MohanPublications Print Books Online store clik Here Devullu.com

-జాతీయ ఐక్యతా దినోత్సవం-సర్ధార్ వల్లభాయ్ పటేల్ _National Unity Day-Rashtriya Ekta Diwas

జాతీయ ఐక్యతా దినోత్సవం
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 
National Unity Day
Rashtriya Ekta Diwas






విశాల భారత విలీనాధీశుడు
ఆడంబరం లేదు. అట్టహాసాల్లేవు. ఈ గడ్డ మీద సుస్థిరంగా నిలబడి.. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ సవిస్తారమైన జాతి నిర్మాణాన్ని సాహసోపేతంగా, అద్వితీయంగా పూర్తి చేసిన చరిత్ర పురుషుడు...
చెక్కుచెదరని ఉక్కు సంకల్పంతో.. వయోభారాన్ని లెక్క చెయ్యకుండా దేశం మొత్తం కలియదిరుగుతూ.. స్వతంత్ర మనుగడకు అడుగడుగునా అడ్డుతగులుతున్న వందలాది సంస్థానాలను విలీనాల బాట పట్టించటంలో అసాధారణమైన చతురత, విజ్ఞత ప్రదర్శించారు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌!
ఒకవైపు అందమైన దార్శనికతతో స్వతంత్ర భారత కలల సౌధాన్ని వూహిస్తూ.. అంతర్జాతీయంగా ఖ్యాతినీ, దేశ ప్రజల్లో కొంగొత్త ఆశలనూ, కొండంత స్ఫూర్తినీ నింపటంలో జవహర్‌లాల్‌ నెహ్రూ కృతకృత్యులైతే... అదే సమయంలో, ఆయన వెన్నంటే ఉండి.. అవసరమైతే విభేదిస్తూ కూడా.. వాస్తవాలను వీడకుండా.. గాలిలో మేడలు కట్టకుండా.. అట్టడుగు నుంచి జాతి సౌధానికి సుదృఢమైన, సుస్థిరమైన పునాదులు వేసిన సిసలు శిల్పి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌!
మొక్కవోని సమైక్యతా స్ఫూర్తి.. సంక్షోభాల అంచున కూడా నిబ్బరమైన నిర్ణయ శక్తి.. స్వప్నాలను సైతం సాకారం చేసే వాస్తవికమైన కార్యాచరణ.. వైరుధ్యాలను సైతం అధిగమించే సాకార సారథ్యం.. ఇవన్నీ సర్దార్‌ జాతికి అందించిన అమూల్యమైన విలువలు. ఈ దేశానికి అనవరతం అవసరమైన సుగుణగణాలు. ఆయన జయంత్యుత్సవాలను పురస్కరించుకుని.. నిర్వహిస్తున్న‘జాతీయ ఐక్యతా దినం’ సందర్భంగా ఆ మహోన్నతుడి స్ఫూర్తి నింపుకొని, ఆయన ఆజన్మాంతం నిలబెట్టుకున్న నిలువెత్తు విలువలకు మనం మరింత అంకితం కావటం మనకూ, మన భవితకూ జాతీయ అవసరం!
సమైక్యతా సార్వభౌముడు 
పుడుతూనే పుట్టెడు సమస్యలు! బ్రిటీషు పరపీడన పరాయణత్వాన్ని వదిలించుకుని.. దాస్యశృంఖలాలను ఛేదించుకుని.. స్వతంత్ర జాతిగా పురుడుపోసుకున్న భరతావనికి.. సమస్యలే స్వాగతం పలికాయి. సుదీర్ఘంగా సాగిన స్వతంత్ర సంగ్రామం.. అనూహ్యంగా వచ్చి పడిన విభజన గాయం.. వీటితోనే సతమతమవుతున్న పురిటిగడ్డకు అడుగడుగునా అడ్డుతగిలే సంస్థానాలు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఆసేతు హిమాచలం విశాల భరతావని నిండా పరచుకుని ఉన్న 565 రాజరిక సంస్థానాలను ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు!
స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, తొలి హోం మంత్రిగా ఈ సమస్యను ఒక సవాల్‌గా స్వీకరించారు ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.
