అక్షర దీపం
‘విద్య లేనివాడు వింత పశువు’ అంటారు పెద్దలు. పశువు ఎప్పటికీ పశువే. దాన్ని ఎవరూ మరోలా పిలవరు. మనిషిగా జన్మనెత్తినవారిలో కొందరు వింత పశువుల్లా మారడమే విడ్డూరం. పరిణామ క్రమంలో రెండు కాళ్ల జీవిగా గల మానవుడు మహోన్నతుడు కావాలి. మానసికంగా ఉన్నతి పొందాలి. జ్ఞాన శిఖరాగ్ర భాగం చేరడానికి అతడు ఆధ్యాత్మికంగా ఉన్నత లోక పయనం సాగించాలి. సంపాదించిన జ్ఞానంతో తన వంతుగా మరింత సంపద సృష్టించాలి. అది సమాజ పురోభివృద్ధికి అన్నివిధాలా దోహదపడాలంటాయి శాస్త్రాలు.
జ్ఞానం వల్ల కలిగే మేలు ఇంతా అంతా కాదు. జ్ఞానం పొందినప్పుడు కలిగే ఆనందం కన్నా, దాన్ని సృజనాత్మకంగా మలచినప్పుడు వచ్చే ఆనందం మరెన్నో రెట్లు అధికంగా ఉంటుంది. జ్ఞాన మూలాలు ప్రతి మనిషి అంతరంగంలోనూ ఉంటాయి. వెలికితీసేందుకు ప్రధాన సాధనం అవసరమవుతుంది. అదే విద్య! దానికి అనేక కళారూపాలు. అవన్నీ అక్షరంతోనే ముడివడి ఉంటాయి.
లోక కల్యాణార్థం మనిషి తన సృజనతో పలు రూపాల్ని ఆవిష్కరించాలి. జీవంపోసుకునే కళకోసం అతడి మనసు కలగంటూ ఎంతో పరితపించాలి. ్చరి పొలిమేరల్లో పడి ఉండే శిలను ఎవరైనా తీసుకుని శ్రద్ధగా చెక్కితే, అది శిల్పంగా మారుతుంది. దాన్ని గ్రామంలో ప్రతిష్ఠించి ఆలయం నిర్మిస్తే, అందరూ దర్శించుకొని మొక్కుతారు. అంతటి మహత్తు కళకు ఉంది. సంగీతం, సాహిత్యం వంటివన్నీ కళలే! అవి విద్యలో భాగాలు.
నెలవంక క్రమేపీ పున్నమి కళ సంతరించుకోవాలి. అప్పుడే వెన్నెల కురుస్తుంది. మొగ్గ పుష్ప శోభతో అందంగా మెరవాలి. ఆ వెంటనే పరిమళాలు గుబాళిస్తాయి. సమయ సందర్భాల్ని బట్టి కఠినమైన రాయి సైతం రూపు మారుతుంది. దానితోనే నిర్మాణాలు సాగుతాయి. మంచుగడ్డ కూడా ద్రవంగా కరిగిపోతుంది. అదే మనిషి దాహాన్ని తీరుస్తుంది. నీరు మరిగి వాయుస్థితి పొందుతుంది. అదే జీవకోటికి ప్రాణవాయువు అందజేస్తుంది. అలాగే మనిషి మనసు కరగడాన్ని ‘హృదయం స్పందించడం’గా భావిస్తారు. అతడే సదా విశ్వప్రేమికుడిగా వెలుగొందుతాడు.
మనిషి తన జీవితమనే పరిధిని దాటి, విశ్వాత్మ ఉనికిని స్పృశించాలి. అతడు ఖగోళాన్ని తాకి రావాలంటే అందుకు ‘విజ్ఞానశాస్త్ర విద్య’ బాటలు వేస్తుంది. వ్యోమగాములు ఎకాయెకి విశ్వాన్నే చుట్టి వస్తారు. విశ్వ రహస్యాల్ని వారే ఛేదిస్తారు.
‘అక్షరం’ అంటే నాశనం కానిది. పరబ్రహ్మం అంటే అదే! అది అండ, పిండ, బ్రహ్మాండం అంతటా నిండి ఉంది. దాని స్వభావం ‘ఆనందం’. ఆ బ్రహ్మానంద అనుభవాన్ని సొంతం చేసుకోవాలంటే- అతడి జీవితం సంగీత, సాహిత్యాదుల్ని పెనవేసుకోవాలి. మీరాబాయి, త్యాగయ్య, అన్నమయ్య వంటివారు సంగీత పథంలో పయనించారు. గానామృతంలో మునిగితేలి, పరంధాముణ్ని కనుగొని ధన్యులయ్యారు. అక్షర బీజాలు మనోక్షేత్రంలో నాటుకోవడం వల్ల, ఆదికవి వాల్మీకి ‘రామాయణ’ సృజనతో ఆత్మారాముణ్ని అందుకోగలిగాడు. అష్టాదశ పురాణాల్ని సృజించిన సత్యవతీ తనయుడు- వ్యాస భగవానుడిగా, వేదవ్యాసుడిగా వినుతికెక్కాడు.
బయట కనిపించే దీపాలకు ఆది, అంతాలుంటాయి. అంటే- అవి వెలుగుతాయి, ఆ తరవాత ఆరిపోతాయి. మనిషిలో వెలిగే ‘అక్షర దీపం’ ఎన్నటికీ ఆరదు. ‘పరంజ్యోతి’ని అతడికి పరిచయం చేసేదాకా దాని జ్ఞానచలనం ఆగిపోదు. శ్రవణం, దర్శనం, అధ్యయనం వంటి ప్రక్రియలతో మనిషి మనసులో అక్షర దీపాలు వెలుగుతాయి. అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సంకెళ్లన్నీ తెగిపడతాయి. మానవుడు స్వేచ్ఛా ´స్వాతంత్య్రాలు పొందుతాడు. ఆకాశంలో పక్షిలా విహరిస్తున్నంత అనుభూతి చెందుతాడు. తనలో అక్షర దీపాన్ని వెలిగించుకున్న అతడు, ఆ అఖండ కాంతిని లోకమంతటికీ పంచుతాడు! - మునిమడుగుల రాజారావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565