MohanPublications Print Books Online store clik Here Devullu.com

అంకెల్లోఆరోగ్యం_Numerology

Numerology అంకెల్లోఆరోగ్యం


అంకెల్లోఆరోగ్యం

సంఖ్యాశాస్ర్తానికి, మానవజీవితానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. చేతిని చూసి జాతకం చెప్పినట్టే.. పుట్టినరోజు నంబర్ల ఆధారంగా ఆ మనిషి ఆరోగ్యం, ఎదురు కాబోయే అనారోగ్యం గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు న్యూమరాలజిస్టులు. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో కూడా చెప్పేదే ఈ హెల్త్ న్యూమరాలజీ. ఏ తేదీన పుట్టినవారు, ఎలాంటి ఆరోగ్యసమస్యలు కలిగి ఉంటారు, వాటి పరిష్కారాలేమిటనే విషయాల్ని న్యూమరాలజీ చెబుతుంది. -సంతోష్‌కుమార్ ప్యాట

1.
1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు
పై తేదీల్లో పుట్టిన వారికి అధిపతి సూర్యుడు. వీళ్లంతా సూర్యగణానికి చెందిన వారు. వీళ్లు ఎక్కువగా గుండె సంబంధిత, రక్త ప్రసరణ సమస్యలతో సతమతమవుతుంటారు. వయసు పెరిగిన తర్వాత అధిక రక్తపోటు, ఎండదెబ్బలతో ఇబ్బంది పడుతారు. కంటి సమస్యలను కూడాఎదుర్కొంటారు. వీళ్లు ఎక్కువగా వేడికి, ఎండకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఎండుద్రాక్ష, నిమ్మ, కుంకుమ పువ్వు, లవంగాలు, తేనె తీసుకోవడం మంచిది. 


2.
2, 11, 20, 29తేదీల్లో పుట్టిన వారు
ఈ తేదీల్లో జన్మించిన వారు చల్లని చంద్రుని నీడలో ఉంటారు. జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. నిద్రలేమి సమస్య వీరికి తీవ్రంగా ఉంటుంది. ఈ నెంబర్ టు మనుషులు.. ఎక్కువగా వెండిగ్లాసుల్లో నీళ్లు తాగడానికి ప్రయత్నించాలి. ఇది అనేక రకమైన ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వీరిలో టీ, కాఫీ వంటి పానీయాలకు బానిసలయ్యే లక్షణాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఈ నెంబర్ మనుషులు బటర్‌మిల్క్ ఎక్కువ తాగడం మంచిది. కీరదోస వంటి నీటిశాతం ఎక్కువగా ఉన్న వాటిని తినాలి.

3.
3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు
ఎటు నుంచి కూడినా మూడు ఫలితం వచ్చే తేదీల్లో పుట్టినవాళ్లకు బృహస్పతే గురువు. అతని పాలనలోనే వీరి జీవితం ముందుకు సాగుతుంది. ఎక్కువ ఒత్తిడికి గురికావడం వీరిలోని ముఖ్యమైన ఆరోగ్యసమస్య. చర్మ, నరాల సంబంధిత సమస్యలు కూడా ఇబ్బంది పెడుతాయి వీళ్లను. వీళ్ల స్వరం కూడా బలహీనమైందే. హెల్త్ న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ మనుషులు రాత్రిపూట నానబెట్టిన మెంతిగింజలు తీసుకోవడం, తలను నూనెతో మర్దన చేసుకోవడం వంటివి ఉపశమనం కలిగిస్తాయి. ఆహారంలో అత్తిపండ్లను, గోధుమను భాగం చేసుకోవడం శ్రేయస్కరం.

4.
4, 13, 22, 31తేదీల్లో పుట్టిన వారు వీరికి రాహువు అధిపతి. అంతుచిక్కని అనారోగ్యసమస్యలతో బాధ పడుతారు. రక్తహీనత, తలనొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతాయి. వీరు రుచికరమైన భోజనం కన్నా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం. పాలకూర, బీట్రూట్ వంటివి రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్, యాపిల్ జ్యూస్ తాగుతుండాలి. ఆకుకూరలు, మొలకలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ నంబర్ మనుషులు ఆరోగ్యంగా ఉండవచ్చు.