రక్తపాత రహితంగా.. ఎక్కడా స్పర్థలకు తావు లేకుండా.. సంస్థానాలన్నీ సయోధ్యతో భారత సమాఖ్యలో విలీనమయ్యేలా ఒప్పించటంలో, ఈ దేశాన్ని ఇలా ఏక ఖండంగా నిలబెట్టటంలో ఆయన సుదృఢ సంకల్పాన్నీ, అసాధారణ ప్రజ్ఞనూ కనబరిచారు.
భరత గడ్డకు స్వతంత్రం ఇవ్వాలని బ్రిటీషు పాలకులు సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నప్పుడు.. సంస్థానాల సమస్యను వాళ్లేమాత్రం పట్టించుకోలేదు. భారత దేశంపై తాము అనుభవిస్తున్న, ఇంకా చెప్పాలంటే తాము చెలాయిస్తున్న సర్వోన్నత అధికారాలను వదిలేసుకోవటంతోటే తమ పని అయిపోతుందని వాళ్లు భావించారు. ఈ సంస్థానాలన్నీ ఇటు భారత్‌లో, లేదంటే అటు పాకిస్థాన్‌లో కలిసి పోవచ్చనీ, ఇంకా కాదంటే స్వతంత్రంగానూ ఉండే స్వేచ్ఛ వాటికి ఉందని చెప్పిపోయారు. ఈ సంస్థానాధీశులంతా కూడా బ్రిటీషువారు వైదొలగిపోతే.. వారి సర్వోన్నత అధికార ఛత్రఛాయ తొలగిపోతుందనీ, ఇక తమ పరిపాలన తాము సాగించుకోవచ్చన్న ­హల్లో తేలియాడటం మొదలుపెట్టారు. కొందరు పాకిస్థాన్‌ పంచన చేరాలనీ పథకాలు వేస్తున్నారు.
కలగూర గంపలా...
అప్పటికే ఈ భరత భూభాగం ఎన్నో జాగీర్లు, ఎన్నో సంస్థానాలు, రాజాస్థానాలతో కిక్కిరిసిపోయింది. వీటిలో పెద్దవే కాదు, ఏమాత్రం ప్రాభవం లేని చిన్నచిన్నవీ ఎన్నో ఉన్నాయి. ఒరిస్సాలోని ఒక సంస్థానపు వైశాల్యం కేవలం 46 చదరపు మైళ్లేనంటే దేశ స్థిరత్వానికి, జాతి మనుగడకు ఇవెంత అడ్డుతగులుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ వీటి నిండా ఎన్నో అంతస్సంఘర్షణలు, కుట్రలూ, కూహకాలూ!
ఒళ్లంతా గాయాల్లా వీటన్నింటినీ ముంగిట పెట్టుకుంటే భారత స్వతంత్రానికి అర్థమే ఉండదని గ్రహించారు పటేల్‌. అప్పటికి ఆయన వయసు 72 సంవత్సరాలు. వయోభారాన్ని సైతం లెక్కచెయ్యకుండా.. ఈ తెగిపడిన పూసల్లా ఉన్న సంస్థానాలన్నింటినీ భరత మాత మెడలో దండగా గుదిగుచ్చటానికి ఒంటిచేత్తో ఆయన పడిన శ్రమ అనంతం.
