MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label subramanya. Show all posts
Showing posts with label subramanya. Show all posts

కుక్కెశ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం. ప్రకృతి ఒడిలో... _KukkeSubhramanya-MohanPublications

నాగుల రక్షకుడు ‘సుబ్రమణ్య’


జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.
ప్రకృతి ఒడిలో...
పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.
పురాణచరిత్ర
సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.

నాగులకు రక్షకుడు: నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.
ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు.. ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి... తదితర పూజలను నిర్వహిస్తారు.
కుమారధారలో పవిత్రస్నానం.. శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
ఎలా చేరుకోవచ్చు.. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.మంగళూరు రైల్వేస్టేషన్‌ , బస్‌స్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు సుబ్రమణ్య మీదుగా వెళుతాయి.

సుబ్రహ్మణ్య షష్టి_SubramanyaSasti


subramanyaSwamy


షణ్ముఖ తత్వం

ఆది దంపతులైన శివపార్వతుల అపురూప ప్రేమానుబంధానికి సంకేతం- సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడి సంహారం కోసం కారణజన్ముడిగా ఆయన స్కందుడి పేరిట ఉదయించాడు. అసురత్వాన్ని అంతం చేసుకొని ఆనంద సిద్ధిని అందుకోవడానికి పాటించాల్సిన సాధనా సంవిధానాన్ని సుబ్రహ్మణ్య తత్వం ఆవిష్కరిస్తుంది. అంతఃకరణ శుద్ధితో జ్ఞానశక్తి ద్వారా సుగుణవంతమైన జీవన మార్గంలో పయనించాలని స్వామి సందేశం!

‘స్వామి’ నామధేయం సుబ్రహ్మణ్యానికే ప్రత్యేకం. ‘సుబ్రహ్మణ్యుడు’ అంటే, శ్రేష్ఠమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సాధకుడని సంకేతార్థం. ప్రతికూలతల్ని అధిగమించి, అవరోధాల్ని అధిరోహించి లోకోత్తరమైన లక్ష్యసిద్ధిని ఎలా అందుకోవాలో ‘కుమార సంభవం’ వృత్తాంతం చాటిచెబుతుంది.

మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్యుడు అవతరించాడంటారు. ఇదే సుబ్రహ్మణ్య షష్ఠి! మహాతేజోమూర్తి అయిన కుమారస్వామిని ఈ తిథినాడు ఆరాధిస్తారు కాబట్టి- దీన్ని చంపా షష్ఠి, కుమార షష్ఠి, మంగళ షష్ఠి, కార్తికేయ షష్ఠి అనీ వ్యవహరిస్తారు. గుహప్రియా వ్రతం, ఫల షష్ఠి వ్రతం, ప్రావరణ షష్ఠి వ్రతం వంటి విధులతో వ్రత విధానంగానూ ఈ పండుగ చేసుకుంటారు. ప్రావరణం అంటే ఉత్తరీయం, కంబళి. మార్గశీర్ష మాసం చలి వాతావరణంతో కూడి ఉంటుంది. ప్రావరణ వ్రతంలో భాగంగా- దుప్పట్లు, కంబళ్లు దానం చేస్తారు.

శివ తనయుడైన కుమరేశుడి ఆవిర్భావం ఎంతో విలక్షణం. శ్రీమద్రామాయణంతో పాటు స్కంద, శివ పురాణాలు షణ్ముఖ జననాన్ని విశదపరచాయి. అవ్యక్తమైన శివ స్వరూపం నుంచి అభివ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు- దాన్ని వాయువు, అగ్ని, గంగ, భూమి... ఇలా ఒకటి తరవాత మరొకటి స్వీకరించిన ఫలితంగా ఆ ఆకృతి ఏర్పడిందంటారు. ఆ స్వరూపమే కుమారస్వామి- అని పురాణ కథనం.

పంచభూతాల పంచీకరణం అంటే సమ్మేళనం! మానవుడిది స్థూల దేహం. అవ్యక్తం నుంచి ఆకాశం, దాని నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని ఉద్భవించాయి. అగ్ని నుంచి నీరు, దాని నుంచి భూమి ఆవిర్భవించాయనీ ‘వివేక చూడామణి’ కర్త జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించారు. ఆయన సూత్రీకరించినట్లు, సృష్టి క్రమ పరిణామ వికాసం సుబ్రహ్మణ్య ఆవిర్భావంలో ప్రస్ఫుటమవుతుంది.