5.
5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు ఈ తేదీల్లో పుట్టిన వారికి బుధుడు పాలకుడు. నిరాశా నిస్పృహలతో మానసిక ఒత్తిడికి లోనయ్యే తత్వం వీరిలో ఎక్కువ. దీని ఫలితమే తీవ్రమైన నిద్రలేమి సమస్య. వీటితో పాటు సాధారణంగా వచ్చే దగ్గు, సర్ది, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి. వీరు సాధ్యమైనంత రెస్ట్ తీసుకోవడం, మెడిటేషన్ చేయడం ద్వారా ఈ ఆరోగ్యసమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా భయాన్ని దూరంగా ఉండచంతో పాటు, మానసిక దృఢత్వాన్ని అలవర్చుకోవాలి. వాల్‌నట్స్, సిట్రస్ యాసిడ్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకొంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

6.
6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు
వీరికి ఉండాల్సింది శుక్రుడి అనుగ్రహం. ఇలాంటి వారికి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశం ఉన్నది. మహిళలైతే హృదయసంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతారు. ఆరో నంబరు మనుషులకు బలమైన శరీర దారుఢ్యం, తాజాగాలి చాలా అవసరం. తమ నిర్లక్ష్యధోరణితోనే రకరకాల వ్యాధులు కొనితెచ్చుకొంటారు. ప్రాణాయామం లేదా శ్వాససంబంధిత కసరత్తులు వీరికి మ్యాజిక్ ట్రీట్‌మెంట్‌లా పనిచేస్తాయి. వీరు ప్రతిరోజూ బీన్స్, బాదం ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిచేస్తుంది.

7.
7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు
ఈ తేదీలు పుట్టినరోజుగా కలిగిన వ్యక్తులకు మంచైనా, చెడైనా కేతువే ఆధారం. ఈ నెంబర్ వ్యక్తులు చర్మవ్యాధులు, అధిక చెమట వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరిసరాలకు తగ్గట్టు ఉండలేరు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికీ ఇరిటేట్ అవుతుంటారు. వీళ్లకు విటమిన్ డి,ఈ తీసుకోవాల్సి ఉంటుంది. తాజా పండ్ల రసాలు తాగడం మంచిది. అధిక పని ఒత్తిడికి లోనుకాకుండా ఉండడం శ్రేయస్కరం. ద్రాక్షలు, పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అధిగమించే శక్తిని పొందవచ్చు.

8.
8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు
ఈ తేదీల్లో జన్మించిన వారికి శని అనుగ్రహం ముఖ్యం. ఈ నంబరు వ్యక్తులను కాలేయ, పేగు, దంత సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతాయి. కీళ్లవాతం, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలు కూడా తీవ్రరూపం దాలుస్తాయి. వీరు రోజూవారీ ఆహారంలో క్యాల్షియం, ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ సల్ల తాగాలి. ఏదో ఒక రూపంలో నిత్యం క్యారెట్‌ను డైట్‌గా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ద్రవాహారాన్ని తీసుకోవడం ఈ వ్యక్తులకు ఆరోగ్యరీత్యా మంచిది.

9.
9, 18, 27తేదీల్లో పుట్టిన వారు
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులపై (కుజుడు)అంగారకుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి వివిధ రకాల జ్వరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతాయి. వ్యసనాలకు బానిసలవుతారు. కాబట్టి మత్తు, మద్యం, ధూమపానం వంటివి నివారించాలి. జిడ్డయిన ఆహారం, ఊరగాయలు, వేడి సుగంధాలకు దూరంగా ఉండాలి. ఏ రూపంలో అయినా వీరు తినే ఆహారంలో అల్లం, ఉల్లిపాయ ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు తులసి ప్రాథమిక వైద్యం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list