ఈ విలీన క్రమంలో ఆయన ప్రదర్శించిన విజ్ఞత అపూర్వమైనది. అంతా ఆ రాజులనూ, రాజ్యాలనూ మధ్యయుగాల అవశేషాలుగా, పాతకాలపు రోతగా ఈసడించుకుంటుంటే పటేల్‌ మాత్రం వారిని మానసికంగా దూరం చేసుకునే పనులేవీ చెయ్యలేదు. వాళ్లకు ప్రాముఖ్యం ఇస్తున్నట్టే కనబడుతూ, వాళ్ల ప్రాభవం తగ్గకుండా చూస్తామని హామీలిస్తూనే వాళ్లను నయగారంగా దారిలోకి తీసుకువచ్చారు. అంతా జాగీర్దారులను- దొంగలనీ, దోపిడీదారులనీ నిరసిస్తుంటే పటేల్‌ మాత్రం వాళ్లను మరో కోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. దోపిడీదారులంటూ వాళ్ల జాగీర్లు లాగేసుకుని, వాళ్ల చేతిలో చిల్లిగవ్వ కూడా పెట్టకుండా పంపించేస్తే.. వాళ్లంతా మందీమార్బలంతో సహా అసాంఘిక శక్తులుగా, అరాచక మూకలుగా మారతారని, స్వతంత్ర భారతావనికి మరింత ముప్పుగా, పెద్ద తలనొప్పిగా తయారవుతారని ­హించారాయన. అందుకే వారందరికీ తగినంత పరిహారాలూ, భరణాలూ, పర్సులూ ముట్టజెప్పేలా ఒప్పందాలు కుదిర్చారు. అంతేకాదు, వారితో సానుకూలంగా వ్యవహరిస్తూ, వారిని జాతినిర్మాణంలో భాగస్వాములను చెయ్యటం దేశ భవితకు మరింత కీలకమని కూడా గ్రహించారాయన. అందుకే ఇంత పెద్ద విశాల భారతావని మధ్య స్వతంత్రంగా బతికే సాధన సంపత్తి లేదు కనక మీరంతా పరిపాలనా బాధ్యతలు వదిలేసుకుని దేశంలో విలీనమైపోవటమే మీకు శ్రేయోదాయకమంటూ నచ్చచెప్పారు. రాజ్‌ప్రముఖ్‌ వంటి బిరుదులూ, గౌరవ మర్యాదలకు భంగం లేకుండా చూస్తామనీ, భరణాలతో పాటు తాయిలాలూ, అందలాలూ కూడా ఇస్తామని ­రించారు. పరిమిత అధికారాలతో పాటు కొంత వరకూ సొంత ఆస్తులూ కలిగి ఉండొచ్చని ఒప్పందాలు కుదిర్చారు. ఒరిస్సా లాంటి చిన్న ప్రాంతంలో దాదాపు 28 సంస్థానాలున్నాయి. వాళ్ల వద్దకు వెళ్లి- ‘‘మీరంతా నూతుల్లో కప్పల్లా ఈ చిన్నచిన్న సంస్థానాల్లో ఎంతకాలం ఉంటారు? మీ రాజ్యాధికారాలను ఎంత వరకూ నిలపుకొంటారు? నేనేమీ రాజకుటుంబంలో పుట్టలేదు. కానీ ఈనాడు యావత్‌ భారత రాజ్యవ్యవస్థలో నాకు కీలక భాగముంది. కోరుకుంటే మీకూ ఇలాంటి విస్తృత అధికారాలు దక్కుతాయి’’ అంటూ విడమరిచి చెప్పారు. ఒకవైపు బుజ్జగిస్తున్నా.. సంస్థానాధీశులంతా ఆయన మాటల్లోని దృఢత్వాన్నీ, కచ్చితత్వాన్నీ గ్రహించకపోలేదు. దీంతో వారంతా మరో మార్గం లేదని గ్రహించి.. గౌరవప్రదంగానే పటేల్‌ దారికి వచ్చేశారు. పటేల్‌ వ్యూహం ఫలించింది. ఇలా ఒరిస్సా, నాగపూర్‌, సౌరాష్ట్ర, కొల్హాపూర్‌, బరోడా, రాజస్థాన్‌, మైసూర్‌.. ఎన్నో సంస్థానాలు బేషరతుగా, రక్తపాత రహితంగా భారత భూభాగంలో విలీనమైపోయారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి దేశంలోని దాదాపు సంస్థానాలన్నీ విలీనమైపోయాయి.
ఒక యజ్ఞంలా విలీనాల కోసం పటేల్‌ చేస్తున్న కసరత్తును చూసి సాక్షాత్తూ జవహర్‌లాల్‌ నెహ్రూనే.. ‘‘నేను కూడా ­హించలేదు... ఈ విలీన ఘట్టం ఇంత త్వరగా ముగుస్తుందని’’ అని ఆనందాశ్చర్యాలు ప్రకటించారు. పటేల్‌ పట్టుదల, ప్రతిభ చూసి ముగ్ధులయ్యారు.
పాలన చట్రంలో ఇమిడిపోయేలా...
