తప్పులు చేయడం మానవ స్వభావం. పుట్టుక మొదలు గిట్టేదాకా తెలిసో, తెలియకో తప్పులు చేస్తుండటం అతడికి సహజం. వాటిని ‘అపరాధాలు’ అంటారు. జగద్గురువు శంకర భగవత్పాదులు మానవ అపరాధాల్ని స్తోత్ర రూపంలో శివుడికి నివేదించారు. క్షమించాలని వేడుకొన్నారు. అది ‘శివాపరాధ క్షమాపణ స్తోత్రం’గా ప్రసిద్ధి చెందింది.
‘ఓ పరమేశ్వరా! రోగాల వల్ల ఎంతో దుఃఖం కలుగుతోంది. అలాంటి దుఃఖకారకమైన అపరాధం చేయకుండా నన్ను రక్షించు. యౌవనంలో అనేక ‘మాధుర్యాలు’ నన్ను వెంటాడుతున్నాయి. అటువంటి దుర్దశ మళ్లీ కలగకుండా అనుగ్రహించు. వృద్ధాప్యంలో శక్తి నశిస్తోంది. అధైర్యం తరుముతోంది. మృత్యుభయం పీడిస్తోంది. ముళ్లకంపలో పడిన కాకిలా మారింది నా పరిస్థితి. పరమ దుర్భరంగా ఉంది. అపరాధాల్ని మన్నించి, నన్ను కాపాడు.
నేను పొద్దున నిద్ర లేచి స్నానం చేసి నీ కోసం గంగాజలాలతో అభిషేకం చేయలేదు. ఒక్కనాడైనా, ఒక్క మారేడు దళాన్నీ సమర్పించలేదు. సరస్సులో పూచిన కమలాన్ని తెచ్చి నీకు అలంకరించలేదు. నా అపరాధాల్ని మన్నించు. పంచామృతాలతో నీకు అర్చన చేయలేదు. పదహారు ఉపచారాలూ చేయడం మరిచాను. ఒక్క పత్రమో, పుష్పమో, ఫలమో- ఏదీ సమర్పించలేదు. శాస్త్రాలు ఎన్నో మంచి విషయాలు చెప్పినా, వాటిని నేను వినలేదు. వాటి గురించి ఆలోచనైనా చేయలేదు. ఏ ఒక్కటీ మనసులో పెట్టుకోలేదు. ఇదంతా నా అపరాధమే కాబట్టి మన్నించి అనుగ్రహించు.
స్వామీ! నీ కోసం ఒక్కనాడైనా నమక చమకాలతో కూడిన రుద్ర మంత్రాల్ని పఠించలేదు. యజ్ఞాలు చేయలేదు. నీ నామాన్ని జపించలేదు. నీ కోసం తపించలేదు. ఈ అపరాధాల్ని క్షమించు.
నాకు అపారంగా ధనం ఉంది. తిరిగేందుకు వాహనాలున్నాయి. పెద్దపెద్ద నివాస భవనాలున్నాయి. ఆస్తిపాస్తులున్నాయి. కుటుంబం ఉంది. బంధుమిత్రులెందరో ఉన్నారు. సమాజంలో గౌరవ మర్యాదలున్నాయి. పలుకుబడి ఉంది. అధికారం ఉంది. ఇన్ని ఉన్నా ఏం లాభం? ఇవన్నీ ఏ క్షణంలోనైనా దూరం కావచ్చు. ఇవన్నీ క్షణభంగురాలే. వీటి వల్ల నాకు మనశ్శాంతి లభించడం లేదు. పరమేశ్వరా! ఎప్పుడూ నిన్ను ధ్యానిస్తూ, మానసిక శాంతితో ఉండే వరాన్ని ప్రసాదించు!
