో బాధపడే పిల్లలకు, అస్థిమితంగా ఉండేవారికిది మంచి ఉపశమనం కలగజేస్తుంది. వానలో తల తడిచిన తర్వాత పట్టుకునే జలుబు, దగ్గు, తుమ్ముల వంటి బాధలకు బాగా ఉపయోగపడుతుంది. ఏవైనా బరువు పనులు, శారీరక శ్రమ చేయటం వల్ల బాధలు ఎక్కువవుతుంటే దీన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
డల్కమారా: ఒకరకంగా దీన్ని వర్షకాల టీకా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ కాలంలో తలెత్తే శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవటానికే కాదు.. అవి రాకుండా చూసుకోవటానికీ ఉపయోగపడుతుంది. తేమ, చెమ్మతో కూడిన వాతావరణంలో.. సముద్రతీర ప్రాంతాల్లో నివసించేవారిలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. వర్షకాలంలో ఇలాంటి సమస్యలకు గురయ్యేవారికి డల్కమారా మంచి ఔషధం. ఎండ కాస్తూ.. కాస్తూ.. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోవటం మూలంగా తలెత్తే సమస్యలకిది బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు, కఫం పడటం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టటానికి తోడ్పడుతుంది. కఫంలో రక్తం పడుతున్నా దీన్ని గుర్తుంచుకోవాలి. ముక్కులు బిగుసుకుపోవటం, గొంతునొప్పి తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మవ్యాధులతో బాధపడేవారు ఈ కాలంలో ఆ సమస్య తగ్గిపోయి.. కొత్తగా శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నట్టు గమనిస్తే దీన్ని వాడుకోవటం ఉత్తమం. జలుబు చేసినపుడు దగ్గు, తుమ్ములతో పాటు చర్మం మీద దద్దు (అర్టికేరియా) కూడా ఉన్నట్టు గమనిస్తే డల్కమారా తీసుకోవచ్చు. వేసవికాలం పోయిన తర్వాత తొలకరిలో పట్టుకునే నీళ్ల విరేచనాలకూ ఇది ముఖ్యమైన ఔషధమే. మలం ఆకుపచ్చగా ఉంటున్నా, పల్చగా నీళ్లలాగా విరేచనం అవుతున్నా దీన్ని వాడుకోవటం మంచిది.
ఆర్సెనికం ఆల్బ్: వర్షకాలంలో జలుబు, దగ్గులకు గురయ్యేవారికిది దివ్యమైన ఔషధం. ఆహారం కలుషితం (ఫుడ్ పాయిజనింగ్) కావటం వల్ల పట్టుకునే విరేచనాలు, వాంతులను తగ్గించటానికీ బాగా ఉపయోగపడుతుంది. వాంతులు, విరేచనాలు ఒకే సమయంలో అవుతున్నవారికి, కలరా బాధితులకు ఆర్సెనికం ఆల్బ్ ప్రత్యేకమైన ఔషధం. ఇది నిస్త్రాణ తగ్గటానికీ తోడ్పడుతుంది. వర్షకాలంలో తరచుగా కనబడే జలుబు, దగ్గు, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులను సమర్థంగా తగ్గిస్తుంది. ఆస్థమా బాధితులకు.. ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట సమయంలో ఆయాసానికి గురయ్యేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
నేట్రం సల్ఫ్: తేమ, చల్లటి వాతావరణంలో పట్టుకునే ఉబ్బసం, నీళ్ల విరేచనాలు తగ్గటానికిది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో ఆయాసం ఎక్కువయ్యేవారికి దీంతో మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో ఆస్థమాకు నేట్రం సల్ఫ్ దివ్యంగా పనిచేస్తుంది. పిల్లికూతలు, శ్లేష్మం ఎక్కువగా ఉండేవాళ్లు దీన్ని వాడుకోవచ్చు. ఛాతీలో నొప్పి.. ముఖ్యంగా ఎడమవైపున నొప్పి వచ్చేవారికి ఉపయోగపడుతుంది.
నేట్రంమూర్: మలేరియా జ్వరానికి విశిష్టమైన ఔషధమిది. మలేరియా జ్వరంతో శుష్కించి, పాలిపోయి నీరసంగా ఉన్న రోగులు దీన్ని వాడితే త్వరగా కోలుకుంటారు. జ్వరం పది, పదకొండు గంటలకు మొదలయ్యేవారు దీన్ని వాడుకోవచ్చు. బద్ధలవుతున్నట్టుగా తలనొప్పి, చలి, జ్వరం గలవారికి ఇదెంతో మేలు చేస్తుంది. కొందరికి మలేరియా చలితో మొదలై వాంతులకు దారితీస్తుంటుంది. ఇలాంటివారికిది బాగా ఉపయోగపడుతుంది.
