MohanPublications Print Books Online store clik Here Devullu.com

బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Obesity Weight Loss Losing weight couple weight loss made for eachother


బరువు తగ్గండీ

పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేస్తానంటారు... కానీ చేయరు! కొవ్వుపదార్థాలు మానేస్తాననీ చెబుతారు... కానీ నాన్‌లూ, పిజాలూ, బర్గర్‌లు లాగించేస్తారు. వేళకు నిద్రపొమ్మంటే... కంప్యూటరు ముందునుంచీ కదలరు. కూరల్లో కాస్త ఉప్పు తగ్గిస్తే... ఏంటీ చప్పిడి తిండి అంటూ కోప్పడతారు... ఇలా శ్రీవారి బరువుకు సంబంధించిన కథల గురించి ఎన్నయినా చెప్పేస్తారు చాలామంది మహిళలు. అలా బాధపడటం కన్నా... తన బరువును తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు. దానివల్ల మనమూ సన్నబడొచ్చు. అదెలా అంటారా... చదవండి మరి.
పెళ్లికి ముందు...ఫిట్‌గా ఉండాలీ, అందంగా కనిపించాలి, పిడికెడు పొట్ట కూడా ఉండకూడదు... అని అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఆలోచిస్తారు. దానికి సంబంధించి తీసుకునే జాగ్రత్తలూ, పాటించే కొత్తకొత్త నియమాల జాబితా చాంతాండంత ఉంటుంది. తీరా పెళ్లయ్యాక ఉద్యోగం, కుటుంబం, పిల్లలూ, ఆలస్యంగా పడుకోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం... అన్నీ కలిపి బరువు పెంచేస్తాయి. అవే క్రమంగా అనారోగ్యాలూ, వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి... మానసిక కుంగుబాటుకు దారి తీస్తాయి. శ్రీవారి బాగోగులు చూసే ఇల్లాలిగా.. వారి ఆరోగ్యం కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఛలో సన్నబడదాం..’ అంటూ ఆయన్నీ ప్రోత్సహించండి. ముందుగా...
మానసికంగా సిద్ధం చేయండి...
చాలామంది మహిళలు చేసే పొరపాటు ‘మీరు బరువు తగ్గాల్సిందే. అవి తినొద్దూ.. ఇవి తినొద్దూ’ అని ఆర్డర్లు వేసేస్తుంటారు. దీంతో రకరకాల ఒత్తిళ్లలో ఉన్న మగవారు ఈ విషయాన్ని ప్రతికూలంగా తీసుకుంటారు. గట్టిగా దబాయింపుగా చెప్పడాన్ని మాత్రమే వారు పట్టించుకుంటారు గానీ.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కొందరు అనుకుంటారు కానీ ఆరంభంలోనే ఆగిపోతారు. ‘తను చెబితే నేను చేయాలా... నాకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో...’ అనే ధోరణిలో తమ ఆరోగ్యాన్నీ, ఫిట్‌నెస్‌ని నిర్లక్ష్యం చేసేవారూ ఉంటారు. కాబట్టి భర్త బరువు తగ్గాలి అనుకుంటే.. ముందు మానసికంగా సిద్ధం చేయాలి. పెళ్లికి ముందు ఫొటోలు చూపించి.. ‘మళ్లీ మనం ఇలా ఎప్పుడవుదాం..’ అని అడిగి చూడండి. కలిసి వ్యాయామం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, చిలిపి సవాళ్లు విసరడం.. వంటివి శ్రీవారిని తప్పకుండా ఆ దిశగా ప్రేరేపిస్తాయి. భార్యాభర్తలు కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఒకరినొకరు స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగొచ్చు. పార్టనర్‌ యోగా, పార్టనర్‌ ఏరోబిక్స్‌, పార్టనర్‌ ఎక్సర్‌సైజెస్‌, పార్టనర్‌ ఫిట్‌నెస్‌... ఇలా రకరకాలుగా ప్రయత్నించొచ్చు. ఇంటికి దగ్గరలోని పార్కుకో, మైదానానికో ఇద్దరూ కలిసి ఉదయం నడకకు వెళ్లొచ్చు. తాడాట ఆడొచ్చు. గోడ కుర్చీలు వేయొచ్చు. స్క్వాట్స్‌ను ప్రయత్నించొచ్చు. ట్రైనర్‌ను పెట్టుకుని ఇద్దరూ కలిసీ వ్యాయామాలు చేయొచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణురాలు మణిపవిత్ర.



