ఇండిక్ ఇంక్విలాబ్!
చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్.. భాషలు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది? మరి, తెలుగుకు ఆ వైభవం ఎప్పుడొస్తుంది? అది మీ చేతుల్లోనే ఉంది. అమ్మభాషను మనం గౌరవిస్తేనే కదా.. ప్రపంచం గుర్తించేది? అంతర్జాలంలో ఇప్పుడిప్పుడే ఇండో ఆర్యన్ (ఇండిక్) భాషల విప్లవం మొదలైంది. మన మాతృభాషకు మంచిరోజులు వస్తున్నాయి. ఇండిక్ ఇంక్విలాబ్! అంటోంది భారతీయ యువతరం..
2025 సంవత్సరం..
హైదరాబాద్‌లోని అమీర్‌పేట..
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి..
అడుగడుగునా తెలుగు శిక్షణ సంస్థలు దర్శనమిస్తున్నాయి. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అంటూ కృష్ణదేవరాయల రూపంలో ఆహ్వానం పలుకుతున్నారు ద్వారపాలకులు. ‘తేట తేట తెనుగులా’ ఆ పాత మాధుర్యం చెవికింపుగా తాకుతోంది. వీధుల్లో సీ++, జావా, ఒరకిల్ బ్యానర్లేవీ కనిపించలేదు. ఓ కుర్రాడు బుద్ధిగా కూర్చుని ఆపిల్ టాబ్‌లో అ, ఆ లు దిద్దుకుంటున్నాడు. మరో అమ్మాయి ఆన్‌లైన్‌లో అచ్చులు, హల్లులు, గుణింతాలతో పదవినోదంలాంటి ఆట ఆడుకుంటోంది. ‘30 రోజుల్లో తెలుగు’, ‘డిజిటలైజేషన్‌లో తెలుగు వాడకం ఎలా?’, ‘వర్చువల్ రియాలిటీలో మాతృభాష’, ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (కృత్రిమమేధ)లో అమ్మభాష’ పుస్తకాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆ పక్కనే ‘స్కైప్‌లో తెలుగు బోధించే టీచర్లు కావలెను’ అతికించిన గోడపత్రికను ఎగబడి చూస్తున్నారు నిరుద్యోగులు. సమీపంలోని కాఫీక్లబ్‌లో తిలక్ కవిత్వ మాధుర్యం గుప్పుమంటోంది. ఎంకి నాయుడు బావల సరసాన్ని లఘుచిత్రంగా తీస్తే - పెళ్లిచూపులను మించిన సినిమా అవుతుంది.. అంటూ స్క్రిప్టును సిద్ధం చేస్తోంది మరో యువ బృందం. ఆ పూటకు గురజాడ కన్యాశుల్కం నాటకం టికెట్లు దొరక్క డీలా పడిన ముఖాలు అక్కడే ఉన్నాయి. అలనాటి తెలుగు వైభవాన్ని తలపిస్తున్న ఈ దృశ్యం.. హాత్మకమే అయినా.. కళ్లతో తిలకించలేని అసాధ్యమేమీ కాదు. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లను ఉరకలెత్తిస్తున్న యువచైతన్యం.. అమ్మభాషకు చెయ్యెత్తి జైకొడితే అది సాధ్యమే! అంతర్జాలంలో ఆంగ్లమే ఎందుకుండాలి? మన భాష ఎందుకు ఉండదు? అంటున్న దేశాలే ఇందుకు నిదర్శనం. అంతర్జాలంలో ఏ సమాచారమైనా మాతృభాషలోనే ఉండాలని పూనుకున్నాయవి. చైనీస్, జపనీస్, ఫ్రెంచ్, థాయ్, స్పానిష్, హిబ్రూ భాషలు ఇంటర్‌నెట్‌లో తమకు కావాల్సిన స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ స్థానిక భాషల్లోనే కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. సేవలు అందుతాయి. అందుకని అంతర్జాలంలోని మరో భాష వైపు కన్నెత్తి చూడరు. ఇప్పుడు ఏ సంస్థకు అయినా అంతర్జాలమే అతి పెద్ద విపణి. స్థానిక వినియోగదారులు, ప్రజలను ఆకట్టుకోవడం అవసరం. ఆ డిమాండే ప్రాంతీయభాషలకు పట్టాభిషేకం చేస్తోంది. ఇంతకు మునుపు హించనన్ని భాషా సంబంధిత ఉద్యోగాలు ఇప్పుడు లభిస్తున్నాయి. ఇక ముందు మన తెలుగుకూ మరో వెలుగు రావడం ఖాయం అంటున్నారు నిపుణులు.