విలీనాల ద్వారా దాదాపు 5 లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని, దాదాపు 8.6 కోట్ల మంది ప్రజలను భారత్‌లో కలపగలిగారు పటేల్‌. కేవలం సంస్థానాలను విలీనం చెయ్యటమే కాదు... అవన్నీ స్వతంత్ర భారత పరిపాలనా చట్రంలో ఇబ్బంది లేకుండా ఇమిడిపోయేలా చూడటం కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నిజమైన పని ఇప్పుడే మొదలైంది. శతాబ్దాలుగా దూరం జరిగిన వాటిని ఒక దరికి చేర్చటమేకాదు.. పాత వాటిని కొత్త చట్రంలోకి తీసుకువస్తూ, ఇవన్నీ కలిసికట్టుగా ఒక వ్యవస్థలో ఒదిగిపోయేలా చూడటం ముఖ్యం. ఈ పాత రాష్ట్రాల్లో మనం ఉన్నట్టుండి ఒక్క రాత్రిలో ఆధునిక పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ మార్పునకు స్ఫూర్తి కింది నుంచి కాదు, ముందు పైనుంచి రావాలి. ఈ వేళ్లు ఆరోగ్యకరంగా, బలంగా పాదుకోవాలి. అప్పుడే అది సుస్థిరంగా నిలబడుతుంది’’ అయన వ్యాఖ్యానించారు. జునాగఢ్‌, కశ్మీర్‌, హైదరాబాద్‌... ఈ మూడు సంస్థానాల విషయంలో తప్పించి మిగతా సంస్థానాలన్నింటినీ పటేల్‌ ఇలాగే విలీనం దారికి తెచ్చారు. హైదరాబాద్‌ విషయంలో సరైన సమయంలో పోలీసు చర్యకు దిగటం ద్వారా తన వ్యూహచతురతను ప్రదర్శించారు.
సంస్థానాల శాంతియుత విలీనం స్వతంత్ర భారత నిర్మాణంలో తొలి అడుగు, అతిపెద్ద అడుగు, బలమైన అడుగు కూడా. దీన్నో అద్భుతంలా సుసాధ్యం చెయ్యటంలో పటేల్‌ కృషి, దార్శనికత అనితర సాధ్యం.
సంస్థానాల విలీనం విషయంలో తరచూ వల్లభాయ్‌ పటేల్‌ను జర్మనీ ఏకీకరణ సాధించిన బిస్మార్క్‌తో పోల్చినా.. దీన్ని రక్తపాత రహితంగా సాధించటం పటేల్‌ను శిఖర సమానుడిని చేసింది. ‘‘కొన్ని వందల సంవత్సరాల నుంచీ ఈ దేశంలో వేళ్లు పాతుకుని పోయిన జమీందారీ విధానం, సామంత రాజ్యాలను ఇంత సులభంగా పెకలించవచ్చని ఎవరూ ­హించలేదు. ఆరు మాసాల క్రితం ఇలా జరుగుతుందని నేనూ అనుకోలేదు. ఇంత క్లిష్టమైన సమస్యను ఇంత సునాయాసంగా పరిష్కరించటంలో నా మిత్రుడు, సహచరుడు సర్దార్‌ పటేల్‌ చూపించిన ప్రజ్ఞ ప్రశంసనీయమైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందుకు దేశంతో పాటు మేమూ సర్దార్జీకి రుణపడి ఉన్నాం. పాకిస్థాన్‌ విడిపోగా మిగిలిన దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచటంలో ఆయన నేర్పు, సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి’’
- జవహర్‌ లాల్‌ నెహ్రూ
అంబేడ్కర్‌ అత్యుత్తమ వ్యక్తి
రాజ్యాంగ సభకు చెందిన అనేక కమిటీల్లో కీలక సభ్యుడి వ్యవహరిస్తూ సర్దార్‌ పటేల్‌ చేసిన కృషి నిరుపమానం. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సందర్భంగా జరిగిన ఓ చిన్న సంఘటన ఆసక్తికరం. గాంధీజీని తరచూ విమర్శించే, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా ఎందుకు నియమించారంటూ కాంగ్రెస్‌ నాయకుడొకసారి పటేల్‌ను నిగ్గదీశాడు. దీనికి పటేల్‌ సమాధానమిస్తూ... ‘‘రాజ్యాంగ నిర్మాణం అంటే మీకు ఏం తెలుసు? ఈ పనికి మేం అత్యుత్తమ వ్యక్తిని ఎంపిక చేశాం’’ అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు.