వానకాల సమస్యల బాధలను తగ్గించే ఔషధాలివి. వీటిని ఆయా లక్షణాలను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులను 30 పొటెన్సీలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి లక్షణాలు తగ్గేంతవరకు వేసుకోవచ్చు.
లేకిసిస్: శరీరంలో ఎడమవైపు సమస్యలతో బాధపడుతున్నట్టయితే దీని గురించి ఆలోచించాలి. వీరిలో సమస్యలు ఎడమవైపు మొదలై.. కుడివైపునకు వ్యాపిస్తుంటాయి. వీరికి నిద్ర పెద్ద శత్రువు. నిద్ర పట్టిన తర్వాత సమస్యలు ఉద్ధృతమవుతాయి. ఆయా బాధలతో నిద్రలోంచి లేస్తుంటారు కూడా. కొందరు శ్వాస ఆగిపోయి, ఉలిక్కి పడి లేస్తుంటారు (స్లీప్ అప్నియా). వీరికి అసూయ ఎక్కువ. అనుమాన రోగులు. నిష్కారణంగా అనుమానిస్తుంటారు. వాగుడు కాయలు కూడా. అతిగా మాట్లాడుతుంటారు. మాటిమాటికీ తలనొప్పి, గొంతు సమస్యలతో బాధపడుతుంటారు. రక్తస్రావమైతే కండలు కండలుగా అవుతుంటుంది. మహిళల్లో నెలసరి దగ్గరపడుతున్నకొద్దీ సమస్యలు ఎక్కువవుతుంటాయి. రుతుస్రావం మొదలవ్వగానే తగ్గిపోతుంటాయి.
సల్ఫర్: రుతువులు మారినప్పుడల్లా బాధలకు గురయ్యేవారికిది ముఖ్యమైన ఔషధం. ఉదయం 11 గంటల సమయంలో సమస్యలు ఎక్కువయ్యేవారికిది ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటివి ఎక్కువవుతుంటే దీన్ని తీసుకోవచ్చు. ఉదయం పూట విరేచనాలు అవుతూ.. మధ్యాహ్నమయ్యాక తగ్గిపోతుండేవారికీ బాగా ఉపయోగపడుతుంది. పరిశుభ్రతను అంతగా పట్టించుకోనివారు, తేమ వాతావరణంలో బాధలు ఎక్కువయ్యేవారు దీన్ని తీసుకోవటం మంచిది. మలబద్ధకం, ఆసనంలో మంట, మొలల వంటి సమస్యలు గలవారికి.. తీపి, మద్యం బాగా ఇష్టపడేవారికి.. తెలివితేటలు కలిగి ఎక్కువగా గర్వపడేవారికి ఇది ఆలోచించదగిన మందు.
సైలీషియా: ఇది సిగ్గు, బిడియం, పిరికితనం, మొండితనం ఎక్కువగా ఉండే స్వభావం గలవారికి ఉపయోగపడే ఔషధం. అరిచేతులకు, అరికాళ్లకు చెమటలు ఎక్కువగా పోసేవారు.. మేజోళ్లు చెమటలో నాని దుర్వాసన వస్తుండేవారు దీని గురించి ఆలోచించాలి. పని అవుతుందో కాదో, రైలు అందుతుందో లేదో అని ప్రతిదానికీ ఆదుర్దా పడే స్వభావం గలవారికి సైలీషియా బాగా ఉపయోగపడుతుంది. పరీక్షలంటే భయపడిపోయే పిల్లలకు, కుడివైపున పార్శ్వనొప్పితో బాధపడేవారికిది మంచి ఔషధం. విసర్జన సమయంలో మలం ఆసనం దాకా వచ్చి వెనక్కి మళ్లుతున్నా.. శరీరం మీద సూదులు గుచ్చుకున్నట్టుగా బాధలు వేధిస్తున్నా దీని గురించి ఆలోచించాలి. టీకాలు ఇచ్చిన తర్వాత వచ్చే బాధలన్నింటికీ సైలీషియా బాగా పనిచేస్తుంది. దుమ్ము ధూళిలో పనిచేయటం వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలు తగ్గటానికీ ఉపయోగపడుతుంది. తలలో చెమటలు పట్టేవారికిది గుర్తుంచుకోదగిన ఔషధం. కాళ్లు చేతులు సన్నగా ఉండి.. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే రికెట్స్‌తో బాధపడేవారికీ మేలు చేస్తుంది.
శరీర తత్వాన్ని (కాన్‌స్టిట్యూషనల్) బట్టి తీసుకోవాల్సిన ఔషధాలు ఇవి. వాతావరణం మారినప్పుడల్లా తలెత్తే సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికివి తోడ్పడతాయి. వీటిని వ్యాధి లక్షణాలు తగ్గాక- 30 పొటెన్సీలో వారానికి ఒకసారి చొప్పున 4-6 వారాలు వాడుకోవాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565