MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

గాంధీమార్గం అనుసరణీయం_GandhianWayIsPractical

గాంధీమార్గం అనుసరణీయం

గాంధీమార్గం అనుసరణీయం_GandhianWayIsPractical Gandhism MahatmaGandhi Gandhiji MahatmaGandhiDeathDay


నేడు మృతవీరుల సంస్మరణ దినం. 70 ఏళ్ల క్రితం హంతకుడి తుపాకి గుళ్లకు మహాత్మాగాంధీ నేలకొరిగిన రోజు. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన అది. మహాత్ముడు మన జాతిపిత. విశ్వ శాంతిదూత. అంతటి మహనీయుడిని ఆనాడు హింసోన్మాదం పొట్టన పెట్టుకొంది. మనిషిలోని మృగత్వం జడలు విప్పి, కరాళనృత్యం చేసిన దుర్దినమది. మృతవీరుల సంస్మరణ దినం పాటించడమంటే అహింసామూర్తి మహాత్మాగాంధీ ఒక్కరికే నివాళి అర్పించడం కాదు, ప్రపంచవ్యాప్తంగా హింస, ఉగ్రవాదం ప్రబలుతున్న తీరుపైన నిరసన ప్రకటించడం కూడా! మహాత్ముడి సిద్ధాంతాల గురించి, వాటిని ఆయన ఆచరించి చూపిన విధానం గురించి చర్చించాల్సిన సందర్భమిది.
ఆత్మవినాశనం దిశగా వేగంగా సాగిపోతున్న మనిషిలో జీవితంపట్ల ఆశలు రగిలించి, కొత్తవెలుగుల బాటలో నడిపించేవే మహాత్ముడి ఆలోచనలు, ప్రవచనాలు, ఆచరణలు. స్వదేశీ అన్నది మహాత్ముడి తారకమంత్రం. అదే ఆయన జీవన విధానం. స్వదేశీ అంటే స్వావలంబన, స్వయంపోషకత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, అన్నింటికి మించి నిస్వార్థంగా సేవచేయాలన్న భావన, తపన. స్వదేశీ సిద్ధాంతాన్ని విజయవంతంగా ఆచరించి చూపారు మహాత్మాగాంధీ. విదేశీగడ్డపై నుంచే స్వదేశీ ప్రయోగాలు ప్రారంభించారాయన. సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి, బానిస సంకెళ్లనుంచి ప్రజల్ని విముక్తం చేయడానికి ఆయన ఎంచుకొన్న మార్గం స్వదేశీ. అది ఆయన చేతిలోని దివ్యాస్త్రం. తిరుగులేని బ్రహ్మాస్త్రం.

సత్యాన్నే దైవంగా భావించారు మహాత్మాగాంధీ. దేవుడే సత్యం అన్నంత సునాయాసం కాదది. సత్యమనే దేవుడిలో మనిషి సంలీనమైనప్పుడే శాంతి లభిస్తుందని ఉద్బోధించారాయన. సత్యమార్గంలో పయనించడం ద్వారానే సంఘర్షణలను నివారించవచ్చునని అన్నారు. హింస ద్వారా ఘర్షణలను తాత్కాలికంగానే అణచివేయవచ్చునని, అహింసే శాశ్వత పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ దృష్టిలో సత్యం, అహింస అన్నవి నాణానికి బొమ్మా బొరుసు లాంటివి. సత్యం లక్ష్యమైతే, అహింస దాన్ని సాధించే మార్గమని అన్నారాయన. లక్ష్యం, మార్గం అభిభాజ్యమైనవి. ఆయన ప్రవచించిన దైవత్వానికి సత్యం, అహింస రెండు ముఖాలు. సత్యాన్ని శోధించి, సాధించాలంటే దేవుడిని గట్టిగా నమ్మాల్సి ఉంటుంది. అది ప్రేరణ ఇస్తుంది. మనోబలాన్ని ప్రసాదిస్తుంది. దానివల్ల లక్ష్యాన్ని సాధించడం సులువవుతుంది.దేవుడిని తెలుసుకోవడమంటే అహింసను ఆచరించడం ద్వారా జీవితంలో శాంతిని సాధించడమే. అలాంటి దేవుడిని తెలుసుకొనే మార్గాన్ని మతం చూపిస్తుంది, చూపించాలి. ఏ రూపంలోనైనా సరే హింసను ప్రేరేపించేది మతమే కాదు, అదెవరికీ సమ్మతం కారాదు. మతం అన్నది శాంతిని ప్రసాదించేది అయినప్పుడు మతపరమైన హింస అన్న పదాలే పరస్పర విరుద్ధమైనవి అవుతాయి. అసలు మతపరమైన హింస అన్నదే అర్థం లేనిది. హింస ఏ రూపంలో ఉన్నా, ఎలాంటిదైనా- హింస హింసే. ఏ మతంతోనూ దాన్ని ముడిపెట్టలేం.