మైనారిటీల మద్దతుండాలి
రాజ్యాంగ సభకు చెందిన అత్యంత ముఖ్యమైన అల్ప సంఖ్యాకులు, ప్రాథమిక హక్కుల సలహా కమిటీకి సర్దార్‌ పటేల్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ కమిటీకి తనను ఛైర్మన్‌గా ఎంపిక చేసిన రోజు తాను ఎంతో భయపడినట్టు పటేల్‌ చెప్పుకున్నారు. ఆ సమయానికి దేశంలో అన్ని వర్గాల ప్రజలు అపోహలు, అనుమానాలతో ఉండేవారు. ఈ క్రమంలో పరస్పర అవగాహన, సహకార స్ఫూర్తితో పటేల్‌ ఆ బాధ్యతలను నిర్వర్తించారు. అల్పసంఖ్యాక వర్గాలన్నింటి ఏకాభిప్రాయ మద్దతుతో నిర్ణయాలు ఉండాలని భావించేవారు. చివరకు రాజ్యాంగ సభ మతపరమైన అల్పసంఖ్యాకులకు ప్రత్యేక ప్రాతినిధ్యం అంశాన్ని పక్కనపెట్టడం పటేల్‌ నిష్పాక్షిక కృషికి నిదర్శనం.
అంతరాలు పూడాలి
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రక్షణలు కల్పించడంపై పటేల్‌ విస్పష్టమైన అవగాహనతో ఉండేవారు. ‘‘సమాజంలో వర్గీకరణలు, భేదాభిప్రాయాలను వీలైనంత వేగంగా రూపుమాపాలి. పౌరులందరినీ సమానత్వం స్థాయికి తీసుకురావాలి. మైనార్టీల్లో విశ్వాసం పాదుకునేలా ఔదార్యం చూపాల్సిన బాధ్యత మెజార్టీ వర్గాలదే. అలాగే మైనార్టీ వర్గాలు గతాన్ని మరచిపోవాలి’’ అని రాజ్యాంగ సభ సమావేశంలో పేర్కొన్నారు.
ఈ మొండిమనిషి ఎవర్రా?
1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం వచ్చారు. అహ్మదాబాద్‌లోని కోచవరం వద్ద ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. వల్లభాయ్‌ ఆ రోజుల్లో గాంధీ సిద్ధాంతాలను, నమ్మకాలను ఎగతాళి చేసేవారు. ‘ఆశ్రమంలో ఏముందయ్యా.. గోధుమల్లోని రాళ్లేరుకుంటూ కూర్చోవడం తప్ప.. ఈ మాత్రానికే దేశానికి స్వరాజ్యం వచ్చేస్తుందా?’ అని చులకనగా మాట్లాడేవారట. ‘‘స్వరాజ్యం ఆంగ్లేయుల దయాదాక్షిణ్యాలతో లభించేది కాదు, గుంజుకోవాల్సిందే. ఇది దేశ ప్రజల జన్మహక్కు. ఇతరుల దయాభిక్ష కోసం పాకులాడొద్దు’’ అని గాంధీజీ ప్రభోదించారు. గాంధీ మార్గం వల్లభాయ్‌ను ఆకర్షించింది. ఎక్కువకాలం దూరంగా ఉండలేక పోయారు. గాంధీజీని అనుసరించారు.
నేను మొదట వల్లభ్‌భాయ్‌ను కలుసుకొన్నప్పుడు ఈ మొండిమనిషి ఎవరా అని అనుకొన్న మాట నిజం. కానీ, కార్యరంగంలో ఆయ నను చూసిన తర్వాత మాత్రం ఇలాంటి మనిషే నాకు కావాలి అనిపించింది.’ అని గాంధీజీ తన అనుచరులతో పేర్కొన్నారు.













No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list