మీ దుకాణంలో
G S T గుర్తింపు బోర్డు ఎక్కడ!
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టంలో అనేక చర్యలను ప్రభుత్వం పొందుపరిచింది. విక్రయ కేంద్రాల్లో జీఎస్‌టీ గుర్తింపు ధృవపత్రాన్ని వ్యాపారులు తప్పనిసరిగా కనిపించేలా ఉంచడం ఇందులో ఒకటి. విక్రయ కేంద్రం ఎదుట జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన పేరు బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని కూడా చట్టం చెబుతోంది. ఈ చర్యల వల్ల ఎవరి దగ్గర నుంచి వస్తువులు కొంటున్నాం లేదంటే సేవలు పొందుతున్నామనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకునే వీలుంటుంది. అంటే ఆ వ్యాపారి జీఎస్‌టీ కింద నమోదయ్యాడా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చన్నమాట. తద్వారా జీఎస్‌టీ ముసుగులో కొందరు వ్యాపారులు చేస్తోన్న మోసాలకు అడ్డుకట్ట వేసే వీలుంటుంది.
విక్రయ కేంద్రం ప్రాంగణంలో జీఎస్‌టీ గుర్తింపు బోర్డులను తప్పనిసరిగా కనపించేలా ఉంచాలనే నిబంధన అటు సామన్య ప్రజలకే కాదు వ్యాపారుల్లో చాలా మందికి అవగాహన లేదు. అందుకే ముందుగా ఈ నిబంధనలు ఎవరెవరికి, వేటివేటికి వర్తిసాయో, వాటిని పాటించకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
జీఎస్‌టీ గుర్తింపు ధృవపత్రం
జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి వ్యాపారి జీఎస్‌టీ గుర్తింపు ధృవపత్రాన్ని విక్రయకేంద్రంలో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యాపారికి ఒకటికి మించి విక్రయ కేంద్రాలుంటే కూడా అన్నింటిలోనూ ఈ ధృవపత్రాన్ని కనిపించేలా ఉంచాలి.
జీఎస్‌టీ గుర్తింపు సంఖ్య బోర్డు
జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి వ్యాపారి తమ విక్రయ కేంద్రం ముందు ఉంచే పేరు బోర్డులో జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యను తప్పక పొందు పరిచాలి. ఆ వ్యాపారికి ఎన్ని విక్రయకేంద్రాలుంటే అన్నింటి ముందు ఇదే తరహాలో పేరు బోర్డును ఉంచాల్సి ఉంటుంది.
జరిమానా రూ.25,000
జీఎస్‌టీ ధృవపత్రం లేదా జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన బోర్డును ప్రదర్శించకుంటే నిబంధనల ఉల్లంఘన కింద రూ.25,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని జీఎస్‌టీ చట్టం చెబుతోంది.
ఎవరెవరికి వర్తింపు
జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి ఒక్కరు జీఎస్‌టీ ధృవీకకరణ పత్రం, జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన బోర్డును ప్రదర్శించాల్సి ఉంటుంది. వర్తకులు, తయారీదార్లు, సేవలు అందించేవారు, ఎగుమతిదార్లు, రవాణాదార్లు, బ్రోకర్లు, ఏజెంట్లు, కాంట్రాక్టర్లతో పాటు హోటళ్లు, లాడ్జింగ్, సినిమా హాళ్లు, వినోద పార్కులు, రేసు కోర్సులు, క్లబ్బులు, శాఖలు, గిడ్డంగులు, విక్రయ డిపోలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, సంఘాలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, రైల్వే స్టేషన్లు, ప్రకటనల ఏజెన్సీలు, కార్పొరేషన్లు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి ఒక్కరు పై నిబంధనకు తగ్గట్లుగా నడుచుకోవడం తప్పనిసరి.
పారదర్శకతే లక్ష్యం
జీఎస్‌టీ ధ్రవీకరణ పత్రం, జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యను ప్రదర్శించని వ్యాపారులపై ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25,000 జరిమానా విధించడాన్ని ప్రారంభించాయి. అందువల్ల ఈ వ్యాసం చదివిన తర్వాతైనా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారులు నడుచుకుంటారని ఆశిద్దాం. అలాగే వ్యాపారుల విక్రయ కేంద్రాల్లో పేరు బోర్డులు, ధృవీకరణ పత్రం ప్రదర్శన ఆవశ్యకతపై వినియోగదారులకూ ఎంతో కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తీసుకొని రావడమే పై నిబంధనలను పొందుపరచడం వెనక ప్రభుత్వ ఉద్దేశం. గతంలోని పరోక్ష పన్నుల విధానంలో ఈ తరహా చర్యలు లేనందువల్లే అప్పుడు పారదర్శకత లోపించింది.
ఏంటి ప్రయోజనం
* విక్రయ కేంద్రంలో జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన పేరు బోర్డు లేదా ధృవీకరణ పత్రం లేకుంటే ఆ వ్యాపారి జీఎస్‌టీ కింద నమోదుకాలేదని భావించవచ్చు. అలాగే మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేసే అధికారం ఆ వ్యాపారికి ఉండదు.
* కాంపోజిషన్ విక్రయదార్లు కూడా తాము కాంపొజిషన్ విధానంలో ఉన్నామని బోర్డు పెట్టాలి. దీనివల్ల ఆ వ్యక్తి విక్రయించే వస్తువుల ధరలో పన్ను కలిపే ఉందనే విషయాన్ని వినియోగదారు గ్రహించే వీలుంటుంది. ఎందుకంటే ఈ తరహా వ్యాపారులు వినియోగదార్ల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకూడదు.
* జీఎస్‌టీ ధృవీకరణ పత్రం లేదా జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో బోర్డును ప్రదర్శిస్తున్నాడంటే.. మనం క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే, పన్నులు వసూలు చేసే వ్యాపారి వద్ద నుంచే సరుకులు కొంటున్నామనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు.
* జీఎస్‌టీ కింద నమోదైన వ్యక్తి దగ్గర నుంచి జీఎస్‌టీ గుర్తింపు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడంటే.. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆ వ్యక్తికి వస్తుందని గ్రహించవచ్చు.
* జీఎస్‌టీ కింద నమోదుకాని వ్యాపారులు, కాంపోజిషన్ డీలర్లు పన్నులు వసూలు చేసే వీలు లేనందున, జీఎస్‌టీ ముసుగులో వాళ్లు వినియోగదారులను మోసం చేయకుండా పై నిబంధనలు తోడ్పడుతాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565