దక్షిణాయణం ప్రారంభంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి ముక్కోటి ఏకాదశి వరకూ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఆయన వైకుంఠ ఏకాదశి రోజు మేల్కొంటాడు.
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ఆలయం మధురభక్తిని నేటికీ చాటుతోంది. ధనుర్మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోదాదేవి జన్మనక్షత్ర సమయంలో జరిగే రథోత్సవం, గోదాకల్యాణం వైభవంగా జరుగుతాయిక్కడ. ఈ ఆలయం నుంచి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలేశుడికి పూలహారాలు పంపించడం ఆనవాయితీ. 12 అంతస్తులున్న విల్లిపుత్తూరు రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. 192 అడుగుల ఎత్తున్న రాజగోపురం నమూనా తమిళనాడు ప్రభుత్వ అధికార ముద్రగా చెలామణీలో ఉంది.
‘మాసాల్లో మార్గశీర్షం నేను’ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో ! మార్గశిరంలోనే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ధనుర్మాసంలో.. తెల్లవారుజాము నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. పొద్దుపొడవక ముందే కళ్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, వూళ్లొని రామాలయానికో, వేంకటేశ్వర ఆలయానికో తరలి వెళుతుంటారు.
సూర్యుడు ఏడాదిలో ప్రతి నెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం.
ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుడనే శ్రీరంగడి భక్తుడికి గోదాదేవి పసిబాలికగా ఉన్నప్పుడు దొరికింది. చిన్నప్పటి నుంచి ఆమెకు రంగడంటే వల్లమాలిన ప్రేమ. స్వామివారికి సమర్పించమని తన తండ్రి ఇచ్చిన పూలహారాలను ముందు తాను ధరించి స్వామికి ధరింపజేసేది గోదా! చివరకు శ్రీరంగడిని మనువాడి తన జన్మను చరితార్థం చేసుకుంది.
తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజత కృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు.
శివుడికి తిరువెంబావై
ధనుర్మాసంలో తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు. శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడిని దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్. నగర వీధుల్లో నడుస్తూ తిరుంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవాడు. ఆ అమృతగానం విని మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపే వారు. అలా మొదలైన తిరువెంబావై ప్రభ.. నేటికీ వెలుగుతూనే ఉంది. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను చదువుతుంటారు.
తిరువెంబావై 30 పాశురాలు పుస్తము ఉంటే ధర తెలుపండి
ReplyDelete