అప్పుడేం చేయాలంటే..
* మీరు కావచ్చు, ఆయన కావచ్చు... అప్పటివరకూ జీవనశైలిలో చేసిన పొరపాట్లన్నీ ఓ జాబితాగా రాసుకోవాలి. ఇక మీదట చేయాల్సిన నియమాలను మరో కాగితంపై రాయాలి. చేయకూడనివి రెడ్‌ మార్కర్‌తో కొట్టేసి చేయాల్సినవి గ్రీన్‌ మార్కర్‌తో టిక్‌ చేయాలి. ఆ జాబితాను ప్రతిరోజూ ఇద్దరూ చూసేలా ఒక చోట అంటించుకోవాలి. అలా చూడటం వల్ల మెదడులో చేయాలన్న స్ఫూర్తి పెరుగుతుంది.
* నిపుణుల్ని సంప్రదించి బరువు తగ్గడానికి ఎలాంటి నియమాలు పాటించాలన్నదీ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆహార నియమాలూ, చేయాల్సిన వ్యాయామ ప్రక్రియ గురించి రాసుకోవాలి. ఎలా చేయాలన్నది మాట్లాడుకోవాలి. ఒక్కరి నిర్ణయమం మీదే వెళ్లడం సరికాదు.
* ఇద్దరూ కలిసి ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. కలిసి వ్యాయామ సాధన చేయడం, అల్పాహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. వీలుంటే మిగతా సమయాల్లోనూ కలిసి తినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* రోజూ ఒకే రకమైన వ్యాయామ సాధనలు కాకుండా ఒక రోజు నడకా, మరోరోజు జాగింగ్‌.. ఇలా రోజూ వ్యాయామ సాధనలో కొత్తదనం ఉండేలా ప్రణాళిక వేయాలి. ఈ రోజుల్లో ఇద్దరూ కలిసి చేసే యోగాసనాలు ఉన్నాయి. అలా ఇద్దరూ కలిసి చేయడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయని చెబుతున్నారు యోగా నిపుణులు.
* ఒక వేళ మీ శ్రీవారు బద్ధకించినా గట్టిగా అరవడం, విసురుగా మాట్లాడటం, కోప్పడటం సరికాదు. నియమాలు పాటించడంలో వెనకబడినా, ఒకరోజు బద్ధకించినా తేలిగ్గానే తీసుకోవాలి తప్ప సహనం కోల్పోకూడదు.
సరదా సరదాగా..
వ్యాయామం, బరువు తగ్గడం, డైటింగ్‌ వంటి మాటలు మనసులోంచి తీస్తే చాలా మంచిది. ఇద్దరూ కలిసి వ్యక్తిగత సమయం కేటాయించుకుంటున్నాం అని భావిస్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా ఈత తరగతులకు వెళ్లడం, సైక్లింగ్‌ చేయడం, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటివి ఆడొచ్చు. చిన్నారుల్లా మారి.. ఎంత హడావుడిగా ఉన్నా.. రోజులో ఎంతో కొంత సమయం ఇలా గడపడం వల్ల ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుందో.. మానసికంగానూ అంతే ప్రయోజనం ఉంటుంది. పైగా ఇద్దరి మధ్యా అనుబంధం అంతకుముందు కంటే మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు కొత్త జంటలా మారిపోయి.. ఏరోబిక్స్‌, జుంబా, సల్సా వంటి నృత్య రీత్యుల్ని నేర్చుకోవడం మొదలు పెట్టొచ్చు. వీటన్నింటి వల్ల కెలొరీలు అధిక మొత్తంలో ఖర్చు అవుతాయి. నిద్రలేమి సమస్యలూ దూరమవుతాయి.


వంటింట్లో చేయాల్సిన మార్పులు...

* బరువు తగ్గడానికి పూర్తిగా పొట్ట మాడ్చుకోవాల్సిన అవసరంలేదు. మాంసకృత్తులూ, పిండిపదార్థాలు శరీరానికి అందాలి. పిండిపదార్థాలు అంటే అన్నం, బ్రెడ్‌ నుంచి అందేవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్‌రైస్‌, తృణధాన్యాలూ, ఓట్స్‌ వంటి వాటితో చేసిన పదార్థాలు అన్నమాట. వీటిని కూడా మితంగా తీసుకోవాలి. వీటిల్లో పీచు ఉండటమే కాదు... అరగడానికీ ఎక్కువ సమయం పడుతుంది.
* మాంసాహారం దూరంగా పెట్టాల్సిన పనిలేదు. మీ వారికి ఎక్కువగా తినే అలవాటు ఉంటే పూర్తిగా మానేయమనకుండా ఆ పరిమాణం తగ్గిస్తూ రావాలి. బదులుగా మీల్‌మేకర్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌ ఎంచుకోవచ్చు. అంతేకానీ అలవాటు లేని బ్రకోలీ, లెట్యూస్‌ వంటివి శ్రీవారికి వడ్డించేయడం సరికాదు.
* తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను మాత్రం ఎంత తగ్గిస్తే అంత మంచిది. బదులుగా తేనె, తాజా పండ్లూ, ఖర్జూరాలూ, ఎండు ద్రాక్ష వంటివి ఇవ్వొచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.
* రెస్టారంట్లూ, రోడ్డువారల ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టేయడం మంచిది. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్‌, బీట్రూట్‌, టోఫూతో సలాడ్లు చేయడం మంచిది. నూనె, ఉప్పూ ఎంత తక్కువ తీసుకుంటే అంత త్వరగా ఫలితం ఉంటుంది.
* అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసలూ, బఠాణీ, సెనగలూ, గుడ్లూ, సోయా, పల్లీలూ... ఇవన్నీ మనం తీసుకునే భోజనంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృత్తులు శరీరానికి శక్తిని అందిస్తాయి.
* కాఫీ, టీలు తాగినా చక్కెర్లకు దూరంగా ఉండాలి. వాటితోపాటు ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు.. శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list