ఆరుగురు కృత్తికా దేవతల ఆశీర్వాద శక్తితో ఆరు ముఖాల షణ్ముఖుడిగా స్వామి తేజరిల్లాడు. ఆయనది నెమలి వాహనం విహరించే రూపం. శూర పద్మాసురుణ్ని వధించిన స్వరూపం. భక్తులకు అభయాన్ని ప్రసాదించే ఆకృతి ఆయనది. దండాయుధ పాణిగా వీరత్వాన్ని ప్రకటించే రూపమూ అదే! శివపరమాత్మతో జ్ఞాన చర్చలు సాగించే స్వరూపం ఆ స్వామిది. లౌకిక పరమైన సంపదల్ని అనుగ్రహించే ఆకృతి అది. ఆ మూర్తిమత్వమే ఏకీకృతమై ‘ఆర్ముగం’గా సుబ్రహ్మణ్యుడు వర్ధిల్లుతున్నాడు.

షడాననుడైన స్వామిని షడాక్షరీ మంత్రంతో ఉపాసిస్తారు. వేదాల్లో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని ప్రతిబింబంగా ‘స్వామి’ని పేర్కొంటారు. ఆరు ముఖాలు, ఆరు రుతువులు; పన్నెండు చేతులు, పన్నెండు మాసాలతో కాలాగ్ని రూపకంగా సంవత్సరాగ్ని ప్రకటితమవుతుంది. దహించడం అగ్ని లక్షణం. కరిగిపోవడం కాలానికి సహజ ప్రవృత్తి. దహించుకుపోయే కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవన పరమార్థం సాధించాలన్నది స్వామి వచనం!

శరవణుడి చెంత గల నెమలి, తన కాళ్ల కింద సర్పాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. నెమలి- కోరికల అతీతత్వానికి చిహ్నం. పాము అహంకారానికి, దాని కోరలు రాగద్వేషాలకు సూచికలు. కోరికల్ని జయించడంతో పాటు అహంకారాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే వ్యక్తి పూర్ణత్వాన్ని అందుకుంటాడని ఈ రెండింటి ద్వారా స్వామి ఉద్బోధిస్తాడు. భక్తి, జ్ఞాన, యోగ సంబంధిత అంశాలెన్నింటినో సుబ్రహ్మణ్యస్వామి మూర్తిమత్వం సుబోధకం చేస్తుంది. వాటిని తమ జీవన గమనానికి అన్వయించుకోవడమే, స్వామికి భక్తులు జరపాల్సిన అసలైన ఆరాధన! - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌





మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి ...

నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే
ఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు.

ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఓం శ్రీ వల్లీసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం శ్రీసీతారామచంద్రపరబ్రహ్మణే నమః
ఓం శ్రీ హనుమతే నమః
"మాసానాం మార్గశీర్షోహమ్'' అన్నాడు గీతాచార్యుడు. ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏకాదశీ దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశినాడు. ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి వస్తుంది. ఈరోజు మార్గశీర్ష శుక్ల షష్ఠి. లోకసంరక్షణార్ధం, ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్యస్వామి వారు, ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈ రోజు.




సుబ్రహ్మణ్య జననము – షష్ఠి ప్రాశస్త్యముః


అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వేయి సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సురస్థిరసాధ్య విద్యాధరాదులు, తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు, అది ఏమిటంటే, పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామాన్ని గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలోతానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని, తారకాసురుడు, దేవతలందరినీ బాధపెడుతున్నాడు.

శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అందుకోసం, దేవతలందరూ కలిసి, సత్యలోకానికి వెళ్ళి, అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మ గారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు…"బ్రహ్మాదిదేవతలారా! మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి..” అని ఓదార్చారు.

అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది, పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే, ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి, దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి "దేవాదిదేవా! ప్రభూ మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధలనుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని, అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్ధిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు, పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు, దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు. దేవతల ప్రార్ధన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండీ విడివడింది కాబట్టి, నాతేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది, తను మాత్రుమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గానూ, అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై, దేవతలందరినీ శపిస్తుంది, నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక, ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం ముఫ్ఫైమూడుకోట్ల మంది అంతే.

అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.

శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించుటం కోసం శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచపర్వతాన్ని భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామి వారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు.

సరే ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు… అని అడిగితే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్య ఖండంలో, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరమూ, శాపమూ అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు, నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు. అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో “నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను…” అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ''ఇదేమిటి!! శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే..” అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు..”శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ, కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి, యోనిసంభవుడిగా రానమ్మా…. నన్ను క్షమించు” అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి, ఒకనాడు నీవు మోహినీ అవతారములో ఉన్నప్పుడు, కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండీ నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు.

సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చిందీ అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామంకూడా వుంది. సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామం కూడా వుంది. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము.






సుబ్రహ్మణ్య షష్టి_SubramanyaSasti
 సుబ్రమణ్య షష్టి
సుబ్రహ్మణ్య షష్టి_SubramanyaSasti

సుబ్రహ్మణ్య షష్టి_SubramanyaSasti
సుబ్రహ్మణ్య షష్ఠి
న‌వంబ‌రు 24


పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యేశ్వరుడని, తెలుగునాట సుబ్బరాయుడని వ్యవహరిస్తారు. మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని, ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది. కుమారస్వామి జన్మించిన షష్ఠి గనుక దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రత చూడామణి పేర్కొంటోంది. కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన తిథిగానూ కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు పేర్కొంటున్నాయి. శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని తన తీరంలోని రెల్లుపొదల్లో జారవిడిచింది. ఆ శరవనంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కన్యలు ఆ శిశువును తీసుకొనిపోయి బదరికావనం చేర్చారు. కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు.

బ్రహ్మ మానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచం, సుఖదుఃఖాలను గురించిన చింత లేనివాడు. అటువంటివాడికి ఒకనాడు ఒక కల వచ్చింది. కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కల ఏమిటని అడిగాడు. బ్రహ్మ దివ్యదృష్టితో పరిశీలించి ‘అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది. కానీ, ఇది రాబోయే జన్మలోనిది’ అని చెప్పాడు. ఇది శివ పార్వతులకు తెలిసింది. సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది.

సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్లాడు. తపోనిమగ్నుడైన సనత్కుమారుడు శివుణ్ని పట్టించుకోలేదు. కోపించిన శివుడు ‘లయకర్తనైన నేనే స్వయంగా వచ్చినా పలకరించవా’ అని గద్దించాడు. ‘శపించగలను జాగ్రత్త’ అని హెచ్చరించాడు. కళ్లు తెరచిన సనత్కుమారుడు ‘శాప ఫలితం నా దేహానికే గాని ఆత్మకు కాదు గదా’ అన్నాడు. శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆదరంగా ‘నీకు వరం ఇస్తాను... కోరుకో’ అన్నాడు. దానికి అతడు ‘ప్రపంచం మీద ఏ ఆశా లేని నాకు వరం దేనికి? కావలిస్తే నీకే వరమిస్తాను కోరుకో’ అన్నాడు. వచ్చిన అవకాశం జారవిడువరాదని భావించిన శివుడు ‘స్వామీ! నీవంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడిగా జన్మించా’లని కోరుకొన్నాడు. ఆయన అంగీకరించాడు.

ఇది విన్న పార్వతి పురుషుడివైన నువ్వు ‘నాకు పుత్రుడిగా’ అన్నావు కదా. పురుషుడికి గర్భధారణ ఎలా? మళ్ళీ వెళ్లి ‘మాకు పుత్రుడు’గా అని అడగమంది. కానీ తపోనిష్ఠలో ఉన్న సనత్కుమారుడి నుంచి బదులు లేదు. కొంతకాలానికి అతడు ఒక నిప్పు ముద్దగా శంకరుడిలో ప్రవేశించాడు. అది శివుడి మూడో కంటి నుంచి వెలువడి వేగంగా వెళ్లి శరవనంలో పడింది. ఆ నిప్పు ముద్ద ఒక కుమారుడి రూపం ధరించగా కృత్తికా స్త్రీలు ఆరుగురు తమ స్తన్యంతో పోషించారు. అందుకే ‘షణ్ముఖు’డయ్యాడు. ఇది మరొక గాథ.

సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. ఇంద్రుడి కుమార్తె దేవసేన, శివ ముని పుత్రిక వల్లీదేవి ఇతడి పత్నులుగా పురాణాలు చెబుతున్నాయి.

తమిళుల దైవారాధనలో స్కంద పూజకు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ఈ దినం పుట్టలో పాలుపోసే సంప్రదాయమూ ఉంది. పంచారామాల్లో ఒకటి సామర్లకోటలోని స్కందారామం. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు చెబుతారు

















సుబ్రమణ్య స్వామి ప్రవర_Sri Valli Devasena Sametha Sri Subramanya Swamy Pravara



సుబ్రమణ్య స్వామి ప్రవర_ Sri Valli Devasena Sametha  Sri Subramanya Swamy  Pravara

సుబ్రమణ్య స్వామి ప్రవర

Sri Valli Devasena Sametha
 Sri Subramanya Swamy Pravara
సుబ్రమణ్య స్వామి ప్రవర_ Sri Valli Devasena Sametha  Sri Subramanya Swamy  Pravara
సుబ్రమణ్య స్వామి ప్రవర_ Sri Valli Devasena Sametha  Sri Subramanya Swamy  Pravara

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం_mopidevi_subramanya swamy


mopidevi kumaraswamy subramanya kumaraswamy murugan
మోపిదేవి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం



పుట్టలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరుడు!

తండ్రీతనయులు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగులచవితి రోజున ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి పుట్టకు విశేషపూజలు నిర్వహిస్తారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సుమారు అయిదు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాకృతిలో తనయుడైన కుమారస్వామీ లింగాకృతిలో శివుడూ కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహు, కేతు, సర్పదోషాలను నివారించే ఇలవేలుపుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు.

స్థలపురాణం... 
ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా జాతివైరాన్ని మరచి పాము, ముంగిస, నెమలీ ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్యతేజస్సును విరజిమ్ముతూ ఉన్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి చూడగా కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటుచేసి ఆరాధించాడు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి, తాను పుట్టలో ఉన్నాననీ, తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమనీ ఆజ్ఞాపించాడట. స్వప్నవృత్తాంతాన్ని పెద్దలకు తెలియజేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి, షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామి మహిమలను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులూ, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ ఆలయ అభివృద్ధికి విశేష కృషిచేశారు. కాలక్రమంలో ఆ మోహినీపురమే మోపిదేవిగా ప్రసిద్ధిచెందింది.

లింగరూపంలో.. 
తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. దీన్నే పానపట్టం అని కూడా అంటారు. ఆలయ ప్రదక్షిణమార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. పుట్ట నుంచి గర్భగుడిలోకి దారి ఉందనీ, ఆ దారిలోనే దేవతా సర్పం సంచరిస్తుందనీ భక్తుల నమ్మకం. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు.

పుట్ట బంగారం... 
సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపంలో పుట్టలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. నాగుల చవితి రోజున పుట్టదగ్గరకు వెళ్లి ఆయన్ను పూజిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారని ఇక్కడివారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి సంకేతం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.

అర్చనలూ... ఉత్సవాలూ... 
దీపావళి అనంతరం వచ్చే నాగులచవితితోపాటు నాగపంచమి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పుట్టలో కొలువైన సుబ్రహ్మణేశ్వరుడికి పాలుపోసి, క్షీరాన్నాన్ని నివేదిస్తారు. వల్లీదేవసేనా సమేతుడైన స్వామికి ఇక్కడ నిత్యశాంతి కల్యాణం జరుగుతుంది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాధారణ అభిషేకాలు, వూయల సేవలు, రాహు - కేతు - సర్పదోష పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే రజత బిల్వార్చన మరింత ప్రత్యేకం. మాఘమాసంలో షణ్ముఖుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక దీపోజ్వలన, ఆరుద్రోత్సవాలు, ఏటా ఆషాఢమాసంలో ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చిన్నారులకు చెవిపోగులు కుట్టించడం, బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నామకరణం లాంటి క్రతువులకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఇలా చేరుకోవచ్చు.. 
విజయవాడకి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఉయ్యూరు, పామర్రు మీదగా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు. తక్కువ సమయంలో ఈ ఆలయాన్ని చేరుకునేందుకు మరో కొత్త రహదారిని కూడా ఏర్పాటుచేశారు. విజయవాడ నుంచి యనమలకుదురు మీదుగా బస్సు ప్రయాణం సాగుతుంది. మచిలీపట్నం, గుడివాడ నుంచి కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
- ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి 
ఫొటోలు: కె.ఎస్‌.ఎన్‌.మూర్తి
#పుట్టలో_వెలసిన
#సుబ్రహ్మణ్యేశ్వరుడు