చూస్తుండగానే ముసలితనం వచ్చేసింది. కాలం ఎంతో వేగంగా పరుగెత్తుతోంది. మొన్న మెరిసిన యౌవనం నేడు మాయమైపోయింది. గతించిన రోజులు తిరిగి రావడం లేదు. కాలం నన్ను కబళించేలా ఉంది. సంపదలన్నీ నీళ్లలో తరంగాల్లా అప్పుడే ఎగసిపడి, అప్పుడే మాయమైపోతున్నాయి. జీవితమంతా మెరుపులా మెరిసి మాయమైందని అనిపిస్తోంది. ఈ దురవస్థ నుంచి నన్ను రక్షించి, మనశ్శాంతిని ప్రసాదించు స్వామీ!’
ఇలా సాగిపోయే శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో మానవ జీవన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. మనిషి జననం నుంచి మరణం వరకు ఉత్థాన పతనాలుగా సాగే దశలెన్నో ఈ స్తోత్రంలో దర్శనమిస్తాయి. ‘మనిషి సుఖాలుగా భావిస్తున్నవన్నీ పరిణామ దశలో దుఃఖదాయకాలు’ అనే సత్యం బోధపడుతుంది. యౌవనం పైకి ఎంత అందంగా కనిపించినా, అది కొంతకాలమే ఉంటుంది. అది అనిత్యమే! పలుకుబడులు, పదవులు కొన్నాళ్ల మురిపాలే అని; వాటికీ శాశ్వతత్వం లేదని ఈ స్తోత్రంతో తేటతెల్లమవుతుంది. పరమేశ్వరుడిపై మనసు నిలపడం అనే పారమార్థిక భావన ఒక్కటే ఆత్మతృప్తికి, మానసిక శాంతికి మూలమవుతుందని ఈ స్తోత్రం బోధిస్తుంది.
స్తోత్రాల్లో భక్తితో పాటు మానవ జీవన సౌందర్యమూ దాగి ఉంటుంది. వారిని నీతిమార్గంలో నడిపేందుకు, సంస్కరించి ముందుకు సాగేలా చేసేందుకు స్తోత్రాలు బాటలు వేస్తున్నాయి. అవి ధర్మపథాన్ని చూపుతున్నాయి. అశాశ్వత అంశాలపై మనుషుల దురాశను దూరం చేస్తున్నాయి. శాశ్వతానందాన్ని సమకూరుస్తున్నాయి. ఇదంతా సమాజానికి ఉపకరించే సాహిత్యమే! - డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
శివాపరాధక్షమాపణస్తోత్రం
Shiva Aparadha
Kshama Stotram in telugu
ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః |
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 1 ||
బాల్యే దుఃఖాతిరేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసు-
ర్నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి |
నానారోగాతిదుఃఖాద్రుదితపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 2 ||
ప్రౌఢో హం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టోzవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మే zపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 3 ||
వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః
ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్జ్ఞప్తిహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 4 ||
స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరగహనేzఖండబిల్వీదళం వా |
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపూష్పైస్త్వదర్థం
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 5 ||
దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిగుడసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః |
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 6 ||
నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఢ్యే
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే |
తత్త్వోzజ్ఞాతే విచారే శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 7 ||
ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః |
నో తప్తం గాంగాతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యం న జప్యం
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 8 ||
నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రేన్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ |
ఉన్మన్యాzవస్థయా త్వాం విగతగతిమతిః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 9 ||
స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభితే సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే దివ్యరూపే శివాఖ్యే |
లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 10 ||
హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం
సత్యం శాంతస్వరూపం సకలమునిమనః పద్మషండైకవేద్యమ్ |
జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేzపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || 11 ||
చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సర్పైర్భూషితకంఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే |
దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్త వృత్తిమమలామన్యైస్తు కిం కర్మభిః || 12 ||
కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్ || 13 ||
పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో
మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్ |
బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం
మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు || 14 ||
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా || 15 ||
ఇతి శ్రీమత్ శంకరాచారకృతం
శివాపరాధక్షమాపణస్తోత్రం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565