MohanPublications Print Books Online store clik Here Devullu.com

ముహూర్త భేదాలు_ Muhoortha_differences


ముహూర్త భేదాలు_ Muhoortha_differences

ముహూర్త భేదాలు

కార్యసాధకుడికి మనోనిశ్చయమే ప్రధానం. శుభాశుభ ముహూర్తాల విచారణ అవసరం లేదు. ఈ దేహం పతనమవుతున్నా సరే, మనోనిశ్చయంతో కార్యాన్ని సాధించాలన్నది తైత్తరీయోపనిషత్‌ సందేశం. కార్యం పవిత్రమైనదే అయితే ఆ కార్యసాధకుడు ముహూర్తబలం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటాడు.

రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ప్రయాణానికి ముహూర్తం బాగాలేదని పాండవులు సూచిస్తే... 'అయిననూ పోయి రావలె హస్తినకు' అంటాడు కృష్ణుడు. మనం తలపెట్టిన కార్యం స్వప్రయోజనానికి కాకుండా సమాజానికి అవసరమైనదైతే చాలు- అలాంటి కార్యాన్ని ఎప్పుడు ప్రారంభించినా అదే సుముహూర్తమవుతుంది.


కాలం అనేది ప్రాపంచికమైనది. కాలానుగుణంగా తిథి వార నక్షత్రాలు మారుతుంటాయి. పరంలో కాలమనేదే లేదు. ఇహ పరాల్లోని అన్నీ బ్రహ్మమేనని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాలం సైతం బ్రహ్మమే కనుక సుముహూర్తమనీ, దుర్ముహూర్తమనీ భేదాలు లేవు. యద్భావం తద్భవతి అన్నట్లుగా భావాన్ని అనుసరించి మాత్రమే కాలం మనకు గోచరమవుతుంది.


కర్రతో గుర్రం వంటి ఆకారాన్ని తయారుచేసి ఉంచారనుకుందాం. కొంతదూరం నుంచి గమనించినవారికి అది నిజమైన గుర్రంగానే కనిపిస్తుంది. ఆ సమయంలో మన దృష్టికి కర్ర కనబడదు. కర్ర అనే పదార్థం గుర్రం ఆకారంలో లీనమై ఉంటుంది. మనం దగ్గరకు వెళ్లి చూశామనుకోండి. అప్పుడు ఆ ఆకారం మొత్తం కర్రమయమై కనిపిస్తుంది. అంతవరకు కనిపించిన గుర్రం ఆ కర్రలో లీనమైపోతుంది. అదేవిధంగా ఈ భూమిపైన కాలంలో సుముహూర్తం దుర్ముహూర్తంగా కనపడినా, నిశితంగా గమనిస్తే కాలం యావత్తు బ్రహ్మమయమై ఉంటుంది. అలాంటప్పుడు చెడు, మంచి ముహూర్తాలెక్కడివి?


కాల గమనాలన్నీ కాల్పనికాలేనని యముడు నచికేతుడికి చెప్పినట్లుగా కఠోపనిషత్తులో ఉంది. అటువంటి వాక్కుల నేపథ్యంలో తిథి, వార, నక్షత్రాల్లో మంచివి కొన్ని, చెడువి కొన్ని ఉంటాయని ఎలా చెప్పగలం?


జరాసంధుడి వధను లక్షించి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో మగధకు బయలుదేరతారు. మగధలో అడుగు పెట్టేటప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు- 'బావా! శత్రువును జయించేందుకు ముగ్గురం బ్రాహ్మణ వేషంలో బయలుదేరాం... బ్రాహ్మణత్రయం శుభం కాదు కదా' అని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు 'బావా! మూఢ నమ్మకాలు మంచివి కావు. శత్రు సంహారంవల్ల దుష్ట శిక్షణ జరుగుతుంది. జరాసంధుడి మరణ సమయమే మనకు సుముహూర్తం' అంటాడు. జరాసంధుడి వధ నిరాటంకంగా సాగుతుంది.


కాలాలు ముహూర్తాలు అనేవి అత్యంత ప్రభావం కలిగి ఉంటాయి. ముహూర్తాలు ఇలాంటివే! కాల స్వరూప స్వభావాలు ముహూర్త బలాలు ఇలా ఇంటాయని చెప్పడం కష్టమని రఘువంశంలో కాళిదాసు వివరిస్తాడు. సాధారణంగా అష్టమి నవములు మంచి తిథులు కావని భావిస్తారు. నవమి తరవాత దశమి వస్తుంది. దశమి తిథి అన్ని విధాలా మంచి రోజని చాలామంది విశ్వసిస్తారు. మరి శ్రీరామచంద్రుడు శుక్లపక్ష నవమి రోజు ఎందుకు జన్మించాడు? ఆ మరుసటి రోజు చాలా మంచిది కదా! ఇదే ప్రశ్నను దశరథుడు వశిష్ఠుని అడుగుతాడు. అందుకు ఆయన బదులిస్తూ 'రాజా! ఈ మహాపురుషుడు కారణజన్ముడు. కార్యసాఫల్యం కోసం అవతరించినవారికి జన్మించడమే ప్రధానం కాని తిథి, వార, నక్షత్రాలు కాదు. మనోనిశ్చయంతో ఉన్నవాడు కాలానికి సైతం ఎదురీదగలడు. ముహూర్తబలం కన్నా ఆత్మబలం గొప్పది కదా దశరథ మహారాజా!' అంటాడు.


జీవన్ముక్తులకు శుభాశుభ ఘడియలు ఉండవు. మూఢ నమ్మకాలు అవిద్యకు సంకేతమని రమణ మహర్షి బోధించేవారు. పూర్ణచంద్రుడు ఉదయించిన రాత్రినీ, అమావాస్య నిశినీ ఒకే రీతిలో ఆస్వాదిస్తానని ఆయన అనేవారు. 

వశిష్ఠుడు శుభ ముహూర్తమని తలచిన రోజునే శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లాడు. 'మంచి రోజని రేపు తలపెట్టిన కార్యాన్ని ఈ రోజే చేసెయ్‌. ఈ రోజు తలపెట్టిన కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించు' అంటాడు కబీర్‌! 

సూర్యుడు రోజూ ఉదయిస్తాడు. రాత్రి కాగానే అస్తమిస్తాడు. ఆదిత్యుడికి తిథి, వార, నక్షత్రాల పట్టింపులు లేవు. విధి నిర్వహణే ఆ ఆదిత్యుడికి ముఖ్యం. కార్యసాధకుడెప్పుడూ కాలం కోసం వేచి ఉండరాదు. కార్యం మంచిదైతే కాలం సైతం సహకరిస్తుంది. దుర్ముహూర్తం కూడా సుముహూర్తంగా మారుతుంది!                          - అప్పరుసు రమాకాంతరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list