భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర
Bharateeya Ujwala Vaignanika Parampara
RS 200/- online...
-Suresh Soni
ఈ పుస్తకాన్ని శ్రీ సురేష్ సోనీ గారు హిందీ లో రచించారు, తెలుగులోకి శ్రీ బెల్లంకొండ మల్లారెడ్డిగారు అనువదించారు, నవయుగభారతి, భాగ్యనగర్ వారు ప్రచురించారు.
ఇక పుస్తకం విషయానికి వస్తే.... మన పూర్వికులు చాలా విషయాలు కనుకొన్నారు, అని గొప్పలు చెబుతూ ఉండే వాళ్ళను మనం చూస్తుంటాం. ఏం కనుగొన్నారు అని ప్రశ్నిస్తే మరలా కనిపించరు. అలానే "వేదాలలో అన్నీ ఉన్నాయిష" అని గేలిచేసేవారు, భారతీయులు కనుగొన్నది '0' అని వ్యంగ్యంగా ద్వంద్వార్థాలతో మాట్లాడేవారు మనకు చాలా తరచుగా కనిపిస్తూనే ఉంటారు. పాశ్చాత్య విద్యను అభ్యసించడం వలన మనలోని స్వాభిమానం దెబ్బతిన్నదని చెప్పవచ్చు. మెకాలే విద్య ఉద్దేశ్యం నెరవేరిందనేది, నేటి పరిస్థితులను గమనిస్తే మనకు తెలియవచ్చే సత్యం.
విమర్శించేవారికి ఈ పుస్తకం ఒక పెద్ద చెంప పెట్టు. గొప్పలు చెప్పుకునేవారికి మంచి సమాచారాన్ని అందిచే పుస్తకం. అపార విజ్ఞానాన్ని అందిచిన భారతీయ వైజ్ఞానికుల ప్రతిభను ఒక 220 పేజీల పుస్తకంలో అందించడమనేది అసంభవం. భారతీయ విజ్ఞానమనేది పాల సముద్రం అందులో మనం ఎంత త్రాగగలం. మన కడుపు పట్టినంత, మనకు అవసరమైనంత అంతే. ఆ పాల సముద్రాన్ని చిలికి తీసిన వెన్న భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర అనే పుస్తకం. ఈ పుస్తకంలో ఇచ్చిన విషయాలు సాక్షాధారాలతో సహా నిరూపించారు. భారతీయ విజ్ఞానం పై ఆసక్తి ఉన్న యువకులకు ఈ పుస్తకం ఒక మణిదీపం. ఈ పుస్తకంలో ఇచ్చిన విషయాలు ఒకొక్కటి ఒకొక్క రీసెర్చికి పనికి వచ్చే విషయాలు. భారతీయులు వైజ్ఞానిక ప్రపంచానికి చేసింది ఏమీలేదు అనుకుని నిరాశతో క్రుంగిపోయే యువతకు, మన విజ్ఞానే అపారం అని తెలియజేసి ధైర్యం చెప్పే పుస్తకం. భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే పుస్తకం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
సరే ఈ పుస్తకం చర్చించిన విషయాలు కొన్ని మచ్చుకకు చూద్దాం.... విధ్యత్ శాస్త్రం, యంత్రవిజ్ఞానం, ధాతు విజ్ఞనం అంటే లోహశాస్తం, విమాన విద్య, నౌకాశాస్తం, గణితం, కాలగణన, రసాయన శాస్త్రం, వ్యవసాయం వంటి 21 అంశాలను ఈ గ్రంథం స్పృశిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు ఒకొక్క అంశం ఒకొక్క డాక్టరేటును ఇవ్వగలదు. సంస్కృత, ఆంగ్ల, మరాఠీ, గుజరాతీ భాషలలోని దాదాపు 70 పుస్తకాలలోని విషయాలను క్రోడీకరించి అందించిన పుస్తకం. ఈ పుస్తకం అందించిన శ్రీ సురేష్ సోనీ గారికి, తెలుగులోకి అనువదించిన శ్రీ బెల్లంకొండ మల్లారెడ్డి గారికి మనం ఋణపడి ఉండాలి. ఎంతో శ్రమకోర్చి చాలా భారతీయ వైజ్ఞానిక వైభవాన్ని మన కళ్ళముందుంచారు.
మనిషి పుట్టుకతో 4 ఋణాలతో పుడతాడని శాస్త్రం చెబుతుంది. అందులో ఒకటి ఋషి ఋణం. ఆ ఋణం తీరాలంటే వారిచ్చిన అమూల్యమైన సాహిత్యాన్ని, గ్రంథాలను చదివి మాత్రమే తీర్చుకోగలం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన పుస్తకం "భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర". యువకులందరూ చదవాల్సిన పుస్తకం, పెద్దలందరూ యువకులచేత చదివించాల్సిన పుస్తంకం. నేను చెప్పేందుకంటే మీరు చదివితే బాగుంటుంది.