మనిషి నిరామయుడిగా ఉండాలంటే సేవాభావం అలవరచుకోవాలి. ఎలాంటి త్యాగాలకైనా సంసిద్ధంగా ఉండాలి. అహం వదులు కోవాలి. మహాత్మాగాంధీ ఈ సిద్ధాంతాలు, సూత్రాలను ప్రవరించడమే కాదు, ఆచరించి చూపారు. సామాజిక కార్యాచరణకు ఆయన చేపట్టిన ధర్మాయుధం సత్యాగ్రహం. అటు దక్షిణాఫ్రికాలోను, ఇటు భారతదేశంలోనూ పలు సందర్భాల్లో ఆయన ఈ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించి, సత్ఫలితాలు సాధించారు. సత్యం, అహింస- ఈ రెండింటి స్ఫూర్తితో రూపొందినదే సత్యాగ్రహ ఆయుధం. ఇతరులకు సేవ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలన్నారు మహాత్ముడు. ఇది ఆయన ప్రబోధించిన దైవీభావం.

మహాత్మాగాంధీ కార్యాచరణ ప్రణాళికలో కొన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలు ఉన్నాయి. అవి- 1. మత సామరస్యాన్ని పెంపొందించడం. 2. అంటరానితనాన్ని తొలగించడం, స్థూలంగా చెప్పాలంటే- అసమానతలను రూపుమాపడం. 3.అన్ని రకాల మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలను నిషేధించటం. 4. అట్టడుగుస్థాయిలో ప్రజానీకానికి సాధికారత కల్పించే ప్రక్రియలో భాగంగా ఖాదీని, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడం. 5. గ్రామీణ ప్రజారోగ్యాన్ని, పరిశుభ్రతను పెంపొందించడానికి పారిశుద్ధ్యాన్ని ప్రోది చేయడం. 6. ప్రాథమిక, వయోజన విద్యకు ప్రాధాన్యం. ముఖ్యంగా మహిళా అక్షరాస్యతపై ప్రత్యేక శ్రద్ధ. 7.జాతీయ భాషను నిర్లక్ష్యం చేయకుండానే ప్రాంతీయ భాషలకు అండదండ. 8. రైతులు, కూలీలు, వెలివేతకు గురైనవారు, గిరిజనులు తదితర అణగారిన వర్గాల సంక్షేమం. 9. సేవ, త్యాగనిరతి, ఇతరుల బాధలు తీర్చడానికి స్వయంగా బాధలు అనుభవించడానికైనా సిద్ధపడటం వంటి చర్యల ద్వారా ఆత్మశుద్ధి చేసుకోవడం.
మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చిన గ్రంథం భగవద్గీత. దేనిమీదా వ్యామోహం పెంచుకొనకపోవడం, ఫలితాలు ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ప్రతిఫలాపేక్ష లేకుండా కార్యాచరణకు సిద్ధపడటం- భగవద్గీత ద్వారా ఆయన నేర్చుకొన్న జీవిత సత్యాలు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, భగవద్గీత ద్వారా అనాసక్తి యోగాన్ని ఆయన నేర్చుకొన్నారు. ఆత్మశుద్ధి అనేది గాంధేయ సంప్రదాయంలో కీలకం. తగినంత ఆధ్యాత్మిక వికాసం సాధించిన వ్యక్తి ఇతరులనూ ధర్మపథంలో నడపగలడని ఆయన నమ్మారు. పతంజలియోగ సూత్రాల నుంచి ఈ సత్యం గ్రహించారాయన. ఒకే ఒక్క వ్యక్తి పూనుకొంటేచాలు, జ్ఞానదీపాలు వెలిగించి యావత్‌ ప్రపంచాన్ని ప్రకాశపథంలో నడపగలడనేందుకు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసలతోపాటు స్వయంగా మహాత్మాగాంధీ నిదర్శనం.

ప్రస్తుత ప్రపంచ స్థితిగతులు తీవ్ర భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఎల్లెడలా హింస, ఉగ్రవాదం పెట్రేగుతున్నాయి. ఉత్తర కొరియా వంటి దేశాల్లో దురహంకారంతో రగిలిపోతున్న నేతల చేతుల్లోని సామూహిక జనహనన ఆయుధాలు విశ్వవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహాత్మాగాంధీ తన జీవితకాలంలో ఆచరించి చూపిన సిద్ధాంతాలు ప్రస్తుత పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనువైన మార్గాలు. పశు ప్రవృత్తితో చెలరేగిపోతున్నవారి కట్టడికి, తద్వారా మనిషి మనిషిగా బతకగలితే ఆశాజనక వాతావరణ సృష్టికి మహాత్ముడి మాటే మేలుబాట. ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపే దారి దీపమది... ధర్మరూపమది!
- ప్రొఫెసర్‌ కె.రామకృష్ణారావు

గాంధీమార్గం అనుసరణీయం_GandhianWayIsPractical Gandhism MahatmaGandhi Gandhiji MahatmaGandhiDeathDay mohanpublications granthanidhi bhaktipustakalu


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం