కన్నిస్వామి
స్వామి అయ్యప్ప దీక్షను ప్రథమంగా చేపట్టి, శబరిమల యాత్ర సాగించే భక్తుణ్ని ‘కన్నిస్వామి’ అంటారు. ఆ దీక్షను నియమబద్ధంగా చేయించి, యాత్రకు తీసుకువెళ్లే గురువును ‘గురుస్వామి’గా భావిస్తారు.
అనేక పర్యాయాలు యాత్రలు నిర్వహిం చడంతో పాటు సదా ఆధ్యాత్మిక చింతన, భక్తిభావన కలిగి; నాయకత్వ లక్షణాలున్నవారే ఉత్తమ గురుస్వామిగా రాణిస్తారు. అదే గురువు నేతృత్వంలో ధార్మిక అక్షరాభ్యాసం చేసి, కొత్తగా బడిలో చేరి చదువుకునే విద్యార్థి వంటివాడు కన్నిస్వామి!
అతడు దైవం పైనే మనసు నిలిపి, గురుస్వామి మాట తు.చ. తప్పక పాటించి, భక్తిశ్రద్ధలతో దీక్ష సాగించాలి. అప్పుడే ఆ కన్నిస్వామికి నూతన శక్తి, ఉత్సాహం కలుగుతాయి. అటువంటివారు యాత్రాబృందంలో ఎంత ఎక్కువమంది ఉంటే, అంత బాగా లక్ష్యం నెరవేరుతుందంటారు. అందుకే ఎప్పుడూ మితంగా, సత్యసమ్మతంగా మాట్లా డాలని గురుస్వామి ముందుగానే సూచిస్తుంటారు. దీక్షలో, యాత్రలోనూ స్వామి శరణాలే తప్ప ఇతర చింతనలు మనసులోకి రానివ్వరాదని చెబుతుంటారు. ఆ సూచనలనే కన్నిస్వాములు అక్షరాలా పాటిస్తుంటారు.
హరిహర సుతుడైన మణికంఠుడు తన తల్లికి వైద్యం కోసం ప్రయత్నిస్తాడు. పులిపాలు ఔషధమన్న రాజవైద్యుల సూచనను అనుసరించి, ఒంటరిగా అడవులకు పయనమవుతాడు. మార్గమధ్యంలో ఎరుమేలి వద్ద ఎదురైన బందిపోటు నేరస్వభావాన్ని ఆయన అణచివేస్తాడు. పాదాక్రాంతుడైన ఆ వ్యక్తితో కలిసి సంప్రదాయ నృత్యం సాగించి, విందు ఆరగించి, ఆ రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు.
అందువల్ల ఇప్పటికీ శబరిమల యాత్రికులు ఎరుమేలిలో మజిలీ చేస్తారు. నృత్యం అనంతరమే యాత్ర కొనసాగిస్తారు. అలా దీక్ష చేసేవారు తమలో ఇంకా ఏదైనా అహంకారం మిగిలి ఉంటే, దాన్ని అక్కడికక్కడే త్యజించాలి. వారు స్వామికి పూర్తిగా శరణాగతులు కావాలన్నదే ఇందులోని అంతరార్థం.
ఆనాడు మణికంఠుడు ఎరుమేలి నుంచి అళుదామేడు చేరేసరికి, గగనమార్గంలో విహరించే రక్కసి కనిపిస్తుంది. అవతార స్వరూపుడైన ఆయన దానితో పోరాడి సంహరించి, శాపవిమోచన కలిగిస్తాడు.
ఆమె పూర్వం దత్తాత్రేయుడి భార్య లీలావతి అని, శాపవశాత్తు రాక్షసిగా జన్మించిందని లోకానికి ఆయన ఎరుకపరుస్తాడు. శాపవిముక్తితో సుందరిగా మారిన ఆమె- మణికంఠుడితో వివాహం కోరుతుంది. ఆయన సమ్మతించడు. ఆమె పదేపదే ప్రాధేయపడటంతో, ఇక ఏ సంవత్సర మైనా కన్నిస్వాములు యాత్రకు రాకపోతే ఆ ఏడాది వివాహం చేసుకుంటానని మాటిచ్చినట్లు చెబుతారు. శబరిమలలో మాలికపురత్తమ్మ పేరిట పూజలు అందుకొనేలా అయ్యప్పస్వామి వరమిస్తాడని, ‘భూతనాథోపాఖ్యానం’ విశదీకరిస్తుంది.
మకర సంక్రాంతినాడు శబరిమలలో రాత్రి పదిగంటల వేళ, ఏనుగు అంబారీపై మాలికపురత్తమ్మను వూరేగిస్తారు. కన్నిస్వాముల ప్రాంతమైన ‘శరంగుత్తి’ వరకు తీసుకువెళతారు. కన్నిస్వాములంటే అయ్యప్పకు సర్వదా ప్రీతి అంటూ ఇప్పటికీ వారికి సమధిక ప్రాధాన్యమిస్తుంటారు. స్వామి శరణం.
- మహాభాష్యం నరసింహారావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565