పులిగోరు
పులిగోరు మెడలో వేసుకోవడం అనేది కొత్త విషయమేం కాదు. బంగారంలో పులిగోరును పొదిగి లాకెట్ రూపంలో మెళ్లో వేసుకోవడం తరాల నుంచీ చూస్తున్నదే. మొదట్లో జమీందార్లలాంటివాళ్లు వీటిని ధరించినా తర్వాత తర్వాత అబ్బాయిలందరి గొలుసులకూ సొంపుగా వేలాడాయి. అయితే, వజ్రరత్నవైఢూర్యాల జిలుగులన్నీ ఉన్నాయి కానీ మెడకు హుందాతనాన్ని తెచ్చిపెట్టే పులిగోరు మాత్రం మన నగల్లోకి ఎందుకు చేరకూడదు, ఆ అందాన్ని కూడా మా సౌందర్యానికి ఎందుకు జోడించకూడదు... అన్న అతివల ఆలోచనే అంకురంగా సరికొత్త నగల ట్రెండ్‌కి తెరతీశారు నగల డిజైనర్లు. అందుకే, ఇప్పుడు ‘పులిగోరు మోడల్ నగలున్నాయా’ అని జ్యువెలరీ షాపుల్లో ఆడవాళ్లు ఆరా తీసేంత అందంగా సరికొత్త రకాలు వస్తున్నాయి.
గోరందం చూడు...
అప్పట్లో పులిగోరు వేసుకుంటే హుందాతనానికీ, అంతస్తుకీ గుర్తుగా భావించేవారు. ఇప్పుడు మాత్రం అలాంటి నగలు వేసుకున్న అమ్మాయిలు కనిపిస్తే ట్రెండ్ ఫాలోవర్ అని గుర్తుపట్టాలి. ఎప్పటికప్పుడు మారిపోయే ఫ్యాషన్లు ఆడవాళ్లను ఆకట్టుకున్నంతగా ఎవరినీ ఆకట్టుకోలేవు. అంతేకాదు వాటిని అమ్మాయిలు ఫాలో అయినంతగా ఇంకెవరూ ఫాలో అవలేరు కూడా. అప్పట్లో పులిగోరు లాకెట్ అనగానే రెండు గోళ్లు అటూఇటూ తిరిగి ఉండి మధ్యలో బంగారంతో కనిపించేది. అవేగోళ్లు, ఆడవాళ్ల నగల్లోకి చేరిపోయేసరికి వాటి చుట్టూ కూడా తీగలూ పూలూ అల్లుకుంటున్నాయి. అందమైన నెమళ్లు నాట్యం చేసేస్తున్నాయి. పచ్చలూ, కెంపులూ, వజ్రాలూ, సీజెడ్‌లూ ఇలా రంగురంగుల రాళ్లన్నీ మెరుపుల్ని కురిపిస్తున్నాయి. వాటితో పాటు సౌత్‌సీ ముత్యాలూ జోడవుతున్నాయి. మొత్తానికి పులిగోరు అచ్చంగా అమ్మాయిల ఆభరణమే అనేంత అందంగా నగల్లో ఒదిగిపోతోంది. చిన్నవి మొదలు అరచేయంత ఉండేవాటిదాకా రకరకాల లాకెట్లు వీటితో తయారవుతున్నాయి. సన్నపాటి గొలుసుల్లోనూ, లాంగ్ చెయిన్లలోనూ ఈ తరహావి వాడుతున్నారు. ఇక అచ్చంగా పులిగోళ్లతోనే డిజైన్‌ను రూపొందించి చేస్తున్న నెక్లెస్‌లూ తయారవుతున్నాయి. హారాల్లోనూ ఇవి దర్శనమిస్తున్నాయి. మొత్తానికి అతివ అలంకారంలోకి పులిగోరు రూపంలో కొంగొత్త సొగసులు అమరాయి. ఇక నుంచీ ఒక కెంపుల నెక్లెస్సూ, ఒక పచ్చల దండా, ఒక పులిగోరు హారం... అంటూ మగువలు తమ ఆభరణాల చిట్టాలో దీన్నీ చేర్చేసుకోబోతున్నారన్నమాట!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565