డిజిటల్ మార్కెటింగ్‌లోనూ మన భాషలదే హవా కనిపిస్తోంది. ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్, ప్రభుత్వ వెబ్‌సైట్లు, పేమెంట్ సర్వీసులు, చాట్‌యాప్స్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ వంటివన్నీ మాతృభాషలకే జైకొడుతున్నాయని వాట్ కన్సల్ట్ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. ఇక, సెలబ్రిటీలు కూడా అభిమానులకు దగ్గరయ్యేందుకు.. ఫేస్‌బుక్ పోస్టులు, ట్విట్టర్‌లో ట్వీట్లు ప్రాంతీయ భాషల్లోనే చేస్తున్నారు. మాతృభాష అంటేనే అమ్మభాష. అందులో చెబితేనే సులువుగా మనసును తాకుతుంది. అందుకే ఆయా బ్రాండ్‌లు ప్రాంతీయ భాషల్లోనే వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాలంలో స్థానిక భాషల అమలుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఫిబ్రవరి నాటికి 22 ఇండిక్ లాంగ్వేజీలను మొబైల్‌ఫోన్లలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ప్రతి మొబైల్‌లో కనీసం రెండు స్థానిక భాషలను కంపోజ్ చేసుకునే వీలును కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ, ప్రైవేటు వెబ్‌సైట్లు, ఈ కామర్స్, పేమెంట్, చాటింగ్, సోషల్ నెట్‌వర్కింగ్.. ఇలా ప్రతిదాంట్లోనూ తెలుగు వెలిగే అవకాశం ఉంది. ఈ-తరానికి ‘కొత్త కొత్త భాష..’ సరికొత్త దారిని చూపాలంటే.. అంతర్జాలంలో అమ్మ భాషకే పట్టంకట్టాలి.
మన దేశంలో ప్రాంతీయభాషల్లో 23 కోట్ల మంది బ్రౌజ్ చేస్తున్నారు. ఈ సంఖ్య 2021 నాటికి 53 కోట్లకు చేరుకోనుందని గూగుల్ నివేదిక చెబుతోంది. కొత్తగా అంతర్జాలం వాడుతున్న గ్రామీణుల్లో పదిమందికిగాను తొమ్మిది మంది స్థానికభాషలనే ఇష్టపడుతున్నారు. తెలుగు, మరాఠీ, బెంగాలీ, తమిళం, కన్నడం వంటి భాషలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వికీపీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్య సమాచారాన్ని తెలుగులో పెంచడమే దీని ఉద్దేశం. తెలంగాణ వైతాళికుల పేరుతో కొన్ని తెలుగు పాంట్లను కూడా విడుదల చేయనున్నాం. తెలుగు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా గ్రామస్థాయిలోకి ఇంగ్లీషు వెళ్లదు. అంతర్జాల సమాచారం, సంబంధిత సేవలు కచ్చితంగా ప్రాంతీయభాషల్లో ఉండాల్సిందే! నేడు ఆ అవసరం ఉంది కనకే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు ప్రత్యేక తెలుగు విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. అంతర్జాలంలో స్థానికభాషల ప్రాధాన్యం పెరిగేకొద్దీ.. తెలుగు భాషా నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి.
- దిలీప్ కొణతం, డైరెక్టర్,
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం
* మీరు దిల్లీకి వెళితే హిందీ, ఇంగ్లిష్ మాట్లాడక తప్పదు. ఎంచక్కా ఓ డివైజ్‌ను జేబులో పెట్టుకుంటే చాలు. మీరు మాట్లాడే తెలుగును హిందీలోకి.. ఎదుటివ్యక్తి మాట్లాడే హిందీని తెలుగులోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో భాషానిపుణులు ఉండాల్సిందే!
* కార్లలో వాడే ఇన్ఫోటైన్‌మెంట్‌లో జీపీఎస్ వాయిస్‌ను స్పష్టమైన తెలుగులోనే రూపొందిస్తున్నాయి సంస్థలు. ఈ ప్రక్రియలో నిపుణుల అవసరం ఉంటోంది.
* స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాంతీయభాషల్లో కీబోర్డులు తప్పనిసరి. వర్చువల్ కీబోర్డులు రూపొందించే కంపెనీల్లోనూ భాషా నిపుణులు పనిచేస్తారు.
* కథలు, నవలలను కాగితం మీద రాసే సంప్రదాయ పద్ధతికి డిజిటల్ ప్రత్యామ్నాయం రాబోతోంది. నోటితో చెబితే దానంతట అదే (స్పీచ్ రికగ్నైజ్) రాసుకునే సాఫ్ట్‌వేర్‌లు రానున్నాయి. అక్షరాలు, వాక్యనిర్మాణం, పదాలకు అర్ధాలు పొందుపరచడంలో భాషానిపుణుల ప్రాధాన్యం ఎంతో ఉంటుంది.
* స్థానిక భాషల్లో సేవలు అందించే చాట్‌పాట్‌ల సంఖ్య రెట్టింపు కానుంది. వినియోగదారునికి తలెత్తే ఎలాంటి సందేహాన్ని అయినా నివృత్తి చేస్తాయివి. ఒక రైతు ‘పంటకు దోమపోటు వచ్చింది. ఏ పురుగు మందు కొట్టాలి’ అనడిగితే చాలు. రైతు మాతృభాషలోనే జవాబు ఇస్తుంది చాట్‌పాట్.
* వాడుకభాషలో టైప్ చేస్తే.. స్పందించేలా ఈ కామర్స్ వెబ్‌సైట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి పనుల్లోనూ స్థానిక భాషల్లో చేయితిరిగిన నిపుణులు ఉండాల్సిందే! సాంకేతిక అవగాహన, తెలుగు భాషా నైపుణ్యం కలిగిన యువతకు ఎంతో భవిష్యత్తు ఉంది.
- నూతన్ చొక్కారెడ్డి, సీఈవో, కీ పాయింట్ టెక్నాలజీస్, హైదరాబాద్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565