వేయి పడగల మీద.. 
కోటి మణుగుల నేల..
మోపిదేవి స్వామి
వేయిపడగల మీద .. కోటి మణుగుల నేల.. మోసి అలసిన స్వామి.. మోపిదేవి స్వామి.. హరుని కంఠం వీడి హరిని నిద్దుర లేపి కదిలిరా.. కదలిరా..’’ అంటూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విశిష్టతను తెలియజేసే చిత్ర గీతం నేటికీ చాలా ఆలయాల్లో మార్మోగుతుంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మోపిదేవిని పూర్వం కుమారక్షేత్రమని, మోహినిపురమని పిలిచేవారని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. ఓ సందర్భంలో పార్వతీదేవి, తన తనయుడైన కుమారస్వామిని మందలించిందట. స్వామి పశ్చాత్తాపంతో తపస్సు చేసేందుకు భూలోకంలోని ఈ ప్రాంతానికి వచ్చి సర్పరూపం దాల్చి పుట్టలో ఉండి తపస్సు చేస్తున్నాడట. కొంతకాలానికి అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరాన గల మోహినీపురం చేరుకుని నదిలో స్నానం చేసేందుకు వటవృక్షం చెంతకు చేరగా, అక్కడే ఉన్న పుట్టలో నుంచి దివ్యమైన కాంతిపుంజం కానరావడంతో దివ్యదృష్టితో శోధించగా, పుట్టలో తపస్సు చేసుకుంటున్న కుమారస్వామి దర్శనమిచ్చాడట. అగస్త్యముని స్వామి తపస్సుకు భంగం కలగకుండా, పుట్టలోపల ఉన్న శివలింగాన్ని బయటకు తీసి పుట్టపై ప్రతిష్టిస్తారు. అనంతరం ఈ ప్రాంతానికి కుమారక్షేత్రంగా నామకరణం చేసి అగస్త్యముని ఇక్కడ నుంచి వెళ్లిపోయారని, ఈ కుమారక్షేత్రమే తరువాత కాలంలో మోహినీపురంగానూ, మోపిదేవిగానూ రూపాంతరం చెందినట్టు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.

దేవతలచే పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగాకృతి కొన్నేళ్ల తరువాత అదృశ్యమై ఇక్కడున్న పుట్టలో ఉండిపోయింది. ఈ పుట్టకు దగ్గరలో వీరారపు పర్వతాలు అనే భక్తునికి స్వామి కలలో కనబడగా పుట్టలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసి ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రాంతంలో ప్రతిష్టించినట్లు, అనంతరం దేవరకోట సంస్థానాధీశులైన శ్రీమంతురాజా యార్లగడ్డ వారి వంశీయులు నిత్యధూప, దీప, నైవేద్యాలతో పాటు కొంత భూమిచ్చి శిఖర, గోపుర మండపాలతో స్వామివారికి ఆలయం నిర్మించారు. నాటినుంచి స్వామివారు భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటున్నారు. సుబ్రహ్మణ్యషష్ఠికి స్వామికి భక్తులు విశేషపూజలు చేస్తారు.
– ఉప్పల సుబ్బారావు, సాక్షి, మోపిదేవి, కృష్ణాజిల్లా

ఇలా వెళ్లాలి
అమరావతి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే భక్తులు తెనాలి చేరుకుని అక్కడ నుంచి రేపల్లె రావాలి. ఇక్కడ నుంచి మచిలీపట్నం, చల్లపల్లి వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగవచ్చు. రేపల్లె రైల్వేస్టేషన్‌ నుంచి మోపిదేవికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి వచ్చే వారు కరకట్ట మీదుగా మోపిదేవి వార్పు నుంచి మోపిదేవికి 59 కి.మీ, లేదా నడకుదురు మీదుగా వయా చల్లపల్లి నుంచి మోపిదేవికి 64 కి.మీ దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగొచ్చు.
#mopidevi
#VenugopalSwamy













mohan publications price list