భగవద్గీతలోని విభూతియోగంలో శ్రీకృష్ణుడు ఎన్నో అంశాలు చెప్పాడు. అర్జునుడు వేసిన ఒక కీలకమైన ప్రశ్న గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది అర్జునుడి మాట. ఎందుకంటే జీవుడు ఎప్పుడూ దేవుడి స్థాయికి ఎదగడం చాలా కష్టం. అందుకే విచిత్రంగా జీవుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి మాయలోకి లాగుతాడు. జీవుడంటే మనస్సు. సరిగ్గా అర్జునుడు అదే రకంగా లాగుతున్నాడు భగవంతుణ్ణి! విభూతియోగంలో మొదటి పది, పదిహేను శ్లోకాలు చూడండి. ‘భగవంతుడు అంతా నేనే.. అన్నీ నేనే...’ అని చెబుతాడు. కానీ అర్జునుడు ఇలా అడుగుతాడు.
కథం విద్యామహం యోగిన్ స్త్వాం సదా పరిచింతయన్
కేషు కేషు చ భావేషు చిన్త్యోసి భగవన్మయా!
‘నిన్ను కొలవాలంటే ఒక రూపం కావాలి కదా! అన్నీ నేనే అంటే ఎలా? ఏయే రూపాలలో నిన్ను ఆరాధించాలి?’ అని అడుగుతున్నాడు అర్జునుడు. ప్రతి వస్తువుకు ఒక పేరు పెట్టాం. ఇక ఆ వస్తువును ఆ పేరుతోనే పిలుస్తాం. మనుషులకు ఓ పేరు పెడతాం. ఆ పేరుతో పిలిస్తేనే ఆ వ్యక్తి పలుకుతాడు. అలాగే దేవుళ్లకు పేర్లు పెట్టాం. కృష్ణుడంటే వేణువు ఉండాల్సిందే. రాముడంటే ధనుస్సు ఉండాల్సిందే. రాముడు, కృష్ణుడు ఒక్కరే అంటే ఒప్పుకోరు. రాముడు ముందు, కృష్ణుడు తరువాత అంటే ఒప్పుకోరు. ‘కృష్ణుడే ముందు...మా దేవుడే గొప్ప’ అంటారు. అహం ఆ పని చేయిస్తుంది. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలంటే నిరంతరం భగవన్నామస్మరణ ఒక్కటే మార్గం. ‘ఓం నమఃశివాయ’ అనే స్మరణ ఎంత గొప్పదో ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లో చెబుతున్నాడు మహాకవి ధూర్జటి.
‘నిప్పె పాతకతూలశైల మడచున్ నీనామము న్మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్ మహాపండితుల్
చెప్పంగా దమకింక శంకలుండవలెనా? శ్రీకాళహస్తీశ్వరా!’
అజ్ఞానం నుంచి బయటపడాలంటే నిరంతరం మనసులో మరో ఆలోచన లేకుండా ‘ఓం నమఃశివాయ’ అన్న మాటే స్మరిస్తుండాలి. దిక్కుమాలిన మనస్సు పక్కకెళ్లినా మళ్లీ ‘నమఃశివాయ’ అని లాక్కురావాలి. ‘‘భగవన్నామం స్మరిస్తే కొండల వంటి పాపాలు పోతాయి. నరకబాధలు తప్పుతాయి. వేదశాస్త్రాలు, పండితులు ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాయి. అయినా మనుషులకు ఇంకా అనుమానాలెందుకు? నీ పేరును స్మరించేందుకు సిద్ధపడరెందుకు?’’ అంటున్నాడు ధూర్జటి.దేవతలకు మరణం ఉండదంటారు కానీ అది తప్పు. వారికీ మరణం ఉంటుంది. అమరులు అంటే ఎక్కువ కాలం జీవించే వారని అర్థమే తప్పితే, మరణించరు అనే అర్థం కాదు. పిప్పలాదుడు అనే రుషి కుమారుడు దేవతలందరినీ సంహరించాడు. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా దేవతలందరినీ మట్టుబెట్టాడు.
ఆ కథ ఏమిటంటే... దదీచి మహర్షి చనిపోవడంతో ఆయన భార్య తట్టుకోలేకపోయింది. సహగమనం చేసేద్దామనుకుంది. కడుపులో బిడ్డ ఉన్నాడు చేయవద్దని చెప్పారు రుషులు. బిడ్డ పుట్టే వరకు ఆగలేక కత్తితో కడుపును కోసుకుని, బిడ్డకు జన్మనిచ్చి ఆవిడ చనిపోయింది. చనిపోతూ బిడ్డను పిప్పల వృక్షం(రావిచెట్టు) కింద వదిలేసింది. వదిలేస్తూ ఒక విషయం చెప్పింది. ‘మీ తండ్రిని దేవతలు మోసం చేశారు. నువ్వెలాగైనా తపస్సు చేసి దేవతల సంగతి చూడాలని’ చెప్పింది. ఆ పసిబిడ్డే పిప్పలాదుడు. ఆ పసివాడికి తల్లి మాట పట్టేసింది. రావి చెట్టు తొర్రలో కూర్చుని తపస్సు చేశాడు. రావి పండ్లు తింటూ పెరిగాడు. పిప్పలాదుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో! అన్నాడు. ‘దేవతలందరినీ చంపాలి’ అని అన్నాడు పిప్పలాదుడు. సరే అని శివుడు వరమిచ్చాడు. ఆ వరంతో పిప్పలాదుడు దేవతలందరినీ సంహరించాడు. మళ్లీ శివుడే దిగి వచ్చి పిప్పలాదుణ్ణి శాంతపరిచాడు. పరమశివుడు గురువుగా పిప్పలాదుడు ముక్తిమార్గం పొందాడు.
డా. గరికిపాటి నరసింహారావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565